వికటిస్తున్న బాబు వ్యూహాలు!

9 Jun, 2018 01:06 IST|Sakshi
చంద్రబాబు నాయుడు (ఫైల్‌ ఫోటో)

విశ్లేషణ

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసు కొన్నా.. ప్రజలకిచ్చిన ప్రధాన హామీలేవీ ఇప్పటివరకు అమలు చేయలేకపోయారు. కానీ, ఒకట్రెండు హామీలు నహా మొత్తం నెరవేర్చేశామని బొంకుతున్నారు. అధికారం చేపట్టిన జూన్‌ 8, 2014న సీఎంగా ఐదు దస్త్రాలపై తొలి సంతకం చేశారు. వాటినే ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేదు. పదవి చేపట్టిన తొలి మాసంలోనే ఆర్థిక రంగంతోసహా పలు రంగాలపై శ్వేత పత్రాలు ప్రచురించి కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో అభివృద్ధి తిరోగమనంలో పయనించిందని చెప్పుకొచ్చారు.

కానీ, ఈ నాలుగేళ్లల్లో తన పరిపాలనలో ఆయా రంగాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో శ్వేతపత్రాలు ప్రచురించమని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తుంటే.. బాబు విననట్లు నటిస్తూ..‘నవ నిర్మాణదీక్ష’ అంటూ ప్రజలతో ప్రమాణాలు చేయించే కార్యక్రమాల్ని ప్రజాధనంతో నిర్వహిస్తున్నారు. చంద్రబాబు ప్రదర్శిస్తున్న రాజకీయ టక్కుటమార విద్యల్లో ‘నవ నిర్మాణదీక్ష’ ఒకటి.

గత నాలుగేళ్లుగా ఈ తంతు నిర్వహిస్తున్నారు. మొదటి మూడేళ్లు నవ నిర్మాణదీక్షల వేదికల నుంచి కాంగ్రెస్‌ పార్టీని, వైసీపీని తిట్టిపోశారు. ఈ ఏడాది కొత్తగా బీజేపీని, జనసేనను కలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని పార్టీ కార్యక్రమాలుగా మార్చివేసి.. ‘ప్రత్యేకహోదా’ ఇవ్వనందుకు బీజేపీని, మోదీని; రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారన్న సాకుతో కాంగ్రెస్‌ పార్టీని; అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి వైసీపీని; స్నేహహస్తాన్ని వీడి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలో ఎండగడుతున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను పదేపదే విమర్శిస్తున్నారు. 

ప్రత్యేకహోదా అంశంలో మాట తప్పారని ప్రధాని మోదీని ఏపీ ప్రజల్లో విలన్‌గా చిత్రీకరించడానికి బాబు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. మోదీతో జగన్, పవన్‌కల్యాణ్‌లు జత కలిశారని ప్రచారంచేసి.. 2019 ఎన్నికల్లో గట్టెక్కాలన్నది బాబు వ్యూహం! బాబు చేస్తున్న నవ నిర్మాణ దీక్షల పోస్టర్లలో 2050 నాటికి పెట్టుకొన్న లక్ష్యాలు కనిపిస్తున్నాయి. అంటే, 2050 వరకు తన ప్రభుత్వమే ఉంటుందని పరోక్షంగా ప్రజలకు చెబుతున్నట్టే లెక్క.  ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ 30 ఏళ్ల తర్వాత సాధించబోయే లక్ష్యాలు ఏర్పరుచుకొన్న దాఖలాలు కన్పిం చవు. గత నాలుగేళ్లలో టీడీపీ అన్ని రంగాల్లో ఘనంగా విఫలమైంది కనుకనే.. ప్రజల దృష్టిని మరల్చడానికి తనకు తెలిసిన విద్యలను ప్రదర్శిస్తున్నారు. 

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి నిర్దిష్టమైన ఎజెండా లేదు. ఈ నాలుగేళ్లల్లో సాధించామని చెప్పుకోవడానికి ఏ ఒక్క ఘనత లేదు. నాలుగేళ్ల బాబు పాలనలో వ్యవసాయరంగం కుదేలయింది. ఎన్నికల ముందు బేషరతుగా రైతు రుణమాఫీ చేస్తామన్నారు. మొత్తం రుణభారం రూ. 95,455 కోట్లుగా ఎస్‌ఎస్‌బీసీ తేల్చితే.. కాకి లెక్కలు వేసి రైతులకు రూ. 24,000 కోట్లు చెల్లిస్తామని చెప్పి ఇప్పటివరకు కేవలం రూ. 14,000 కోట్లమేర మాత్రమే చెల్లించారు. ఆ మొత్తం రైతులు వడ్డీలు కట్టడానికే సరిపోయింది. ఇక, రాష్ట్రంలో కరువును పారద్రోలామని ఘనంగా చెప్పుకొంటూ.. అనంతపురం జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన ఘనత ఈ ప్రభుత్వానిది. క్రిందటేడాది.. రాయలసీమ నుంచి పొరుగునున్న తమిళనాడుకు 4 లక్షల మంది సన్నకారు రైతులు, రైతు కూలీలు ఉపాధి కోసం వలసబాట పట్టారని పతాక శీర్షికల్లో వార్తలొచ్చాయి. 

సాగునీటి రంగానికి సంబంధించి అధికారంలోకి రాగానే పెండింగ్‌ ప్రాజెక్టుల అంచనాల్ని అనూహ్యంగా పెంచేశారు. పెంచిన అంచనాలను చీఫ్‌ సెక్రటరీ ఆమోదించడానికి నిరాకరిస్తే.. క్యాబినెట్‌లో ఫైల్‌పెట్టి ఆమోదముద్ర వేసుకొన్నారు. పట్టిసీమను సకాలంలో పూర్తిచేస్తే 21.9% బోనస్‌ ఇస్తామనే నిబంధన ఏర్పరిచి.. ఆ ప్రాజెక్టు సకాలంలో పూర్తయిందని చెప్పుకోవడానికి.. పాత పైపులు తెచ్చి బిగించి సంబ రాలు జరుపుకొన్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంను కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సి ఉండగా, కాంట్రాక్టింగ్‌ పనుల కోసం దాని నిర్మాణం తలకెత్తుకొని.. దానిని పూర్తి చేయలేక నెపాన్ని కేంద్రంపై నెట్టేస్తున్నారు. పోలవరం అవినీతికి కేంద్రంగా మారిపోయింది. దాని లెక్కలు, ఖర్చులు చెప్పే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడంతో, కేంద్రం నిధులు విడుదల చేయని పరిస్థితి. డ్వాక్రా మహిళలకు రూ. 14,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని చెప్పి.. కేవలం రూ. 3,000 చొప్పుల పెట్టుబడి రూపంలో ఇచ్చారు. ఫలితంగా 84 లక్షల మంది మహిళలు రుణగ్రస్తులుగా బ్యాంకు రికార్డుల్లో మిగిలారు. మహిళల సాధికారత మద్యం అమ్మకాల పెంపు ద్వారా సాధ్యపడుతుందా?   

ఈ నాలుగేళ్లల్లో ఏడాపెడా అప్పులు చేయడంలోనే ఈ ప్రభుత్వం విజయం సాధించింది. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం నిబంధనలను పక్కనపెట్టి ఇష్టానుసారం అప్పులు చేశారు. ఈ నాలుగేళ్లల్లో రూ.1,40, 000 కోట్ల మేర కొత్తగా రుణాలు తీసుకొచ్చారు. ఆర్థిక క్రమశిక్షణ కాగడాపెట్టి వెతికినా కనపడదు. గతంలో చేసిన దుబారాకు అదనంగా ఇటీవల ధర్మదీక్ష కార్యక్రమాలకు ఒక్కోదానికి రూ. 30 కోట్లు చొప్పున, నవ నిర్మాణదీక్షకు రూ.13 కోట్లు చొప్పున ఖర్చు పెడుతున్నారు. వీటివల్ల ప్రజలకు ఒరిగేదేమిటి? ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగభృతి రూపంలో నెలకు రూ. 2,000 ఇస్తామన్న హామీని.. ఆగస్టు నెల నుంచి డిగ్రీ చదివిన నిరుద్యోగులకు పరిమితం చేసి ఇస్తామంటున్నారు. ఎన్నికల ఏడాదిలో కేవలం 6 లేక 7 నెలలు అదికూడా 21 ఏళ్లు దాటి ఓటు కలిగిన వారికి ఇవ్వాలన్న నిర్ణయం, ఓట్లు కొల్లగొట్టే వ్యూహం మాత్రమే.

రాష్ట్ర పాలన కాడిని పక్కన పడేసి బాబు.. ప్రతి పక్షపార్టీలను తిట్టడం, సొంత పార్టీ నేతలతో తిట్టించడమే పనిగా పెట్టుకుని చాలాకాలమే అయింది. ఎన్డీఏ నుంచి బయకొచ్చాక అది మరింత పెరిగింది. పార్టీ నేతలతో జరిపే టెలికాన్ఫరెన్స్‌లు, పార్టీ సమన్వయ భేటీల్లో ఆయన చర్చించే అంశాలు కేవలం రెండే రెండు. 1. టీడీపీ బాగా పనిచేస్తున్నదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి అసత్యాలు ప్రచా రం చేయడం, రాష్ట్ర ప్రభుత్వ పని తీరుపై 80% ప్రజలు సంతృప్తి చెందుతున్నారని చెప్పుకోవడం. 2. ప్రతిపక్షాలపై బురదజల్లే విధంగా తిట్లదండకాలు ఎలా ఉండాలో నాయకులకు దిశానిర్దేశం చేయడం. జన్మభూమి కమిటీలతో ఇప్పటికే టీడీపీ నేతలు గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకతను కొనితెచ్చుకొన్నారు.  

నాలుగేళ్లపాటు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి.. ప్రత్యేకహోదా సాధించలేకపోవడం తెలుగుదేశం వైఫల్యమని ప్రజలు నమ్ముతున్నారు. పైగా, ప్రత్యేకహోదా వల్ల ఉపయోగం లేదని, అదేమీ సంజీవని కాదని ప్రచారం చేసిన బాబు.. కేవలం ప్రజల్లో పెరుగుతున్న ప్రత్యేకహోదా సెంటిమెంట్‌ను సొమ్ము చేసుకోవడానికే.. చివరి క్షణంలో ప్రత్యేకహోదా అంశాన్ని ఎత్తుకున్నారన్న నిజం ప్రజలు గ్రహిస్తున్నారు. బాబు పన్నుతున్న వ్యూహాలు వికటిస్తున్నాయి. టీడీపీ అధినేత ప్రతి అడుగును, ప్రతి వ్యూహాన్ని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు.


సి. రామచంద్రయ్య 
వ్యాసకర్త మాజీ ఎంపీ ‘ 81069 15555

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు