గ్రేటాంధ్ర చౌరస్తా

9 Feb, 2020 03:47 IST|Sakshi

జనతంత్రం 

నాలుగు రోడ్ల కూడలి, ఊరికి నడిబొడ్డు. అక్కడొక గారడీ ప్రదర్శన.. చుట్టూ జనం.. గుంపులోంచి ఎంపిక చేసుకున్న ఓ వ్యక్తిని పిలిచాడు గారడీ హెడ్డు. పడుకో మన్నాడు. కళ్లకు గంతలు కట్టాడు. గుంపులో కోటు వేసుకొన్న ఒకాయన దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు హెడ్డు. పడుకున్న వ్యక్తిని ‘బేటా’ అని పిలిచాడు. ‘నా పక్కన ఎవరున్నారు?’ ప్రశ్నించాడు. ‘ఓ కోటు ఈశ్వరుడు’ బదు లిచ్చాడు సదరు బేటా. ‘ఎలా చెప్పావ్‌?’ హెడ్డు ప్రశ్న. ‘తావీజు మహిమ’... బేటా స్పందన. మద్దెల ముందేసు కొని గుంపు మధ్యలో కూర్చున్న హెడ్డుగారి అసిస్టెంట్‌ ‘చప్పట్లూ’ అని గట్టిగా అరిచాడు. జనం చప్పట్లు. ఆ చప్పట్లతో సింకయ్యేలా అసిస్టెంట్‌ మద్దెలదరువు అందు కొన్నాడు. మళ్లీ పిలిచాడు హెడ్డు. ‘బేటా’ ఈ కోటు ఈశ్వ రుని పేరు చెప్పగలవా? ‘ఓ... కియామియా’ బేటా చెప్పే శాడు. హెడ్డు కోటు ముఖం చూశాడు ‘ఔనా’ అన్నట్టు. ఔనన్నట్టు కోటు తలూపింది.

‘తాలియా’ కెవ్వున అరి చాడు అసిస్టెంటు. జనం చప్పట్లు. ఈసారి సౌండ్‌ పెరిగింది. సౌండ్‌కు తగినట్టు మద్దెల మోతెక్కింది. మళ్లీ పిలిచాడు హెడ్డు. ‘బేటా... ఈ కోటు మనసులో ఏముంది?’ ‘ఈ ఊరొదిలి పారిపోదామనుకుంటున్నాడు’ గట్టిగా అరిచినట్టు చెప్పాడు బేటా. ‘ఎలా చెప్పావ్‌?’... ‘తావీజు మహిమ...’ కోటు ముఖం చూడలేదు హెడ్డు. ఆ ఛాన్సివ్వలేదు అసిస్టెంటు. ఒక్కసారిగా కరెంటు షాక్‌ కొట్టినట్టు రెండు పిల్లిమొగ్గలేశాడు. పిల్లిమొగ్గలతో పాటే ‘తాలియా’ అనే అరుపును కూడా మిక్స్‌ చేశాడు. చప్పట్ల హోరు పెరిగింది. మద్దెల జోరందుకుంది. కోటు ఏదో చెప్పబోతున్నది. ఎవరికీ వినపడలేదు. హెడ్డుకు చిల్లర బాగానే రాలింది. బేటాకు వాటా ముట్టింది. ఒక షో ముగిసింది.

గజకర్ణ గోకర్ణ టక్కుటమారాది కనికట్టు ప్రజ్ఞలూ, ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు.. గడసానుల గారడీ విన్యాసాలు ఆ చౌరస్తాలో చాలా చూడొచ్చు. ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఆగమేఘాలమీద అక్కడొక ఎల్లో కళాక్షేత్రాన్ని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాటు ఎంత వేగంగా జరిగిందంటే, దానితో పోల్చ దగిన ఏకైక ఘటన మొన్న చైనాలో కరోనా వైరస్‌ నియంత్రణ కోసం పది రోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించడం మాత్రమే. కాకపోతే వాళ్లు వైరస్‌ను నియంత్రిస్తారు. వీళ్లు పంపిణీ చేస్తారు. ఎల్లో కళాక్షేత్రం పంపిణీ చేసే వైరస్‌ నెమ్మదిగా ప్రజల మెదళ్ల మీద పనిచేసేలాగా ప్రోగ్రామింగ్‌ చేశారు. ఎల్లో కళాక్షేత్రంలో ప్రదర్శనలు ఇచ్చేవాళ్లను మీడియా మేనేజర్లుగా టీడీపీ వాళ్లు పిలుచుకుంటారు. పార్టీ నాలెడ్జి సెంటర్‌తో ఈ మేనేజర్లు అనుసంధానమై వుంటారు. ఈ నాలెడ్జి సెంటర్‌ ప్రధాన కేంద్రం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్టు భవ న్‌లో ఉంది. బ్రాంచిని గుంటూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌లో పూర్తి కాలం పనిచేసే ఉద్యోగులే వంద మంది దాకా ఉన్నారు. వీళ్లు కాకుండా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టుల పార్ట్‌టైమ్‌ సేవలను, వివిధ రకాల సేవలను కూడా ఈ సెంటర్‌ వాడుకుంటున్నది.

మరో వెయ్యిమందితో కూడిన సోషల్‌ మీడియా సైన్యానికి ఈ సెంటర్‌ నుంచే కమాండ్స్‌ అందుతుంటాయి. మీడియా సంస్థల యాజమాన్యాలతో తెలుగుదేశం పార్టీ అధినాయ కత్వానికి ఉన్న సన్నిహిత సంబంధాలు ఈ సెంటర్‌కు అదనపు బలం. సెంటర్‌లో అందుబాటులో వున్న విస్తార మైన డేటాను ఉపయోగించుకొని పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా మోకాలుకు–బోడిగుండుకూ ముడి పెట్టడం, తిమ్మిని బమ్మిని చేయడం, పందిని నందిగా చూపడం వంటి స్క్రిప్టులన్నీ ఈ సెంటర్‌లోనే తయారవు తాయి. స్క్రిప్టు రెడీ కాగానే మీడియా మేనేజర్లు రంగం లోకి దిగుతారు. నిజం గడప దాటకముందే అబద్ధం దేశాటన పూర్తి చేస్తుందన్న చందంగా తెలుగుదేశం పార్టీ స్క్రిప్టు వేగంగా జనంలోకి వెళ్లిపోతుంది. ఈ కార్యక్రమం నాడీ కేంద్రం టీడీపీ నాలెడ్జి సెంటర్‌. వెయ్యికి పైగా వెబ్‌సైట్లు, యూ ట్యూబ్‌ ఛానళ్లు కూడా ఈ సెంటర్‌తో అనుసంధానమై వున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి కనీసం నెల రోజులు కూడా నిండకముందు నుంచే నాలెడ్జి సెంటర్‌ను తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో రంగంలోకి దించింది. గ్రామాల్లో జరిగే వ్యక్తిగత ఘర్షణలకు రాజకీయ రంగు పులిమి వైఎస్సార్‌సీపీ బాధి తుల పునరావాస శిబిరం పేరుతో కొన్నాళ్లపాటు మీడి యాలో హడావుడి నడిచింది.

కృష్ణానదికి భారీ వరదలు వచ్చి చంద్రబాబు నివసిస్తున్న అక్రమ నిర్మాణంలోకి నీళ్లు వచ్చినప్పుడు కూడా మీడియాలో వారం రోజులపాటు చంద్రబాబు సానుభూతి ప్రభంజనం వీచింది. బాబు ఇంటిని ముంచేయడానికే బరాజ్‌ గేట్లు ఎత్తలేదని ఆరోపిస్తూ  మిత్రుడు పవన్‌కల్యాణ్‌ను కూడా రంగంలోకి దించారు. కుటుంబ సభ్యుల నిర్వాకం, తన వ్యవహారా లతో పరువు పోగొట్టుకొని కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న ఘటననూ అధికార పార్టీతో ముడి వేస్తూ చాలాకాలం పాటు ప్రచారం నడిచింది. పేదపిల్ల లకు ఇంగ్లీషు మీడియం ప్రకటనపై తిరుగుబాటు తేవా లని మీడియా ద్వారా విఫలయత్నం చేయడం తాజా ఉదాహరణే. మూడు రాజధానుల వ్యవహారంలో ఏం జరుగుతున్నదీ ఇప్పటికీ చూస్తూనే వున్నాము. కియా మోటార్స్‌ వెళ్లిపోవడానికి సూట్‌కేసు సర్దుకున్నదనీ, వైజాగ్‌ మిలీనియం టవర్స్‌ నుంచి ఓ ఐటీ సంస్థ కొచ్చి ఫ్లైట్‌కు టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నదనీ గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న హడావుడిని కూడా గమని స్తున్నాము. పెన్షన్లు తగ్గిస్తున్నారు. రేషన్‌ కార్డులు కత్తి రిస్తున్నారంటూ వచ్చిన విమర్శలకు ప్రభుత్వం తరపున మంత్రులు సమాధానం చెప్పిన తర్వాత కూడా ప్రచార దుమారం ఆగలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే ప్రతి అంశాన్నీ ఒక క్లైమాక్స్‌గా మార్చి మీడియా దన్నుతో జీవన్మరణ సమస్యగా తెలుగుదేశం పార్టీ ఆరాటం చేస్తున్నది. ఎందుకిలా?

ఎందుకంటే, చంద్రబాబు పరిపాలనా మోడల్‌కు, ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ పరిపాలన మోడల్‌ పూర్తిగా భిన్నమైనది. చంద్రబాబు అనుసరించింది ప్రపంచ బ్యాంకు ప్రవచించిన అభివృద్ధి మోడల్‌. అమెరికా వంటి అగ్రదేశాలు వాటి ప్రయోజనాల కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలు అనుసరించాలని కోరుకుంటున్న మోడల్‌. ఈ దేశాలు అప్పుల ఊబిలో కూరుకొనిపోయి శాశ్వతంగా రుణదాతల కబంధ హస్తాల్లో చిక్కుకొనిపోవాలి. ఈ దేశాల సహజ సంపద లను రుణదాత దేశాల బహుళ జాతి కంపెనీలు కొల్లగొట్టి లాభాలవేట సాగించాలి. ఆ విధమైన షరతులతోనే అవి రుణాలిస్తాయి. ఆ షరతుల ప్రకారం వాళ్లిచ్చిన రుణాన్ని భారీ రహదారులు, భారీ భవనాలు, ఎయిర్‌పోర్ట్స్, పవర్‌ ప్లాంట్స్‌ వగైరా బహుళజాతి కంపెనీల పెట్టుబడి విస్తృతికి అవసరమైన మౌలిక రంగాల్లోనే ఖర్చు చేయాలి. ఆ దేశ మానవ వనరుల అభివృద్ధి కోసం ఖర్చు చేయకూడదు. శ్రమజీవుల పిల్లలను బడికి పంపించడానికీ, వాళ్లను డాక్టర్లునూ, ఇంజనీర్లనూ చేయడానికి ఖర్చు చేయకూ డదు.

వ్యవసాయ రంగం అభివృద్ధికీ, రైతు సంక్షేమానికి ఖర్చు చేయరాదు. వ్యవసాయం దండగగా మారి రైతుల పొలాలు కార్పొరేట్‌ సంస్థల చేతుల్లోకి కారుచౌకగా బద లాయింపు కావాలి. భూముల నుంచి బేదఖలయిన రైతులు చీప్‌ లేబర్‌ ఫోర్స్‌గా పెట్టుబడిదారులకు అందు బాటులో వుండాలి. తొలితరం ఆర్థిక సంస్కరణల రోజులనాటి ఈ ప్రపంచ బ్యాంకు ఆర్థిక ఎజెండాకు భారతదేశంలో దత్తపుత్రుడి వంటివాడు చంద్రబాబు. అందుకే ఆ రోజుల్లో చంద్రబాబును కమ్యూనిస్టు పార్టీలు ప్రపంచ బ్యాంకు జీతగాడుగా పిలిచేవి. ఈ అమానవీయ షరతులతో కూడిన రుణాల కారణంగా ఎన్నో దేశాలు సర్వనాశనమయ్యాయి. ఈ విధానాలను వ్యతిరేకించిన పనామా, ఈక్వెడార్‌ దేశాల అధ్యక్షులు హెలీకాప్టర్ల ప్రమాదాల్లో చనిపోయారు. దక్షిణ అమెరికా, సెంట్రల్‌ అమెరికా దేశాలు ఏకమై అమెరికాపై, ప్రపంచ బ్యాంకుపై ఒత్తిడి తెచ్చిన తర్వాత షరతుల్లో కొన్ని స్వల్పమైన మార్పులు చోటు చేసుకున్నాయి. రుణవ్యాఘ్రం గోముఖాన్ని తగిలించుకున్నది.

ప్రస్తుతం ఈ గోముఖవ్యాఘ్రం మోడల్‌కే చంద్ర బాబు ప్రతినిధిగా ఉన్నాడు. అందుకే మరోసారి లభిం చిన ఐదేళ్ల అవకాశాన్ని ప్రపంచంలో అతి పెద్దదైన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేసే పనికే వినియోగించాడు తప్ప నిజమైన సమ్మిళిత అభివృద్ధివైపు దృష్టి పెట్టలేకపో యాడు. ఈ మోడల్‌ వల్ల లబ్ధిపొందే కార్పొరేట్‌ శక్తుల అధీనంలోనే జాతీయ మీడియా రంగం ఉన్నందువలన ఆనాటి నుంచి నేటి వరకూ మీడియా తోడ్పాటు చంద్రబాబుకు లభిస్తున్నది. ఈ చుట్టరికాన్ని దాచిపెట్టి ‘ఇక్కడి పత్రికలు రాస్తే ఎల్లో మీడియా అంటారు. ఇప్పుడు జాతీయ పత్రికలు కూడా జగన్‌కు వ్యతిరేకంగా రాశాయి. ఇప్పుడేమంటారు?’ అంటూ అమాయకత్వాన్ని నటించడం ఆయన గడుసుతనానికి నిదర్శనం. కమ్యూ నిస్టులు నామకరణం చేసినట్టుగా ఆయన ప్రజాప్రయోజ నాలను విస్మరించి ప్రపంచబ్యాంకు జీతగాడుగానే వ్యవహరించాడు. ఆ హోదాలో ఆయన సేవలకు గుర్తిం పుగానే నాడే క్లింటన్‌ విజిట్, గేట్స్‌ విజిట్‌ వగైరాలను టిప్పులుగా అమెరికా అండ్‌ కో మంజూరు చేసింది. కానీ, ఆయన వాటిని తన ప్రపంచ స్థాయి పలుకుబడిగా ఈనాటికీ ప్రచారం చేసుకుంటాడు.

ప్రపంచబ్యాంకు సృష్టించిన ‘టిప్పు’ సుల్తాన్‌ ప్రారంభించిన భారీ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాల కారణంగా ప్రమాదంలో పడింది. చంద్రబాబు వర్గ ఆర్థిక ప్రయోజనాలతో పాటు కొన్ని కార్పొరేట్‌ శక్తుల ఆర్థిక ప్రయోజనాలు కూడా ఈ వెంచర్‌తో ముడిపడి ఉన్న కారణంగానే వీరిలో అసహనం పెరుగుతున్నది. వీలైనంత త్వరగా ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేసి దుష్ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్పొరేట్‌ శక్తులు వాటి అధీనంలోని మీడియాతో పాటు తన వర్గం ఎల్లోమీడియా సంపూర్ణ తోడ్పాటు చంద్రబాబుకు లభి స్తున్నది. ఆ కారణంగానే గ్రేటాంధ్ర రాజకీయ చౌరస్తా సందడిగా మారింది. ఈ సందడిలో నిలబడి తెలుగుదేశం గారడీ షోను వీక్షిస్తూ, ఏం జరుగుతున్నదో అర్థం చేసుకోలేక తటపటాయించే తటస్తులారా!.. ఈ రాష్ట్రంలో విశాల ప్రజానీకం ప్రయోజనాలకూ, పిడికెడుమంది పెత్తందార్ల ప్రయోజనాలకూ మధ్య యుద్ధం జరుగు తున్నది. ప్రభుత్వం ప్రజలవైపు దృఢంగా నిలబడి వున్నది. ప్రతిపక్షం పెత్తందార్ల జెండాను భుజాన వేసు కున్నది. మీరెటువైపు? ప్రజల వైపా, పెత్తందార్ల వైపా?


మురళి
muralivardelli@yahoo.co.in

మరిన్ని వార్తలు