సమగ్ర గల్ఫ్‌ విధానానికి ఇదే తరుణం

21 Apr, 2020 00:06 IST|Sakshi

సందర్భం

గల్ఫ్‌లోని 87 లక్షల మంది భారతీయ శ్రామికుల్లో 17 శాతం, అంటే 15 లక్షల మంది తెలంగాణ వాళ్లు. ప్రవాసిమిత్ర, ఎమిగ్రంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం ప్రకారం, కరోనా కారణంగా ఇందులో 25 శాతం అనగా 3.7 లక్షల మంది ఉపాధిని కోల్పోవచ్చు. వీళ్లు రానున్న ఆరు నెలల్లో తెలంగాణకు తిరిగి రావచ్చు. ఈ సంక్షోభంతో పాటు, ప్రతియేటా వచ్చే సుమారు రూ. 6,300 కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని కోల్పోవాల్సిన పరిస్థితిని ఎదుర్కోవడం ప్రభుత్వానికి పెద్ద సవాలు.

గల్ఫ్‌ కార్మికుల చిరకాల వాంఛ అయిన సమగ్ర ప్రవాసీ విధానాన్ని రూపొందించడానికీ, క్షేత్ర స్థాయి సమస్యలను వ్యక్తిగతంగా అధ్యయనం చేయడానికీ తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫిబ్రవరి 26 నుంచి గల్ఫ్‌ దేశాల్లో పర్యటించాలని అనుకున్నారు. తెలంగాణలో తగినంత పని ఉంది, వారు స్వదేశానికి తిరిగి రావాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద, తక్కువ ఆదాయ వర్గాల వారికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆకట్టుకునే మూలధన పెట్టుబడులతో ముందుకు వెళుతున్నప్పటికీ నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఉంది. మరోవైపు కేరళ ఎన్నారై విధానాన్ని అధ్యయనం చేయ డానికి అధికారుల బృందాన్ని తెలంగాణ ప్రభుత్వం పంపింది. వివిధ దేశాల్లో నివసిస్తున్న కేరళీయుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలపై ఈ బృందం సమగ్ర చర్చలు జరిపింది.

రాష్ట్రంలోని ముఖ్యమైన పనుల ఒత్తిడితోపాటు, కరోనా సంక్షోభం కారణంగా ముఖ్యమంత్రి గల్ఫ్‌ పర్యటన వాయిదా పడింది. ఈ నేపథ్యంలో చాలాకాలంగా రగులు తున్న గల్ఫ్‌ వలస కార్మికుల సమస్యలకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక పరిష్కారం వెతకడం ముఖ్యం. భారత్‌ కార్మికులు గల్ఫ్‌ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రె యిన్, ఒమన్, కువైట్‌లలో పని చేస్తున్నారు. భారత్‌కు అనేక శతాబ్దాలుగా అరబ్‌ దేశాలతో నాగరికత సంబంధ మూలా లున్నాయి. ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) ప్రకారం, గల్ఫ్‌కు వలస కార్మి కులను పంపే రెండు ప్రధాన దేశాలలో ఒకటి భారత్‌ (మరొకటి ఫిలిప్పీన్స్‌). ఈ వలసదారులు విదేశీ మారక ద్రవ్య బదిలీ ద్వారా మన దేశానికి ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉంటున్నారు, అదే సమయంలో గల్ఫ్‌ దేశాల ఆర్థిక అభివృద్ధిలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. 1970 లలో చమురు వికాసం తరువాత గల్ఫ్‌కు భారత కార్మికుల వలసలు పెరిగాయి. తక్కువ జీతానికి చేయడానికి సిద్ధంగా ఉన్న కారణంగా భారత్, ఇతర దక్షిణాసియా దేశాల కార్మి కులను నియమించుకోవడానికి గల్ఫ్‌ దేశాలు ఆసక్తి చూపాయి. 

2018–19 కాలంలో ఎన్నారైలు భారత్‌కు పంపిన మొత్తం విదేశీ మారకద్రవ్యంలో అమెరికన్‌ ఎన్‌ఆర్‌ఐల వాటా కేవలం 12.5 శాతం. మిగిలిన 87.5 శాతం సొమ్ము ప్రధానంగా గల్ఫ్, ఐరోపా దేశాల నుంచి వచ్చింది. మన ఆర్థిక వృద్ధికి తోడ్పడే గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐల కొరకు మన విధానాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. 

భారతీయ వలసదారుల్లో పాక్షిక నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని కార్మికులు 70 శాతం, వైట్‌ కాలర్‌ ఉద్యోగులు 20 శాతం, నిపుణులు 10 శాతం ఉన్నారు. దక్షిణాసియా కార్మికులు గల్ఫ్‌ దేశాల్లో రాజకీయ హక్కులను కోరలేదు, ఆ దేశాల రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో జోక్యం చేసుకో లేదు. ఇది అక్కడి పాలకవర్గాలు తమ అధికారాన్ని స్థిరీక రించుకోవడానికి ఉపయోగపడింది. గల్ఫ్‌ వలసదారులు రెండు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. మొదటిది చట్టపరమైన ప్రక్రియకు సంబంధించినది; రెండవది వారి జీవన, పని పరిస్థితులకు సంబంధించినది. అందులో ముఖ్యమైనవి: తాత్కాలిక నుంచి శాశ్వత ఉద్యోగానికి మారడం (పర్యాటక వీసాలతో సహా), ఉద్యోగ ఒప్పం దాలను ముందస్తుగా రద్దుచేయడం, కాంట్రాక్టు నిబంధన లను కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా మార్చడం, చెల్లింపుల్లో ఆలస్యం, కనీస వేతన ప్రమాణాలను ఉల్లం ఘించడం, ప్రతిఫలం ఇవ్వకుండా అధిక సమయం పని చేయించుకోవడం, పాస్‌పోర్టు, ఇతర చట్టపరమైన పత్రాలను యజమాని స్వాధీనంలో ఉంచుకోవడం.

చాలా మంది కార్మికులు ప్రాథమిక సదుపాయాలు లేని బహిరంగ ప్రదే శాల్లో తాత్కాలిక లేదా అక్రమ స్థావరాలు ఏర్పాటు చేసుకొని వంతులవారీగా ఆశ్రయం పొందుతున్నారు. వారికి ఆహా రాన్ని రాయితీ ధరలకు అందించే స్థానిక రేషన్‌ కార్డులు లేవు. వారు వృత్తిపరమైన ఆరోగ్య ప్రమాదాలకు, అంటు వ్యాధులకు గురయ్యే అవకాశముంది. సంవత్సరాలకొద్దీ నివసించినప్పటికీ, వారి కుటుంబాలను తెప్పించుకోవడా నికి అనుమతిలేదు. 

ఆదాయం పెరిగే అవకాశముంటేనే ఎవరైనా వలస వెళతారు. మనవాళ్ళు పెద్ద సంఖ్యలో యూఎస్, యూరప్, ఆస్ట్రేలియాకు వలస వెళ్లడాన్ని గమనించవచ్చు. కానీ గల్ఫ్‌ సోదరులు కనీస జీవనోపాధి దొరక్క వలస పోతున్నారు. ప్రజలు తగిన జీవనోపాధిని పొందే పరిస్థితులను కల్పించ డంలో గత ఆరు దశాబ్దాలుగా మన ప్రభుత్వాలు, అభివృద్ధి సంస్థల సుదీర్ఘ విధాన వైఫల్య ఫలితమే ఈ వలసలు. 
గల్ఫ్‌ ఎన్నారై విధానాన్ని ఎందుకు రూపొందించు కోవాలి అనే దానికి మరో ముఖ్యమైన వాదన ఉంది. 2018–19 కాలంలో ఎన్నారైలు విదేశాల నుంచి భారత్‌కు పంపిన మొత్తం విదేశీ మారకద్రవ్యం 80 బిలియన్‌ డాలర్లు (సుమారు ఆరు లక్షల కోట్ల రూపాయలు). ఇందులో అమెరికన్‌ ఎన్‌ఆర్‌ఐల వాటా కేవలం 12.5 శాతం. మిగిలిన 87.5 శాతం సొమ్ము ప్రధానంగా గల్ఫ్, ఐరోపా దేశాల నుంచి వచ్చింది.

గల్ఫ్‌లోని చాలా మంది స్వదేశానికి తిరిగి రావాలని కోరుకుంటారు. దానికి అనుగుణంగానే కుటుం బం కోసం పెట్టుబడులు పెట్టారు. కానీ యూఎస్, కెనడా, యూరప్, ఆసియా–పసిఫిక్‌ భారతీయుల్లో స్వదేశానికి వచ్చి స్థిరపడాలనే ఆలోచన లేదు. కాబట్టి వారు ఆయా దేశాల్లోనే గణనీయమైన పెట్టుబడి పెడతారు. ఇక్కడ పెట్టుబడి పెడితే ఆస్తిని కిరాయికి ఇస్తారు, లేదా కొన్నేళ్ల తర్వాత అధిక లాభాలకు  అమ్ముకుంటారు. పెట్టుబడులను ఆకర్షించడా నికి ప్రోత్సాహకాల ద్వారా ప్రాధాన్యతలను ఇవ్వాలను కుంటే విధాన రూపకర్తలు ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి. మన సొంత ఆర్థిక వృద్ధికి తోడ్పడే గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐల కొరకు మన విధానాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. 

ప్రవాసీ కేరళీయ వ్యవహారాల విభాగం (నోర్కా) వలస వెళ్లాలనుకునే వ్యక్తులకు త్వరగా, సజావుగా డాక్యుమెంటే షన్‌ చేయడంలోనూ, వారి నైపుణ్యాలు మెరుగుపరిచే శిక్షణ ఇవ్వడంలోనూ సాయపడుతుంది. విదేశీ కార్మికుల డేటా బేస్‌ ఏర్పాటు చేయడం, మరణిస్తే మృతదేహాన్ని తెప్పిం  చడం, తిరిగి వచ్చిన వారికి బీమా, ఆర్థిక సహాయ పథకాలు, పునరావాస సబ్సిడీ ఇవ్వడం లాంటివన్నీ చేస్తుంది. 35 లక్షల కేరళ ప్రవాసుల అవసరాలు తీర్చడానికి నోర్కాకు రూ.80 కోట్ల బడ్జెట్‌ ఉంది. గల్ఫ్‌లో పనిచేస్తున్న 15 లక్షల మంది తెలంగాణ ప్రవాసులు అలాంటి విధానం కోసం ఎదురు చూస్తున్నారు.


డా. రమేశ్‌ చెన్నమనేని 
వ్యాసకర్త వేములవాడ శాసనసభ్యులు

మరిన్ని వార్తలు