అమెరికాలో మనవాళ్లు క్షేమమే

1 Apr, 2020 00:21 IST|Sakshi

సందర్భం

ఇదివరకు అమెరికా తుమ్మితే, ప్రపంచానికి జలుబు చేస్తుంది అనేవారు. కానీ ఇప్పటి పరిస్థితి అలాగా లేదు. అమెరికాకు జలుబు చేయడమే కాకుండా మంచం ఎక్కే పరిస్థితి వచ్చినా, ఇండియా లాంటి దేశాలు తుమ్ములు కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా మొత్తానికి ఏప్రిల్‌ 30 వరకు సామాజిక దూరం పాటించాలని ప్రకటించారు అంటే అమెరికా ఎలాంటి సంక్షోభంలో ఉందో అర్థం అవుతోంది.

అమెరికాలో కూడా సామాజిక మాధ్యమాల్లోనూ, చానెళ్లలోనూ  కరోనా వ్యాధిగ్రస్తుల గురించి, మరణాల గురించి రకరకాల సంఖ్యలు వస్తున్నా అధికారికంగా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ (సీడీసీ) ఇచ్చే లెక్కలనే అందరూ విశ్వసిస్తారు. కరోనా వైరస్‌ బాగా ఎక్కువగా ఉన్న కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సి రాష్ట్రాల గవర్నర్లు కూడా కరోనా సంక్షోభంలో  తమ తమ విధులను నిర్వర్తిస్తూనే మరోవైపు ఎప్పటికప్పుడు వాళ్ళ వెబ్‌సైట్‌లలో ఈ వైరస్‌ విషయమై గందరగోళం లేకుండా వివరాలు ఇస్తుంటారు. మార్చి 31 నాటికి అమెరికా 1,65,000 కేసులతో 3000కు పైగా మరణాలతో అగ్రస్థానంలో ఉంది.
 
అమెరికాలోని 50 రాష్ట్రాలలో కరోనా వైరస్‌ విజృం భించింది. ఈరోజుకీ  న్యూయార్క్‌  రాష్ట్రం లో  ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మాన్‌ హట్టన్‌  నగరం ప్రపంచ వాణిజ్యానికి మూలస్తంభం లాంటిది.. అక్కడ జన సాంద్రత కూడా ఎక్కువే.. అలాంటి నగ రంలో కరోనా కట్టడి చేయకపోవటంతో కరోనా పూర్తిగా ప్రబలింది.  ఓ వారం రోజుల క్రితమే సైన్యాన్ని దింపి నగరాన్ని కట్టడి చేయడం మొదలు పెట్టారు కానీ అది చేతులు కాలాక ఆకులు పట్టుకొన్న చందాన వుంది అని అంటున్నారు.
 
ప్రస్తుత పరిస్థితికి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్లక్ష్యమే కారణమని ప్రతిపక్షం డెమోక్రాటిక్‌ పార్టీ విరుచుకుపడుతోంది. ఆ పార్టీ అధికారంలో ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రంలో స్పీకర్‌ నాన్సి పెలోసి సీఎన్‌ఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ ట్రంప్‌ ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు రిపబ్లిక్‌ పార్టీ కూడా వెంటనే స్పందించి ట్రంప్‌ ప్రభుత్వం ఇప్పుటివరకు ఎవరూ చేయని విధంగా 2లక్షల కోట్ల డాలర్లను కేటాయించారని గుర్తు చేశారు.
 
అమెరికాలో పేదవారికి, నిరుద్యోగులకు, సీనియర్‌ సిటిజన్‌లకు ప్రభుత్వం సాయం మొదలుపెట్టిందని, అంతే వేగంతో చిన్న, మధ్యతరగతి వ్యాపారులకు,  పరిశ్రమలకు కూడా అనేక వెసులుబాట్లు కల్పించి ఆదుకునేందుకు చర్యలు తీసుకుందని జవాబిచ్చారు. ప్రతి రాష్ట్రం తన శక్తిమేరకు నివారణ చర్యలు తీసుకుంది. అమెరికాలో మెజారిటీ ప్రజలకు వైద్య బీమా వుంటేనే చికిత్స జరుగుతుంటుంది. వివిధ బీమా సంస్థలు అందుకు సహకరిస్తున్నాయి.
 
కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌ గవిన్‌ న్యూస్కమ్‌ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఫిబ్రవరి 15–20 తేదీల మధ్యనే చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం ప్రవేశపెట్టాయి. ఫిబ్రవరి 20 నుంచే కాలిఫోర్నియా రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ ప్రవేశపెట్టి బయటతిరగడాన్ని పూర్తిగా నిషేధిం చారు. అందువల్లే మార్చి నెలాఖరుకు కాలిఫోర్నియా రాష్ట్రంలో  కేవలం 16,000 వరకు కేసులు ఉండగా, న్యూయార్క్‌లో 1,63,000 కేసులు, న్యూజెర్సిలో 67,000 కేసులు నమోదయ్యాయి.

 అదృష్టవశాత్తు తెలుగువారు క్షేమంగా ఉన్నారని సమాచారం అందుతోంది. ఇప్పటివరకూ భారతీయులెవరూ కరోనా బారిన పడ్డట్లు లేదు. దాదాపు అన్ని తెలుగు సంఘాలు కరోనా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పనిచేస్తున్నాయి. తానా అన్ని ప్రాంతాల్లో వెబి  నార్‌ నిర్వహించి తెలుగువారిని చైతన్యపరచింది. గోఫండ్‌ ద్వారా దాదాపు లక్ష డాలర్ల నుంచి పది లక్షల డాలర్ల దాకా విరాళాలు సేకరించే పనిలో ఉన్నామని, ఆ నిధులను కరోనా బాధితులకు, కుటుంబాలకు ఉపయోగిస్తామని తానా అధ్యక్షుడు జయ్‌ తాళ్ళూరి తెలిపారు. ఆటా అధ్యక్షులు పరమేష్‌ భీంరెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ మహాసభలను వాయిదా వేశామన్నారు. నాటా అధ్యక్షులు రాఘవరెడ్డి గోసల మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు నాటా తరపున రూ.10 లక్షలు ఇచ్చామని తెలిపారు. నాట్స్‌ చైర్మన్‌ శ్రీధర్‌ అప్పసాని మాట్లాడుతూ అందరికీ తమ సంస్థ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

కాలిఫోర్నియాలో ఉంటున్న సురేష్‌ రెడ్డి ఉయ్యూరు మాట్లాడుతూ, కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రత ఎక్కువగానే ఉండటం వల్ల 4వారాల నుంచి తాము ఇళ్ళకే పరిమితమవుతున్నామని చెప్పారు. వాల్‌ మార్ట్, కాస్ట్‌ కో లాంటి పెద్ద సంస్థలు బాగా పని చేస్తూ నిత్యావసర వస్తువులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాయని శాన్‌ ఫ్రాన్సిస్కోలో  ఉంటున్న శ్రావ్య చెన్నూరి తెలిపారు.  బే ఏరియా తెలుగు సంఘం పూర్వ అధ్యక్షులు వీరు ఉప్పల మాట్లాడుతూ, అందరూ ఇళ్ళకే పరిమితమవడం అనేది అమెరికాలోని పిల్లలకు కొత్త అనుభవమని, చాలామంది పిల్లలు, తల్లిదండ్రులు కలిసి మొదటిసారిగా ఆనందకరమైన కుటుంబ జీవితం గడుపుతున్నారని చెప్పారు. ఏప్రిల్‌ నెలాఖరునాటికి అయినా సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశించాలి.


చెన్నూరి వేంకట సుబ్బారావు
వ్యాసకర్త తెలుగుటైమ్స్‌ పత్రిక సంపాదకులు, అమెరికా

మరిన్ని వార్తలు