చీకటి ఎమర్జెన్సీకి 45 యేళ్లు

25 Jun, 2020 00:34 IST|Sakshi

సందర్భం

ఎమర్జెన్సీ ప్రకటించిన అర్ధరాత్రి తెల్లారే, ఇవ్వాళ అధికారంలో ఉన్న పార్టీ ముఖ్య నాయకులంతా జైళ్ళలోనే ఉన్నారు. మొరార్జీ దేశాయ్, జయప్రకాశ్‌ నారాయణ్, ఎల్‌.కె.అద్వానీ, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఇలా ‘అంతర్గత భద్రత’కు ముప్పు అను కున్న వారినందరినీ నాటి ప్రధాని ఇందిరా గాంధీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌తో ‘రబ్బర్‌ ముద్ర’ కొట్టించి చీకటి కొట్టాలకు తరలించింది. లక్షమందికి పైబడిన ఆరెస్సెస్‌ సైన్యం ‘అభివృద్ధి నిరోధకులు’గా ముద్రపడి నిర్భందానికి గురయినారు. విప్లవ కమ్యూనిస్టుల అరెస్టులు, చిత్ర హింసల, ఎన్‌కౌంటర్లకు అదుపే లేదు. సిక్కుల హక్కులు, అకాలీ కార్యకర్తలు అపర ‘కాళీమాత’ ఇందిరాగాంధీ కంటి వేడికి దగ్ధమయిన తీరు ‘శిరోమణి గురు ద్వారా’ల్లో ఇప్పటికీ చర్చిస్తూనే ఉంటారు. భూమయ్య, కిష్టాగౌడ్‌ను ఉరి తీయవద్దని, రైట్‌–లెఫ్ట్, వాజ్‌పేయి, జయప్రకాశ్‌ నారాయణ్, శ్రీశ్రీ, జార్జ్‌ ఫెర్నాండెజ్, జైపాల్‌రెడ్డి, భూపేష్‌ గుప్తా, కన్నాభిరాన్, చండ్ర రాజేశ్వర్రావ్, ఇంకెందరో 1975లో ఢిల్లీలో ఆందోళన నిర్వహించిన వారే.

అయితే సరిగ్గా 45 యేండ్ల తరువాత ఉరిశిక్షలు, ఎన్‌కౌంటర్లు వద్దన్న వాళ్ళు ఇప్పుడు మోదీ ప్రభుత్వ మార్గదర్శకులుగా ఉన్నారు.  మరోవైపు ఇతరులంతా తుకుడే తుకుడే గ్యాంగ్‌గా ముద్రపడి ప్రతి పక్షంలో ఉన్నారు. పైగా, ఈ దేశంలో అత్యంత దారుణ పరిస్థితు లలో తప్పుడు కేసుల్లో భీమ్‌ కోరేగావ్‌ అల్లర్ల పేర ప్రొఫెసర్‌ సాయి బాబా, వరవరరావు, సోమా సేన్, గౌతమ్‌ నవలాభా, ఆనంద్‌ తేల్‌ తుంబ్డే, సుధా భరద్వాజ్, విల్సన్‌ ఇంకా ఎందరో నెలల తరబడి జైళ్ళలో ఉండటాన్ని ఎట్లా చూడాలి?

ఎన్‌కౌంటర్లు రాజకీయ హత్యలన్నది ఒక అంశమయితే, ఎన్‌కౌంటర్లు లేకుండా చీకటి గుహల్లో రాజకీయ ఖైదీలకు ఉండే సౌకర్యాలు కూడా లేకుండా చేసి బ్రతికి ఉన్నన్నాళ్లు అందులోనే మగ్గి చచ్చి పోవాలని చూస్తున్న తీరు మరో అంశం. లక్షల మందిని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కూడగట్టి, ప్రజాస్వామ్యం బ్రతికి బట్ట కట్టడం కోసం అన్ని రాజకీయ పక్షాలతో ఫ్రంట్‌ కట్టి, ఇందిరకు చుక్కలు చూపెట్టిన నాగ్‌పూర్‌లోని కార్యాలయం ‘నాగ్, నాగ్‌’ అంటూ ఇప్పుడు బుసలు కొట్టడం ఒక సాంస్కృతిక సేనాని సంస్థ చేసే పనేనా? నాకు బాగా గుర్తున్నది ఒకసారి కుల్‌దీప్‌ నయ్యర్‌ ఎమర్జెన్సీ అనంతరం రాజకీయ సమరశీలత, నిబద్ధత, గొప్ప యువతరం వనరు ఉన్నది ఆరెస్సెస్, నక్సలైట్లలోనేనని అన్నారు. ఎమర్జెన్సీకి పదిరెట్లు హక్కులు కుంచించుకుపోయిన దేశంలో ఈ ఇద్దరికీ దేశ రాజకీయాల్లో ఉన్న ప్రాభవమెంత? అంగీకారమెంత? అన్నది వేరే చర్చగానీ ఎమర్జెన్సీని తెచ్చిన కాంగ్రెస్‌ను ఇప్పుడు లిబరల్‌ పార్టీగా ఎక్కువ మంది గుర్తించటం ఆశ్చర్యమే!

ఫెడరల్‌ స్ఫూర్తితో రాష్ట్రాల హక్కులు, ప్రజల హక్కులు కాపాడతామని మాట్లాడే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి ఇలాఖాలో ఇష్టారాజ్యం, హక్కుల హననం కొనసాగిస్తూనే ఉన్నారు. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీకి, స్థానిక పోలీసులకు ‘చట్ట బద్ద కొమ్ములు’ ఇచ్చి అన్ని రాష్ట్రాల్లో స్థానిక నల్ల చట్టాలతో అణచివేత కొనసాగించేలా చూసే వివిధ రాష్ట్రాల నేతలు నిన్నటి తమ గొప్ప ప్రజాస్వామ్య ప్రాభవాన్ని, స్ఫూర్తిని మరిచి జాతికి ఎమర్జెన్సీ చీకటి రోజులను గుర్తు చేస్తున్నారు. ఎన్‌కౌంటర్లు లేకుండా పాలకులు బతుకలేరు. అధీకృత హింస లేకుండా నక్సలైట్లు బతుకలేరు. యుద్ధ ప్రభువులు రాష్ట్రాలు, ప్రాంతాల్లో అధికారంతో పాటు వనరులు కొల్లగొట్టి, సంపదను, శ్రమను కొల్లగొట్టే వాళ్ళకు సహకరిస్తూ– వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలకు వాటాదారులయి, విపరీతమైన ఎన్నికల పెట్టు బడితో, సాంకేతిక లబ్ధితో అనుకూల ఫలితాలు సాధిస్తూ, ఇదే ప్రజాస్వామ్యమని ఊరేగుతున్నప్పుడు జూన్‌ 25న జడలు విర బోసుకున్న నాటి అత్యవసర పరిస్థితి ‘వేయి నాలుకల భద్రకాళి’ నేటికీ వెంటాడినట్లే అనిపిస్తుంది. స్వాతంత్య్రం తొలినాటి ప్రజా తంత్ర వైభవాలు కాల గర్భంలో కలిసినట్లే అనిపిస్తుంది.

మన కళ్ళ ముందు యాభై యేండ్ల చరిత్రలో ఎన్నో అధిగ మించలేని సవాళ్ళు. గింగిరులు కొడుతున్న సుడి గుండాలు. గుండె దిటవుతో పోరాడే దివిటీలు. రాజ్యాంగం పీఠికపై మొలుస్తున్న కొత్త సింగిడీలు. ఏ కాన్వాసు మీద చిత్రీకరించలేని రఫ్‌ పెయింటింగ్‌ వర్తమాన భారతం. ఏ కవీ, తత్వవేత్త ఏకవేదంగా కూర్చి, విడ మర్చి, య«థా లాపంగా చెప్పలేని సమకాలీన భారత రాజకీయంలో ఏ సోయి, ఏ గాయం గమ్యంలో, గమనంలో లేని ఒక సౌకర్యవంతమైన ధారావాహికకు... చీకటి రోజు... ఉజ్వల ఉత్తానం– ఉదాత్త మానవ పునరుత్తానం... అన్నీ ఉట్టి మాటలే. చీకటిని చీల్చి గుండెను ఎదురునిల్చి సమాధుల్లో వొరిగి పోయిన వాళ్ళ బంధువులకు, రక్త సంబంధీకులకు తమ వాళ్ళు వదిలి పెట్టిన బాధ్యత గుర్తు రావాలని ఆశించడం అత్యాశ ఏమి కాదు. అట్లా మిగిలి ఉన్న అమరుల స్మృతి చిహ్నాలను కూడా ధ్వంసం చేస్తూనే ఉన్నారు. దర్శించుకుంటే నేరమని అంటారు అందరు పాలకులు. సిక్కుల ఊచకోతలో కాంగ్రెస్‌ భాగస్వామ్యమయిన సంఘ టనలు దురదృష్టకరమని, విచారకరమన్న సోనియాజీ అట్లనే అత్యవసర పరిస్థితుల పర్యవసానాలకు నాటి కాంగ్రెస్‌కు రాజకీయ వారసులు అయినందున విచారం వ్యక్తం చేస్తే ఎంత బాగుండు? అట్లాంటిది పునరావృతం కాదని అనే పాలకులు ఎవ్వరో వొడిసి పట్టుదాం.

డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ ,
వ్యాసకర్త, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు
మొబైల్‌ : 98484 72329

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు