భారత్, చైనా ప్రపంచ పెద్దన్నలు కావాలి

7 Apr, 2020 00:31 IST|Sakshi

సందర్భం 

దేశాలు స్వాతంత్య్రాన్ని, జాతులు విముక్తిని, ప్రజలు శ్రేయోరాజ్యాన్ని, ప్రపంచం అంతర్జాతీయ మానవతావా దాన్ని కాంక్షిస్తున్న కాలంలో సరిహద్దులు దాటి అనేక సర్దుబాట్లు, దిద్దుబాట్లు జరి గినాయి. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్‌– మన దేశ స్వాతంత్య్ర కాలానికి అటు ఇటుగా ఏర్పడినాయి. 1920లో జెనీవా కేంద్రంగా హెన్రీ డ్యూనాంట్‌ ఏర్పాటు చేసిన రెడ్‌క్రాస్‌ సంస్థ కోటి మంది స్వచ్ఛంద సైనికులతో దేశాలు, వాటి ఘర్షణలతో సంబంధం లేకుండా క్షతగాత్ర సైనికు లకు సేవలు అందించింది. దీని స్ఫూర్తితో 1948 ఏప్రిల్‌ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పడి, తన మొదటి అసెంబ్లీని 1950లో సమాయత్తపరిచింది. అన్ని దేశాల ప్రజలు అత్యున్నత శారీరక, మానసిక ఆరోగ్యం సాధించాలని పిలుపును ఇచ్చింది.

మన దేశంలో అమలైన మాతా శిశు సంరక్షణ, జాతీయ మలేరియా, క్షయ, కుష్టు, అనేక అంటురోగాల నిర్మూలనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారం ఉన్నది. ఎయిడ్స్‌ వ్యాధి నివారణకు వర్ధమాన దేశాల నుండి మందుల సరఫరాకు అతి తక్కువ ధరల బిడ్స్‌ కోరినందునే మన దేశంలోనే అనేక మందుల కంపె నీలు అంతర్జాతీయ ప్రమాణాలతో సరఫరా చేసి నాయి. చైనా, ఇండియా, జపాన్‌ కొత్త ప్లేయర్స్‌గా అవతరించినాయి. అయితే, గత 30 ఏండ్లలో లేని తీవ్రమైన నిధుల కొరతను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎదుర్కొంటున్నది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో బేలగా కొన్ని సలహాలే తప్ప, క్రియాశీలకంగా ముందుకు పోలేని స్థితిలో నేడు 72వ వార్షికోత్సవం జరుపుకొంటున్నది.

1978లో రష్యాలో ‘2000 సంవత్సరం నాటికి ప్రపంచ ఆరోగ్యం’ డిక్లరేషన్‌ జరిగింది. దేశాలలో వనరుల పంపిణి సమంగా ఉంటే కాని ఈ లక్ష్యం నెరవేరదనీ, పేద దేశాలకు నిధులు సమకూర్చడం అగ్రదేశాల మాననీయ కర్తవ్యమనీ అర్థించింది. ఈ మాటలు సహజంగానే అమెరికా, యూరోప్‌ దేశాలకు నచ్చలేదు. చమురు పోస్తే కాని తోటి దేశాల ఆరోగ్య దీపాలు వెలగవని ఇవి గ్రహించలేకపోయినాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచ ప్రజలు సంవత్సరమంతా ఒక నిర్దేశిత ఆరోగ్య లక్ష్యం చుట్టూ గమనంలో ఉండాలని ప్రతి ఏప్రిల్‌ 7కు ఒక థీమ్‌నూ, ఒక గోల్‌నూ ప్రతిపాదిస్తుంది. అనేక సంక్షోభ, సంక్లిష్ట కారణాలతో 2000 నాటికి అందరికి ఆరోగ్యం సాధించడం జరగలేదు కనుక, 2018 ఏప్రిల్‌లో తన 70వ వార్షికోత్సవం సందర్భంగా విశ్వ జనీన ఆరోగ్య కవరేజ్‌ ప్రకటించుకుంది.

2019లో కూడా అదే టార్గెట్‌ను ప్రపంచ దేశాలకు నిర్దేశించినా, విధానపరమైన నిర్ణయాత్మకత లేకపోవడంతో ఫలి తాలు రాలేదు. ఇప్పుడు కోవిడ్‌ 19  నేపథ్యంలో సంక్ర మణ వ్యాధుల చర్చను, కార్యక్రమాలను ప్రకటిం చింది. సేవామూర్తులైన నర్సులకు ఆరాధ్య దేవత ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ 200వ జన్మదినోత్సవ పునరు త్తేజంతో వైద్య, ఆరోగ్య సిబ్బంది ముందుకు పోవా లని అన్నది. అట్లాంటాలోని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (íసీడీసీ) ప్రపంచంలో ప్రామాణికమైన పరిశోధనా సంస్థ. కానీ సార్స్, ఎబోలా, నిఫా, మెర్స్‌ సమయంలో సీడీసీ, ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇచ్చిన సాంకేతిక సహాయం, సలహాలు నామమాత్రం. నిన్నటి కరోనా, నోవల్‌ కరోనాగా వచ్చి వూహాన్‌ గగనతలాన్ని దాటి తమ దేశాల్లో ప్రవేశిస్తుంటే చేష్టలుడిగిన దౌర్భాగ్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాభవం తగ్గడానికి ఒక కారణం.

కరోనా దెబ్బకు లక్షమంది దేశీయంగా చని పోతారని వణికిపోతున్న అమెరికా గ్లోబల్‌ సహాయం చేసే స్థితిలో లేదు. అందుకే భారత్‌ అయినా గతంలో చేసిన తప్పులు చేయకుండా 2020 ఆరోగ్య బడ్జెట్‌లో 6% నిధులను కేటాయిస్తే బాగుంటుంది. ప్రపంచ ప్రజల ఆర్థిక శక్తులుగా ఎదిగిన చైనా, ఇండియా ఇతర వర్ధమాన దేశాలను ప్రభావితం చేయడానికి తామే పెద్దన్నలుగా ఎక్కువ నిధులు ఈ సంస్థకు సమ కూర్చితే 2020లో అదే పెద్ద ‘కంట్రిబ్యూషన్‌’. ఈ సంస్థ ప్రపంచ ఆరోగ్యానికి ఆక్సిజన్‌. దాన్ని బలో పేతం చేయడం ఒక అత్యవసర కార్యం.
(నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా)


డా. చెరుకు సుధాకర్‌
వ్యాసకర్త సామాజిక వైద్యులు, రాజకీయ కార్యకర్త

మరిన్ని వార్తలు