దేవుళ్లకు జాతులు, కులాలు ఉండవు!

30 Aug, 2019 01:33 IST|Sakshi

అభిప్రాయం

మల్లెపల్లి లక్ష్మయ్యగారి  వ్యాసాన్ని బాధతో చదివాను. ఆయన మేధావి. జ్ఞానసంపన్నుడు.  కాలానుగుణ మార్పులను సూక్ష్మంగా చూస్తున్నవారు. అలాంటి వ్యక్తి ‘దేవుడికీ తప్పని కులవివక్ష’ అనే వ్యాసం రాయడాన్ని (సాక్షి 29–08–2019) సున్నితంగా తిరస్కరిస్తున్నాను. వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క కాలంలో సద్గురు రవిదాస్‌ మహరాజ్‌ లాంటి అవతార పురుషులు పుడుతూనే ఉన్నారు. వారిని సమాజం గుర్తిం  చింది. వారి సందేశాలను భక్తితో స్వీకరించాయి. 

సాధువుల జాతి, పుట్టుక అడుగకు, వారి జ్ఞానాన్ని స్వీకరించు. ఒరను పట్టించుకోకు కత్తి పదునును చూడు. 

సంత్‌ రవిదాస్‌ జయంతి సమావేశాల్లో చాలాసార్లు నేను పాల్గొన్నాను. ఢిల్లీలో సంత్‌ రవిదాస్‌ దేవాలయాన్ని కూలగొట్టినప్పుడు ముందుగా స్పందించిన వాణ్ణి నేనే.. సంత్‌ రవిదాస్‌ దళితులకే కాదు.. మానవజాతికే గురుతుల్యులు.

2018 ఏప్రిల్‌ 16 సాయంత్రం 4 గంటలకు ఒక దళిత శ్రీ వైష్ణవ భక్తుడిని నా భుజాలపై కూర్చోబెట్టుకుని జియాగూడ శ్రీరంగనాథ స్వామి ఆలయంలోనికి మేళతాళాలతో భక్త బృందం వెంటరాగా తీసుకువెళ్లాను. భక్తుల గోవింద నామ స్మరణ, తిరుప్పాణాళ్వారు రచించిన ‘అమలనాది పిరాన్‌ పాశురగానం,’ అన్నమయ్య రచించిన ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..’ అనే గానాల మధ్య దేవుడిముందు అందరూ సమానమే అని మరోమారు నిజం చేస్తూ, మునివాహన ఉత్సవం బ్రహ్మాండంగా నిర్వహించాం.

భగవద్రామానుజులవారి 1000వ జయంతి సంవత్సరంలో ఈ ఉత్సవం జరగడం విశేషం. వైష్ణవాచార్య గురుపరంపరలో నమ్మాళ్వారు ప్రథమాచార్యులు. నమ్మాళ్వారు శూద్రజాతిలో జన్మించారు. శ్రీవైష్ణవులు పన్నెండుగురు ఆళ్వారులను భక్తితో పూజిస్తారు. పన్నెండు మంది ఆళ్వారులు వివిధ వర్ణాలలో జన్మించి పూజలందుకుంటున్నారు. వీరిలో తిరుప్పాణ్‌ ఆళ్వార్‌ దళిత కులానికి చెందినవారు. ఈ పరమ భక్తుడు శ్రీరంగనాథునికి తన జీవితాన్ని అంకితం చేసి శాస్త్రబద్ధ జీవనం చేస్తూ శ్రీరంగంలోని ఆలయం వెలుపలి నుండే రంగనాథుని గుణగానం చేస్తూ ఉండేవారు.

పరమ భక్తుడైన ఈ ఆళ్వారుని, ఆలయ అర్చకులైన శ్రీలోక సారంగముని గుర్తించారు. శ్రీరంగనాథుని ఆజ్ఞానుసారం శ్రీలోకసారంగముని తిరుప్పాణాళ్వారుని కలుసుకుని, ఆ భక్తాగ్రేసరుని తన భుజాలపై కూర్చుండబెట్టుకుని ఆలయ ప్రవేశం చేయించమని తనను స్వామి ఆదేశించారని తెలి పారు. దైవాజ్ఞకు ఎదురు చెప్పలేక ఆళ్వారు అంగీకరించారు. ఈ విధంగా ‘మునివాహనునికి’ సంతోషకరమైన స్వామి దర్శనం లభించింది. 

ఈ సంఘటన దాదాపు 2,700 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు మన సమాజంలో కులాల మధ్య వివక్ష, అగౌరవం అధికంగా కనిపిస్తున్నాయి. కులాల నడుమ చెలరేగుతున్న అగౌరవం, వివక్షతలు తొలగాలనీ, అందరినీ సమానంగా గౌరవించాలన్న సందే శం ఇచ్చే విధంగా, నేను మునివాహన సేవను నిర్వహించాను. ఒక దళిత భక్తుని తిరుప్పాణాళ్వారు వలె నా భుజాలపై కూర్చుండబెట్టుకుని అమలనాది పిరాన్‌ పఠిస్తూ ఆలయ ప్రవేశం చేశాను.

సమాజంలో ఎస్సీ, ఎస్టీ సోదరులపట్ల చూపుతున్న దుర్వ్యవహారం ఆపివేసి, ప్రజ లకు వారిపట్ల గౌరవభావాన్ని ఇనుమడింప చేయడానికి నేను చేసిన చిన్న ప్రయత్నం ఇది. నేను 2018వ సంవత్సరం జూన్‌ నెలలో గుంటూరులో, జూలై నెలలో నెల్లూరులో ఈ ఉత్సవాన్ని నిర్వహిం చాను. నేను చేసిన ప్రయత్నాలు తప్పుగా మా ధర్మ శాస్త్రజ్ఞులు పరిగణించలేదు. మనువాదులుగా మీరు నిందించిన వారెవరూ నన్ను దూషించలేదు.

మల్లెపల్లి లక్ష్మయ్యగారు తమ వ్యాసంలో పేర్కొన్న అంశాలు సనాతన ధర్మం కానీ, రామానుజ సాంప్రదాయం కానీ ఎన్నటికీ ఒప్పుకోవు. కొంతమంది చేసే దుశ్చర్యలకు మొత్తం సమాజాన్ని నిందించే పని చేయడం సబబు కాదు. మనమందరం కలిసి మంచి సమసమాజ స్పృహను, చైతన్యాన్ని లోకంలో ఆవిష్కరిద్దాం. లక్ష్మయ్యగారూ.. మీరూ రండి. ఇదే మా ఆహ్వానం.


వ్యాసకర్త: సీఎస్‌ రంగరాజన్‌,
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు 
csranga@gmail.com

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా