ఇదీ నారా మార్కు భాషాసేవ! 

31 Jul, 2019 01:08 IST|Sakshi

సందర్భం

నేతిబీరకాయలో ఏపాటి నెయ్యి ఉంటుందో, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుగారి మనసులోనూ ఆంధ్రభాషకు అంతపాటి విలువే ఉంటుంది. అధికారభాషాసంఘాన్ని సైతం గాలికొదిలేసిన బాబు వైనాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే చాలు. మాతృభాషపట్ల ఆయనకున్న మమకారం ఎంతటిదో ఎవరి కైనా ఇట్టే అవగతమవుతుంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు ఆంధ్రభాష అంటే అమితమైన మక్కువ. నడక, నడత, వర్తనల్లో నిలువెత్తు తెలుగుదనం ఆయనలో నిత్యమూ  తొణికిసలాడుతుండేది. చేవ్రాలు సైతం తెలుగులోనే చేయాలన్న పట్టుదలతో ఆజన్మాంతం భాషాగరిమను చాటి చెప్పిన ధన్యజీవి ఎన్టీఆర్‌. అయితే, అంతటి మహనీయునికి తానే సిసలైన వారసుడనంటూ భుజాలు చరుచుకుని మరీ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న చంద్రబాబు మాత్రం ఎన్నెన్నో అంశాల్లో మామ గారి స్థాయిని అస్సలు చేరుకోలేకపోయారు. అధికారభాషగా ప్రవర్థమానం కావాల్సిన తెలుగుకు తెగులు పట్టించారు. 

విభజిత ఆంధ్రప్రదేశ్‌ వాకిట 2014లో చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచీ ఆంధ్రసాహిత్యం, సంస్కృతి, భాష దిగజారిపోయాయి. నాటి ఎన్నికల ప్రణాళికలో ప్రాంతీయ భాషా వికాసానికి, స్థానీయభాషా సముద్ధరణకు పాటుపడతామని పేజీలకు పేజీలు వండివార్చిన బాబు స్కంధావారం సింహాసనం అధిరోహించగానే ఆ సంగతిని బొత్తిగా పట్టించుకోకుండా పోయింది. కనీసం అధికార భాషాసంఘాన్ని నియమించాలన్న ఇంగితమూ లోపించడం ఆంధ్రులు చేసుకున్న కల్తీలేని దురదృష్టం. ఇరుగుపొరుగు రాష్ట్రాలైన కన్నడ, తమిళ, మలయాళ సీమల్లో ఆయా స్థానీయ భాషలకు అగ్రతాంబూలం దక్కుతున్నా ఇక్కడ ఈయనకేం పట్టలేదు.

ఏళ్లు గడిచిపోతుండగా, ఎవరెవరో పోరగా పోరగా, రెండేళ్ల కిందట రాష్ట్ర అధికారభాషాసంఘం అధ్యక్షునిగా అనంతపురం జిల్లాకు చెందిన అస్మదీయుడొకర్ని బాబు ప్రకటించేశారు. తీరా చూస్తే సదరు అస్మదీయులవారు ఆ పదవికి ఏ మాత్రం సరిపోరని,  భాషాసాహిత్యాలకు ఆయన చేసిందేమీలేదనీ పెద్ద ఉద్యమమే మొదలైపోయింది. బాబు చేసిన ఆ నియామకాన్ని భాషాప్రేమికులందరూ అప్పట్లో కలిసికట్టుగా అడ్డుకున్నారు. అధికారభాషా సంఘాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దని వేడుకున్నారు. పత్రికల్లోనూ, ఇతర ప్రసారమాధ్యమాల్లోనూ పుంఖాను పుంఖాలుగా ప్రకటనలు విడుదలచేస్తూ నిరసనకు దిగారు. సొంతపార్టీ నుంచి సైతం బాబుకు సెగ మొదలైంది. తను చేసిన తప్పును ప్రజలు తెలిసేసుకున్నారన్న సంగతిని ఆయన గ్రహించారు. వెనువెంటనే తను ఇచ్చిన జీవోను తానే లోపాయికారీగా ఉపసంహరించుకున్నారు. ఇందుకు సంబంధించి తీసుకోబోయే నిర్ణయాలన్నింటినీ పెండింగ్‌లో పెట్టేశారు. అధికారభాషాసంఘ అధ్యక్ష స్థానాన్ని మరెవ్వరికీ అప్పగించలేదు. సభ్యులుగా కూడా ఇంకెవ్వరినీ నియమించలేదు. ఆ విధాన ఆయన పాలించిన ఆయిదేళ్లూ అధికార భాషాసంఘం అనాథగా మిగిలిపోయింది. 

ప్రబలిపోతున్న పాశ్చాత్యధోరణుల వల్ల, ప్రపంచీకరణ పుణ్యమాని మన సమాజంలో ప్రాంతీయభాషలు నానాటికీ నీరసిల్లిపోతున్నాయి. తీవ్రమైన పరభాషాపెత్తనానికి దడిసి తెలుగూ తిరోగమన పథమే పడుతోంది. ఇలాంటి క్లిష్టస్థితిలో అధికారభాషాసంఘమే లేకుండా నారావారు జాగ్రత్తపడటంతో మన భాష మరింతగా వన్నె తగ్గింది. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దాలంటూ భాషాప్రేమికులు ఎంతగా మొత్తుకున్నా సింగపూర్‌ జపంలో మునిగితేలిన బాబుకు ఇవేమీ వినిపించలేదు. తెలుగుభాషామతల్లి రోదన ఆయనను కదిలించలేదు. అంచేతనే ప్రభుత్వపరంగా భాషను పట్టించుకునే దాతాదైవం కరవైపోయారు. 

కొసవిరుపు : అన్నట్టు! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా అయిదేళ్ల కిందట పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలోనే  విశాఖపట్నం వన్‌టౌన్‌ ప్రాంతంలోని మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు పుట్టిన ఇంటిని ప్రభుత్వం తరఫున కొనుగోలు చేస్తామని నారా చంద్రబాబునాయుడు ఘనమైన ప్రకటన విడుదల చేశారు. ఆ ఇంటిని జాతీయ తెలుగు సాహిత్య స్మారక కేంద్రంగా తయారుచేస్తామని, శ్రీశ్రీ రచనా స్ఫూర్తిని భావితరాలకు అందిస్తామని వాక్రుచ్చారు. ఈ విషయాన్ని నాడు తెలుగు దినపత్రికలు ప్రముఖంగా అచ్చువేశాయి. వాగ్దానాలు మరచిపోయే అలవాటున్న బాబు అనంతర కాలంలో షరా మామూలుగానే శ్రీశ్రీ ఇంటిని స్మారకమందిరంగా మలిచే ప్రతిపాదననూ పట్టించుకోలేదు.  బాబు మార్క్‌ భాషా సేవ అంటే ఇదేనేమో..!

డాక్టర్‌ చింతకింది శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 
మొబైల్‌ : 88971 47067

మరిన్ని వార్తలు