దురాచారమా.. సామాజిక దూరమా?

29 May, 2020 01:08 IST|Sakshi

భారతదేశం ఎంత తీవ్రమైన రోగగ్రస్తతలో చిక్కుకుని ఉందంటే, కోవిడ్‌–19 సాంక్రమిక వ్యాధి పట్ల దేశం స్పందన సైతం ప్రాణాంతక అంటువ్యాధిని మించిపోతోంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత అమానుషత్వంగా లాక్‌డౌన్‌ని విధించిన ఘటనను కానీ, కోట్లాది శ్రామిక ప్రజల జీవితాలను ఇంతగా అవమానించిన ఉదంతం కానీ మనం చూసి ఉండలేదు. జాతి ఆరోగ్య సమస్యను కేంద్ర ప్రభుత్వం మానవ ఉపద్రవంగా మార్చివేసింది. ఇలాంటి లాక్‌డౌన్‌ని భారత కులీన వర్గానికి చెందిన అతిపెద్ద సెక్షన్‌ నిస్సిగ్గుగా ఆమోదించిందంటే దానిలోని కులతత్వాన్నే అది చాటి చెబుతోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే లాక్‌డౌన్‌ ఒక సమర్థవంతమైన కులపరమైన వేధింపు. బలహీన వర్గాలపై ప్రయోగించిన క్రూర హింస లాక్‌డౌన్‌. వైరస్‌ని నిరోధించే పేరుతో ఈ వేధింపుకు ఆమోదంకూడా పొందారు. 

మార్చి 23న ప్రధాని నరేంద్రమోదీ దేశం మొత్తాన్ని లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వేతనాలు దక్కని, పని లేదా పునరావాసం కోల్పోయిన కోట్లాది ప్రజలు కనీవినీ ఎరుగని భారీ వలసల బాటపట్టారు. తమ జీవితాల్ని ఇలా పూర్తిగా దిగ్బంధించి వేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బయటకు వచ్చిన వారిని మన రాజ్యవ్యవస్థ లాఠీలతో చితకబాదుతూ, టియర్‌ గ్యాస్‌ ప్రయోగిస్తూ, నిర్బంధ శిబిరాల్లోకి నెట్టిపడేసింది. మన విధాన నిర్ణేతలు, న్యాయవ్యవస్థ, మీడియా, విద్యావేత్తలు (మొత్తంగా అగ్రకులాల ఆధిపత్యమే ఉంటోంది) ఇలా బాధలుపడుతున్న కోట్లాది ప్రజలను వలస కూలీలు అని ముద్ర వేసేశారు. కానీ, ఈ పదబంధం మన దేశంలో వర్గంతో కులం ఎంత లోతుగా కలిసిపోయిందనే వాస్తవాన్ని మసకబారుస్తోంది. లాక్‌డౌన్‌ మన దేశంలో ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన కులాలనుంచి ప్రధానంగా పుట్టుకువచ్చిన వారిపై సామూహిక గాయాల పాలు చేసిన వాస్తవాన్ని వలస కూలీలు అనే పదబంధం కనుమరుగు చేసేసింది. మతాలకు అతీతంగా, మన దేశంలో స్థానబలం లేని ఇలాంటి కోట్లాదిమంది శ్రామి కులే దేశవ్యాప్తంగా పొలాల్లో పనిచేస్తున్నారు. వర్క్‌షాపులు, ఫ్యాక్టరీలను నడుపుతున్నారు. రహదారులపై, నిర్మాణ స్థలాల్లో శ్రమిస్తున్నారు, సంపన్న, మధ్యతరగతి వర్గాల ఇళ్లలో సేవలందిస్తూ, వారి పిల్లల ఆలనా పాలనా చూస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో వీధులను మురికి కాలువలను శుభ్రపరుస్తున్నారు. వీరిలో గూడ్స్‌ రైలుకింద పడి నలిగిపోయిన ఆదివాసీ కూలీలు, ఆత్మహత్య చేసుకున్న దళిత ఎలెక్ట్రీ షియన్‌ రోషన్‌ లాల్, నడిచినడిచి కుప్పగూలిపోయిన 12 ఏళ్ల జామల్లో మద్కమ్‌ వంటి వారు ఎందరో ఉన్నారు.

గత 60 రోజులుగా కోట్లాది వలస కార్మికులు అనుభవించిన దురవస్థ, లాక్‌ డౌన్‌ ప్రేరేపిత మరణాలు అనేవి గత మూడు దశాబ్దాలుగా దేశంలోని దిగువ కులాల ప్రజలపై సాగిస్తూ వచ్చిన పాశవిక కృత్యాలను మించిపోయాయి. ఏటేటా దేశం నమోదు చేస్తూ వచ్చిన ఆర్థిక ప్రగతి దానికి నిజంగా కారణమైన కోట్లాది సాధారణ ప్రజానీకం కోల్పోతూ వచ్చిన స్వాతంత్య్రాన్ని, వారి తక్షణ ఉనికిని కూడా కనుమరుగు చేస్తూ వచ్చింది. అదే సమయంలో అగ్రకులాల ఆధిపత్యం రానురానూ పెరుగుతూపోయింది. దేశంలో మొదలైన ఆర్థిక సరళీకరణ మన దేశంలోని కుల ఆధిపత్యశక్తులతో కుమ్మక్కైపోయింది. దేశంలో భూమి, పెట్టుబడి, విద్య, న్యాయం, ఆరోగ్య సంరక్షణను పొందే విషయంలో కులం నిర్దిష్టమైన సరిహద్దులు గీయడం యాధృచ్ఛికం కాదు.

భారతదేశంలో 70 శాతం ప్రజల సంపద కంటే 10 శాతం సంపన్నుల ఆదాయం ఎక్కువగా ఉంది. దేశంలోనీ ప్రైవేట్‌ కంపెనీలు దాదాపుగా అగ్రకులాల యాజమాన్యం లోనే ఉన్నాయి. జనాభాలోని అతి చిన్న విభాగంగా ఉండే రెండు అగ్రకుల బృందాలు దేశంలోని 90 శాతం కార్పొరేట్‌ బాండ్లను కలిగివున్నాయి. దేశంలోని ఒక శాతం సంపన్నులు 70 శాతం మంది ప్రజల సంపదకంటే నాలుగు రెట్ల సంపదను హక్కు భుక్తం చేసుకున్నారు. కుల వ్యవస్థ నిచ్చెనమెట్లలో అట్టడుగున ఉన్న వారి జీవ ధాతువులుగా ఉంటూ వచ్చిన భూమి, అడవులు, వనరుల్లో అధిక భాగాన్ని ఈ సంపన్నవర్గమే లాగేసుకుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, సంపదను కులీన వర్గాలకు బదలాయింప చేసే ప్రక్రియ మాత్రం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే వచ్చింది.

ఈలోగా ఆర్థిక వ్యవస్థ లక్షణాల్లో ఒకటిగా మారిపోయిన నిరుద్యోగం దేశంలోని కింది కులాల ప్రజలను కూలి కోసం, పనికోసం పోరాటంలో మగ్గిపోయేలా చేసి కనీస వేతనాల కంటే తక్కువ స్థాయిలో ఎలాంటి రక్షణలు, ప్రయోజనాలు లేని తరహా పనులకు పరిమితం చేసిపడేసింది. ఈ క్రమంలోనే మన శ్రామిక ప్రజలు గ్రామాల్లో ఒక కాలు పెట్టి పనికోసం దేశమంతా వలసపోవలసి వచ్చింది. కాస్త మెరుగైన జీవితంకోసం వారు ఎంచుకున్న వలస మార్గం చివరికి వారి గౌరవాన్ని, మర్యాదను కూడా వారినుంచి లాగేసుకుంది. ఈ వలస శ్రామికులే మురికివాడల్లో మగ్గిపోయారు, చిన్న చిన్న పని స్థలాల్లో ఇరుక్కుపోయారు లేక కోట్లాదిమందికి గూడు కూడా దొరకని నేపథ్యంలో మామూలు సమయాల్లో కూడా వీరు అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటూ దోపిడీకి గురవుతూ వచ్చారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆకలితో అల్లాడిపోనున్న కోట్లాది వలస ప్రజలకు తానేం చేయబోతున్నదీ ప్రధాని కనీసం వివరించలేదు. దేశవిభజన నాటి సామూహిక వలసలను సైతం తోసిరాజని లక్షలాది మంది కాలినడకన స్వస్థలాలకు పయనమవుతుండగా వారి బాధలు, కడగండ్లు దేశానికి అవసరమైన త్యాగంగా మోదీ పేర్కొని మసిపూశారు. దిగువ కులాల జీవితాన్ని, వారి అవయవాలను, గౌరవాన్ని బలి ఇచ్చే సంప్రదాయం కలిగిన దేశంలో ప్రధాని వ్యాఖ్య  ఖండనకు గురికాలేదు. చివరకు కులీన వర్గాలు సామాజిక దూరం గురించి పదేపదే చేస్తూ వచ్చిన ప్రచారాన్ని కూడా ఎవరూ అడ్డుకోలేదు. ఈ పదబంధం దేశజనాభాలో అత్యధిక శాతాన్ని కులపరమైన అవమానాలకు గురిచేసింది. వారిని తాకినా, కలిసి భోంచేసినా, సామాజిక సంబంధాలను కొనసాగించినా తప్పు అనే స్థాయిలో ఆ ప్రచారం సాగిపోయింది. 

మనదేశంలో లాక్‌డౌన్‌ దిగువ కులాలను మరింత కిందికి నెట్టేసింది. మరోవైపు ఎగువ కులాలు గతం లోని అంటరానితనాన్ని సామాజిక దూరం ముసుగులో పాటిం చాయి. కోవిడ్‌–19 పట్ల భారత్‌ కొనసాగించిన ఈ స్పందన మన ప్రాచీన కులతత్వ గతం సాగించిన అమానుష కృత్యాలను మరోసారి రంగంమీదికి తెచ్చింది. కరోనా వైరస్‌ అంతరించిపోవచ్చు కానీ వలసవాద వ్యతిరేక పోరాటాల నుంచి ఆవిర్భవించిన మన రిపబ్లిక్‌ వారసత్వంగా అందించిన సంఘీభావం, సౌభ్రాతృత్వం అనే నైతిక విలువల పతనాన్ని తిరిగి తీసుకురాలేం. ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని దీప్తిమంతం చేసిన విలువలు. ఇన్నాళ్లుగా అవి ప్రసరించిన కాంతి చెదిరి పోతూడటమే విషాదకరం. 
చిత్రాంగద చౌదరి, స్వతంత్ర జర్నలిస్టు
అనికేత్‌ అగా, విద్యావేత్త 

>
మరిన్ని వార్తలు