మౌన సంస్కృతి ప్రజాస్వామ్యానికి ప్రమాదకారి

30 Dec, 2018 01:01 IST|Sakshi

సందర్భం

కారణాలు ఏవైనా కావచ్చు. కారకులు మీరంటే మీరని రాజకీయ పార్టీలూ, నాయకులూ పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలతో పొద్దు గడపవచ్చు. దురదృష్టవశాత్తూ  మన దేశంలో మౌన సంస్కృతి పవనాలు వేగంగా వీస్తున్నాయి. మౌనం సమాజానికి, ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ప్రజలు తమలోని భావాల్ని, ఆలోచనల్ని  స్వేచ్ఛగా బయటకు ప్రకటించుకొనే హక్కులను గౌరవించి, వాటిని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలే వాటిని కాలరాసేలా వ్యవహరిస్తున్నాయి. బలప్రయోగంతో సమాజంలో నెలకొల్పుతున్న అనారోగ్యకరమైన మౌనాన్ని తొలగించి ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కాపాడే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అప్పుడప్పుడు జలుబు రావాలి. అప్పుడే శరీరంలో ఉన్న మలినమంతా బయటకు పోతుంది. అందువల్ల జలుబు రావడం మంచిది. లేకపోతే ఊపిరితిత్తులు నాశనమై మానవ దేహాన్నే అది కబళిస్తుంది. అలాగే మనిషి తన ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకోగలగాలి. అదే ప్రజాస్వామ్యం.

దేశాన్ని మౌన సంస్కృతి (సైలెన్స్‌ కల్చర్‌) కమ్ముకుంటోంది. ప్రజల్లో, విశ్వవిద్యాలయాల అధ్యాపకుల్లో, యువకుల్లో, పలు రాజకీయ పార్టీల నాయకుల్లోనూ.. ఇలా ఎక్కడ చూసినా ఈ  సైలెన్స్‌ వాతావరణమే కనబడుతోంది. దేశంలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వాలు తీసుకుంటోన్న పలు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ మాట్లాడే వారి సంఖ్య పరిమితమైపోతోంది. ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడితే తమకు ఎటువైపు నుంచి ఏ రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయమే అందుకు కారణమని చెప్పక తప్పదు. అందువల్ల మౌనమే శ్రీరామరక్ష అనుకుంటూ దేశంలో ఏం జరుగుతున్నా మనకెందుకులే అనుకునే ధోరణి జనంలో పెరుగుతోంది. దీంతో ఎక్కడ ఏం జరుగుతున్నా మౌనంగా ఉండే వారి సంఖ్య దినదినం పెరుగుతోంది.

 ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా చెప్పుకుంటున్న మన దేశంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తడం తీవ్ర ఆందోళనకరం. ఇలాంటి మౌనం సమాజానికి, ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. తమ ఆకాంక్షలను, అభిప్రాయాలను ప్రతి బింబించేలా ప్రభుత్వాలు పనిచేయాలనే కోరిక ప్రతి పౌరుడికీ ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పనిచేస్తే జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. దురదృష్టవశాత్తు, మన దేశంలో విచిత్రమైన, విపరీతమైన పోకడలు విస్తరిస్తున్నాయి. ప్రజలు తమలోని భావాల్ని, ఆలోచనల్ని  స్వేచ్ఛగా బయటకు ప్రకటించుకునే హక్కులను గౌరవించి, వాటిని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలే వాటిని కాలరాసేలా వ్యవహరిస్తున్నాయి. ప్రతిపక్షాలే లేకుండా ప్రయత్నాలు చేయడం, ప్రశ్నించే తత్వాన్నే భరించలేకపోవడం వంటి అవాం ఛనీయ పోకడలు నేటి రాజకీయ వ్యవస్థలో ప్రవేశిం చాయి. ఇలాంటి ధోరణులు ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాయి. 

అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వాలైనా ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వాలి. నూరు పూలు వికసించనీ.. వేయి ఆలోచనలు సంఘర్షించనీ చందంగా ప్రభుత్వాలు పనిచేస్తే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. లేకపోతే పాలకులు ఎక్కడ తప్పు చేస్తున్నారో, పాలన గురించి ప్రజలేం అనుకుంటున్నారో, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులేమిటో ఎలా తెలుస్తాయి? ఫలితంగా ప్రజావిశ్వాసాన్ని కోల్పోవడమే కాదు.. జనాగ్రహం తప్పదు. అధికారంలో ఉన్నంతవరకూ ప్రజల్ని, వారి ఆలోచనల్ని భయపెట్టి నియం త్రించే వీలు పాలకులకు ఉండొచ్చేమోగానీ.. అధికారం శాశ్వతం కాదు. భయంలేని సమాజాన్ని సృష్టించగలిగినప్పుడే ఏ ప్రభుత్వమైనా మరింత పదునుదేలుతుంది. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించగలుగుతుంది. అలాంటి వాతావరణం కల్పించినప్పుడే ప్రజలు హద్దులు లేని ఆలోచనలతో ముందుకుసాగుతారు. తద్వారా ప్రగతిశీలతతో, రెట్టింపు ఉత్సాహంతో ఈ సమాజం మరింత పురోగమనంలో దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. 

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వినూత్న రాజకీయ పంథాలను అనుసరిస్తూనే ప్రజల సహకారంతో పనిచేసినప్పుడే దేశాన్ని అనాదిగా పట్టిపీడిస్తున్న పేదరికం, నిరుద్యోగం, అవినీతి వంటి మహమ్మారిల బారి నుంచి విముక్తి చేయగల్గుతాం. లేకపోతే ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయి. జనం ఓట్లేస్తారు. గెలిచిన పార్టీ అధికారం చెలాయిస్తుంది. ఓడిపోయిన పార్టీ మళ్లీ అధికారంలోకి ఎలా రావాలో, ప్రజల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఆలోచిస్తాయి తప్ప ప్రజల జీవితాల్లో ఏమాత్రం మార్పులు కనబడవు. ఈ రోజు దేశ ప్రజలు కోరుకుంటున్నది ఇది కాదు. తమ జీవితాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ప్రపంచంలో జరుగుతున్న పరి ణామాలను అనునిత్యం పరిశీలిస్తున్న సగటు భారతీయ పౌరుడు అగ్రదేశాల సరసన భారత్‌ సగర్వంగా నిలవాలని అభిలషిస్తున్నాడు.

సాంకేతిక యుగంలో వస్తోన్న విప్లవాత్మక మార్పులతో ప్రతిమనిషీ చైతన్యమంతమవుతున్నాడు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా నిమిషాల్లోనే తెలుసుకోగలుగుతున్నారు. అంతలా సాంకేతికత వృద్ధి చెందింది. కానీ మన నాయకుల్లో మాత్రం ఇంకా మూస పద్ధతులే కొనసాగుతున్నాయి. ప్రజల్ని నియంత్రించాలని, భయపెట్టాలని ప్రయత్నిస్తే ఆ చర్యలు తమకే ఇబ్బందులు తెచ్చిపెడతాయని గుర్తించలేకపోతున్నారు. అంతేకాదు, కార్యనిర్వాహక వ్యవస్థలు, స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థలో రాజకీయ జోక్యం పెరిగిపోతోంది. కార్యనిర్వాహక వ్యవస్థల పనితీరును రాజకీయ వ్యవస్థలు పరిశీలించాలే తప్ప నియంత్రించాలని చూడటం సరికాదు. 

విశ్వవిద్యాలయాలు మౌనంగా ఉండాలి. అక్కడ పనిచేసే ప్రొఫెసర్లూ ఏమీ మాట్లాడొద్దంటే కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలు ఎలా వస్తాయి? ఇలాంటి పరిస్థితులతో వచ్చే తరమే మారిపోతుంది. ఏం జరుగుతున్నా, ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నా సగటు మనిషి నాకెందుకులే అనుకుంటూ ఏమీ మాట్లాడకపోతే సమాజాన్ని అది పెద్ద దెబ్బకొడుతుంది. ఈ మౌనం ఏదో ఒక రోజు అగ్నిపర్వతంలా బద్దలవుతుంది. అన్ని వ్యవస్థలూ స్వతంత్రంగా ఎవరిపని వారు చేసుకుంటూ ముందుకెళ్తేనే  అందరికీ క్షేమం. 

దురదృష్టవశాత్తూ  మన దేశంలో మౌన సంస్కృతి పవనాలు వేగంగా వీస్తున్నాయి. ఈ మౌనం తొలగించి ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కాపాడే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అప్పుడప్పుడు జలుబు రావాలి. అప్పుడే శరీరంలో ఉన్న మలినమంతా బయటకు పోతుంది. అందువల్ల జలుబు రావడం మంచిది. లేకపోతే ఊపిరితిత్తులు నాశనమై మానవ దేహాన్నే అది కబళిస్తుంది. 
అలాగే దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో  నిజమైన మార్పులు రావాలంటే అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేయాలి. మనిషి స్వేచ్ఛగా తన ఆలోచనల్ని ఇతరులతో పంచుకోగల్గినప్పుడే ప్రజాస్వామ్యం మరింతగా వికసించడమే కాదు మరింత సౌందర్యాన్ని సంతరించుకుంటుంది. 

డా.చుక్కా రామయ్య
వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త
సామాజిక విశ్లేషకులు

మరిన్ని వార్తలు