చర్చలు రగిలించిన మానవతామూర్తి

9 Feb, 2018 00:19 IST|Sakshi

నివాళి 

సాగర్‌లో రెసిడెన్షియల్‌ వ్యవస్థ అంత గొప్పగా ఉండటానికి కారణం వై.వి. రెడ్డి లాంటి ప్రిన్సిపాళ్లు ఉండటమే. ఒక విద్యాసంస్థను తీర్చిదిద్దడంలో సఫలీకృతులయ్యారు. ఉపదేశాలకు బదులు విద్యార్థుల్లో ఆలోచనలు రేపే చర్చలు రగిలించేవారు.

ప్రతి ప్రిన్సిపాల్‌ తనకన్నా ముందున్న ప్రిన్సిపాళ్లను పిల్లలు విమర్శిస్తే సంతోషపడతారు. దాని వలన తన గౌరవం పెరుగుతుంది అనుకుంటారు. కానీ వై.వి రెడ్డి (వై. వెంకటరెడ్డి) తనకన్నా ముందున్న ప్రిన్సిపాళ్లను పొగిడితే సంతోషపడతాడు. ఈనాడు తన కుర్చీని పటిష్టంగా చేసింది వారే కదా అంటాడు. తన కన్న ముందున్న ప్రిన్సిపాళ్లను ఎంతో గౌరవంగా చూసేవాడు. ఆయనను నేను ప్రిన్సిపాల్‌గా, పొలిటికల్‌ సైన్స్‌ లెక్చరర్‌గా చూశాను. తనతో ఏకీభవించనివాళ్లను వాళ్లముందే విమర్శిస్తాడు. కానీ వారు లేనప్పుడు వారి మంచితనాన్ని పొగుడుతాడు. ఇది చాలామందిలో ఉండదు. మానవత్వానికి ప్రతీక ఆయన. ఆయనే నాగార్జున సాగర్‌ ఎ.పి.రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీకి నా తర్వాత వచ్చిన ప్రిన్సిపాల్‌. అలాంటి మనిషి విద్యార్థులకే కాదు, నాలాంటి వారికి కూడా ఆదర్శనీయం. చనిపోయిన తర్వాత వచ్చే కీర్తి అది శాశ్వత కీర్తి. బతికున్నప్పుడు వచ్చే కీర్తి నీళ్ల మీద రాతలే.

కొందరు వ్యక్తులు ఎక్కడికి వెళ్లినా ఏ ప్రాంతానికి వెళ్లినా, తమ పనిద్వారా, నడవడిక ద్వారా ప్రత్యేకముద్ర వేస్తారు. తరగతి గది అంటే అది సిలబస్‌కు, పరీక్షలు నిర్వహించటానికి మాత్రమే కేంద్రం కాదు. తరగతి గదిని పరీక్షలతో పాటుగా భవిష్యత్‌ సమాజంలో విద్యార్ధులు జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలకు కూడా సన్నద్ధం చేస్తారు. వై.వి. రెడ్డి నల్గొండ ఎన్‌.జి. కాలేజీలో పనిచేస్తున్నప్పుడు నాకు సహ అధ్యాపకుడు. ఆయన ప్రతిరోజు దేశంలో, ప్రపంచంలో పత్రికల్లో వచ్చే వార్తలను విశ్లేషించి చెప్పేవాడు. వార్తల రూపం వెనుక ఏం జరిగి ఉంటుందని  విశ్లేషించి చెప్పేవాడు. పలానా దేశంలో పరిస్థితులు ఏమిటి? అక్కడ ప్రజల చైతన్యస్థాయి ఏమిటి? ప్రజలు ఇలాంటి సమస్యలపై ఏ రకంగా ప్రతిస్పందిస్తారు అన్న అంశాలను నల్గొండ స్టాఫ్‌ రూమ్‌లో కూర్చున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు మా మదిలో ఎప్పటికీ గుర్తుకు వస్తుంటాయి. 

వై.వి. రెడ్డి ప్రతిరోజు విద్యార్థుల అసెంబ్లీలో మాట్లాడే మాటల విశ్లేషణలు విన్నాను. విద్యార్థులకు ఆయన హితోపదేశాలు చేసేవాడు కాదు. విద్యార్థులు ఆలోచించుకోవటానికి అనుగుణమైన చర్చను మాత్రం వారిలో రగిలించేవాడు. సమస్యలకు పరిష్కారం చెప్పేవాడుకాదు. కానీ పిల్లలను పాత్రధారులను చేసేవారు. దాని వల్ల ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఈనాడు సైంటిస్టులుగా, పాలనా రంగంలో, వివిధ వృత్తుల్లో ఉన్నతమైన దశలో ఉన్నారు. ఏ సమస్యకైనా, ఏ సవాళ్లకైనా పరిష్కారాలు చెప్పే పాలనాదక్షులయ్యారు. అలా ఒక విద్యాసంస్థను తీర్చిదిద్దడంలో వై.వి. రెడ్డి సఫలీకృతులయ్యారు. ప్రిన్సిపాలే పరిష్కారం చెబితే అతని గొప్పతనం మాత్రమే బయటపడుతుంది. కానీ అందులో పిల్లలను నిమగ్నం చేస్తే వాళ్లు భవిష్యత్‌ను నిర్ణయిస్తారు. దాంతో భవిష్యత్‌ నిర్మాణం జరుగుతుంది.

వై.వి. రెడ్డి దీర్ఘదృష్టి కలవాడు. కోదాడ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న సమయంలో అక్కడి విద్యార్థులకు.. సమాజానికి కాలేజీకి మధ్య సంబంధం ఎలా ఉంటుందో ఆయన ఆచరణ ద్వారా చెప్పగలిగాడు. నాగార్జునసాగర్‌లో ప్రిన్సిపాల్‌గా ఉండి దేశానికి అవసరమైన పాలనాదక్షులను తయారుచేయటానికి దోహదపడ్డాడు. ఖమ్మంలో ఆయనపైన నక్సలైట్‌లకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిగా ముద్ర పడింది. ఎమర్జెన్సీ కాలంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. సాగర్‌లో డిగ్రీ చదువులో రెసిడెన్షియల్‌ వ్యవస్థ అంత గొప్పగా ఉండటానికి కారణం వై.వి. రెడ్డి లాంటి ప్రిన్సిపాళ్లు ఉండటమే. ఒక ప్రిన్సిపాల్‌ను అంచనా వేయాలంటే ఆయన పనిచేసిన కాలేజీలో లక్ష్యం ఏమేరకు చేరుకోగలిగారో అదే గీటురాయిగా చెప్పవచ్చు. 

పరిశోధన అంటే సబ్జెక్టుపై సంపూర్ణ అవగాహన ఉండాలి. అంటే ప్రస్తుతం ఉన్న విజ్ఞానం నుంచి పరిశోధనాత్మకమైన దృక్కోణం రావాలి. దానికి కావాల్సింది సబ్జెక్టుపైన అవగాహనే. పరిశోధనాత్మక దృక్కోణం ఉన్న టీచర్లను తీసుకోవాలి. అదే కోణంలో ఏపీ రెసిడెన్షియల్‌ డిగ్రీకాలేజీల్లో అధ్యాపకుల నియామకం జరిగింది. అంతకుముందే డిగ్రీ కాలేజీల్లో పనిచేసిన అనుభవం ఉన్నవారిని తీసుకొన్నారు. ఇలాంటి మనుషులను తీసుకొన్నట్లయితే పరిశోధనకు అవసరమైన విద్యార్థులు తయారవుతారని దూరదృష్టితో ఈ రెసిడెన్షియల్‌ వ్యవస్థను నిర్మిం చారు. దీన్ని నిర్వహించే ప్రిన్సిపాళ్లకు కూడా ఈ లక్ష్యంవైపుకు తీసుకుపోయే శక్తిసామర్థ్యాలు ఉండాలి. ఆనాటి రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీ వ్యవస్థ విద్యార్థులను ఆర్‌ఈసీలకు, పిల్లలను ఐఐటీలకు పంపి సాంకేతిక మానవ సంపదను తయారుచేసేది. అదే విధంగా డిగ్రీల్లో మానవీయశాస్త్రాలు, సైన్స్‌ సబ్జెక్టులలో రీసెర్చ్‌ చేసే మనుషులను తయారుచేసింది. 

ఆ దారిలో సంస్థను ముందుకు నడిపించే దీక్షాదక్షత, శక్తి వై.వి.రెడ్డికి ఉన్నాయి. ఆయనకు సామాజిక చింతన ఉంది. లక్ష్యంకోసం పట్టు వదలకుండా పనిచేసే ధైర్యం ఉంది. పిల్లలను తీర్చిదిద్దగల నైపుణ్యం ఉంది. కొత్తకోణాలను ఆవిష్కరించగల శక్తి వై.వి. రెడ్డికి ఉంది. అలాంటి ప్రిన్సిపాళ్లకోసం సమాజం ఎప్పుడూ ఎదురుచూస్తుంది. వై.వి. రెడ్డి వృత్తికి అంకితమైన మహామనిషి. ఆయనకు అధ్యాపకులందరి తరపున స్మృత్యంజలి ఘటిస్తున్నాను.
(నేటి సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట జిల్లా కోదాడలో, రేపు ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా యర్రంవారిపాలెంలో వై.వి. రెడ్డి సంతాపసభ, ఆయనపై ‘నిలువెత్తు పుస్తకం’
పుస్తకావిష్కరణ ఉంటాయి)

- చుక్కా రామయ్య
వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త,
శాసనమండలి మాజీ సభ్యులు

మరిన్ని వార్తలు