రుజువులు చూపకపోతే పౌరులు కారా?

7 Feb, 2020 04:00 IST|Sakshi

విశ్లేషణ 

ఈ దేశవాసిని అనడానికి తగిన రుజువులు చూపలేకపోతే విదేశీయులమవుతామా? సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్‌ సమస్య ఇది. దీన్ని హిందూముస్లిం సమస్యగా చర్చలోకి తెచ్చి, హిందూ ఓట్లను కొల్లగొడదామని అధికార పార్టీ పన్నిన వ్యూహం. ఈ దేశంలో పుట్టిన వారందరూ, వారి పిల్లలూ భారతపౌరులే అనే సార్వజనిక విశ్వజనీన నియమం ప్రకారం రాజ్యాంగం వారికి పౌరసత్వం లభిస్తుందని నిర్దేశించింది. రాజ్యాంగం, 1955 పౌరసత్వ చట్టం, దానికి చేసిన అన్ని సవరణలలో కూడా ఆ అధికారాన్ని ప్రభుత్వానికి, పార్లమెంటుకు ఇవ్వలేదు. కానీ దాన్ని చట్టంద్వారా కాకుండా, రూల్స్‌ ద్వారా కేంద్రం చేజిక్కించుకుని రెవెన్యూ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు అప్పగించడం దారుణం.

కేంద్రానికి సహజీకరణ రిజిస్ట్రేషన్‌ ద్వారా కొందరు విదేశీయులకు, వలసదారులకు, శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే విచక్షణాధికారం ఉంది. దాన్ని 1955 చట్టం స్పష్టంగా గుర్తించింది. ప్రపంచంలో ఏ ప్రభుత్వానికైనా బయటనుంచి వచ్చే వారి పౌరసత్వాన్ని నిర్ధారించే, నిరాకరించే అధికారం పూర్తిగా ఉంటుంది. కానీ, రాజ్యాంగాన్నే ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా సవరించిన ప్రభుత్వం నియమాలు మార్చడం ద్వారా చట్టం లక్ష్యాలను అతిక్రమించే ప్రయత్నం చేస్తున్నది. ముస్లింలను మతం ప్రాతిపదికన మినహాయించడం రాజ్యాంగ వ్యతిరేకమే.

ఎన్‌ఆర్సీ జనపట్టిక వివరాలతో పౌరసత్వానికి ప్రమాదం వస్తుందని ఊహించలేం. ఆ ప్రమాదాన్ని చాలా జాగ్రత్తగా రూల్స్‌ రూపంలో ప్రవేశపెట్టారు. ఈ లంకె 2003లోనే పెట్టారు. జనపట్టిక వివరాలు సరిచూసి, దాని ప్రాతిపదికగా పౌరపట్టిక తయారవుతుందని చాలా స్పష్టంగా రూల్స్‌లో ప్రకటించి, అదేమీ లేదని, ప్రచారం చేస్తున్నారు. నిజానికి జనపట్టికలో వచ్చిన వివరాలను సరిపోల్చినపుడు అనుమానం వస్తే పౌరుడిని సందేహాస్పద పౌరుడుగా వేరు చేసి రిజిస్టర్‌ చేయకుండా ఆపే అధికారం కిందిస్థాయి వరకు ఇచ్చారు. అనుమానిత పౌరుడు జిల్లా మేజిస్ట్రేట్‌ ముందు అప్పీలు చేసుకోవాలి. అతను కూడా కింది అధికారుల నిర్ణయాన్ని ఆమోదిస్తే ఆ పౌరుడి గతి అధోగతే. ఇక్కడ కేంద్రం ఇంకో వల పన్నింది. అదేమంటే పౌరసత్వం చట్టం కింద చేసిన నియమాలలో సందేహంతో ఆపివేసి, మిగతా పరిణామాల గురించి ఫారినర్స్‌ ఆర్డర్‌ కింద రూల్స్‌లో కొత్త చేర్పులు చేసింది. దాంతో సీఏఏకు, ఎన్‌ఆర్సీకి కొత్త లంకె వేశారు. మామూలుగా బయటపడని ఈ లంకెను ఫారినర్స్‌ చట్టం 1946లో చేశారు. దీనికింద 1964లో ఫారినర్స్‌ ట్రిబ్యునల్‌ ఆర్డర్‌ రూపొందించారు.

అనుమానించిన ప్రతి పౌరుడిపై విదేశీయుడుగా ముద్రపడే ప్రమాద స్థలం ఈ ట్రిబ్యునల్‌. దీని కారణంగా ఎన్నో దశాబ్దాలనుంచి దేశంలో ఉన్న పౌరులు మతంతో పనిలేకుండా వలసవచ్చిన వారితో సమానంగా, చొరబాటుదారులుగా లేదా శరణార్థులుగా భావింపబడే ప్రమాదానికి గురి అవుతారు. దేశంలో ఎంత మంది ప్రజల దగ్గర తాము పౌరులమని రుజువు చేసుకోగల పత్రాలు ఉన్నాయి? ఉన్నా తుఫాన్‌ లోనో మరో కారణం వల్లో కోల్పోతే వారి గతి ఏమిటి? వీరంతా విదేశీయులైపోతారు కదా? కనుక ఇది ముస్లింలు, సెక్యులరిస్టులు, వామపక్షాలు అనుకుంటున్నట్టు కేవలం ముస్లింల వేర్పాటు సమస్య కాదు. విదేశీ ముస్లింల సమస్య కూడా కాదు. ఇది ఈ దేశంలో పుట్టి ఈ దేశంలోనే దశాబ్దాల నుంచి ఉంటున్న ప్రతి వ్యక్తి ఎదుర్కోవలసిన గడ్డు సమస్య.}


మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌madabhushi.sridhar@gmail.com

మరిన్ని వార్తలు