ఇద్దరూ ఇష్టపడితే ఒప్పే!

29 Sep, 2018 00:46 IST|Sakshi

అక్షర తూణీరం

ఇన్నాల్టికి దేశ అత్యున్నత న్యాయస్థానం మూలాల్ని తవ్వితీసింది. వివాహేతర బంధం నేరం కానే కాదని తీర్పు ఇచ్చింది. చట్టంలో 497 శక్తిని నిర్వీర్యం చేసింది. నిజమే, పురు షుడు పక్కకి వెళితే నేరం కాదు, స్త్రీ వెళితే తప్పా అని సూటిగా ప్రశ్నించింది. భారతీయ శిక్షాస్మృతి చాలా ప్రాచీనమైంది. కొన్ని కొన్ని సదాచారాలు అశాస్త్రీయ మార్గంలో వచ్చి చేరిపోయాయి. ఆయనెవరో ‘‘నస్త్రీ స్వాతంత్య్రమర్హతి’’ అని చెప్పాడని చాలా రోజులు మనువు చెప్పింది వేదం అన్నారు. ఆధునిక మహిళ ఎన్నడో మను సిద్ధాం తాలను పాతర వేసింది. నైతిక విలువలను ఒక స్త్రీపట్లే ఎక్కువగా అమలు చేయడానికి మన సమాజం అలవాటు పడింది. ఏ మాత్రం తేడా వచ్చినా, ఇంకేముంది మహిళ తెగించేసింది అనే విమర్శ మొదలవుతుంది. కట్టుకున్న భార్యని పూర్తి హక్కులుగల చరాస్తిగా భావించడం ఆది నుంచి మగ వాడికి సంక్రమించిన హక్కు. అదేవన్నా అంటే ఆలిని సత్యం కోసం విక్రయించిన హరిశ్చంద్రుని గొప్పగా ఉదహరిస్తారు. ఆయన శ్రీరామచంద్రుని పూర్వీ కుడు. ఈయన కూడా తన ధర్మ నిరతిని, భార్యని త్యజించి నిరూపించుకున్నాడు.

158 సంవత్సరాల క్రితం పుట్టిన 497ని నిన్నటి తీర్పులు జ్ఞాన సంపన్నులైన న్యాయమూర్తులు వివ రంగా సమీక్షించారు. చక్కని విజ్ఞతతో విశ్లేషించారు. ఇక్కడ మానసిక శారీరక సాంఘిక అంశాలు ముడి పడి ఉన్నాయి. వివాహేతర సంబంధాన్ని న్యాయ శాస్త్రం ‘అడల్ట్రీ’గా వ్యవహరిస్తుంది. అంటే ‘కల్తీ’ అని అర్థం. తప్పు, నేరం, అధర్మం, అనైతికం ఇవన్నీ ఒకటి కాదు. ఇక నుంచి వివాహేతర సంబంధం ఇష్టపడిన సందర్భాలలో అక్రమ సంబంధం కూడా కాదు. మన ప్రాచీనులు ఎక్కడ ఇతర సంబంధాలు తప్పుకాదో, ఎక్కడ సమర్థించవచ్చునో కూడా సూచించారు. శృంగార పురుషుల కోసం ‘నాచ్‌ సొసైటీ’ని హాయిగా తయారు చేసుకున్నారు. సమర్థించుకున్నారు. స్టేటస్‌ సింబల్‌ చేసుకుని ఊరేగారు. కానీ, స్త్రీకి కూడా ఇలాంటి అవకాశాలు ఉంటే బాగుండని వాళ్లకి అనిపించలేదు. ‘భార్యపై భర్త సర్వాధికారి కాదు. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను 497 ఐపీసీ స్పష్టంగా ఉల్లంఘిస్తోంది. దీన్ని కొన సాగించటంలో అర్థం లేదు’ అన్నారు తమ తీర్పులో జస్టిస్‌ ఇందూ మల్హోత్రా. ‘ఈ తీర్పు దారి తప్పి చరించడానికి లైసెన్సు ఇచ్చినట్టు అవుతుందే మో’నని కొందరు చదువుకున్న మహిళలే భయపడు తున్నారు. కొందరు భార్యాభర్తలు ఎవరి దారిన వారు తిరుగుతుంటే, కుటుంబం మాటేమిటని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

‘497 సెక్షన్‌కి బీజాలు 1860లోనే పడ్డాయి. అప్పటికి మహిళలకు ఎలాంటి హక్కులూ, అధికా రాలూ లేవు. ఓటు హక్కు కూడా లేదు. భార్యను భర్త సొంత ఆస్తిలా భావించేవాడు. అనుభవించినా, హింసించినా సంపూర్ణ హక్కు, అధికారాలుండేవి. ఆమెతో మరొకరు శారీరక సంబంధం పెట్టుకోవ డాన్ని క్రూరంగా, ఘోరంగా తన సొమ్ము పరహస్తం అయినట్టు భావించేవాడు’ అంటూ ధర్మాసనం ఒక చోట పేర్కొంది. అసలు మన రుషులు శారీరక కలయిక కంటే మానసిక పొందు మరీ పెద్ద పాప మని నిర్వచించారు. ఇవన్నీ అమలులో సాధ్యంకాని విషయాలు.త్రేతాయుగంలో జరిగిన అహల్య కథ ఉంది. అహల్య ఇంద్రుణ్ణి మనసారా వలచిన మాట నిజం. ఇంద్రుడు గౌతముని రూపంలో రావడం కథలో పిట్టకథ. నిజ రూపంలోనే వచ్చాడు. శక్తి సంపన్నుడు కాబట్టి, భర్త కాబట్టి స్తబ్దుగా పడి ఉండమని శాపంపెట్టి అహల్యని హత్య చేశాడు. ఈ లెక్కన అహల్యను శపించాల్సిన అవసరంగానీ, అగత్యం గానీ లేదు. మన పురాణ కథల్లో ఈ అవగుణాల అవశేషాలు కనిపిస్తాయి.పురాణ పురుషులు వారి చిత్తానికి తోచిన కోరి కలన్నీ తనివితీరా తీర్చుకున్నారు. శ్రీరామచంద్రుడు పురుషులలో పుంగవుడు. ఏకపత్నీ వ్రతుడు. అర్ధాంగి పాతివ్రత్యాన్ని కూడా అగ్నిప్రవేశం ద్వారా నిరూ పించి ధన్యుడైనాడు. తర్వాతి కృష్ణావతారంలో బహు పత్నీవ్రతుడై సేదతీరాడు స్వామి. అప్పుడు అనే కానేక రాసలీలల ద్వారా వివాహేతర సంబంధాలకు బీజాలు పడ్డాయ్‌. నా దేశం భగవద్గీత! అగ్నిపునీత, సీత!

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు