కమ్యూనిస్టు ప్రణాళిక ఘనత

21 Feb, 2020 04:35 IST|Sakshi

సందర్భం

విశ్వమానవ విముక్తి కోరే శక్తులంతా ఒక్కటై విప్లవోద్యమానికి పునరంకితమయ్యే దిశగా జరుగుతున్న ప్రయత్నం ప్రపంచ అరుణ గ్రం«థోత్సవం. ప్రపంచ గతిని మార్చిన కమ్యూనిస్టు ప్రణాళిక తొలిసారి పుస్తకరూపంలో విడుదలైన రోజు 1848 ఫిబ్రవరి 21. విశ్వవిపణిలో శ్రమ అమ్ముకోవటం తప్ప మరో జీవనాధారం లేని కోట్లాదిమందికి గొంతుకనిచ్చిన రచన మార్క్స్, ఏంగెల్స్‌ రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక. ఈ ప్రణాళిక విడుదల దినోత్సవాన్ని ప్రపంచ అరుణ గ్రంథ దినోత్సవంగా ఇక నుంచి ప్రతి ఏటా ప్రపంచ ప్రజాతంత్ర విప్లవ శక్తులు జరుపుకోనున్నాయి. దాదాపు 170 ఏళ్లు దాటిన తర్వాత కూడా కమ్యూనిస్టు ప్రణాళికను ప్రపంచం ఎందుకు గుర్తు పెట్టుకుంది? ఇంతవరకు ప్రపంచానికి అందుబాటులోకి వచ్చిన కోటానుకోట్ల గ్రంథాల్లో వేల సంవత్సరాల ప్రజల చరిత్రను ప్రజల భాషలో వివరించిన ఏకైక గ్రంథం కమ్యూనిస్టు ప్రణాళిక. ప్రపంచంలో ఏ రోజైనా ఏ ఖండంలోనైనా పరీక్షకు నిలవగల సామాజిక చలన సూత్రాలను ప్రపంచానికి 34 పేజీల నిడివిలో అందించిన గ్రంథం ఇది.

చారిత్రక భౌతికవాదం, గతితార్కిక భౌతికవాదం, రాజకీయ అర్థశాస్త్రం. ఈ మూడింటి సమాహారమే మార్క్సిజం. ఈ మూడు సూత్రాలు విశ్వవిజ్ఞానానికి తలుపులు తెరిచే తాళం చేతులు. ఈ తాళం చేతులు ఏ దేశ ప్రజలు ఒడిసి పట్టుకుంటారో వారే ఆ సమాజంలో జరుగుతున్న మాయలు, మర్మాలు, కుట్రలు, కుతంత్రాలు, మతం పేర ప్రాంతం పేర జరిగే అణచివేతలు, సంపద కేంద్రీకరణ వంటి అనేక దైనందిన సమస్యలకు మూలాలను గుర్తించగలుగుతారు. పిడికెడుమందికి ప్రపంచ సంపద కట్టబెట్టటానికి కోటానుకోట్లమందిని అదుపులో ఉంచాలన్న ప్రయత్నంలో వచ్చిందే రాజ్యం. పొత్తిళ్లలో ఉన్న దశ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ తన ప్రయోజనాలు కాపాడుకోవటానికి అడ్డువచ్చిన అన్నింటినీ దునుమాడుకుంటూ వెళ్లింది. సామ్రాజ్యవాదం, ప్రపంచీకరణ, స్వేచ్ఛావాణిజ్యం ఈ పెట్టుబడి ప్రయోజనాలు కాపాడేం దుకు పుట్టుకొచ్చిన వ్యవస్థలు. ఆయుధాలు. వీటి మాటున పెట్టుబడి సాగిస్తున్న దాడిని గుర్తించిన రోజున ప్రజలు తమ చరిత్రను తామే రాసుకుంటారు.

ప్రతి సమాజంలోనూ విప్లవానికి అనుకూలమైన పరిస్థితులు ఆ సమాజపు గర్భంలోనే దాగి ఉంటాయి. వాటిని వెలికితీసి ప్రజల ముందుంచటమే విప్లవోద్యమాల కర్తవ్యం.  పెట్టుబడిదారీ దోపిడీ మర్మాన్ని, ఈ దోపిడీ నుండి విముక్తి పొందే మార్గాన్ని విప్పి చెప్పే కమ్యూనిస్టు ప్రణాళికను లక్షన్నర కాపీలు ముద్రించి ప్రజలకు అందించటం ద్వారా ప్రపంచ అరుణ గ్రంథోత్సవాన్ని జరుపుకుంటున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని విముక్తి శక్తులు. తెలుగు సాహితీ చరిత్రలో ఓ పుస్తకం ఒకేసారి లక్షన్నర ప్రతులు అచ్చు కావటం ఇదే తొలిసారి. అటువంటి చరిత్రాత్మక గ్రం«థాన్ని ప్రజలకు తేలికపాటి భాషలో అందుబాటులో తెచ్చేందుకు జరుగుతున్న చారిత్రక ఉద్యమాన్ని ఆదరిస్తున్న తెలుగు పాఠకలోకానికి నమస్సుమాంజలులు.

వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ‘ 98717 94037
కొండూరి వీరయ్య
 

మరిన్ని వార్తలు