‘గట్టు’.. తెలంగాణకు మరో పచ్చబొట్టు

29 Jun, 2018 00:52 IST|Sakshi
గట్టు ప్రాంతం ఇదే 

సందర్భం

ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమాన్ని రాజకీయం చేస్తూ మహబూబ్‌ నగర్‌ జిల్లా ప్రజలను గందరగోళ పరుస్తున్న కాంగ్రెస్‌ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎక్కడ మూడు వేల ఎకరాల ప్రాజెక్టు? ఎక్కడ 33 వేల ఎకరాల ప్రాజెక్టు? ఏ ప్రాజెక్టు కట్టాలి? వారి 3 వేల ఎకరాల ప్రాజెక్టా? మేం ప్రతిపాదిస్తోన్న 33 వేల ఎకరాల ప్రాజెక్టా? గట్టు, ధరూర్, కేటీ దొడ్డి మండలాల రైతులు సైతం దీనిపై స్పందించాలని కోరుతున్నా. ప్రజలు తమని నమ్ముతున్నారన్న భ్రమలో కాంగ్రెస్‌ నేతలున్నారు. వారి స్వభావం ఉద్యమ కాలంలోనే ప్రజలు గుర్తించారు. అదే 2014 ఎన్నికల తీర్పులో ప్రతిఫలించింది.

ప్రజాస్వామ్యంలో పాలించే ప్రభుత్వ వ్యవస్థలు శాశ్వతం. ఆ వ్యవస్థలకు నాయకత్వం  వహించే పాలక పక్షాలు మాత్రం ఐదేళ్లకోమారు పరీక్షను ఎదుర్కోవాల్సిందే. అదే ప్రజాస్వామ్య వ్యవస్థకున్న చక్కటి లక్షణం. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పాలక పార్టీలను మార్చేసే అధికారం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఓటుకు ఉంది. ఇది  ఇప్పటికే భారతదేశ ఎన్నికల వ్యవస్థలో ఎన్నోసార్లు రుజువయింది. పాలకపార్టీలు అధికార పీఠం ఎక్కిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెడుతున్నాయా లేదా ప్రజల అవసరా లను తీర్చుతున్నాయా లేదా అన్నది ముఖ్యం. తాను ఓటు వేసిన సర్పంచ్‌ నుంచి ఎంపీ వరకు ఎలా పని చేస్తున్నారని ప్రజలు ప్రత్యక్షంగా, ప్రసార మాధ్య మాల ద్వారా నిత్యం గమనిస్తూనే ఉంటారు. తాము పట్టం కట్టిన పార్టీ పాలన ఎలా ఉందో బేరీజు వేసు కుంటారు. ఐదేళ్ల తర్వాత తనకు వచ్చిన అవకాశంతో అటు పాలక పార్టీలకు, ఇటు ప్రతిపక్షాలకు మార్కులు వేసి ఎవరిని ఉత్తీర్ణులను చేయించాలి ఎవర్ని ఫెయిల్‌ చేయాలో నిర్ణయిస్తారు. 

అయితే 2014లో ప్రభుత్వంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధికార దాహంతో రాలేదు. తెచ్చిన తెలంగాణను అందరు కలలు కంటున్న బంగారు తెలంగాణగా మార్చాలని అధి కార పీఠాన్ని అధిష్టించింది. తెలంగాణ ఉద్యమం ద్వారా వెలుగు చూసిన కడగండ్లను తొలగించడమే ధ్యేయంగా ఎన్నికల ఎజెండాను రూపొందించింది. సాగు నీరు తెలంగాణ బీడు పొలాల్లోకి రాకపోవడం వల్లే ఈ ప్రాంతం వెనకబడిందని గమనించింది. అందుకోసమే అధికార పీఠం ఎక్కిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్టులపైనే ఎక్కువ దృష్టి సారించారు. సామాజిక ఇంజనీర్‌గా మారి ఏ ప్రాంతానికి  ఎలా నీరు ఇవ్వాలో ప్రాజెక్టుల రీ ఇంజ నీరింగ్‌ సాధ్యాసాధ్యాలపై మేధో మథనం చేశారు. అందులోంచి పుట్టుకొచ్చినవే నేటి తెలంగాణ ప్రాజె క్టులు. శరవేగంగా తెలంగాణలో ప్రాజెక్టుల పనులు నడుస్తున్నాయంటే అది వచ్చే ఎన్నికలలో విజయం కోసం కాదు. తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలను పరిపూర్ణంగా నెరవేర్చడానికే. తెలంగాణ వస్తే పాలన చేతనవుతుందా? రాష్ట్రం మనగలుగుతుందా? అన్న వారి నోళ్లు మూతపడేలాగా పాలన కొనసాగుతు న్నది. దేశానికి దిక్సూచిగా చెప్పదగిన అభివృద్ధి పథ కాలు, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. చరిత్రను సృష్టించనున్నాయి. 

ప్రస్తుత అంశానికి వస్తే–ముఖ్యమంత్రి గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ అంశాన్ని ఇటీవలే ప్రతిపక్ష  కాంగ్రెస్‌ తనదైన శైలిలో వివాదం చేస్తోంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రజ లకు వాస్తవాలు తెలియవలసి ఉంది.  ఏదైనా ఓ పని అప్పగిస్తే కొందరు చేసినట్లు నటిస్తారు. మరి కొందరు నిజంగా పనిచేస్తారు. ఇలా పని చేసినట్లు నటించే చరిత్ర ప్రతిపక్ష పార్టీది. ఇది నేను చేస్తున్న ఆరోపణ కాదు.  గట్టు ప్రాజెక్టు చరిత్రే కాంగ్రెస్‌ నేతల అసలు చరిత్రను వెల్లడిస్తుంది. పాలమూరు ప్రాంత సాగుకు ఉపయోగపడే గట్టు ప్రాజెక్టుకు తొలి అడు గులు పడిన తీరు ఇలా ఉంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌  వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి  గద్వాలలో జరిగిన బహిరంగ సభలో గట్టు హైలెవెల్‌ కెనాల్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆయన హయాంలో ఈ పనులు ప్రారంభం కాలేదు. 2012 సెప్టెంబర్‌ 14వ తేదీన జరిగిన ఇందిరమ్మ బాట కార్యక్రమంలో ఆనాటి ముఖ్యమంత్రి ర్యాలంపాడు జలాశయం నుంచి నీళ్లను ఎత్తిపోతల ద్వారా మళ్లించి గట్టు మండలం లోని చెరువులను నింపి, ఆ ప్రాంతాన్ని సస్యశ్యా మలం చేస్తామని ప్రకటించారు. అయినా ఏడాదిన్నర వరకు అనుమతులు మంజూరు చేయలేదు. చివరకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాతే మోక్షం కలిగింది. తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాత ప్రజలను ప్రసన్నం చేసుకోవాలని ఉమ్మడి  ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా 3,000 ఎకరాలు చెరువు ఆయకట్టు  స్థిరీకరణకు సర్వే చేయ డానికి  జీవో నంబర్‌ 3ను 22–01–2014 నాడు విడు దల చేసింది. 3 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన సర్వే కోసం మాత్రమే రూ. 10.50 లక్షలు మంజూరయ్యాయి.

ఎన్నికల ప్రకటన జారీకి  ముందు 2014 ఫిబ్రవరి 22న అప్పటి మంత్రులు సైతం ఇది సర్వే చేయడానికి జారీ చేసిన జీవో మాత్ర మేనని తెలిసి కూడా గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఇది ఎన్నికల ముందు ప్రజ లను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికి చేసిన పని అని ఎవరికైనా అర్థమవుతుంది. రెండు నెలల్లో కేవలం సర్వే కోసం రూ. 10.57 లక్షలు మంజూరు చేసినట్లు జీవో విడుదల చేసి, నెల రోజులకి శంకు స్థాపన చేసి ఆ తర్వాతి నెలలో ఎన్నికల్లో ప్రజల్ని మభ్య పెట్టింది ఎవరు? కాంగ్రెస్‌ పార్టీ కాదా? కాంగ్రెస్‌ ఘనత చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. సర్వే కోసం జీవో ఇచ్చి ప్రాజెక్టుకు శంకు స్థాపన చేస్తారా?  సర్వే జరగలేదు, ప్రాజెక్టు డీపీఆర్‌  లేదు, టెండర్లు లేవు. మరి శంకుస్థాపన ఎందుకు చేశారు? ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి మరో మారు ‘గట్టె’క్కాలన్న ఆలోచన. కానీ ప్రజలు ఆ ఎన్నికల్లో సరైన తీర్పు ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ బాధ, తెలంగాణ సోయి, తెలంగాణ ఆలోచన ఉన్న తెరాస ప్రభుత్వం రిటైర్డ్‌ ఇంజనీర్ల ఫోరంతో మేధో మథనం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలుమార్లు చర్చించారు. అనంతరం  గట్టు, ధరూర్, కేటీ దొడ్డి మండల ప్రజల ఆలోచనను అడిగి తెలుసుకున్నారు. కరవు మండలాలకు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 3 వేల ఎకరాలకు నీరు ఇచ్చే పథకం సర్వే చేయించడానికి ఇచ్చిన జీవో వల్ల ఎటువంటి  న్యాయం జరగదని గుర్తించి ఈ మూడు  మండ లాల్లో  దాదాపు 25 వేల ఎకరాల వరకు  కొత్త ఆయ కట్టుకు గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఇచ్చేలా సమగ్ర సర్వే చేయాలని సాగు నీటి శాఖను ఆదేశిం చారు. ఈ మేరకు జీవో ఆర్‌టీ నంబర్‌ 461 ని 2016  మే 3వ తేదీన విడుదల చేశాం. కొత్తగా ఈ ప్రాజె క్టును రూపొందించేందుకు సమగ్ర  సర్వే చేయించేం దుకు 52.46 లక్షలు  మంజూరు చేసి ఆ పనులను సర్వే ఏజెన్సీకి అప్పగించాం. ఇక్కడితో మా ప్రభు త్వం ఆగలేదు. ప్రాజెక్టు సమగ్ర సర్వే సమర్పించే దశలో సౌర విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు కోసం రిజర్వు చేసిన 5 వేల ఎకరాలను ఆయకట్టు పరిధి లోకి తేవాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. వారి కోరికను మేం కాదనలేదు. తిరిగి  మరోమారు సర్వే చేయించాం. తద్వారా 25 వేల ఎకరాల నుంచి 33 వేల ఎకరాలకు నీరిచ్చేలా గట్టు ప్రాజెక్టు రూపు రేఖలు మార్చాం.
 
ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే మూడు వేల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ కోసం సర్వే పనులకు మాత్రమే జీవో విడుదల చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రతిపాదిత గట్టు ప్రాజెక్టుకు మేం శంకుస్థాపన చేస్తున్నామా?  లేదా 33 వేల ఎకరాల కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన తెరాస ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గట్టు ప్రాజె క్టుకు శంకుస్థాపన చేస్తున్నామా? ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ సమర్పించిన తర్వాత గట్టు, ధరూర్, కేటీ దొడ్డి మండలాల ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్‌ 33 వేల ఎకరాలకు నీరు పారించే విధంగా రూ. 553.98 కోట్లను మంజూరు చేశారు. ఈ మేరకు జీవో ఎం.ఎస్‌ నెంబర్‌ 60 ద్వారా 2018 మే 31వ తేదీన పరిపాలన పరమైన అను మతులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది అసలు ప్రాజెక్టు కథ.

ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమాన్ని రాజ కీయం  చేస్తూ  మహబూబ్‌ నగర్‌ జిల్లా  ప్రజలను గందరగోళ పరుస్తున్న కాంగ్రెస్‌ ప్రజలకు సమా ధానం చెప్పాలి. ఎక్కడ మూడు వేల ఎకరాల ప్రాజెక్టు? ఎక్కడ 33 వేల ఎకరాల ప్రాజెక్టు? ఏ ప్రాజెక్టు కట్టాలి? వారి 3 వేల ఎకరాల ప్రాజెక్టా? మేం ప్రతిపాదిస్తోన్న 33 వేల ఎకరాల ప్రాజెక్టా? గట్టు, ధరూర్, కేటీ దొడ్డి మండలాల రైతులు సైతం దీనిపై స్పందించాలని కోరుతున్నా. ప్రజలు తమని  నమ్ముతున్నారన్న భ్రమలో కాంగ్రెస్‌ నేతలున్నారు. వారి స్వభావం ఉద్యమ కాలంలోనే ప్రజలు గుర్తిం చారు. అదే  2014 ఎన్నికల తీర్పులో ప్రతిఫలిం చింది. 2014లో మంత్రిగా తానే ఈ ప్రాజెక్టుకు శంకు స్థాపన చేసినట్టు మాజీ మంత్రి డీకే అరుణ చెబు తున్నారు.

నేను అరుణ గారిని  అడుగుతున్నాను. 25 వేల ఎకరాలకు నీరిచ్చేందుకు ప్రతిపాదించిన ప్రాజెక్టు జీవోను చూపించగలరా? ఆధారాలు ఏవైనా బయట పెట్టగలరా? కాంగ్రెస్‌కు కావల్సింది మొబిలై జేషన్‌ అడ్వాన్స్‌లు. మాకు కావాల్సింది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు. మేం అడ్వాన్స్‌ల కోసం ప్రాజె క్టులు కట్టడం లేదు. కోటి ఎకరాలకు నీరిచ్చే లక్ష్యంతో ప్రాజెక్టులు కడుతున్నాం. అధికార యావ మీది. తెలంగాణ గోస తీర్చాలన్న భావన మాది. గత ఎన్నికల్లో గట్టెక్కేందుకు గట్టు ప్రాజెక్టును వినియోగిం చుకున్న కాంగ్రెస్‌ రానున్న ఎన్నికల్లో నాలుగు ఓట్లు పడతాయన్న భావనతో ప్రజలను గందరగోళ పరిచే ప్రయత్నం చేస్తున్నది. ప్రజల ముందు ఈ వాస్తవా లను ఉంచాలన్న నా ఈ ప్రయత్నం ఉద్దేశం అదే.
(గట్టు ఎత్తిపోతల పథకానికి నేడు శంకుస్థాపన)


- తన్నీరు హరీశ్‌రావు
వ్యాసకర్త తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి

మరిన్ని వార్తలు