బలహీనతలతో హస్తం బేజారు!

27 Apr, 2019 00:43 IST|Sakshi

జాతిహితం

కేంద్రంలో నూతన ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామనే ప్రకటన చేయడానికి కూడా ధైర్యం లేని కాంగ్రెస్‌ పార్టీ 2014లో సాధించిన 44 లోక్‌సభ స్థానాలకు మూడురెట్లు అంటే 132 స్థానాలను సాధించి మోదీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాలని కలలు కంటోంది. వాస్తవానికి కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో వంద సీట్లు సాధించడానికి కూడా కొట్టుమిట్టులాడుతోందన్నది వాస్తవం. నిర్ణయాత్మకంగా ఉండటంలో, అనిశ్చితినుంచి బయటపడటంలో దాని వైఫల్యమే ఆ పార్టీని మరింత దుస్థితిలోకి నెడుతోంది. దీర్ఘకాలంలోనే కాదు స్వల్ప కాలంలో కూడా కాంగ్రెస్‌ కోలుకునే అవకాశాలు కొరవడుతుండటమే మోదీ, అమిత్‌ షాల బలంగా మారడం గమనార్హం.

కాంగ్రెస్‌ పార్టీలో అత్యంత సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ ఈ సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ ఎన్ని స్థానాలపై గురిపెట్టిందో తాజాగా  సూచించారు. 2014లో సాధించినదానికి మూడు రెట్ల సీట్లను కాంగ్రెస్‌ పార్టీ సాధిస్తుందని కమల్‌నాథ్‌ స్పష్టం చేశారు. గతంలో కంటే మూడు రెట్లు ఎక్కువగా ఈ ఎన్నికల్లో తాము సీట్లు సాధిస్తే నరేంద్రమోదీ రెండో దఫా ప్రధాని కాకుండా అడ్డుకోవచ్చని చెప్పారు. అయితే బీజేపీ కంటే కాంగ్రెస్‌ మద్దతుదారులే ఆయన ప్రకటనపట్ల పెదవి విరిచేయడం గమనార్హం. కేంద్రంలో నూతన ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామనే ప్రకటన చేయడానికి కూడా కాంగ్రెస్‌కు ధైర్యం లేదు. పైగా అది ఎన్నికల ప్రచారం మధ్యలోనే ఓటమి దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. పైగా గత ఎన్నికల్లో సాధించిన 44 సీట్లకు బదులుగా మూడు రెట్లు అధిక స్థానాలు ఈ ఎన్నికల్లో వచ్చినట్లయితే అప్పటికీ కాంగ్రెస్‌ మొత్తం సీట్లు 132కి మాత్రమే చేరుకుంటాయి.

అంటే కాంగ్రెస్‌ తనను తానుగా 132 స్థానాలకు పరిమితం చేసుకుంటోంది. వాస్తవానికి 100 స్థానాలు సాధించడానికే అది  కొట్టుమిట్టాడుతోంది. కాంగ్రెస్‌ తీసుకొస్తున్న ఈ వాదన వాస్తవరీత్యా సరైందే కావచ్చు కానీ రాజకీయంగా లోపభూయిష్టమైంది. నేడు బీజేపీ 200 స్థానాలకు చేరుకుంటే, తప్పకుండా  తదుపరి ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పర్చగలదు. అలా జరగకూడదంటే బీజేపీని 200కు తక్కువ స్థానాలకే పరి మితం చేయాలి.  2019లో బీజేపీ, కాంగ్రెస్‌  అవకాశాలను పరిశీ లిద్దాం. బీజేపీ ప్రత్యేకించి మోదీ–షాల కనీస లక్ష్యం 200 స్థానాలు. తమకు అన్ని సీట్లు మాత్రమే వస్తే తమ ప్రత్యర్థి కాంగ్రెస్‌కి కేవలం వంద సీట్లు మాత్రమే వచ్చేలా బీజేపీ పథకం రచిస్తుంది. కాంగ్రెస్‌ ఒకవేళ వందకు పైబడిన స్థానాలకు చేరుకోగలిగితే తమకు 200కు లోబడిన స్థానాలు మాత్రమే  రావచ్చని బీజేపీ అంచనా వేసుకుంటుంది. కాంగ్రెస్‌ పార్టీ వందకు మించి సాధించే ప్రతి సీటు కూడా మోదీ–షాల బీజేపీని 200 స్థానాల దిగువకు నెట్టేసే ప్రమాదాన్ని సృష్టిస్తుంది. కానీ కాంగ్రెస్‌ 100కి మించిన  స్థానాలు సాధించగలుగుతుందని నేనయితే చెప్పడం లేదు. 100 సీట్లు మాత్రమే సాధించినా ఆ పార్టీ కాస్త ఊపిరి  పీల్చుతున్నట్లే అవుతుంది మరి. కమల్‌నాథ్‌ చెబుతున్నట్లు కాంగ్రెస్‌ 132 స్థానాలు సాధించినట్లయితే మోదీ రెండో దఫా అధికారంలోకి రాకుండా అది అఢ్డుకునే అవకాశం ఉంది. 2004లో అంతకుమించి 12 స్థానాలు అధికంగా సాధించినందుకే యూపీయే–1 ప్రభుత్వం ఉనికిలోకి రాగలిగింది. అయితే ఈసారి కాంగ్రెస్‌ ఆ సంఖ్యను చేరగలుగుతుందని  నేను చెప్పను. నా అంచనా కాంగ్రెస్‌కు 132 స్థానాలు కూడా రావనే.

2014 ఎన్నికల్లో ఇరు పార్టీలు సాధించిన స్థానాలను సమీక్షిద్దాం. బీజేపీ సాధించిన 282 స్థానాల్లో 167 స్థానాల్లో కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలిచింది. మరోమాటలో  చెప్పాలంటే కాంగ్రెస్‌ను పూర్తిగా ధ్వంసం చేసిన కారణంగానే మోదీ ప్రభంజనం సృష్టించగలిగారు. ఆ దెబ్బకు కాంగ్రెస్‌ గతంలో సాధించిన 204 స్థానాల నుంచి 44  స్థానాలకు ఘోరపతనం చెందింది. దాదాపుగా 2014లో కాంగ్రెస్‌ తన ప్రత్యర్థి బీజేపీముందు సాగిలపడిపోయింది. ఇక ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ,  బహుజన్‌ సమాజ్‌ పార్టీ నుంచి బీజేపీ 38 స్థానాలు కొల్లగొట్టింది. ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 100 స్థానాలకు చేరుకోవాలంటే బీజేపీ గతంలో సాధించిన 60  స్థానాలను అది కైవసం చేసుకోవాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కూటమికి బీజేపీ చాలా సీట్లు కోల్పోనున్నట్లు అంచనా వేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ 60 స్థానాలను బీజేపీ నుంచి లాక్కోవడం అంటే అది నిర్ణయాత్మకమైన మలుపుకు దారి  తీస్తుంది. అయితే ఇది కూడా జరుగుతుందని నేనయితే భావించడం లేదు. వంద స్థానాల మార్కును చేరుకోవడం ఎంత సుదూర లక్ష్యమో అర్థం చేసుకోవాలంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 44 ఎంపీ స్థానాలు ఎక్కడినుంచి వచ్చాయో పరిశీలించాల్సిందే. దేశంలోని 16 రాష్ట్రాలనుంచి కాంగ్రెస్‌ 44 స్థానాలను సాధించగలిగింది. ఒక్క కర్ణాటకలో మాత్రమే కాంగ్రెస్‌ డబుల్‌ ఫిగర్‌ని అంటే కచ్చితంగా 10 స్థానాలను సాధించింది. ఇక కేరళలో ఆ పార్టీ ఏడు స్థానాలను కైవశం చేసుకుంది. ఈ 17 సీట్లను మినహాయిస్తే, మిగిలిన 27 స్థానాలు ఆ పార్టీకి 14 రాష్ట్రాలనుంచి వచ్చాయి. అంటే ఒక్కో రాష్ట్రం నుంచి 1, 2, 3 సీట్లు వచ్చాయి. ఇవి సైతం అభ్యర్థి వ్యక్తిగత బలంపై ఆధారపడి మాత్రమే వచ్చాయి.

ఇక బీజేపీతో పోటీలో కాంగ్రెస్‌కి రెండో స్థానం కట్టబెట్టిన 167 సీట్లను చూస్తే 14 సీట్లలో బీజేపీ కంటే 10 శాతం తక్కువ ఓట్లను కాంగ్రెస్‌ సాధించగలిగింది. ఇక 10 నుంచి 15 శాతం ఓట్లతేడాతో కాంగ్రెస్‌ ఓడిపోయిన స్థానాలు 6. మిగతా స్థానాల్లో ఇరుపార్టీల మధ్య 75 శాతం అంతరం ఉండటం గమనార్హం. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ 10 శాతం ఓట్లను అదనంగా పొందగలిగిందంటే అది బీజేపీ సాధించిన నాటి ఘనవిజయాన్ని సరిగ్గా తలకిందులు చేయడం ఖాయం. కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ ఎన్నికల్లో సాధించిన సీట్లను ఈ కోణంలోంచి విశ్లేషిద్దాం. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ సాధించిన విజయ 2014 ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయాన్ని సరిగ్గా తలకిందులు చేసిపడేసింది. కాబట్టి ఈ మూడు రాష్ట్రాల్లో  ఓటర్ల పునాదిని తనకు అనుకూలంగా కాంగ్రెస్‌ ఆకర్షించగలదు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ వంద సీట్ల మాజిక్‌ను సాధించాలంటే ఈ మూడు రాష్ట్రాల్లో అది కనీసం 30 లోక్‌సభ స్థానాలు గెలుపొందాల్సి ఉంటుంది. చత్తీస్‌గఢ్‌లో దాని మెజారిటీని గమనిస్తే ఇక్కడినుంచే అది అధిక స్థానాలు సాధించే అవకాశముంది. కానీ అదేసమయంలో మధ్యప్రదేశ్, రాజస్తా న్‌ల నుంచి కాంగ్రెస్‌ 25 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని భావించడం మితిమీరిన ఆశావాదం కిందికే వస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి అనుకూల లేదా వ్యతిరేక ఓటు అనేది రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను ప్రతిబింబించలేదు. ఎన్నికల మధ్యలో పరిస్థితి ఇది. ఎన్నికల ప్రచారం ఇంకా తీవ్రం కావలసి ఉంది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు ఈ రెండు పార్టీలకూ కీలకమే కావచ్చు కానీ ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే సమస్య మధ్యప్రదేశ్, రాజస్థాన్, హరియాణ, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహా రాష్ట్ర, జార్ఖండ్, అస్సామ్‌ తదితర రాష్ట్రాల్లోనే ప్రధానంగా నిర్ణయం కానుంది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఈ రాష్ట్రాల్లోనే నేరుగా 150 స్థానాల్లో తలపడుతున్నాయి. తమను అధికారంలోకి రాకుండా అడ్డుకునే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని మోదీ, అమిత్‌షాలకు తెలుసు. కాంగ్రెస్‌ పార్టీ తన ప్రధాన ప్రత్యర్థిగా లేని రాష్ట్రాల్లో కూడా మోదీ తన దాడిని కాంగ్రెస్‌పైనే ఎందుకు కేంద్రీకరిస్తున్నారు అనే ప్రశ్నకు ఇదే సమాధానం. ప్రత్యర్ధులు బీజేపీని 200 కంటే స్థానాలకే పరిమితం చేయాలని ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్‌కి 100 కంటే తక్కువ స్థానాలే వచ్చేలా చూడటం మోదీకి చాలా ప్రధానమైన ఆంశంగా ఉంటోంది.

2014లో కాంగ్రెస్‌ సాధించిన మొత్తం సీట్లకు మూడు రెట్లు అంటే 132 స్థానాలు సాధిస్తే మోదీని మళ్లీ ప్రభుత్వం ఏర్పర్చకుండా అడ్డుకోవచ్చు అన్నట్లయితే, ఇది మూడునెలలకు వెనుకటి పరిస్థితిని తలపించవచ్చు. మరి ఇప్పుడు కాంగ్రెస్‌ ఆ లక్ష్యాన్ని చేరుకోగల స్థితిలో ఉందా? ఈ నిర్ణయాత్మక స్థాయిని చేరుకోగలిగేందుకు కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగతంగా తనను తాను బలపర్చుకోగలిగిందా? అవిభక్త పంజాబ్‌లో తిరుగులేని ముఖ్యమంత్రి ప్రతాప్‌ సింగ్‌ ఖైరాన్‌ ప్రయాణం మధ్యలో తమ కారు ఉన్నట్లుండి ఆగిపోయిన సందర్భాన్ని ఆనాటి రాజకీయ పరిస్థితికి అన్వయిస్తూ చెప్పిన మాటలను 1980లలో హర్యానా వృద్ధ నేత దేవీ లాల్‌ ఒక సందర్భంలో విలేకరులతో ముచ్చటిస్తూ గుర్తు చేశారు. దేవీలాల్‌ అప్పట్లే ఖైరాన్‌కి రాజకీయ సలహాదారుగా ఉండేవారు. ‘‘చూడు చౌదరీ.. ఇప్పుడు మన కారుకు ఉన్నట్లుండి బ్రేకులు పడిన చందంగానే జవహర్‌లాల్‌ నెహ్రూకు కూడా బ్రేకులు పడవచ్చు. మీరు కుడివైపుకు అయినా వెళ్లండి, లేక ఎడమవైపుకైనా వెళ్లండి కానీ అనిశ్చితితో, నిర్ణయ రాహిత్యంతో ఉన్నవారు ఎవరూ మనుగడ సాధించలేరు’’ అని ఖైరాన్‌ చెప్పారట.

నెహ్రూ వంశంలో మూడో తరం నేతృత్వంలో నడుస్తున్న ప్రస్తుత కాంగ్రెస్‌కి కూడా దీన్నే ఆపాదించండి. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీలతో విడిపోయింది. ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి దూరమైంది. మమతా బెనర్జీతో, కేసీఆర్‌తో, నవీన్‌ పట్నాయక్‌తో కలిసే అవకాశాలు దాదాపుగా లేవు. పైగా ఉమ్మడి ప్రయోజనాల లక్ష్యంతో కర్ణాటకలో జేడీ(ఎస్‌) పార్టీ అభ్యర్థులను బలపర్చడానికి తన బలగాలను మొత్తంగా కేంద్రీకరించాల్సిన దుస్థితి. వీటన్నింటికి పరాకాష్టగా ప్రియాంక గాంధీని వారణాసి నుంచి మోదీకి పోటీగా నిలబెట్టాలా వద్దా అనే సంశయంలో కాలం గడుపుతూ అంతిమంగా ఆమెను అక్కడి నుంచి బరిలోకి దింపరాదని తేల్చడం... రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ఎలా కనిపిస్తోందో చూశారా? కారు హెడ్‌ లైట్ల వెలుగులో చిక్కి కుందేలు చేష్టలుడిగిపోయిన స్థితే కదా. ప్రస్తుత ఎన్నికలను పక్కనబెట్టి చూస్తే భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌ పార్టీని పూర్తి స్థాయిలో పునర్నిర్మించవలసి ఉంది. ఎందుకంటే క్రికెట్లో మాదిరే, రాజకీయాల్లో కూడా రెండో ఇన్నింగ్స్‌ను బాగా ఆడాలని కోరుకుంటూ మొదటి ఇన్నింగ్స్‌ను మనకు మనమే ధ్వంసం చేసుకోకూడదు. మన్మోహన్‌ సింగ్‌ గతంలో చేసిన ఒక వ్యాఖ్యనుంచి కాంగ్రెస్‌ పాఠం నేర్చుకోవలసి ఉంది. పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా మన్మోహన్‌ సింగ్‌ సుప్రసిద్ధ ఆర్థికవేత్త కీన్స్‌ మాటల్ని గుర్తుచేశారు. ‘‘దీర్ఘకాలంలో మనమంతా చస్తాం’’. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌ పరిస్థితి ఎలా ఉందంటే స్వల్ప కాలంలోనూ పెనుప్రమాదం కాచుకుని ఉన్నట్లే ఉంది.

వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta
శేఖర్‌ గుప్తా

మరిన్ని వార్తలు