నేనెరిగిన రాజ్‌బహదూర్‌ గౌర్‌

21 Jul, 2018 02:32 IST|Sakshi

హైదరాబాద్‌ సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమం నిర్మాత, తొలి తరం కమ్యూనిస్టుల్లో ఒకరు డాక్టర్‌ రాజ్‌బహదూర్‌ గౌర్‌. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన యోధుడు. 1952లో రాజ్యసభ ఏర్పడినప్పుడు తొలిసభలోనే రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలినాళ్ళలో హైదరాబాద్‌ రాజకీయాలు,  ట్రేడ్‌యూనియన్‌లతో ఆయన జీవితం పెనవేసుకుంది.  అలాంటి రాజ్‌బహదూర్‌ గౌర్‌ గారిని మొదటిసారిగా 1978లో హైదరాబాద్‌లో కలిశాను. ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాకుండా మంచి కవి, రచయిత. ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషల్లో పాండిత్యం కలిగిన వ్యక్తి. 

హైదరాబాద్‌లోని విద్యావంతుల కుటుం బంలో డాక్టర్‌ రాజ్‌బహదూర్‌ గౌర్‌ 1918 జూలై 21న జన్మించారు. చిన్నప్పటి నుండి చురుకైన వ్యక్తిగా ఉండేవారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో ఉర్దూలో డాక్టర్‌ కోర్సు చదివారు. చదుకునే రోజుల్లోనే కామ్రేడ్స్‌ అసోసియేషన్, కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలతో బిజీగా ఉండేవారు. కానీ తన చదువులో 2 లేదా 3 ర్యాంకులోనే ఉండేవారు. 

రాజ్‌బహదూర్‌ తొలితరం పార్లమెంటేరియన్‌. అంతకుముందు సాయుధ పోరాటంలో అనేకమార్లు అరెస్టయ్యారు.  రాచకొండ గుట్టల్లో ఆయుధంతో సహా పట్టుబడటంతో ఆయనను జైళ్ళో వేశారు. ఇంతలోనే సాయుధపోరాట విరమణ జరిగిపోయి, 1952లో ఎన్నికలొచ్చాయి. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన జైలు నుండి నామినేషన్‌ వేసినప్పటికీ తిరస్కరణకు గురైంది. అప్పుడు జైలు నుండి విడుదల చేసేందుకు మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జోక్యం చేసుకున్నారు. గౌర్‌ని విడుదల చేసేందుకు నాటి కేంద్ర మంత్రి గోపాలస్వామి అయ్యంగార్‌ ససేమిరా అన్నాడు. ఆయన ఆయుధంతో అడవిలో పట్టుబడిన ప్రమాదకర వ్యక్తి అన్నారు. అయితే, సర్వేపల్లి ఆయన సంగతి నీకు తెలియదని చెప్పి విడుదల చేయిం చారు. దీంతో 1952లో రాజ్యసభ ఏర్పడినప్పుడు తొలి సభ్యుల్లో ఒకరిగా హైదరాబాద్‌ స్టేట్‌ నుండి ఎన్నికయ్యారు. ఆ తరువాత రెండవసారి కూడా పెద్దల సభకు ఎన్నికయ్యారు.

హైదరాబాద్‌ సంస్థానంలో ట్రేడ్‌ యూనియన్‌లలో రాజ్‌బహదూర్‌ గౌర్‌ పేరు మారుమ్రోగేది. నిజాం హయాంలోనే ఆయన అనేక కార్మిక సంఘాలను ఏర్పాటు చేశారు. నిజాం రైల్వే, ఆర్టీసీ, సింగరేణి, బ్యాంకింగ్‌ యూనియన్‌లలో ఆయన కీలక పాత్ర పోషించారు. మెడికల్‌ శాఖలో ఆసుపత్రుల్లో పని చేస్తున్న కాంపౌండర్లు, ఏఎన్‌ఎం, నర్సులు తదితరులకు మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ స్థాపించారు. తెలంగాణలోని ప్రముఖ పరిశ్రమలు, డీబీఆర్, ఆజాం జాహీ మిల్స్‌ వంటి అనేక చోట్ల సంఘాలు పెట్టించారు.  హైదరాబాద్‌లో ఉంటున్న నిరుపేదలకు నివాస స్థలాల కొరకు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేయించారు. 

తన పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది ఆయన మాట ల్లోని చమత్కారం. 70 ఏళ్లు పూర్తికాగానే పార్టీ పదవుల నుంచి స్వచ్ఛం దంగా వైదొలగి, శేషజీవితమంతా పార్టీ శ్రేయోభిలాషిగా కొనసాగి, అందరి అభిమానాన్ని, మన్ననలు పొందారు. మరణానంతరం ఆయన కోరిక మేరకు నేత్రాలను, శరీరాన్ని తాను చదువుకున్న ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి అప్పజెప్పటం ఉత్తమ మానవతా వాదానికి నిదర్శనం.

అలాంటి వ్యక్తుల ఆదర్శాలను, జీవిత విశేషాలను ఈనాటి తరానికి తెలియజెప్పడానికే డా‘‘ గౌర్‌ శతజయంతి ఉత్సవాలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర సమితి నిర్ణయించింది. సంవత్సరం పాటు చర్చాగోష్టులు, సెమినార్లు, సభలు సమావేశాలు నిర్వహించడం ద్వారా గౌర్‌ ఆదర్శాలను ఈనాటి సమాజానికి తెలియపర్చాల్సిన గురుతరమైన నైతిక బాధ్యత కమ్యూనిస్టు పార్టీ, ట్రేడ్‌యూనియన్‌ నాయకులపై ఉందని భావిస్తున్నాం.(నేడు రాజ్‌బహదూర్‌ గౌర్‌ శత జయంతి)
చాడ వెంకటరెడ్డి,
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

మరిన్ని వార్తలు