సాగు సంక్షోభంతోనే మాంద్యం

14 Sep, 2019 01:06 IST|Sakshi

విశ్లేషణ 

మన వ్యవసాయరంగంలో కనీవినీ ఎరుగని రీతిలో కనిపిస్తున్న ప్రస్తుత సంక్షోభం గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత తారస్థాయికి చేరుకుంటోంది. అయినప్పటికీ మన ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు ఈ సంక్షోభంపై ఎలాంటి ప్రతిస్పందనా వ్యక్తపర్చకపోవడం బాధాకరం. అయితే భారతీయ వ్యవసాయరంగాన్ని ఆవరిస్తున్న కఠిన వాస్తవాలపై నీతి ఆయోగ్‌ మేల్కొనకపోయి ఉన్నట్లయితే ఆర్థిక మందగమనం గురించి ఈ స్థాయిలో ఎవరూ గగ్గోలు పెట్టేవారు కాదు. వ్యవసాయ రంగ నిజ ఆదాయాలు తగ్గుముఖం పట్టి, గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్‌ కుప్పగూలడంతో దేశీయ డిమాండ్‌ క్షీణించిపోయిన పరిస్థితికి అనివార్య ఫలితమే ఆర్థిక మందగమనం. దీన్ని పక్కనబెట్టి పరిశ్రమలకు ఉద్దీపన ప్యాకేజీలపై మన ఆలోచనలు సాగినంతకాలం ఆర్థిక రంగం కోలుకోవడం కలలో మాటే.

దేశాన్ని ఆవరిస్తోన్న ఆర్థిక రంగ క్షీణత అనూహ్యమైనదని, బహుశా గత 70 ఏళ్లలో ఇంతటి హీన పరిస్థితిని చవిచూడనట్లుందని సాక్షాత్తూ నీతి అయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ స్వయంగా పేర్కొన్నారు. పైగా ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు కల్పించాలంటే అసాధారణ చర్యలు తీసుకోవాల్సి ఉందని పిలుపునిచ్చారు. అయితే గత 17 ఏళ్ల కాలంలో అంటే 2000–17 మధ్య కాలంలో భారతీయ రైతులు దాదాపు రూ.45 లక్షల కోట్లను నష్టపోయి తీవ్రంగా దెబ్బతిన్నారనన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ నీతి అయోగ్‌ ఎలాంటి ప్రమాద హెచ్చరికలను చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ముందే చెప్పినట్లు మన వ్యవసాయరంగంలో కనీవినీ ఎరుగని రీతిలో కనిపిస్తున్న ప్రస్తుత సంక్షోభం గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత తారస్థాయికి చేరుకుంటోంది. అయినప్పటికీ మన ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు ఈ సంక్షోభంపై ఎలాంటి ప్రతిస్పం దనా వ్యక్తపర్చకపోవడం బాధాకరం. రైతులకు న్యాయంగా లభించాల్సిన ఆదాయాన్ని తిరస్కరించడం వల్లే వారు రూ. 45 లక్షల కోట్లను కోల్పోవలసి వచ్చిందని ఓఈసీడీ–ఐసీఆర్‌ఐఈఆర్‌ నివేదిక తెల్పింది. అలాగే 2017–18లో నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫీసుకు పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సమర్పించిన సర్వే ప్రకారం 2011–12 నుంచి 2017– 18 మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో 3.4 కోట్లమంది సాధారణ కూలీలు (వీరిలో 3 కోట్లమంది వ్యవసాయ కార్మికులు) తమ ఉపాధి కోల్పోయారు. భీతిగొల్పుతున్న గ్రామీణ ఆర్థిక దుస్థితి సంకేతాలు ఇక్కడే ఉన్నాయి. కానీ అసలు విషయం ఏదంటే మన విధాన నిర్ణేతలు ఈ వాస్తవాన్ని చూడడానికి కూడా ఇష్టపడకపోవడమే.

తీవ్ర సంక్షోభం బారిన పడుతున్నట్లు మన పారిశ్రామికరంగం సంకేతాలు వ్యక్తపరిచేంతవరకు, భారత ఆర్థిక వ్యవస్థను ఏదీ దెబ్బతీయలేదనే భ్రమల్లో మునిగిపోయాం. ఇంకా సూటిగా చెప్పాలంటే గ్రామీణ భారత్‌ అసలు ఉనికిలోనే లేనట్లు, అది ఎక్కడో సబ్‌– సహారా ఆఫ్రికాలో ఉంటున్నట్లు భావిస్తూ వచ్చిన విధాన నిర్ణేతలు, ఆర్థిక వేత్తలు మన రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోనంత దూరానికి జరిగిపోయారు. అయితే భారతీయ వ్యవసాయరంగాన్ని ఆవరిస్తున్న కఠిన వాస్తవాలపై నీతి ఆయోగ్‌ మేల్కొనకపోయి ఉన్నట్లయితే ఆర్థిక మందగమనం గురించి ఈ స్థాయిలో ఎవరూ గగ్గోలు పెట్టేవారు కాదు. వ్యవసాయ రంగ నిజ ఆదాయాలు తగ్గుముఖం పట్టి, గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్‌ కుప్పగూలడంతో దేశీయ డిమాండ్‌ క్షీణించిపోయిన పరిస్థితికి అనివార్య ఫలితమే ఆర్థిక మందగమనం. అంతే తప్ప ప్రస్తుత సంక్షోభానికి నిపుణులు నొక్కి చెబుతున్నట్లుగా దేశంలో ద్రవ్యలభ్యత లేకపోవడం కారణం కాదు. 

గత రెండేళ్లుగా వ్యవసాయ రంగంలో వాస్తవాదాయం దాదాపు జీరో వృద్ధిరేటుకు పడిపోయింది. అంతకుముందు 2011–12 నుంచి 2017–18 మధ్య కాలంలో అయిదేళ్లలో వ్యవసాయ రంగ వృద్ధి అర్ధశాతం కంటే తక్కువకు పడిపోయింది. ఇక్కడే భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంత పతనాన్ని చవిచూస్తోందని స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ఇక వ్యవసాయ రంగ ఆదాయాలు చూస్తే గత 14 ఏళ్లలో అత్యంత స్వల్పస్థాయికి దిగజారిపోయాయి. నమ్మలేని విషయం ఏమిటంటే 2011–2017 మధ్య కాలానికి వ్యవసాయరంగంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులు మొత్తం జీడీపీలో 0.3 నుంచి 0.4 శాతంగా మాత్రమే నమోదైనట్లు సాక్షాత్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజా నివేదికలో వెల్లడయింది. వీటిని బట్టే, దేశంలోనే అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వ్యవసాయ రంగం ఇన్నేళ్లుగా ఎంతటి దారుణ నిర్లక్ష్యానికి గురయిందో బోధపడుతుంది.

ఈ నేపథ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడమే ప్రాతిపదికగా అన్ని ప్రయత్నాలు ముందుకుసాగాలి. కానీ దీనికి భిన్నంగా, అసలు సమస్య వ్యవసాయరంగ సంక్షోభంలో కనిపిస్తుం   డగా వాహనాల అమ్మకాలు పడిపోయాయి మొర్రో అంటున్న పరి శ్రమ విషాదగీతికే ప్రచారం పొందుతోంది. దేశవ్యాప్తంగా లోదుస్తుల అమ్మకాలు కూడా పడిపోయాయని, చివరకు అయిదు రూపాయిలు పెడ్జి బిస్కెట్లు కొనడానికి కూడా ఒకటికి రెండుసార్లు పేదవారు ఆలోచిస్తున్నందున దాదాపు 10 వేలమంది కార్మికులను ఉద్యోగాల్లోంచి తీసేయాల్సి వస్తోందని ప్రముఖ బిస్కెట్ల తయారీ కంపెనీ పార్లే బిస్కెట్స్‌ ప్రకటించడం వంటివి జాతీయ మీడియాలో విపరీత ప్రచారానికి నోచుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి లక్ష కోట్ల రూపాయల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీపై కన్నేసిన పారిశ్రామిక లాబీ బృందాలకు మన మీడియాలోని అతి పెద్ద సెక్షన్‌ పూర్తి మద్దతుగా నిలుస్తోంది. ఇలా పారిశ్రామికరంగానికి మద్దతుగా టముకు వాయిస్తున్న మీడియా కఠోర శబ్దాల మరుగున రైతులు, గ్రామీణ పేదలు మరోసారి తెరవెనక్కు పోతున్నారు. 

మందకొడిగా సాగుతున్న ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చాలంటే సంపన్నులకు మరిన్ని రాయితీలు, మినహాయింపులు కల్పించాల్సిం దేనంటూ మీడియాలో వస్తున్న ఆర్భాటపు ప్రకటనల సారాంశం ఒక్కటే. సమాజంలో ఇప్పటికే బలిసి ఉన్న  సంపన్న వర్గాలకు మరింత డబ్బును అందుబాటులో ఉంచడమే ఈ ప్రచారం పరమార్థం. కానీ పారిశ్రామిక పెట్టుబడుదారులు పెడుతున్న ఈ గావుకేకలు, హాహాకారాలు డిమాండును సృష్టించడంలో ఎలా తోడ్పడతాయన్నది నాకు పరమాశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. పరిశ్రమలకు మరిన్ని పెట్టుబడులను, డబ్బును తరలిస్తే అది పేదల చేతుల్లో మరింత డబ్బు  చేరడానికి ఎలా సహకరిస్తుందన్నది పెద్ద పజిల్‌. అన్నిటికంటే మించి ఆర్థిక మాంద్యానికి వాస్తవంగా కారకులైన వారి చేతుల్లో మరింత డబ్బును పెట్టడానికే విధాన నిర్ణేతలు అన్ని చర్యలూ తీసుకుంటుండటాన్ని నేను అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నాను. ఈ మొత్తం పరిస్థితిని చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వయిజర్‌ కె. సుబ్రమణియన్‌ గతంలో చేసిన ప్రకటనకు అన్వయించుకోవచ్చు. భారతీయ పారిశ్రామికవర్గం లాభాలను తమ సొంతం చేసుకుంటూ నష్టాలను సమాజపరం చేస్తోందా? అని ఆయన గతంలో ప్రశ్నించారు. ఆయన ప్రశ్నను సమర్ధిస్తున్న్టట్లుగానే, 2007 నుంచి గత 12 ఏళ్ల కాలంలో రూ. 8.5 లక్షల కోట్ల మొండి బకాయిలను మాఫీ చేసేశారు. పైగా బ్యాంకులు తమపై ఇంకా రూ. 17 లక్షల కోట్ల రుణ భారం ఉందని ప్రకటిస్తున్నాయి. దీంట్లో కనీసం రూ. 12 లక్షల కోట్ల రుణాలు  తిరిగి రానివే ఉంటాయని ఆర్థిక విశ్లేషకుల ఉవాచ.

దేశీయ ప్రైవేట్‌ రంగం ఇప్పటికే బ్లాక్‌హోల్‌లో మునిగిపోయింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిన రోజుల్లో 2009 నుంచి భారతీయ పరిశ్రమ ప్రతి సంవత్సరం రూ. 1.8 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన పథకాన్ని అందుకుంటూ వచ్చింది. గత పదేళ్లలోనే అది రూ.18 లక్షల కోట్లను బెయిలవుట్‌ ప్యాకేజీ రూపంలో అందుకుంది. అదనంగా జీడీపీలో 5 శాతం వార్షిక పన్ను మినహాయింపును కూడా పొందుతోంది. కష్టమొచ్చినప్పుడు పరిశ్రమ తనకు తానుగా నిలదొక్కుకోవాలే తప్ప ప్రభుత్వం వద్దకు పరుగెత్తకూడదని ప్రధాన ఆర్థిక సలహాదారు చెప్పింది సరైనదే. ఎయిర్‌ ఇండియా నష్టాలనుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీని ఇస్తున్నప్పుడు ప్రభుత్వ రంగ ఎయిర్‌లైన్‌ని ప్రైవేటీకరించాలని పరిశ్రమదారులు గావుకేకలు పెడుతుంటారు. కానీ నష్టాల్లో కూరుకుపోయిన ప్రైవేట్‌ పరిశ్రమలు కూడా ఉద్దీపన ప్యాకేజీలకు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో వాటిని మనం ఎందుకు జాతీయం చేయకూడదు? 

ప్రస్తుతం కేంద్రప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల జీవనదానాన్ని ఆర్బీఐ సమర్పిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పునరుద్ధరించాలంటే  గ్రామీణ పేదలకు మరింత డబ్బును అందుబాటులోకి తీసుకురావడమే ఉత్తమ ఎంపిక. 17 రాష్ట్రాల్లో ఒక రైతు కుటుంబం సగటు ఆదాయం సంవత్సరాదాయం రూ.20,000లు మాత్రమే. అందుకే కేంద్రానికి అందుతున్న భారీ మొత్తంనుంచి ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ స్కీం కింద రైతులకు అందిస్తున్న ప్రత్యక్ష నగదు సహాయాన్ని రెట్టింపు చేయాలి. ప్రస్తుతం భూమి ఉన్న రైతుకు ఏటా రూ.6 వేల రూపాయల నగదు సహాయం చేస్తుండగా దాన్ని కుటుంబానికి 12 కోట్ల రూపాయలకు పెంచాలి. అంటే నెలకు రైతుకు కనీసం వెయ్యిరూపాయల నగదు సహాయం అందుతుందన్నమాట. భూమిలేని రైతులను కూడా పీఎమ్‌ కిసాన్‌ పథకంలో భాగం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. అలాగే వ్యవసాయంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులను గణనీయంగా పెంచాలి. దీంట్లో భాగంగానే ప్రభుత్వం వాగ్దానం చేసినట్లుగా 20,000 గ్రామీణ రైతు బజార్లను ఆధునిక మండీలుగా మార్చాలి.


దేవీందర్‌ శర్మ  
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

మరిన్ని వార్తలు