చిరస్మరణీయుడు మన సంజీవయ్య

7 May, 2020 00:10 IST|Sakshi

సందర్భం

దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య (1921–1972). ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా 1960లో ఏకగ్రీవంగా ఎన్నుకోబడినప్పుడు ఆయన వయస్సు కేవలం 39 సంవత్సరాలు. రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పదేళ్లకే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఘనుడు. రెండుసార్లు కేంద్ర మంత్రిగా, రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం మొదలుకొని, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్లలో దాదాపు 20 ఏళ్లు వివిధ శాఖల్లోనూ ఆయన పనిచేశారు.

నిరుపేద కుటుంబంలో పుట్టిన డి. సంజీవయ్య ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలకు నాంది పలికారు. భూమిలేని నిరుపేదలకు 6 లక్షల ఎకరాల బంజరు భూముల పంపిణీ, వృద్ధాప్య పెన్షన్లు, దేశం లోనే మొదటిసారి బాలికలకు సాంకేతిక విద్య అందించే దిశగా హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో కమలానెహ్రూ పాలిటెక్నిక్‌ కళాశాల స్థాపన, చర్మకారుల సంక్షేమం దృష్ట్యా లిడ్‌క్యాప్‌ ఏర్పాటు, పారిశ్రామికాభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్, మైనింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు వంటివి ఆయన దూరదృష్టికి నిదర్శనాలు. స్పెక్యులేషన్‌ మూలంగా హైదరాబాద్‌ చుట్టుపక్కల భూముల ధరలు పెరగకుండా అరికట్టడానికి ప్రభుత్వపరంగా రెండువేల ఎకరాల భూమిని క్రయం చేసి, కొత్త పరిశ్ర మల ఏర్పాటుకు సుగమం చేశారు.

కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్స్‌ ఏర్పాటుతో యాజమాన్యాలు–ప్రభుత్వం ఎప్పటికప్పుడు తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించే దిశగా సంజీవయ్య చేసిన కృషి ఎనలేనిది. ఆ మోడల్‌ తర్వాతి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసే విధంగా దోహదపడటం విశేషం. ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించి సాంఘిక న్యాయానికి బాట వేశారు సంజీవయ్య. షెడ్యూల్డు కులాలు, జాతులు, వెనకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు పెంచుతూ (14 నుండి 17 శాతం షెడ్యూల్డు కులాలకు; 24 నుండి 38 శాతం వెనుకబడిన తరగతులకు) తీసుకున్న నిర్ణయం ఆ రోజుల్లో సంచలనాత్మకం. 

ఈయనకు బోనస్‌ సంజీవయ్యగా గుర్తింపు ఉండేది. అంతకుమునుపు ఏమాత్రం బోనస్‌ పొందని 45 లక్షల మంది కార్మికులకు బోనస్‌ అందేలా పార్లమెంట్‌ ద్వారా చట్టం తెచ్చిన సంజీవయ్య కార్మికవర్గాలకు గుర్తుండిపోతారు. వీరి పదవీ కాలంలోనే కార్మిక చట్టాలను జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రానికి వర్తింపజేశారు. దిగుమతి చేయబడే ముడి సరుకులు గానీ, యంత్రభాగాలు గానీ అంతగా అవసరం లేని 29 పరిశ్రమలను గుర్తించి, లైసెన్స్‌ అవసరం లేకుండా చేశారు.

డీ–లైసెన్సింగ్‌ ఉత్తర్వులను అప్పటి పార్లమెంట్‌ సభ్యులైన దివాన్‌ చమన్‌లాల్, అటల్‌ బిహారీ వాజ్పేయి మెచ్చుకున్నారు. చిన్న పరిశ్రమల మనుగడకై సంజీవయ్య అధ్యయనం చేసి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. రాజకీయాల్లో నెగ్గుతూ వచ్చిన సాహితీవేత్త సంజీవయ్య. పద్యాలు, గేయాలు, పాటలు, స్తుతులు, కొన్ని నాటకాలు రాసి వాటిల్లో నటించారు కూడా. అఖిల భారత తెలుగు రచయితల మహాసభల్ని 1960 మే 6న హైదరాబాద్‌లో నిర్వహించిన గౌరవం సంజీవయ్యకే దక్కుతుంది. ఆ సభలో ‘మానవాభ్యుదయానికి భాషే ప్రామాణికం’ అని ఉద్బోధిస్తూ, ‘జై సరస్వతి’ అని తన ప్రసంగం ముగించారు. 

మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఒక సెంటు భూమి, సొంత కారు, బ్యాంకు బ్యాలెన్సు కూడా ఉంచుకోని నిరాడంబర జీవి ఆయన. ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు బేగంపేటలోని గ్రీన్‌ల్యాండ్స్‌ అతిథి గృహమే ఆయన అధికారిక నివాసం. అక్షర జ్ఞానం లేని సాదాసీదా ప్రజానీకం తనను కలవడానికి వస్తే, తన పీఏ చేత వారి కాగితాల్ని రాయించి, ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కృషి చేయడం ఆయనకు ఎంతో సంతృప్తి కలిగించేది. 1972 మే 8న ఆకస్మికంగా ఆయన ఢిల్లీలో కన్ను మూశారు. వేద మంత్ర పఠనంతో, వైదిక పద్ధతిలో పాటిగడ్డలోని నేటి సంజీవయ్య పార్కులో జరిగిన అంత్యక్రియలతో జీవనయాత్ర చాలించిన సంజీవయ్య మనందరి స్మృతి పథంలో ఎప్పుడూ మెదులుతుంటారు.


డాక్టర్‌ శ్రీనివాసులు దాసరి 
వ్యాసకర్త విశ్రాంత ఐఏఎస్

మరిన్ని వార్తలు