విశ్వాసం, అవిశ్వాసం నడుమ ఆర్థికం

14 Nov, 2019 00:21 IST|Sakshi

విశ్లేషణ

రాజకీయ, ఆర్థిక, దౌత్యరంగాల్లో పొడసూపుతున్న విశ్వాస రాహిత్యం మన జాతి వికాసంపై తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. ఆర్థిక రంగంలో తీసుకున్న ప్రతి కార్యాచరణ కూడా ప్రజాస్వామిక లేదా మార్కెట్‌ సూత్రాలకు అనుగుణంగా కాకుండా ప్రభుత్వం రాజకీయ లక్ష్యాలతో కూడిన ప్రచార అజెండాతో మిళితమైనట్లు కనిపిస్తోంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ కోణంలోనూ, వాణిజ్యం, మదుపుదారుల విశ్వాస స్థాయిల్లోనూ స్పష్టంగానే విశ్వాస సంక్షోభం కనిపిస్తోంది. బలహీనపడిన దేశీయ డిమాండ్‌ నేపథ్యంలో ఎఫ్‌డీఐలు పెద్దఎత్తున దేశం బయటకు తరలిపోవడం అనేది ప్రైవేట్‌ రంగ మదుపుదారులు భారత్‌లో కంటే విదేశాల్లో తమ మదుపులు పెట్టడంపైనే విశ్వాసం ఉంచుతున్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. జాతి సామూహిక పురోగతికి, తిరోగతికి విశ్వాసం, నమ్మకం కీలకాంశాలు అనే విషయాన్ని రాజకీయ నాయకత్వం గుర్తించాలి.

గత కొన్ని వారాలుగా భారత రాజకీయాలు, ఆర్థిక ముఖచిత్రం మన పాలనా వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న వివిధ సమస్యల ఛాయలన్నింటినీ ప్రతిబింబిస్తూ కలవరం కలిగిస్తూ వచ్చాయి. దేశంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితిని అంగీకరించిన కేంద్రప్రభుత్వం భారతీయ రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమను పునరుద్ధరించడానికి స్పెషల్‌ విండో ఫండ్‌ రూపంలో రూ. 10,000 కోట్ల రిలీఫ్‌ ప్యాకేజీని ప్రకటించింది. ప్రస్తుతం తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో రియల్‌ ఎస్టేట్‌ ఒకటి. ఒకప్పుడు భారీస్థాయిలో ఉద్యోగాలను సృష్టించిన రియల్‌ ఎస్టేట్‌ రంగం తీవ్రమైన ద్రవ్య సంక్షోభాన్ని చవిచూస్తూందనడంలో సందేహమే లేదు. నిర్మాణ రంగంలో ద్రవ్య సంక్షోభం ఉపాధి కల్పనపై తీవ్ర ప్రభావం వేసింది. ప్రత్యేకించి నివాస భవనాలు, సరసమైన ధరలకు లభించే గృహనిర్మాణ రంగంలో ఇది కొట్టొచ్చినట్లు కనిపించింది.

గత కొన్నేళ్లుగా దేశీయంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం పేలవమైన పనితీరు నిరర్ధక ఆస్తులను తారస్థాయికి తీసుకుపోయింది. అదే సమయంలో, మధ్యస్థాయి ఆదాయ వర్గాల గృహనిర్మాణ రంగంలో డిమాండ్‌ బాగా తగ్గిపోయింది. రుణాల కోసం పరపతి డిమాండ్‌ కూడా పడిపోయింది. దీంతో బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్‌లో ద్వంద్వ సమస్యలకు కారణమైంది. బ్యాంకింగ్‌ రంగంలో సంక్షోభం మరింత దిగజారిపోవడంతో దిగువ, మధ్య స్థాయి ఆదాయ వర్గాలకు చెందిన ప్రజల్లో భయాందోళనలు పెరిగి డిపాజిట్లను వెనక్కు తీసుకోవడంతో బ్యాంకింగ్‌ వ్యవస్థ కల్పన శక్తిని బాగా తగ్గించివేసింది.

అయితే ప్రజల విశ్వాసానికి సంబంధించిన సంక్షోభంలో బ్యాంకులు కూరుకుపోవడంతో స్పెషల్‌ విండో ఫండ్‌ వంటి చర్యలు రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని ఏ మేరకు పునరుద్ధరిస్తాయనే విషయంలో స్పష్టత ఏర్పడటం లేదు. కేంద్రం చేపట్టిన ఈ ప్రత్యేక చర్యలు దేశంలో స్తంభించిపోయిన రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు పది శాతం కంటే తక్కువగానే తోడ్పాటు అందిస్తాయని అంచనా. రియల్‌ ఎస్టేట్‌ రంగం పూర్తి స్థాయిలో కోలుకోవాలంటే భారతీయ బ్యాంకుల నుంచి మరింత స్థిరమైన రుణ సరఫరా వ్యవస్థ అవసరం ఎంతైనా ఉంది. 

ఇక రాజకీయ రంగంలో చూస్తే మహారాష్ట్రలో శివసేన, బీజేపీ మధ్య ఎన్నికలకు ముందు ఏర్పడిన పొత్తు దాదాపుగా కుప్పగూలిపోయినట్లే. శివసేన ప్రత్యామ్నాయ రాజకీయ సమ్మేళనంలో భాగంగా ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పర్చాలనుకున్నప్పటికీ రాష్ట్రపతి పాలన తప్పలేదు. హరియాణాలో సైతం ఆర్థిక పరిస్థితుల క్షీణత, భారీగా ఉద్యోగాలు కోల్పోవడం, వ్యవసాయ సంక్షోభం కారణంగా బీజేపీ ఓటు షేర్‌ పడిపోయింది. అదేసమయంలో బీజేపీ ఎన్నికల లక్ష్యాలు మూడింట్లో ఆర్టికల్‌ 370 రద్దు, అయోధ్యలో వివాదాస్పదమైన రామాలయ నిర్మాణం సమస్యలు పరిష్కారమయ్యాయి. ఇక మూడవదైన ఉమ్మడి సివిల్‌ కోడ్‌ లక్ష్యం ఇంకా పూర్తి కావలసి ఉంది. 

ఇక అంతర్జాతీయ రంగంలో చూస్తే ప్రధాని నరేంద్రమోదీతో కూడిన భారతీయ వాణిజ్య చర్చల బృందం చిట్టచివరి నిమిషంలో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సీఈపీ)లో చేరకుండా బయటకు రావడం చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. బ్యాంకాక్‌లో అధికారిక భేటీ జరగడానికి కొన్ని నెలల ముందు నుంచీ వాణిజ్యమంత్రి ఇతర వాణిజ్య చర్చల బృందాల సభ్యులు హడావుడి చూస్తే చివరలో ఒప్పందం నుంచి భారత్‌ వైదొలగడం ఎవరూ నమ్మలేకపోయారు. 

కేంద్రప్రభుత్వం, మన మీడియా ఆర్థిక వృద్ధిపై పదే పదే ఆశావాదాన్ని ప్రకటిస్తున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ చుట్టూ అలుముకున్న చీకటిని దాచి ఉంచడం అసాధ్యం అనిపిస్తోందని ప్రతాప్‌ భాను మెహతా ఇటీవలే వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితిలో వృద్ధి గణాంకాలు, అంచనాలు భారత అభివృద్ధికి భవిష్యత్‌కు సంబంధించిన వాస్తవాలను తప్పుదోవ పట్టించే దారిలో నడుస్తున్నాయనే చెప్పాలి.  

ఈ పరిణామాలన్నింటినీ చూస్తే, ఒక పురోగామి ఆర్థిక భవిష్యత్తు వైపుగా జాతిని ముందుకు నడిపించే సామర్థ్యం విషయంలో భారత ప్రభుత్వం నాలుగు రోడ్ల కూడలిలో నిలిచిపోయినట్లు కనిపిస్తోంది. మన రాజకీయ ఆర్థిక ముఖచిత్రం ప్రత్యేకించి గత అయిదారేళ్ల కాలంలో ఈ విశ్వాస సంబంధిత సంక్షోభాన్ని వ్యవస్థీకృతం చేసిపడేసింది. ఈ సంధికాలంలో మన సంస్థాగత విశ్వసనీయతపై తీవ్రంగా సందేహం నెలకొంది. ఆర్థిక రంగంలో తీసుకున్న ప్రతి కార్యాచరణ కూడా ప్రజాస్వామిక లేదా మార్కెట్‌ సూత్రాలకు అనుగుణంగా కాకుండా ప్రభుత్వం రాజకీయ లక్ష్యాలతో కూడిన ప్రచార అజెండాతో మిళితమైనట్లు స్పష్టంగా కనిపించింది. 

ఇక విస్తృత ప్రాతిపదికన అంతర్జాతీయ రంగంలో చూస్తే జమ్మూ కశ్మీర్‌ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా వేరు చేయడం, ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కారణంగా భారత ప్రతిష్ట అంతర్జాతీయంగా కాస్త దెబ్బతిందని రామ్‌ గుహ ఇటీవలే పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రామాణికత బలహీనపడటం కోణం నుంచి దీన్ని అంచనా వేయాల్సి ఉంది. అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధుల సమావేశాల్లో, అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రకటనల్లో, విదేశీ మీడియాలో భారత్‌ పట్ల అంచనాలో ఈ విషయమే ప్రతిధ్వనించింది, ఇక చివరి నిమిషంలో ఆర్సీఈపీలో చేరడం నుంచి వైదొలగడం అనేది యాక్ట్‌ ఈస్ట్‌ దృక్పథాన్ని ముందుకు తీసుకుపోవడంలో భారత దౌత్య, ఆర్థిక విధానాలకు మేలు చేకూర్చదనిపిస్తోంది. తగిన ప్రత్యామ్నాయం లేకుండా భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వాణిజ్యపరమైన పోటీ స్థాయిల్లో భారత్‌ బలహీనతపై, పరస్పర ప్రయోజనాలతో కూడిన  మార్కెట్‌ సూత్రాలపై ఆధారపడిన చర్చల్లో సంప్రదింపులపై దాని దౌత్యపరమైన సామర్థ్యతపై ఇతర దేశాలకు హెచ్చరికను పంపినట్లయింది. 

దేశీయ ఆర్థిక వ్యవస్థ కోణంలోనూ, వాణిజ్యం, మదుపుదారుల విశ్వాస స్థాయిల్లోనూ స్పష్టంగానే విశ్వాస సంక్షోభం కనిపిస్తోంది. బలహీనపడిన దేశీయ డిమాండ్‌ నేపథ్యంలో ఎఫ్‌డీఐలు పెద్దఎత్తున తరలిపోవడం.. మదుపుదారులు దేశాల్లో తమ మదుపులు పెట్టడం పైనే విశ్వాసం ఉంచుతున్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. వ్యవస్థాగత అవిశ్వాస వాతావరణంతో కూడిన విశ్వాస లేమి అనేది ఆర్థిక వృద్ధి రేటుపై తీవ్రప్రభావం వేస్తుందనటానికి ఆధారాలు ఉన్నాయి. ఎవరిని నమ్మాలో, దేన్ని నమ్మాలో తెలీనప్పుడు వ్యాపార వర్గాలు సమర్థవంతంగా ప్లాన్‌ చేయలేవని నోబెల్‌ గ్రహీత రాబర్ట్‌ షిల్లర్‌ మాటలను ఈ సందర్భంగా మనం అన్వయించుకోవాలి.

రాజకీయ నాయకత్వం పనితీరుపై అవిశ్వాసం అనేది భారత్‌లోనే కాదు అమెరికా వంటి దేశాలను కూడా ప్రభావితం చేస్తోందని డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికన్‌ ప్రెస్‌తో వ్యవహరిస్తున్న తీరుపై షిల్లర్‌ చేసిన వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయి. తనకు వ్యతిరేకంగా మీడియాలో వచ్చే వార్తలన్నీ నకిలీ వార్తలేనంటూ ట్రంప్‌ అమెరికన్‌ ప్రెస్‌పై చేస్తున్న దాడిని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. భారత్‌లో రాజకీయ కార్యాచరణపై ఆధారపడి జరుగుతున్న సామాజిక వేర్పాటుతత్వంలోనూ ఈ ధోరణి ప్రతిధ్వనిస్తూండటాన్ని మనం చూడ వచ్చు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వ్యాఖ్యలన్నింటినీ జాతి వ్యతిరేకం అని ముద్రవేయడంలో దీన్ని స్పష్టంగా గమనించవచ్చు. 

నాయకత్వం ప్రోత్సహిస్తున్నప్పుడు సమాజంలో పరస్పర అవిశ్వాసం మరింత బలపడుతుంది. కశ్మీర్‌లో కేంద్ర చర్యపై కాదు కదా.. కశ్మీరీల హక్కుల గురించి ప్రస్తావించినా మన సోషల్‌ మీడియా విరుచుకుపడుతోంది. దేశాన్ని చుట్టుముడుతున్న కీలకమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలపై చేసే వ్యాఖ్యాతలను బూతులతో సత్కరించడం సహజమైంది. ఇలాంటి వైఖరి భారతీయ సొంత భవిష్యత్తుపై తీవ్ర పరిణామాలను కలిగిస్తుంది. అంతేకాకుండా భారతీయ ప్రజాస్వామిక, మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ మూలాలనే ఇది దెబ్బతీస్తుంది. వాణిజ్యవర్గాలు దేశాన్ని విశ్వసించడం, విశ్వసించకపోవడం ఈ మూలాలపైనే ఆధారపడి ఉంటుంది.  జాతి సామూహిక పురోగతికి, తిరోగతికి విశ్వాసం, నమ్మకం అనేవే కీలకాంశాలు. అదే సమయంలో రాజకీయ వ్యవస్థపై విశ్వాసం చెదిరిపోవడం ఆర్థిక వృద్ధి క్షీణతకు దారితీస్తుంది. భారత్‌లో ఈ పరిణామాలను ఇప్పటికే చూస్తున్నాం. మన రాజకీయ నాయకత్వం దేశంలో పెరుగుతున్న విశ్వాస రాహిత్యాన్ని ఇకనైనా గమనించి తగు చర్యలు చేపట్టాల్సి ఉంది. 


దీపాన్షు మోహన్‌

వ్యాసకర్త అసోసియేట్‌ ప్రొఫెసర్, 
ఎకనమిక్స్, ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీ   
(‘ది వైర్‌’ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు