పెద్దన్న తెలియాలి.. సోమన్న మరుగునపడొద్దు

4 Dec, 2017 01:45 IST|Sakshi

ప్రపంచ తెలుగు మహాసభలు

కవిత్రయం తెలియకుండా, అల్లసాని పెద్దన తెలియకుండా తెలంగాణవాళ్లు ఉండాలని తాను అనుకోవడం లేదనీ; అలాగని పాల్కురికి సోమన్న మరుగునపడకూడదనీ దేశపతి శ్రీనివాస్‌ అంటున్నారు. డిసెంబర్‌ 15–19 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా మహాసభల కోర్‌ కమిటీ సభ్యుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్‌డీగా ఉన్న దేశపతితో సాక్షి సాహిత్యం ప్రతినిధి జరిపిన ప్రత్యేక సంభాషణ:

ఎడ్మినిస్ట్రేషన్‌ మీలోని సృజనకారుడిని ఇబ్బంది పెట్టడం లేదా?
ఇబ్బంది పెడుతోంది. హద్దులు ఏర్పడతాయి; మనదైన స్పేస్‌ తగ్గిపోతుంది. సృజనకు అవసరమైన ఉత్ప్రేరణ తగ్గిపోతుంది. అయినా ఏదో ఒక మేరకు సాహిత్యకారులతో సంభాషణలో ఉండటం వల్ల నా సృజనను సజీవంగా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నా.

ఏ క్రియేటివ్‌ ప్రాసెస్‌ నడుస్తోంది మీలో ఇప్పుడు?
తెలంగాణ సాహిత్య మూర్తులు జగజ్జేయమానంగా వెలుగొందాలంటే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించాక, తెలంగాణ సాహిత్య వైభవం సాక్షాత్కరించేలా పాటలు రాయడం మొదలుపెట్టాను. ఉదాహరణకు(పాడి వినిపించారు), ‘మన తెలంగాణము తెలుగు మాగాణము/ పలుకులమ్మ ఎద పంచిన భాషా పీయూషము/ చరితకు తొలి తెలుగందము జినవల్లభు కందము/ పంపకవిలో ప్రతిఫలించె తెలుగన్నడ బంధము/ నన్నయ కన్నా మున్నే ఉన్నదిచట ఛందము/ మల్లియరేచన చల్లిన మరుమల్లెల గంధము’. మనకు రాజకీయ నాయకుల హోర్డింగులు పెట్టడమే తెలుసు. కానీ సాహిత్యమూర్తులను హైదరాబాద్‌ అంతటా హోర్డింగుల్లో నిలిపితే వారి ప్రశస్తీ, భాష కోసం వారు చేసిన కృషీ ఫోకస్‌ అవుతాయి. వారి కోసం రాస్తున్న పంక్తులే ఒక సృజనకారుడిగా నా లోపల ఇప్పుడు సుడులు తిరుగుతున్నాయి.

ఎవరెవరి పేర్లతో తోరణాలు నిలపాలన్న ఎంపిక పూర్తయ్యిందా?
హాలుడి నుంచి ఆధునిక వైతాళికుల వరకు ఇప్పటికి 63 మంది తోరణాలు డిజైన్‌ చేయడం పూర్తయ్యింది. ఇంకా ఈ సంఖ్య వంద వరకు పెరిగే అవకాశం ఉంది.

పంక్తులు, పాటలు రాయడానికి వాళ్లను ఎంతమేరకు మీలోపలికి తీసుకున్నారు?
ఒక కవిని ఆయన భాషలోనే, ఆయన హృదయంతోనే, ఆయన దృక్పథంతోనే, ఆయన భావుకతతోనే చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా. ఉదాహరణకు రామదాసును తలుచుకోగానే భద్రాద్రి ఆలయం, కీర్తనలు స్ఫురణకొస్తాయి. కానీ ఆయన తెలుగులో భజనగీత సృజనకు ఆద్యుడు. త్యాగరాజుకు కూడా ప్రేరణగా నిలిచినవాడు. అందుకే, ‘తేనెలొలుకు తెలుగులోన/ భజనగీత సృజనమునకు/ ఆద్యుడైన రామదాసు/ భక్త శ్రేష్ఠుడు... రాగరాజు త్యాగరాజు/ వినయమొప్ప వినుతించిన/ విబుధవరుడు రామదాసు/ వందనీయుడు’ అన్నాను.

కోర్‌ కమిటీ సభ్యుడిగా ఈ మహాసభలు ఏం సాధించగలవని మీరు భావిస్తున్నారు?
ఒకటి: ఇన్నాళ్లూ తెలంగాణ భాష మీద దాడి జరిగింది. ఉపేక్ష భావం, చిన్నచూపు ఉండినాయి. ఏ భాషైనా గానీ అక్కడి భౌతిక చారిత్రక రాజకీయ ఆర్థిక పరిస్థితుల వల్ల రూపొందుతుంది. భాష అనేది జ్ఞాపకాల నిధి. అది ఇద్దరు వ్యక్తులు కేవలం భావాలు పంచుకొనే సాధనం మాత్రమే కాదు. భాషలో అక్కడి మట్టి వాసన, వారి స్మృతులు, సాంస్కృతిక వాతావరణం అన్నీ ఉంటాయి. తెలంగాణ ప్రజల్లో తమ భాష పట్ల ఒక ఔన్నత్య భావన ఈ మహాసభలు ఏర్పరచగలవు. రెండు: తెలుగు భాషలో ఏమాత్రం అభినివేశం లేని పిల్లల తరం రావడం ఇప్పటి విషాదం. వీరికి మాతృభాష పట్ల ఒక విశాల దృష్టి ఏర్పడుతుంది. తెలుగుకు చరిత్ర, విస్తృతి, వైశిష్ట్యం ఉన్నాయి; కవులకూ భాషావేత్తలకూ సమాజంలో గౌరవం ఉంది, అని వారికి తెలుస్తుంది. మూడు: ఆధునిక అవసరాలకు తెలుగును ఎలా విస్తరించాలో చేయాల్సిన ఆలోచనకు ఈ సభలు ఒక ప్రేరణ ఇవ్వొచ్చు.

ఐదు నుంచి పదేళ్ల తర్వాత తెలుగు భవిష్యత్‌ చిత్రం ఎలా వుండబోతోందని మీ ఊహ?
ఛానళ్ల తరం, ఐటీ తరం, అమెరికా తల్లిదండ్రుల తరం, నలబై అంటే ఇంగ్లీషులో ఎంత అనే తరం వచ్చాయి. వీరికి తెలుగులోని మౌలికాంశాలు తెలియదు. అయినప్పటికీ ఒక భాషగా తెలుగు అంతరించిపోతుంది, ఉండకుండా పోతుంది అనైతే నేను అనుకోవడం లేదు. గ్రామాల్లో ఏ నాట్లు వేసే స్త్రీ, ఏ కలుపుతీసే స్త్రీ ముందర నిలబడి దోసిలి పట్టినా భాషా భిక్ష పెడుతుంది. అయితే, కోర్టులో సాక్షి తెలుగులో చెబితే దాన్ని ఇంగ్లీషులో అనువాదం చేసి నమోదు చేస్తారు. అలా వుండకూడదు. పరిపాలనకూ, వ్యవహారానికీ మొత్తంగా తెలుగును ఉపయోగించే రోజులు రావాలి. అదేదో సెంటిమెంటుగా కాదు, ప్రజల అవసరం కోసం తెలుగును ఉపయోగించాలి. దానికోసం నా స్థాయిలో నేను కృషి చేస్తాను.

కేసీఆర్‌ను దగ్గరినుంచి చూసినవాడిగా– తెలుగుకు తనను తాను ఒక ఛాంపియన్‌గా నిలబెట్టుకోవాలన్న తాపత్రయం ఏమైనా ఆయనలో కనబడిందా?
లేదు. ఆయన పద్యాన్ని ప్రేమించినవారు. రాజకీయ ఉపన్యాసాలకు కూడా సాహిత్య పరిమళం అద్దినవారు. ఎన్నో సభల్లో– ‘ఆరంభించరు నీచమానవులు’ అంటూ భర్తృహరి సుభాషితం చెప్పారు. మొన్న (ఉప రాష్ట్రపతి) వెంకయ్యనాయుడు అభినందన సభలో కూడా ‘చదువది ఎంత కలిగిన’ పద్యం చెప్పారు. తెలంగాణలో ప్రకాశితమైన ఉద్యమ సాహిత్యం, జానపద సాహిత్యం గుర్తింపునొందాయి. కానీ శిష్ట సాహిత్యం, ఇతర సాహిత్య ప్రక్రియల మీద ఇంకా చర్చ జరగవలసేవుంది. తెలంగాణ భాషను తెలుగు భాషాభిమానులందరూ ప్రేమించాలి అనేది ఆయన ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆయనంటే సద్భావన, ప్రశంసే ఉన్నాయి. కాబట్టి కొత్త కీర్తి కోసం అయితే ఈ మహాసభల్ని ఆయన తలపెట్టలేదు.

తెలంగాణలో జరుగుతున్న మహాసభల్లో ఆంధ్రప్రదేశ్‌ వైతాళికుల తోరణాలు నిలబెట్టడాన్ని ఎలా చూస్తున్నారు?
ఇంతకాలం ఏం జరిగిందంటే– తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ సాహిత్యం విస్మరణకు గురైంది. తెలుగు సాహిత్య సంపూర్ణ దర్శనం జరగాలంటే ఈ నేల మీద జరిగిన కృషి కూడా అందులో చేరాలి. కవిత్రయం తెలియకుండా, అల్లసాని పెద్దన తెలియకుండా తెలంగాణవాళ్లు ఉండాలని నేను అనుకోవడం లేదు. అలాగని పాల్కురికి సోమన్న మరుగునపడకూడదు. పద్యానికి జాషువా అద్దిన మానవతా పరిమళాన్ని ఎలా విస్మరించగలం! ఆ తప్పు ఇప్పుడు మనం చేయకూడదు. అందుకే, తెలుగు సాహిత్యంలో మైలురాళ్లు అనదగిన ఆంధ్ర వైతాళికులకూ తోరణాలు కడుతున్నాం.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో తెలుగు అంటేనే ఒక కానిమాటగా చూసిన ధోరణి ఉండింది. ఇప్పుడు అదే తెలుగు సభల్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడాన్ని ఎలా చూడాలి?
ఉద్యమకాలంలో కొన్ని అతివ్యాప్తులుంటాయి. తెలుగంటే వాళ్లది, తెలంగాణ భాష అంటే మనది అనే ఒక వాదన ఉండింది. తెలుగు తల్లి అనే భావన గతంలో ఆంధ్రప్రదేశ్‌ నైసర్గిక స్వరూపంతో ముడిపడినదిగా చూపబడింది. నిజానికి అది భాషా స్వరూపం. అందుకే రాష్ట్రం విడిపోయాక భౌతిక వాస్తవం పలుచనబడి, తెలుగు తల్లి అనే భావన తటస్థత పొందింది. ఆ ప్రతీకతో ఇప్పుడు తెలంగాణకు నిమిత్తం లేదు. తెలంగాణలో అందమైన తెలుగు మాట్లాడుతారు. తెలుగు భాషా సాహిత్యాలకు ఇది పుట్టినిల్లు. బీజప్రాయం నుంచి శాఖోపశాఖలుగా తెలుగు విస్తరించిన నేల ఇది. తెలంగాణ నుడికారం, సామెతలు, శబ్దజాలం వీటన్నింటికీ పట్టంకట్టాల్సిన సమయం వచ్చింది.

మరిన్ని వార్తలు