అలసిన తెలంగాణ ఆకాంక్షలు

19 Jan, 2018 02:12 IST|Sakshi

విశ్లేషణ


ఎన్నికల్లో గెలిచాక ఇకపై ఉద్యమ పార్టీ కాదు అని తెరాస ప్రకటన వెలువడిన క్షణం నుంచే తెలంగాణ ప్రజల వాంఛలకు వ్యతిరేక దిశలో పాలన మొదలైంది. కలాలు తలవంచాయి. కవులకి తమ ఎండిన పూదండల గుబాళింపులే ముఖ్యమయ్యాయి.

మూడున్నరేళ్ల కాలంలో ‘తెలంగాణ’ ఎంత వెలిగిందో తేటతెల్లంగా మాట్లాడుకోలేకపోయాం. ఎవరు, ఏది మాట్లాడినా తెలంగాణ వ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారు. ప్రతిపక్షం అని నిందించడం మామూలైంది. లేదా ఎవరో ఒకరితో ఖండింపచేయడం ఆనవాయితీగా మారింది. ఉద్యోగాలు, అన్ని రంగాలలో వాటా, తెలంగాణ ఆత్మగౌరవ భావన, విద్య, భాష, సాహిత్య, సాంస్కృతిక, పరిశోధన రంగాలలో జరిగిన అవమానం, అన్యాయం ఉద్యమానికి ముఖ్య కారణాలు. ఐతే రాష్ట్రం వచ్చాక ప్రజల ఆకాం క్షల్ని పక్కన పెట్టి తెరాస అధినాయకుల అభీష్టాల కోసం, ప్రయోజనాల కోసమే పాలన ఆరంభమైంది. నేడూ అదే కొనసాగుతున్నది.

ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లోనే ఇప్పుడిక తెరాస ఉద్యమ పార్టీ కాదు అని ప్రకటించారు. అన్ని బూర్జువా పార్టీలలాగే ఎన్నికల పార్టీ అనే సంకేతం ఇచ్చారు. ఈ ప్రకటన వెలువడినప్పుడే ప్రజల నుంచి, ఉద్యమకారుల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన రావలసింది. అందుకు వ్యతిరేకంగా పోరాటం జరగవలసి ఉంది. మావోయిస్టు ఎజండా మా ఎజండా అని ప్రకటించిన అధినాయకుల ప్రకటన ఆంతర్యాన్ని బట్టబయలు చేయవలసి ఉంది. కాని ఎందుచేతనో దాని గురించి ఆలోచించలేదు. అదిగో! అప్పటి నుండే తెలంగాణ ప్రజల వాంఛలకు, బతుకులకు వ్యతిరేక దిశలో పాలన మొదలైంది.

ఇరవై శాతం పాలక వర్గాల ప్రయోజనాల ముందు ఎనభై శాతం ప్రజల మత సాంస్కృతిక సాహిత్య చరిత్రలు దిగదుడుపు అయ్యాయి. ఎక్కడా, ఏ రూపంలోనూ ఆలనలో, పాలనలో తెలంగాణ మాటలేదు. అంతా అధినాయకుల కీర్తనే. తెలంగాణ ఆత్మాభిమానం తాకట్టు పెట్టి వందకోట్లతో తెలుగుకు తారాజువ్వల వెలుగులు అద్దారు. ఆనాటి ఉద్యమ భావనలకు ఇలాంటి కార్యక్రమాలు విరుద్ధం. ఇప్పుడు ‘పులగం పెడుతానన్న దొర సొట్ట గిన్నె కూడ లాక్కుపోయిండన్న’ చందంగా మారిపోయింది. 

ఇప్పుడు తెలంగాణ ప్రజల మనసులు బాగోలేవు. అందుకే పాత నానుడులు, జాతీయాలు, సామెతల వాడుక మెల్లి మెల్లిగా మొదలైంది. ఒక కొత్త విచారధార వారి పదాల్లో తొంగి చూస్తోంది. మాకు మా అసలు తెలంగాణ, కోరిన తెలంగాణ రాలేదు. వచ్చిన తెలంగాణ ఆత్మరహిత తెలంగాణ. ప్రజల అస్తిత్వం, కాంతి లేని రోల్డు గోల్డు తెలంగాణ వచ్చింది. వచ్చింది పాలకవర్గాల తెలంగాణే. ఇది ప్రజలు ఊహించని పరిణామం. మరోసారి తెలంగాణ ప్రజలు, తెలంగాణ పేర ఏర్పడిన పార్టీ, ప్రభుత్వం చేతిలో ఓడినట్లుగానే లెక్కిస్తున్నారు.
 
 ‘నాభిల సల్ల పడ్డరు ఇక నవాబుకి జవాబేమిస్తరు’ అన్నట్టు కలాలు నిస్సిగ్గుగా తల వంచాయి. వీరు నిజానికి ‘నియ్యత్‌ లేని నిప్పులే’ కానీ చెద పట్టిన నిప్పులు అయ్యారని భావిస్తున్నారు. ఎవరు ఏమనుకుంటే ఏమి కవులకి తమ ఎండిన పూదండల గుబాళింపులే ముఖ్యం అయ్యాయి. ‘రోశాల పాటగాడికి వేశాలు మెండు’ అనే సామెత నిజం అయ్యిందని జనం బాధపడుతున్నారు. ఆనాడు పాటలు పాడిన, ఆటలు ఆడిన వాళ్ళని చూసి ఎకెసక్కాలాడుతుండ్రు. ప్రజల సాంస్కృతిక చరిత్రలో ఇంత దిగజారుడు తనాన్ని ఏనాడు చూడలేదని ఒకటే బాధ. ఈ కవులను చూశాక పిట్టల దొరలు అంతరించిపోయారు. కాని కొత్త దొరలు ఈ కొత్త పిట్టలదొరలను సృష్టించుకున్నారని అంటున్నారు. 

ఇప్పుడు, తెలంగాణ ఆత్మ, నాలుగు కోట్ల ప్రజల గుండెలను తట్టి లేపుతున్నది. ఉమ్మడి పాలనలో ‘మిస్‌’ అయిన సన్మానం, ప్రతి శాలువ తనకే కావాలని సర్కారీ కవులు కంకణబద్ధులయ్యారు. ఈ మూడున్నరేళ్ళలో కవుల మతలబు ఏమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ‘నాలిక మీద ప్రేమ. నాభి కాడ కోపం’ కలిగిన పాలకుల అసలు స్వభావం అర్థం చేసుకున్నారు. ‘తొండకు దొరతనమిస్తే ప్రహరి గోడ మీద సవారి చేసింద’నే నానుడిని, ‘ఊసరవెల్లి అసలు రంగు మోసమే’ అని తేటతెల్లంగా గ్రహించారు.

తెలంగాణలో జరగవలసినవి తక్కువ జరిగాయి. జరగకూడనివి అతి ఎక్కువగా జరుగుతున్నాయి. వీటి మధ్య సమతౌల్యం లేని కారణంగా తెలంగాణలో అనిశ్చిత వాతావరణం నెలకొంది. అశాంతి గాలులు వీస్తున్నాయి. ఇప్పుడు ఏ పార్టీ, ఏ పంథా అయినా మరోసారి ‘తెలంగాణకు సై’ అంటుందో వారికే ఇక్కడ భవిష్యత్తు ఉంది. ఎన్నికలు ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజల పూర్తి కాని ఆకాం క్షలే ప్రధానం. ఇప్పుడు అధికారం కోసం రాజకీయాలు ఆపి పరిపూర్ణ తెలంగాణ కోసం పోరాడాలి. జైళ్ల కైనా వారు వెళ్లగలగాలి. 

‘నూతిలో తుపాకి గుండేసి తూటు చూపియ్యి అన్నాడట’ వెనకటికో దొరగారు. ఆనాటికది సామెత! నేడు ప్రజలు తమ గుండెలు విప్పి చూపి అన్నీ తూటులే అని అంటున్నారు. తెలంగాణలో బంగారం అంతా ఎక్కడ ఎక్కువగా కుప్ప కూడుతున్నదో కళ్లు విప్పి చూస్తున్నారు. మొలిచే కొమ్ములను వంచడానికి మార్గం వెదుకుతున్నారు. చల్లబడిన సిద్ధాంతాలను పెనం మీద కాదు, అగ్గి కొలిమిని రాజేసి పరీక్షిస్తున్నారు. 
తెలంగాణ ఉద్యమం గతం కాదు. అది రేపులో కదలాడుతున్నది. ‘గురిజెత్తు ఆశయం, గురి చూసి కొట్టే అమ్ముల పొది’లా ఉంది పరిస్థితి. తెలంగాణ ఎన్నడూ పాలకులకు సింహస్వప్నమే. అసలు సిసలు తెలంగాణ సాధన కోసం ఉద్యమం కొనసాగింపు దిశగా కదులుతుందా?

తిరుమల రావు
వ్యాసకర్త అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక
మొబైల్‌ : 99519 42242 

మరిన్ని వార్తలు