పల్లెతో తెగిపోతున్న బంధం

10 Nov, 2017 00:46 IST|Sakshi

విశ్లేషణ
పట్టణ ప్రాంతాల వైఖరిని చూస్తే ఒక్కోసారి నాకు ఎంతో చీదర ఎత్తుతుంది. రైతు ఆత్మహత్యల పరంపర గురించి ట్వీట్‌ చేస్తే.. వాళ్లు ఎలాగూ చనిపోయేవారే, వాళ్లు దేశానికి భారం అని కొందరు రాస్తే, రైతులు దేశం రక్తాన్ని పీల్చేస్తున్న పరాన్నభుక్కులు అని మరికొందరు రాస్తుంటారు. వారిలో చాలా మందికి రైతులంటే ప్రభుత్వం వేసే బిచ్చంపై ఆధారపడి బతుకుతున్నవారు. ఇక రైతుల గురించి మాట్లాడటం కట్టిపెట్టి, పైకి ఎదుగుతున్న పట్టణ జనాభా గురించి రాయమని నాకు హితవు చెప్పేంతగా గ్రామానికీ, పట్టణానికి మధ్య అనుబంధం విచ్ఛిన్నమైంది.

మనం నివసిస్తున్నది ఇండియా, భారత్‌ అనే రెండు భాగాలుగా చీలి పోయిన దేశంలోనని అందరికీ తెలి సిందే. ఇండియా నివసించేది ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్‌ హైవేలు, ఆకాశహర్మ్యాలు, విలాసవంతమైన కార్లు, ఇంకా ఏదంటే అదీ ఉండే మహా నగరాలలో. కాగా, భారత్‌ నివసించేది మట్టి రోడ్లు, ట్రాక్టర్లు, ఎడ్ల బళ్లు, కోట్లాది మంది నిస్సహాయులైన పేదలు... వారిలో చాలా వరకు రైతులు  ఉండే 6.40 లక్షల గ్రామాల్లో. 

నిజమేగానీ, ఇండియా, భారత్‌ల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడు తున్నావు? అని మీరు అడగొచ్చు. ఇండియా, భారత్‌ల మధ్య ఉన్న అగాధాల్లాంటి అంత రాల గురించి మనకు ఎలాగూ తెలుసు. దేశంలోని పట్టణ, గ్రామీణ భారతాల మధ్య ఉండే అనుబంధం విచ్ఛిన్నం అయిందని భావిస్తుండటమే నేను ఈ విష యాన్ని ప్రస్తావించడానికి కారణం. పైగా ఆ అనుబంధం తెగిపోవడం రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. నగరాలలో నివసించే ప్రజలు గ్రామీణ ప్రాంత పరిస్థితులకు బాగా దూరమై పోయారు. వారికి గ్రామీణ జీవితం గురించి సూచనప్రాయంగా కూడా తెలియ కుండా పోయింది. గ్రామీణ భారతం అంటే వాళ్లు అదేదో వేరే దేశంగా, ఏ ఆఫ్రికాలోనో లేదా మరే సుదూర ప్రాంతంలోనో ఉన్నదిగా భావిస్తున్నారు. బాలీవుడ్‌ సిని మాలు సైతం గ్రామీణ భారతం గురించి మాట్లా డటం మానేశాయి.  

కొరవడుతున్న సహానుభూతి
పట్టణ ప్రాంతాల వైఖరిని చూస్తే ఒక్కోసారి నాకు ఎంతో చీదర ఎత్తుతుంది. రైతు ఆత్మహత్యల పరంపర గురించి నేను ఏదైనా ట్వీట్‌ చేసిన వెంటనే నాకు వచ్చే సమాధా నాలను చూస్తే నోట మాట రాదు. వాళ్లు  ఎలాగూ చని పోయేవారే, ఈ దేశానికి వాళ్లు భారం అని కొందరు రాస్తుంటారు. రైతులు దేశం రక్తాన్ని పీల్చేస్తున్న పరాన్న భుక్కులు అంటారు మరికొందరు. చాలామందికి రైతు లంటే ప్రభుత్వం వేసే బిచ్చంపై ఆధారపడి బతుకుతు న్నవారు. వ్యాపార నిపుణులు కావడానికి వీలుగా పట్ట భద్రులు కానందుకు వారీ మూల్యాన్ని చెల్లించడం అవ సరమే అంటారు. 

రైతుల గురించి నేను సోషల్‌ మీడియాలో రాసే వాటికి ప్రతిస్పందించే వారు.. నువ్వు ఇక రైతుల గురించి మాట్లాడటం కట్టిపెట్టి, పైకి ఎదుగుతున్న పట్టణ జనాభా గురించి రాయమని చెప్పేంత ఘోరంగా గ్రామానికీ, పట్టణానికీ మధ్య అనుబంధం విచ్ఛిన్నమైంది. ఈశాన్య రాష్ట్రాల్లో వరదల వల్ల రైతాంగం ఎంత నష్టపోయిందనో లేక మధ్య, దక్షిణ భారతంలో వ్యాపించిన కరుపు పరి స్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయనో నేను మాట్లాడే టప్పుడు వారిలో విచారమైనా కలుగదు. వ్యవసాయ ఉత్పత్తుల «ధరలు అసాధారణంగా çకుప్ప కూలడంతో రైతులు టమాటాలను రోడ్ల మీద పోసి పోవడం, ఆ కార ణంగా కొందరు రైతులు గుండెపోటుతో మరణించడం లేదా ధరలు అలా కుప్ప కూలడాన్ని తట్టుకోలేక ఆత్మ హత్యలు చేసుకోవడం గురించి నేను రాస్తుంటాను. అలాంటప్పుడు, ఇది గ్రామీణ భారతంలో సర్వసాధార ణమైన సంగతే కదా, దాని గురించి ఆందోళన చెంద వద్దని నాకు చెబుతుంటారు. 

రైతుకు చోటే లేని విద్యాబోధ
ఈ చెత్త వాగుడంతా వింటున్నప్పుడు నేను పట్టణ ఇండియాకు, రైతులకు మధ్య ఇంత లోతైన చీలిక ఎలా వచ్చిందా? అని ఆందోళన చెందుతుంటాను. రైతు నాయకులు ఈ చీలికను ఇంత లోతుగా ఎలా విస్తరించని చ్చారు? పట్టణ జనాభా, గ్రామీణ పల్లెసీమలతో అను బంధం కలిగి ఉండేలా వారు ఏవిధమైన ప్రయత్నమూ ఎందుకు చేయలేదు? ఈ ప్రశ్నలకు నా వద్ద సమాధా నాలు లేవు. కానీ, పట్టణ సమాజానికి చేరువ కాకపోవ డంలో ఏదో ఒక మేరకు రైతాంగం తప్పు కూడా లేదా? అని నాకు బలంగా అనిపిస్తోంది. రైతులు ఎప్పుడూ తమ పోరాటాలను తమ రైతాంగ ప్రజానీకానికి మాత్రమే పరి మితం చేసుకుంటున్నారు ఎందుకు? సమాజంలోని ఇతర విభాగాలకు చేరువయ్యే కృషి ఎందుకు జరగలేదు? 

పాఠశాలలు, కళాశాలలనే ఉదాహరణగా తీసు కోండి. అవి విద్యార్థులకు అందించే విద్యలో ఎక్కడా రైతు కనిపించనే కనిపించడు. పాఠ్య పుస్తకాలలో మహ త్తరమైనదిగా, గొప్పగా రాసి ఉన్నది తప్ప మరేదీ గొప్పది కాదని మాత్రమే విద్యార్థులకు తెలుసు. విద్యా ర్థులకు, రైతులకు మధ్య ముఖాముఖి సంభాషణలను నిర్వహించే దృశ్యాలు అతి అరుదుగా మాత్రమే కనిపి స్తుంటాయి, ఎందుకు? విద్యాలయాల వార్షికోత్సవా లలో లేదా వేరే వివిధ సందర్భాలలో ప్రదర్శితమయ్యే విద్యేతర కార్యక్రమాల్లో రైతులకు, విద్యార్థులకు మధ్య చర్చలు జరగడం చాలా అరుదుగానే కనిపిస్తుంది ఎందు వల్ల? మనం యువజనోత్సవాలను నిర్వహించేటప్పుడు సైతం.. అవి పట్టణ యువతకు సంబంధించినవయ్యే అవకాశాలే ఉంటాయి. గ్రామీణ యువత ఎక్కడా వేదిక మీద కనిపించనే కనిపించదు. భారత్‌ అసలు అస్తిత్వం లోనే లేదన్నట్టుగా, అవన్నీ పూర్తిగా పట్టణ భారతం గురించినవే. 

పల్లెతో సంబంధమే లేని విధానకర్తలు
ఇటీవల నేను ఢిల్లీలోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో మాట్లాడాను. ఆ సందర్భంగా నేను వారిలో చాలా మందిని ఎప్పుడైనా ఏ గ్రామానికైనా వెళ్లారా? అని అడగటం ప్రారంభించాను. 60 మందికి పైగా ఉన్న తరగతిలో కేవలం నలుగురు మాత్రమే చేతులు పైకి ఎత్తారు. వారిలో ముగ్గురు ఏదో పెళ్లికి వెళుతూ లేదా తమ తల్లి, తన తల్లిదండ్రులను చూడటానికి వెళు తుం డగా ఆమెకు తోడుగా వెళ్తూ ఏదో ఒక గ్రామం గుండా లేదా తాలూకా ప్రధాన కేంద్రం గుండా ప్రయాణించిన వారే. నోయిడా నుంచి 40 కిలో మీటర్ల దూరం పోతే చాలు, ఓ గ్రామం వస్తుందని చెబితే వారు అక్కడికి వెళ్లాలనే ఉత్సుకతను కనబరచలేదు. ఈ యువతకు, జీవితం అంటే పట్టణ కేంద్రాలకు పరిమితమైనదే. వారు ఉన్న, ఉండాల్సిన స్థలం అది మాత్రమే.  

ఏదో ఒక రోజు ప్రభుత్వ యంత్రాంగంలో లేదా బహుళజాతి కంపెనీల్లో లేదా మరేదైనా నిర్ణయాలను  తీసుకునే సంస్థల్లో చేరేది ఈ యువతే. దేశ జనాభాలో 70 శాతం నివసించే గ్రామీణ భారతం ఎలా ఉంటుందో కూడా వారికి తెలియదు లేదా అతి కొద్దిగా మాత్రమే తెలుసు. వారిని తప్పు పట్టడం ఎందుకు? రోజు విడిచి రోజు టీవీ చర్చల్లో దర్శనమిచ్చే లేదా ఇంగ్లిష్‌ దినపత్రి కల్లో క్రమం తప్పకుండా కాలమ్‌లను రాసే సుప్రసిద్ధ ఆర్థికశాస్త్రవేత్తలు సహా ప్రస్తుతం విధాన నిర్ణయ కర్తలుగా ఉన్న వారిలో చాలా మందికి గ్రామాలతో ఉన్న ప్రత్యక్ష సంబంధం అతి స్వల్పం. నేడు ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలిలో సభ్యులుగా ఉన్న ఒక ఆర్థికశాస్త్రవేత్త ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో రాసిన ఒక వ్యాసాన్ని చూసి నేను దిగ్భ్రాంతి చెందాను. వ్యవసాయం గురించి ఆయన కచ్చితమైనదంటూ చేసిన వాదనకు సమర్థన ఆయన భార్య పుట్టగొడుగులను పండించే పార్ట్‌టైంరైతు కావడం మాత్రమే. ఆమె సరదాగా తీరుబడి సమ యాల్లో పుట్టగొడుగులను పెంచే ఉన్నత వర్గ మహిళ. 

రాజకీయం రంగుటద్దాలతో...
ఇక్కడితో ఇది ముగిసిపోలేదు. వ్యవసాయ సంక్షోభం గురించి, రైతు ఆత్మహత్యల పరంపర గురించి నేను మాట్లాడినప్పుడల్లా.. కాంగ్రెస్‌ హయాంలో ఆత్మ హ త్యలు జరగలేదా? వానలు కురవకపోవడానికి నరేంద్ర మోదీ కారణమా? అంటూ హేళన చేసే వ్యాఖ్యలు ఎదురవుతుంటాయి. బహిరంగ చర్చ ఇంతగా రెండు ధ్రువాలుగా చీలిపోవడంతో వరదలు, క్షామం సహా ప్రతిదాన్ని ఎన్నికల పరమైన మొగ్గుదల దృష్టి కోణం నుంచి చూస్తున్నారు. 

మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ సైతం ఒక మతంగా మారి పోయింది. దాన్ని విశ్వసించేవారు జాతీయం చేసిన బ్యాంకులకు కార్పొరేట్‌ సంస్థలు రుణాలను ఎగ్గొట్ట డాన్ని సైతం సమర్థించటానికి సుముఖంగా ఉంటు న్నారు. ప్రధాని ఆర్థిక సలహాదారు కార్పొరేట్‌ రుణాలను మాఫీ చేయడం ఆర్థిక వృద్ధి అనీ, రైతుల రుణమాఫీ మాత్రం పరపతి పరమైన క్రమశిక్షణారాహిత్యానికి దారి తీస్తుందని, దేశ బడ్జెట్‌ను తలకిందులు చేస్తుందని చెప్పారు. ఏటా వందల కోట్లలో ఉంటున్న బ్యాంకుల మొండి బకాయిలను మాత్రమే కాదు, ఎన్ని వాస్తవాలను వారి ముందుంచినా... వారు మీ మీద ఏకంగా కమ్యూ నిస్టు అని కాకున్నా, సోషలిస్టు అని ముద్ర వేయడానికి ప్రయత్నించే అవకాశాలే ఎక్కువ. తెలివిగా ముద్రలు వేసే పనిని చేసేది ఇలాగే. ఇదేమైనా పట్టణానికీ, పల్లెకూ మధ్య ఉన్న ఆ అగాధాన్ని పూడుస్తుందా?

- దేవేందర్శర్మ
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌: hunger55@gmail.com

 

>
మరిన్ని వార్తలు