రైతును లక్ష్యపెట్టని రాజకీయం

9 Nov, 2018 00:11 IST|Sakshi

విశ్లేషణ

స్వాతంత్య్రం సాధించి ఏడు దశాబ్దాలు దాటిన తర్వాత కూడా మన దేశంలోని రైతుల్లో 58 శాతం మంది నేటికీ ప్రతిదినం రాత్రిపూట పస్తులతో పడుకుంటున్నారని తెలిసినప్పుడు యావద్దేశం షాక్‌కు గురికావాలి. పరిశ్రమల అభివృద్ధి లక్ష్యంగా ఆర్థిక సంస్కరణలు కొనసాగుతూ రైతును చిన్నచూపు చూడటమే ఈ జాతీయ విషాదానికి కారణం అని రైతాంగం గ్రహించనంతవరకు వారు సార్వత్రిక ఎన్నికల్లోనూ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోసపోతూనే ఉంటారు. కుల, మత, రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా మేల్కొని రైతులుగా మాత్రమే తమ ఓటు వేసినప్పుడే మన దేశ రాజకీయ వాతావరణంలో మార్పు సంభవిస్తుంది. 

సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తన చెవులను తాను నమ్మలేకపోయారు. బహుళ ప్రజాదరణ పొందిన కౌన్‌ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో తన ముందు హాట్‌ సీట్‌లో మహారాష్ట్రకు చెందిన, నాలుగు ఎకరాల పొలాన్ని సాగు చేస్తున్న ఒక సన్నకారు రైతు కూర్చుని ఉన్నాడు. సంవత్సరంలో ఎంత సంపాదిస్తారు అని అడిగిన ప్రశ్నకు అనంత్‌కుమార్‌ అనే ఆ రైతు చెప్పిన సమాధానం ఇది. ‘సంవత్సరానికి రూ. 60,000కు మించి సంపాదన ఉండదు. దాంట్లో సగం డబ్బులు పెట్టి విత్తనాలు కొంటాను, మిగిలిన మొత్తం నా కుటుంబానికి రోజుకు ఒక పూట భోజనానికి మాత్రమే సరిపోతుంది’.

అమితాబ్‌ బచ్చన్‌ నమ్మలేనట్లుగా మళ్లీ ప్రశ్నించారు. అన్నదాత బాధామయగాథను మరోసారి విన్న తర్వాత, రైతులను ఆదుకోవడానికి ముందుకు రావలసిందని, తోచిన సాయం చేయవలసిందని అమితాబ్‌ కోరుతూ జాతిని అభ్యర్థించారు. భారతీయ చిత్రపరిశ్రమ కన్న ఈ ధీరోదాత్త దిగ్గజ నటుడు ప్రదర్శించిన ఈ సానుభూతిని, కనికరాన్ని ప్రశంసించకుండా ఉండలేను. కానీ, ఈ దేశంలో అనంత్‌ కుమార్‌ వంటివారు అరుదైన రైతులు కారన్న వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడు అమితాబ్‌ స్పందన ఎలా ఉంటుంది అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ రైతు చెప్పింది భారతీయ వ్యవసాయం విషయంలో చాలావరకు వాస్తవమే. ఈ దేశంలోని రైతుల్లో 58 శాతం మంది నేటికీ ప్రతిదినం రాత్రిపూట పస్తులతో పడుకుంటున్నారని పలు తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి.

స్తంభించిపోయిన రైతు రాబడి
ఎకనమిక్‌ సర్వే 2016 ప్రకారం, భారతదేశంలోని 17 రాష్ట్రాలలో (అంటే దేశంలోని దాదాపు సగం రాష్ట్రాల్లో) ఒక రైతు సగటు ఆదాయం సంవత్సరానికి రూ. 20,000 మాత్రమేనని తెలిసింది. మరో వైపున దేశంలో గత అయిదేళ్లలో (2010–2015 మధ్య) దేశవ్యాప్తంగా రైతుల నిజ ఆదాయంలో వార్షిక పెరుగుదల అర్ధశాతం కంటే తక్కువేనని సాక్షాత్తూ నీతి ఆయోగ్‌ చెబుతోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 0.44 శాతం పెరుగుదల మాత్రమే ఉంది. గత నలభై ఏళ్లలో ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసి చూస్తే రైతుల ఆదాయం కాస్త ఎక్కువగా లేక కాస్త తక్కువగా ఉంటూ స్తంభించిపోయి ఉంది. వ్యవసాయ రంగ వ్యధ ఇప్పుడు పరాకాష్టకు చేరుకుంది.

ప్రధానంగా ఈ కారణం వల్లే దేశ రైతులు ఆగ్రహంతో వీధులకెక్కుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఏదో ఒక ప్రాంతంలో రైతుల ఆందోళన, నిరసన ప్రదర్శనలు జరగకుండా ప్రశాంతంగా గడుస్తున్న వారాన్ని దాదాపుగా మనం చూడడం లేదు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో ప్రకారం, 2014లో 687 రైతు ప్రదర్శనలు జరగగా 2015లో ఒక్క ఏడాదిలోపే 2,683 నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. ఒక సంవత్సరం తర్వాత అంటే 2016లో రైతు నిరసనల సంఖ్య రెట్టింపై 4,837కు చేరుకుంది. మరోమాటలో చెప్పాలంటే కేవలం మూడేళ్ల వ్యవధిలోపే రైతుల నిరసన ప్రదర్శనలు ఏడు రెట్లు పెరిగాయి. రైతుల్లో పెరుగుతున్న ఆగ్రహావేశాలకు ఇది స్పష్టమైన సంకేతంగా చెప్పవచ్చు. నాసిక్‌ నుంచి ముంబై వరకు రైతుల లాంగ్‌ మార్చ్‌ తర్వాత ఇటీవల హరిద్వార్‌ నుంచి న్యూఢిల్లీ వరకు కిసాన్‌ యాత్ర జరిగిన తదనంతరం మరిన్ని భారీ రైతు నిరసన ప్రదర్శనలకు పథకం రచించారు. వీటిలో ఆదివాసీలు, భూమిలేని రైతులతో కూడిన అతి పెద్ద ప్రదర్శన కూడా ఒకటి. నిశితంగా పరిశీలించి చూస్తే రైతుల ఆగ్రహ ప్రదర్శనలు రెట్టింపు అవుతున్నాయని బోధపడుతుంది. వరుసగా మూడేళ్లుగా వ్యవసాయ పంటల ధరలు పతనమవడమే ఇంత భారీస్థాయిలో రైతుల ప్రదర్శనలకు, వారి ఆగ్రహజ్వాలలకు ప్రధాన కారణం.

2019లో పార్లమెంట్‌ ఎన్నికలు జరగడానికి ముందుగా 5 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల్లో గ్రామీణ ఓటర్ల వాటా చాలా ఎక్కువగా ఉంది. సరిగ్గా ఈ రాష్ట్రాల్లోనే రైతుల నిరసనలు క్రమంతప్పకుండా జరుగుతున్నాయి. రైతుల ఆందోళనలే ఈ రాష్ట్రాల్లో అధికంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో నగర కేంద్రాలకు కూరగాయలు, పాల ఉత్పత్తులను నిలిపివేసి మరీ నిరసనలకు రైతులు పూనుకున్నారు. ఇక మధ్యప్రదేశ్‌లో అయితే రైతులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో అయిదుగురు రైతులు చనిపోయారు. రైతుల ఆగ్రహం ఇలా స్పష్టంగా గోచరిస్తుండగా, ఇప్పుడు దేశం ముందున్న పెద్ద ప్రశ్న ఏదంటే, ఈ రైతాంగ నిరసనలు రాజకీయ పార్టీలను వాటి ఎన్నికల అజెండాను పునర్నిర్వచించుకునేలా చేసి, ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయానికి అగ్రస్థానం ఇచ్చేలా ఒత్తిడి పెట్టగలవా అన్నదే. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అన్ని రాజకీయ పార్టీలూ తమ సిద్ధాంతాలతో పనిలేకుండా రైతులు కోరినవల్లా ఇస్తామని వాగ్దానం చేస్తున్నాయి. కానీ ఎన్నికలు ముగియగానే ఆర్థిక రాడార్‌ స్క్రీన్‌పై రైతులు కనుమరుగైపోతున్నారు. మరోలా చెప్పాలంటే రైతుల సమస్యలను పూర్తిగా వదిలివేస్తున్నారు.

రైతును దగా చేస్తున్న రాజకీయ పార్టీలు
గత 30 ఏళ్లుగా నేను ఈ పరిణామాలను చూస్తూ వస్తున్నాను. ప్రతి ఎన్నికల సమయంలోనూ రాజకీయ పార్టీలు రైతులను వంచిస్తూ తాము అధికారంలోకి వస్తే అవి కల్పిస్తాం, ఇవి కల్పిస్తాం అంటూ ఆర్థిక ప్రలోభాలకు గురిచేస్తూవస్తున్నాయి. ఎన్నికలు ముగిశాక తదుపరి నాలుగేళ్ల పాలనలో అధికార పార్టీ రైతులను బాదిపడేస్తోంది. చివరి సంవత్సరంలో మాత్రం రైతులకు తాయిలాలు ప్రకటిస్తూ ఆకర్షిస్తున్నారు. కనీసం ఇలాంటి వాగ్దానాలను కూడా నెరవేర్చడంలో పాలకులు విఫలమవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రైతులకు సంబంధించిన అన్ని రకాల రుణాలనూ మాఫీ చేస్తామని యోగి ఆదిత్యనాథ్‌ దంబాలు పలికారు కానీ వాస్తవానికి సన్నకారు రైతులకు గరిష్టంగా 1 లక్ష రూపాయల వరకు మాత్రమే రుణ మాఫీ చేశారు. ఇక పంజాబ్‌లో కేప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ అయితే రైతుల అప్పులను తీర్చేస్తానని, ప్రైవేట్‌ బ్యాంకులు, జాతీయ బ్యాంకుల్లో తీసుకున్న అన్ని రుణాలను కూడా మాఫీ చేస్తామని ఆర్భా టంగా ప్రకటించారు.

కానీ ఎన్నికలు ముగిశాక ఇంతవరకు రూ. 900 కోట్ల మొండి రుణాలను మాత్రమే రద్దు చేశారు. పంజాబ్‌లో రైతుల మొత్తం రుణాలు రూ. 86,000 కోట్లు. మహారాష్ట్రలో ఇంతవరకు రూ.16,000 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేశారు. రూ. 34,000 కోట్ల మొత్తం రుణాలలో ఇది సగంకంటే తక్కువే. రైతాంగ ఉద్యమాలు పాలకుల వ్యవసాయ దృక్పథంలోనూ, ఆర్థిక విధానాల్లోనూ మార్పు తీసుకురావడంలో విఫలమయ్యాయనడం వాస్తవం. దేశీయ రైతాంగం తీవ్రంగా పోరాడింది కానీ నేటికీ వారి ఉద్యమాలు రెండు ప్రధాన డిమాండ్లకే కట్టుబడి ఉంటున్నాయి. అన్నిరకాల రుణాలను మాఫీ చేయడం, స్వామినాథన్‌ కమిషన్‌ ప్రతిపాదనల మేరకు వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను పెంచడం. ఇవి రెండూ చాలా అత్యవసరమైనవే. కానీ, సమాజంలోని ఇతర విభాగాలకు, రంగాలకు ప్రభుత్వాలు కేటాయిస్తున్న పెట్టుబడులను, అంది స్తున్న ఆర్థిక మద్దతును రైతు సంఘాలు అధ్యయనం చేసి, విశ్లేషించి బోధపర్చుకోకుంటే, ప్రభుత్వ విధానం ఫలితంగానే దేశీయ వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతోందన్న వాస్తవాన్ని గ్రహించడం అంత సులభం కాదని నా అభిప్రాయం. 

పరిశ్రమల కోసం వ్యవసాయం బలి
మన దేశ ఆర్థిక విధానాలు తొలి నుంచి వ్యవసాయాన్ని ఆర్థికంగా లాభదాయకం కాని విధంగా ఉద్దేశపూర్వకంగా మలుస్తున్నాయి. రైతుల పట్ల ప్రభుత్వాల బాదుడు మొదట్నుంచి ఇదేరకంగా కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌లో భవంతర్‌ భూగ్టన్‌ పథకం ప్రవేశపెట్టడం లేక వ్యవసాయ పంటల సేకరణపై తగు నిబంధనలు చేర్చకుండానే పంటలకు కనీస మద్దతు ధరను కాస్త అధికంగా ప్రకటించడం వంటి కొన్ని చెదురుమదురు పథకాలు తప్పితే వ్యవసాయ సంస్కరణలకు సంబంధించి మౌలిక మార్పులు ఏవీ చోటుచేసుకోవడం లేదు. దీనిఫలితంగా వ్యవసాయదారుల్లో అశాంతి అధికమవుతోంది. వ్యవసాయ రంగంలో ప్రశాంతతను నెలకొల్పాలంటే, రైతుల ముఖాల్లో చిరునవ్వులు చిందించాలంటే ప్రభుత్వ విధానాలను పూర్తిగా మార్చాల్సిందే. పైగా వ్యవసాయ భూమిని పరిశ్రమ రంగం సులభంగా, తాము కోరుకున్నవిధంగా చేజి క్కించుకోవడానికి తగినట్లుగా భూ చట్టాలను ఇష్ట్రపకారం మార్చివేయడం ప్రధాన సమస్యగా మారింది.

వాస్తవానికి ఆర్థిక సంస్కరణల కొనసాగింపు కోసం వ్యవసాయ రంగాన్ని బలిపెడుతున్నారు. రానున్న 2019 ఎన్నికలు మార్పు తీసుకురానున్నాయా? నాకయితే అలా అనిపించడం లేదు. ఇప్పటివరకు జరిగిందేదో జరిగిపోయింది లెమ్మని రైతులు గుర్తించి తగు కార్యాచరణకు దిగనట్లయితే, వారు మరింత దుర్భర పరిస్థితుల్లో కూరుకుపోవడం ఖాయం. అప్పుడు రైతులు తమను తాము తప్పుపట్టుకోవలసిందే. అన్ని రకాల పార్టీల రాజకీయ నాయకులు తమపై సులభంగా స్వారీ చేస్తుంటే గత 70 సంవత్సరాలుగా వ్యవసాయదారులు చూస్తూ ఉండిపోయారు. కుల, మత, రాజకీయ భావజాలాలకు అతీతంగా రైతులు మేల్కొని కేవలం రైతులుగా మాత్రమే తమ ఓటు వేసినప్పుడు మాత్రమే మన దేశ రాజకీయ వాతావరణం మారిపోతుంది. రైతులు తమ ఓటును రైతులుగా మాత్రమే వేసిన రోజున దేశ ఆర్థిక విధానాలు కూడా మారిపోతాయి. ఆరోజు ఎప్పుడొస్తుంది అనేది మన రైతుల చేతుల్లోనే ఉంది.


దేవిందర్‌శర్మ
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు

 

మరిన్ని వార్తలు