కరుగుతున్న హిమనదాలు

31 Jul, 2019 00:56 IST|Sakshi

విశ్లేషణ

అంతరించిపోయిన హిమానీనదానికి ఒక విషాద భావగీతం. అవును. ప్రస్తుతం ఐస్‌లాండ్‌ శాస్త్రజ్ఞులు సరిగ్గా దీనికే పథకం రచిస్తున్నారు. పశ్చిమ ఐస్‌లాండ్‌ ప్రాంతంలో కనుమరుగైపోయిన మొట్టమొదటి హిమానీనదానికి గుర్తుగా ఆగస్టు 18న ఒక స్మారక స్తూపం ఏర్పర్చడానికి రైస్‌ యూనివర్సిటీ, ఐస్‌లాండ్‌  దేశం కలిసి ప్లాన్‌ చేస్తున్నాయి. ఆ మంచుదిబ్బ పేరు ‘ఓకే’. ఆ స్మారకచిహ్నం ఫలకంపై పొందుపరుస్తున్న సందేశం మనందరినీ తీవ్రంగా హెచ్చరిస్తోంది. ‘హిమానీనదంగా తన ప్రతిపత్తిని కోల్పోతున్న మొదటి ఐస్‌లాండ్‌ మంచుదిబ్బ ఓకే. రాబోయే 200 ఏళ్లలో మన హిమానీనదాలన్నీ ఇదే మార్గం అనుసరించనున్నాయి. మనకు ఏం జరగబోతోందో, మనం ఏం చేయాల్సి ఉందో మనకు స్పష్టంగా తెలుసని ఈ స్మారకస్తూపం గుర్తు చేస్తోంది. మనం దాన్ని చేస్తామా అన్నది లేదా అనేది కూడా మనకే తెలుసు’’ 

మంచుదిబ్బలు కాదు కరుగుతున్నది భవిష్యత్తు!
ఐస్‌లాండ్‌  దేశంలోని ఓకే హిమానీనదం ఆ దేశం నుంచి అంతరించిపోతున్న తొలి మంచుదిబ్బ. కానీ ఇది చివరిదేమీ కాదు. వచ్చే 200 సంవత్సరాల్లో ఐస్‌లాండ్‌  దేశంలోని మంచుదిబ్బలన్నీ అంతర్థానం కానున్నాయని ఆ స్మారక స్తూప ఫలకం ప్రకటిస్తోంది. అయితే 30 ఏళ్ల తర్వాత అంటే 2050లో ఈ స్మారక స్తూప సందేశాన్ని చూడబోయే ప్రజలందరూ ఓకే హిమానీనదానికి ఆ గతి పట్టించినందుకు ప్రస్తుత తరాన్ని శపించడం ఖాయం. మంచుదిబ్బను కరగదీయడం ద్వారా అత్యంత వేడి, పొడి వాతావరణం కలిగిన భూగ్రహాన్ని మనం భవిష్యత్‌ తరాలవారికి అందించనున్నాం. ఈ ప్రపంచంలో సంతోషభరితంగా జీవించే అవకాశాన్ని, వారికి దక్కాల్సిన వాటాను మనం దూరం చేసేస్తున్నాం.

అంతరించిపోతున్న హిమానీనదాలకు స్మారకస్తూపాలను నెలకొల్పడం నిజంగానే అద్భుతమైన ఆలోచన. అలా మంచుదిబ్బలకు స్మారక స్తూపాలను నిర్మించడం సరైనదే అయినట్లయితే, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారతదేశం, నేపాల్, భూటాన్, చైనా దేశాల్లో విస్తరించిన హిమాలయ పర్వత శ్రేణుల పొడవునా మనం అనేక స్మారకస్తూపాలను నిర్మించవలసి ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద జలగోపురంగా పేరొందిన హిమాలయాలు భూమ్మీద లభిస్తున్న స్వచ్ఛమైన జలంలో 40 శాతాన్ని కలిగి ఉంటున్నాయి. కానీ ఇక్కడ 50,000 కంటే ఎక్కువ సంఖ్యలో మంచుదిబ్బలు శరవేగంతో కరిగిపోతున్నాయని యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ) వారి అంచనా. ఇవి అంతరిస్తున్న వేగాన్ని చూస్తుంటే, ఈ అత్యున్నత పర్వత శ్రేణికి ఇరువైపులా నివసిస్తున్న 130 కోట్లమంది ప్రజల జీవితాల్లో విధ్వంసం సృష్టించడం ఖాయమనే తెలుస్తోంది. 

మూడో ధ్రువం కరిగితే పెనుముప్పే
అంటార్కిటికా, ఆర్కిటిక్‌ ఖండాల తర్వాత అతిపెద్ద స్థాయిలో మంచును కలిగి ఉన్న మూడో భూభాగంగా హిమాలయాలు గుర్తింపు పొందాయి కాబట్టి దీనిని మూడవ ధ్రువ ప్రాంతం అని పిలుస్తున్నారు. అందుచేత భూగ్రహంలోని అంటార్కిటికా, ఆర్టిటిక్‌ ధ్రువప్రాంతాలే కాకుండా హిమాలయాలు కూడా వాటికి సమాన స్థాయిలో కరిగిపోయే ప్రమాదం స్పష్టంగానే కనిపిస్తోంది. అయితే హిమాలయాలు యూరోపియన్‌ ఆల్ఫ్స్‌ పర్వతాలతో సమాన వేగంలో కరిగిపోవడం లేదు. గత దశాబ్దకాలంలో ఆల్ఫ్స్‌ పర్వత శ్రేణిలోని అనేక హిమానీనదాలు పూర్తిగా అంతరించిపోయాయి. దక్షిణాసియాలో కంటే యూరప్‌లో చాలా త్వరగా ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభించడమే దీనికి కారణం కావచ్చు.

కాకపోతే, 2000 సంవత్సరం నుండి హిమాలయాలు ప్రతి సంవత్సరం ఒకటిన్నర అడుగు కంటే ఎక్కువ స్థాయిలో మంచును కోల్పోతున్నాయని ఇటీవలే కొలంబియా యూనివర్సిటీకి చెందిన లేమోంట్‌–డొహెర్తీ ఎర్త్‌ అబ్జర్వేటరీ నిర్వహించిన సమగ్ర అధ్యయనం భారత్‌లో ఆగ్రహావేశాలను ప్రేరేపిస్తుందని నేను ఊహించాను. దీనికి ముందుగా 1975 నుంచి 2000 సంవత్సరం వరకు హిమాలయాల్లో ప్రతి ఏటా 10 అంగుళాల మేరకు మంచు కరుగుతూ వచ్చింది. అయితే తాజా అధ్యయనం ఆసియాలోని పామిర్, హిందూ కుష్, టియాన్‌ షాన్‌ అత్యున్నత పర్వత శ్రేణులను తన పరిశీలనాంశంగా చేర్చలేదు. ఈ స్థాయిలో హిమాలయాలు కరుగుతూ రావడం మొత్తం ఆసియా ప్రాంతానికి విధ్వంసకరంగా పరిణమించనుంది. హిమాలయాల్లో హిమానీనదాలు ప్రమాదకరంగా కరిగిపోవడం జాతికి వాస్తవంగా షాక్‌ కలిగించాలి. ప్రత్యేకించి హిందీ ప్రాబల్య ప్రాంతంలోని ప్రజలకు ఇది భారీ నష్టాన్ని కలిగించనుంది. కానీ అరుదుగా కొన్ని పతాక శీర్షికల్లో ప్రస్తావించడం తప్పితే దేశప్రజల్లో ఈ పరిణామం ఎలాంటి ఆగ్రహాన్ని కలిగించలేదు. ఈ సమస్యను తమ సంపాదకీయాల్లో ప్రస్తావించడానికి తగినదేనని వార్తా పత్రికలు కనీసం ఆలోచించలేదు. ఇక టీవీ చానెల్స్‌ అయితే అసందర్భమైన రాజకీయ ప్రకటనలతో చొంగకార్చుకోవడంలో బిజీగా ఉండిపోయాయి.

చెన్నై జల సంక్షోభం నుంచి నేర్చుకోమా?
హిమాలయ ప్రాంతంలో విస్తరించిన 650 హిమానీనదాలపై సాధారణంగా ఉపగ్రహాలు తీసే ఫొటోలతోపాటు, అమెరికన్‌ గూఢచర్య ఉపగ్రహాలు తీసిన ఫొటోలను కూడా వర్గీకరించి చేసిన పై అధ్యయనం ప్రకారం ప్రతి సంవత్సరం హిమాలయాలు 800 కోట్ల లీటర్ల నీటిని కోల్పోతున్నాయని తెలిసింది. అంటే ప్రతి సంవత్సరం ఒలింపిక్‌ పరిమాణంలోని 32 లక్షల స్విమ్మింగ్‌ పూల్స్‌లలోని నీటికి సమానమైన నీటిని హిమాలయాలు కోల్పోతున్నాయి. దక్షిణ భారతదేశంలోని చెన్నయ్‌లో ఇటీవల సంభవించిన జల సంక్షోభం కలిగించిన షాక్‌ని చూస్తే హిమాలయాల్ని కప్పి ఉంచిన మంచు కరిగిపోతుండటం పట్ల మనందరం కూర్చుని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇది మనందరి భవిష్యత్తుతో ముడిపడిన సమస్య కాబట్టి, మన పిల్లలకు మనం విడిచివెళుతున్న జల రహిత ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల గురించి ప్రజలు తప్పకుండా ఆందోళన చెందాల్సి ఉంటుంది. బలమైన ప్రజాభిప్రాయం జాతి మొత్తాన్ని ప్రకంపింపచేయాలి. ఈ విషయమై భారత పార్లమెంటు కూడా అత్యవసర అర్ధరాత్రి సెషన్‌కు కూర్చోవాలి.

కానీ ఏమీ జరగలేదు. లభ్యమవుతున్న సాగునీటిలో 78 శాతం నీటిని వ్యవసాయ రంగం దుర్వినియోగపరుస్తోందని దెప్పడం మినహా, జీవితం సజావుగానే సాగిపోతోంది. ఈలోగా హిమాలయాల్లో భాగంగా ఏర్పడిన అతి ముఖ్యమైన సింధు, గంగ, బ్రహ్మపుత్ర నదీపరివాహక ప్రాంతాల్లో నీరు క్షీణించిపోతోందని కేంద్ర జల కమిషన్‌ అధ్యయనం హెచ్చరిస్తోంది. ఇవి ఈశాన్య భారత్, కొంతవరకు మధ్యభారత్‌ ప్రాంత ప్రజాజీవనానికి అత్యవసర వనరులు. కానీ ఇక్కడ కూడా నీటి లభ్యత తగ్గిపోతుండటం ఎవరూ గుర్తించడం లేదు. ఈ మూడు నదీ పరివాహక ప్రాంతాల్లో సగటున నీటి లభ్యత ఇప్పటికే 40 శాతం క్షీణించిపోయింది. ఇక నదీ పరివాహకప్రాంతం క్షీణించిపోవడంతో తూర్పు, ఉత్తర భారత ప్రాంతంలో 628 చదరపు కిలోమీటర్ల పొడవునా అడవులు హరించుకుపోయినట్లు 2015 అటవీ నివేదిక తెలిపింది

ఈ తరం తప్పులతో భవిష్యత్‌ తరాల బలి
ఇలాంటి పరిస్థితుల్లో ఎండిపోతున్న నదుల దిగువ ప్రాంతంలో వ్యవసాయాన్ని, పరిశ్రమలను, తాగునీటి వసతులను దెబ్బతీస్తున్న జల సంక్షోభం నేపథ్యంలో జీవనం సాగిస్తున్న వందల కోట్లమంది ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో హిమాలయన్‌ రాష్ట్రాలుగా పేరొందిన జమ్మూ– కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్, పశ్చిమబెంగాల్, మేఘాలయ, అసోం, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్‌లు తమ తమ ప్రాంతాల్లో నెలకొన్న కొండ ప్రాంతాల పరిరక్షణకు కలిసికట్టుగా ఒక విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయిదేళ్ల క్రితం కేదార్‌నాథ్‌లో సంభవించిన విధ్వంసం పునరావృతం కాకుండా అనువైన పథకాలు రూపొందించడం, నదీపరివాహక ప్రాంతాల పరిరక్షణకోసం సామూహికంగా మదుపులు పెట్టడంపై ఈ రాష్ట్రాలన్నీ దృష్టి సారించాల్సి ఉంది. పర్వతాలు అందించే పర్యావరణ వ్యవస్థ సేవలకు చెందిన ఆర్థిక విలువను మదింపు చేస్తున్న క్రమంలో నీరు, వృక్షాల పరిరక్షణ, నేల కోత నివారణ, వన్యమృగాల పరిరక్షణ వంటి సేవలను తప్పకుండా మిళితం చేయాలి.

వీటిని అంతిమంగా రాష్ట్రాల బడ్జెట్‌ అంచనాల్లో భాగం చేయాలి. పర్వతాలు అందించగలిగే ఆర్థిక సంపదను కొలిచే కొలమానం ఇదే. అభివృద్ధి పేరుతో ఇంతకాలంగా సాగిస్తూ వచ్చిన కొండల్ని కొల్లగొట్టే ప్రక్రియలకు వెంటనే చెల్లుచీటీ చెప్పాలి. పర్వత ప్రాంత రాష్ట్రాల అభివృద్ధికి ఇది నిజంగానే ఒక వినూత్న మార్గంగా ఉపయోగపడుతుంది. ప్రకృతి, పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడంపైనే పర్వత ప్రాంత రాష్ట్రాలు మనగలుగుతాయి. దీనికి తోడుగా మన పరిశోధనా విధానాలు కూడా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మైదాన ప్రాంతాల్లో సాగించే పరిశోధనా పద్ధతులను నకలు చేస్తూ పర్వతప్రాంతంలో మన యూనివర్సిటీలు యథాతథంగా అమలు చేయడంలో ఎలాంటి సంబద్ధతా లేదు.


దేవీందర్‌ శర్మ  
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా