మరో వ్యవసాయ విప్లవానికి బీజాలు

7 Mar, 2020 00:43 IST|Sakshi

విశ్లేషణ

భారత్‌లో మొదలుకానున్న తదుపరి వ్యవసాయ విప్లవం దేశీయ ప్రాధాన్యతల మీదే ఆధారపడి ఉండాలి. దాదాపు 60 కోట్లమంది ప్రజలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ  నేటికీ వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్న దేశంలో, ఇప్పటికే పట్టణప్రాంతాలో ఉపాధి అవకాశాలు ఆవిరైపోయి, నిరుద్యోగం 45 ఏళ్లలో కనీవినీ ఎరుగని స్థాయికి పెరిగి ఉన్న నేపథ్యంలో ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే వ్యవసాయాన్ని అమలు చేసినప్పుడే ఈ రంగంలో ప్రతిఏటా 12 లక్షల కొత్త ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు. అధిక సంఖ్యలో రైతులను పట్టణాలకు తరిమి వారిని రోజుకూలీ కార్మికులుగా మారుస్తున్న  విధానాలకు బదులుగా స్థానిక ఉత్పత్తిపై, స్థానికంగా ధాన్యసేకరణ, స్థానిక పంపిణీపై ఆధారపడిన ఆకర్షణీయమైన వ్యవసాయ నమూనాను అమలు చేయడం గురించి మన విధాన నిర్ణేతలు అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

యువతీయువకులు పూర్తిగా తమ ఆశలు, ఆకాంక్షలను వ్యక్తపరిచే వయస్సులో పంజాబ్‌లోని బర్నాలా జిల్లాకు చెందిన 22 ఏళ్ళ రైతు కూడా తనకున్న కొద్దిపాటి భూమిని విజయవంతమైన వెంచర్‌గా మార్చడానికి ప్రయత్నించారు. ఇప్పటికే రూ. 8 లక్షల రుణ భారంతో, తమ కుటుంబంలో వ్యవసాయం ప్రమాదఘంటికలను మోగిస్తోందని తెలిసినప్పటికీ, ఆ యువరైతు ఈ సవాలును చేపట్టాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయ వాణిజ్యం అనేది అనేక ప్రమాదాలతో కూడి ఉందని తెలుస్తున్నప్పటికీ సంవత్సరానికి రూ.50 వేల అద్దె చొప్పున మరో 8 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. కానీ 2017లో ఏపుగా పెరిగిన తన గోధుమ పంట ఆకస్మికంగా వచ్చిపడిన తుపానుకు దెబ్బతినిపోయింది. తన కలలు చెల్లాచెదురయ్యాయి. తనకు తగిలిన ఎదురుదెబ్బల నుంచి ఇక కోలుకోలేకపోయాడు. తీసుకున్న రుణం చెల్లించలేకపోయాడు. అప్పుఇచ్చినవారు వచ్చి గొంతుమీద కూర్చున్నారు. చివరకు ప్రాణాలు తీసుకోవడం తప్ప మరే దారీ లేదనుకున్నాడు.

అతడి పేరు లవ్‌ప్రీత్‌ సింగ్‌ తన వ్యవసాయ కుటుంబంలో మూడుతరాల్లో ప్రాణాలు తీసుకున్న అయిదో వ్యక్తి కావడం గమనార్హం. ఒకటిన్నర సంవత్సరం క్రితం తన తండ్రి కుల్వంత్‌ సింగ్‌ తనకు తాను ఉరివేసుకున్నాడు. అంతకుముందే తన తాత కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక పంజాబీ వ్యవసాయ కుటుంబంలో మూడు తరాలకు చెందిన వారు వ్యవసాయరంగ దుస్థితి కొనసాగింపు కారణంగా బలైపోయారు. అంటే మన దేశంలో వ్యవసాయరంగ సంక్షోభం ఎంత పాతుకుపోయిందో తెలుస్తోంది. చాలామంది ఇప్పటికీ నమ్మలేకపోవచ్చు కానీ హరిత విప్లవానికి కేంద్రంగా నిలిచిన పంజాబ్‌ మెల్లగా రైతుల ఆత్మహత్యల మృత్యుశయ్యగా మారిపోయింది. 

పంజాబ్‌లోని మూడు ప్రభుత్వరంగ విశ్వవిద్యాలయాలు జరిపిన అధ్యయనం ప్రకారం 2000 నుంచి 2015 వరకు పంజాబ్‌లో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, కూలీల సంఖ్య 16,606 అని తేలింది. రాçష్ట్రంలో ప్రతి ముగ్గురు రైతుల్లో ఒకరు దారిద్య్ర రేఖకు దిగువన ఉంటున్నారు. మహారాష్ట్రలో 2013–18 మధ్య ఆరేళ్లలో 15,356 మంది వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. జాతీయ స్థాయిలో 2016లో మొత్తం 11,379 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి ప్రతి ఏడాది జరుగుతున్న ఈ వరుస ఆత్మహత్యలు పంటపొలాల్లో మృత్యుదేవత విలయతాండవాన్ని నిత్యం ప్రదర్శిస్తూనే ఉన్నాయి.

రైతుల ఆత్మహత్యలు వ్యవసాయ రంగంలోని దుస్థితికి ప్రతి బింబం కాగా, దానికి దేశవ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్న ఆర్థిక రంగ విధానాల ఫలితమే కారణమని చెప్పాలి. ఆర్థిక సంస్కరణలు చెల్లుబాటు కావడానికి దేశంలో ఆహార ధరలను మొదటినుంచి తగ్గించివేశారు. వ్యవసాయ పంటల ధరలను క్షేత్రస్థాయిలో తగ్గిస్తే వినియోగదారులకు సరసమైన ధరల్లో అందించవచ్చు. పైగా రాజకీయ ప్రాథమ్యంలో భాగంగా పరిశ్రమకు ముడిపదార్థాల సరఫరా నిరంతరం తక్కువ ధరల్లో లభించేలా చూడవచ్చు. ఈ క్రమంలో ఆర్థిక భారం మొత్తంగా రైతులకు బదలాయించవచ్చు. వ్యవసాయరంగ నిజ ఆదాయాలు దశాబ్దాలుగా స్తబ్దంగా ఉండటం లేక మరిం తగా పతనమవుతున్న నేపథ్యంలో వాస్తవానికి పోటీని మొత్తంగా రైతులకు వ్యతిరేకంగా ఫిక్స్‌ చేస్తున్నారు.

హరిత విప్లవం ప్రారంభమైన 50 ఏళ్ల తర్వాత 2016 ఆర్థిక సర్వే చేదు వాస్తవాన్ని ముందుకు తీసుకొచ్చింది. దేశంలోని 17 రాష్ట్రాల్లో సగటు వ్యవసాయ కుటుంబం సగటు ఆదాయం సంవత్సరానికి రూ. 20 వేలుగా మాత్రమే ఉంటోంది. అంటే నెలకు రైతు సగటు ఆదాయం రూ.1,700లు మాత్రమే. ఏడాదికేడాది మన దేశ రైతు కుటుంబాలు ఇంత తక్కువ ఆదాయంతో ఎలా మనుగడ సాధిస్తున్నాయన్నది నివ్వెరపరుస్తుంది. అయితే ఆర్థిక సర్వే తెలిపింది సైతం రైతు అమ్ముతున్న పంటమీద వచ్చిన ఆదాయం మాత్రమే కాదు. గృహవినియోగం కోసం వారు ఆదా చేస్తున్న పంటను కూడా కలుపగా వచ్చే ఆదాయం అన్నమాట. వ్యవసాయ సంక్షోభం ఎంత లోతుగా ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ ఆదాయాలు రానురాను పడిపోతున్నాయని అనేక ఇతర  అధ్యయనాలు కూడా తెలుపుతున్నాయి.

భారతదేశంలో చిన్న కమతాలు అధికంగా ఉన్నాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే సన్నకారు రైతుల సమిష్టీకరణ జరిగితే రైతులకు బేరమాడే శక్తి పెరుగుతుంది. దీంతోపాటు వ్యవసాయ ఖర్చులను సామూహికంగా పంచుకోవడం, మెరుగైన వనరులు అందుబాటులోకి రావడం జరిగి రైతుపరిస్థితి బాగుపడుతుంది. రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా కానీ, సహకార వ్యవసాయం ద్వారా కానీ చిన్నకమతాలు అభివృద్ధిపథంలో ముందుకెళతాయి. దృక్పథం ఏదైనప్పటికీ రైతులకు లాభదాయకంగా ఉండే ధరలను కల్పించడటమే ఆదాయ భద్రతను కల్పిస్తుంది. రైతుల ఆదాయం, సంక్షేమం కోసం జాతీయ కమిషన్‌ని ఏర్పర్చడం ద్వారా దీన్ని సాధించవచ్చు. రైతు అందుకునే కనీస ఆదాయం ప్రభుత్వంలోని అత్యంత దిగువ తరగతిలో ఉన్న ఉద్యోగి పొందే కనీస ఆదాయం కంటే తక్కువగా ఉండకూడదన్నది దృష్టిపెట్టుకోవాలి. సమాజంలోని ఇతర సెక్షన్లతో ఆదాయాల్లో సమానత్వాన్ని తీసుకురావడం జరగాలంటే ప్రత్యక్ష నగదు మద్దతు, కొరత చెల్లింపులు అనేవి మంచి ప్రయత్నాలుగానే చెప్పాలి. ఏ దశలోనూ మార్కెట్లలోని అస్థిరత్వానికి రైతులు బలికాకూడదు.

పాశ్చాత్య దేశాల్లోని వ్యవసాయ విధానాల భారతదేశ వ్యవసాయ రంగానికి అవసరం లేదు. భారత్‌లో మొదలుకానున్న తదుపరి వ్యవసాయ విప్లవం దేశీయ ప్రాధాన్యతల మీదే ఆధారపడి ఉంటుంది. దాదాపు 60 కోట్లమంది ప్రజలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ  నేటికీ వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్న దేశంలో, ఇప్పటికే పట్టణప్రాంతాలో ఉపాధి అవకాశాలు ఆవిరైపోయి, నిరుద్యోగం 45 ఏళ్లలో కనీవినీ ఎరుగని స్థాయికి పెరిగి ఉన్న నేపథ్యంలో ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే వ్యవసాయాన్ని అమలు చేసినప్పుడే ఈ రంగంలో ప్రతిఏటా 12 లక్షల కొత్త ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు. అప్పుడు వ్యవసాయంపై అత్యధిక జనాభా ఆధారపడటం పెద్దగా భారమేమీ కాదు. అధిక సంఖ్యలో రైతులను పట్టణాలకు తరిమి వారిని రోజుకూలీ కార్మికులుగా మారుస్తున్న  విధానాలకు బదులుగా స్థానిక ఉత్పత్తిపై, స్థానికంగా ధాన్యసేకరణ, స్థానిక పంపిణీపై ఆధారపడిన ఆకర్షణీయమైన వ్యవసాయ నమూనాను అమలు చేయడం గురించి మన విధాన నిర్ణేతలు అర్థం చేసుకోవలసి ఉంది.

మహాత్మాగాందీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా స్వావలంబనతో కూడిన వ్యవసాయ విప్లవానికి పథక రచన చేయడం చాలా ప్రాథాన్యత కలిగివుంటుంది. ప్రజారాశుల కోసం ఉత్పత్తి వ్యవస్థను ఏర్పర్చడం కాకుండా ప్రజారాశుల ద్వారా ఉత్పత్తి వ్యవస్థను ఏర్పర్చే పద్ధతి భారత్‌కు అవసరమని గాంధీ అప్పట్లోనే చెప్పారు. దేశంలోని సన్నకారు రైతులు ఆరోగ్యకరమైన ఆహార వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే కోట్లాది వ్యవసాయదారుల జీవితాన్ని నిలబెట్టడానికి ప్రధమ ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వికసించాలంటే, అన్నిటికంటే ముందుగా చేయవలసింది వ్యవసాయాన్ని లాభదాయకంగా, చెల్లుబాటయ్యే విధంగా మల్చాల్సి ఉంటుంది. ఇది జరగాలంటే ఆర్థిక పురోగతి పేరిట వ్యవసాయాన్ని బలిపెడుతున్న విధానాలను దాటి పాలకులు ఆలోచించగలగాలి. ప్రభుత్వ రంగ మదుపులపై కోత విధించి వ్యవసాయ ధరలను కుదించి, బలవంతంగా వ్యవసాయ రంగనుంచి రైతులను తప్పించి నగరాలకు వలస వెళ్లేలా చేస్తున్న ప్రస్తుత విధానాలు స్వావలంబనతో కూడిన వ్యవసాయ అభివృద్ధికి ఏమాత్రం సరిపోవు.

ఆంధ్రప్రదేశ్‌ ఈ వైపుగా ఒక మార్గాన్ని ఇప్పటికే చూపించింది. కమ్యూనిటీ పరంగా నిర్వహిచే స్వావలంబనతో కూడిన వ్యవసాయం, దానికనుగుణంగా జీరో బడ్జెట్‌ సహజ వ్యవసాయ విధానాల ద్వారా ఏపీలో ఇప్పటికే 5 లక్షలమంది రైతులు పునరుత్పాదక వ్యవసాయ విధానాలవైపు మొగ్గు చూపారు. అలాగే ఈశాన్య భారతాన్ని ఆర్గానిక్‌ వ్యవసాయ హబ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. వ్యవసాయ, పర్యావరణ అనుకూల సేద్య విధానాలను క్రమంగా దేశంలోని మిగతా ప్రాంతాలకు కూడా అనువర్తింపజేయాలి. అలాంటి పరివర్తన జరగాలంటే కచ్చితంగా సవాలుతో కూడుకుని ఉంటుంది. కానీ స్వావలంబన, ఆర్థికపరంగా లాభదాయకతతో కూడిన సరికొత్త వ్యవసాయ విప్లవం మాత్రమే దేశీయ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజం చేయగలుగుతంది. నెల్సన్‌ మండేలా అన్నట్లు ఏ పనైనా సరే పూర్తి చేసేంతవరకు అది అసాధ్యమైనది గానే కనిపిస్తుంది.

దేవీందర్‌ శర్మ
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

>
మరిన్ని వార్తలు