వృద్ధి కొలబద్దలు మారాల్సిందే!

1 Nov, 2017 00:59 IST|Sakshi

విశ్లేషణ
బహుశా మన ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి తెలిసి ఉండకపోవచ్చుగానీ, ప్రపంచంలో ఇప్పుడు మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ మంత్ర జపాన్ని విడనాడే ధోరణి పెరుగుతోంది. మన విధానకర్తల ఆర్థిక వృద్ధి కొలబద్ధలు మారక తప్పదు. ఎంత మంది ప్రజలను పేదరికం నుంచి బయట పడేస్తున్నాం, ఎంత మంది ఆకలిగొన్న ప్రజల కడుపులు నింపుతున్నాం, రైతు ఆత్మహత్యల సంఖ్య క్షీణత ఎంత, ఎన్ని ఎక్కువ ఉద్యోగాలను సృష్టించాం, తదితర కొలబద్ధలతో మన ఆర్థిక మంత్రి సైతం ఆర్థిక వృద్ధిని కొలిచే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను.

ముందుగా ఒక సంగతి చూద్దాం. ఖరీఫ్‌ పంట మార్కెట్లకు వచ్చినప్పటి నుంచి ధరలు దారుణంగా పడిపోయాయి. దేశవ్యాప్తంగా రైతులు ఉత్పత్తి వ్యయాలనైనా రాబట్టుకోలేక పోతున్నారు. దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో రైతు ఆందోళనలు సాగుతున్న వార్తలు రాకుండా వారం గడవడం కష్టమౌతోంది. రైతు ఆత్మహత్యలు అంతమయ్యే జాడే లేదు. వ్యవసాయరంగ దైన్యస్థితి మరింత అధ్వానం కావడం కొనసాగుతూనే ఉంది.

సెప్టెంబర్‌–అక్టోబర్‌ మధ్య వ్యవసాయ ధరలు తక్కువగానే ఉన్నాయి. సెప్టెంబర్‌ 27న దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల ధరలను ముందుగా పోల్చి చూద్దాం. ఈ ఉదాహరణ, ధరల వల్ల రైతులకు ఎలాంటి దెబ్బ తగులుతోందనే విషయాన్ని స్థూలంగా తెలుపుతుంది. మధ్యప్రదేశ్‌లోని హర్దా, మందసౌర్‌ మార్కెట్లలో సోయాబీన్‌ మోడల్‌ (నమూనా) ధరలు క్వింటాలు రూ. 2,600 నుంచి రూ. 2,880 వరకు ఉండేంతగా పతనమయ్యాయి. కాగా, కనీస మద్దతు ధర (బోనస్‌తో కలసి) క్వింటాలుకు రూ.3,050. అంటే రైతులు ప్రతి క్వింటాలు అమ్మకంలో రూ. 400 నుంచి రూ. 500 వరకు నష్టపోయారు. ఇక మినుములకు వస్తే కనీస మద్దతు ధర (బోనస్‌తో కలసి) క్వింటాలుకు రూ. 5,400 కాగా, మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌ మార్కెట్‌ ధర రూ. 3,725గా ఉంది. అది, రాజ స్తాన్‌లోని కోట మార్కెట్లో రూ. 3,850గా, కర్ణాటకలోని బీదర్‌ మార్కెట్లో రూ. 4,180గా, మహారాష్ట్రలోని అకోలా మార్కెట్లో రూ. 4,410గా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న మినప రైతులకు సగటున క్వింటాలుకు రూ.1,000 నుంచి రూ.1,800 వరకు నష్టం వాటిల్లింది. ఈ ధోరణి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏటికేడాది ఎక్కువ పంట తీయడం కోసం రైతులు చెమటోడుస్తూనే ఉన్నారు. పంటలు పండించడానికి తాము చేస్తున్నది నష్టాల సాగు మాత్రమేనని వారు గుర్తించడం లేదు.

వృద్ధి పథంలో ఆకలి కేకల దేశం
కొన్ని రోజుల క్రితమే అంతర్జాతీయ ఆహార విధాన పరి శోధనా సంస్థ (ఐఎఫ్‌పీఆర్‌ఐ) వార్షిక గ్లోబర్‌ హంగర్‌ (జీహెచ్‌ఐ) ఇండెక్స్‌ను విడుదల చేసింది. జీహెచ్‌ఐ (ప్రపంచ ఆకలి సూచిక)లో మన దేశం మూడు మెట్లు కిందకు దిగజారింది. 119 దేశాలకు ఇచ్చిన ర్యాంకింగ్‌లలో పరిస్థితి ‘విషమం’గా ఉన్న వర్గంలో 100వ స్థానంలో ఉత్తర కొరియా, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి. వాటి కంటే మనం ఆకలిని నిర్మూలించడంలో తీసికట్టుగా ఉన్నామని తేలింది. ఈ జీహెచ్‌ఐని విడుదలచేసే సమయానికే జాతీయ పోషకాహార పర్యవేక్షణా సంస్థ (ఎన్‌ఎన్‌ఎమ్‌బీ), దేశం తెలుసుకోవాలని కోరుకోని కఠోర వాస్తవికతను సైతం మన ముందుంచింది. గ్రామీణ భారతం నేడు, 40 ఏళ్ల క్రితం కంటే తక్కువగా తింటూ, అర్ధాకలితోనే మిగిలిపోయింది. ఆ నివేదిక ప్రకారం, ‘‘సగటున, 1975–79తో పోలిస్తే, గ్రామీణ భారతీయుడు నేడు 550 కేలరీలను తక్కువగా తీసుకుంటున్నాడు. మాంసకృత్తులు 13 మిల్లీ గ్రాములు, 5 మిల్లీ గ్రాములు ఇనుమును, కాల్షియం 260 మిల్లీ గ్రాములు, విటమిన్‌–అను 500 మిల్లీ గ్రాములు తక్కువగా తీసుకుంటున్నాడు.’’ 70 శాతం జనాభా నివసించే గ్రామీణ భారత్‌ తక్కువగా తినడం ఆందోళనకరం.

సాగుకు తావులేని ఆర్థిక చింతన
మూడేళ్ల లోపు పిల్లలకు రోజుకు 300 మిల్లీ లీటర్ల పాలు అవసరం. కానీ ఆ వయసు పిల్లలు తాగుతున్నది రోజుకు 80 మిల్లీ లీటర్ల పాలనే. గ్రామీణ స్త్రీ, పురుషులలో 35 శాతం పోషకాహార లోపంతో బాధపడుతుండటానికి, 42 శాతం పిల్లలు బరువు తక్కువగా ఉండటానికి కారణం ఏమిటో ఈ గణాంక సమాచారం వివరి స్తుంది. సగటున రోజుకు 2,400 కేలరీల శక్తి ప్రతి ఒక్కరికీ మౌలికంగా అవసరం. కానీ, గ్రామీణ జనాభాలో 80 శాతం, పట్టణ జనాభాలో 70 శాతం అంత ఆహారాన్ని తినే స్తోమత లేనివారని ఒక జాతీయ వ్యయ సర్వే చెబుతోంది. ఇటీవల ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, ఆర్థిక వృద్ధికి ప్రేరణను ఇవ్వడం కోసం ఆర్థిక ఉద్దీపనా పథకాన్ని ప్రారంభిస్తూ ఢిల్లీలో ఓ పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా జైట్లీ ఏం మాట్లాడారో మీరు విని వుంటే, ఆ గంటన్నర సమావేశంలో ఆయన నోట ‘వ్యవసాయం’ అనే మాటైనా రాకపోవడాన్ని మీరు గమనించే ఉంటారు. 83,677 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ. 6.92 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనా పథకాన్ని, బ్యాంకులకు రూ. 2.11 లక్షల కోట్ల భారీ బెయిలవుట్‌ను (ఆదుకునే నిధి) ప్రకటించారు. బ్యాంకుల వద్ద పెండిం గ్‌లో ఉన్న కార్పొరేట్‌ మొండి బకాయిలను రద్దు చేయడమే దీని ప్రాథమిక లక్ష్యం. మరోవిధంగా చెప్పాలంటే, జనాభాలో దాదాపు 60 శాతానికి ఉపాధిని కల్పిస్తున్న వ్యవసాయరంగం అతి తీవ్ర సంక్షోభంలో ఉన్నా, అది ప్రభుత్వ ఆర్థిక చింతనలో ఎక్కడా కనిపించలేదు. 

చింతలేని విధానకర్తలు
వృద్ధి పథంలో ఉన్నానని చెప్పుకుంటున్న దేశంలో ప్రమాదకర స్థాయిలలో అలముకొని ఉన్న ఆకలి... ఆర్థిక మంత్రిత్వశాఖలోని అధికారులకు ఎలాంటి బెంగనూ కలిగించడం లేదు. గ్రామీణ ప్రాంతంలోని రైతులు రోజు విడిచి రోజు చనిపోతున్నా ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తల అంతరాత్మలకు చీమ కుట్టినట్టు అనిపించడం లేదు. వారి దృష్టిలో ఆర్థిక వృద్ధి అంటే మరిన్ని మౌలిక వసతులను నిర్మించడం మాత్రమే. పేదరికం, ఆకలి నిర్మూలనకు ఎక్కువ సమర్థవంతమైన పని వ్యవసాయరంగంపై ఎక్కువ పెట్టుబడిని పెట్టడమేనని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసి తేల్చింది. దాన్ని వారు చదివి ఉండరు. ప్రధాన రహదార్ల నిర్మాణం కోసం ఇస్తున్న రూ. 6.92 లక్షల కోట్ల ఉద్దీపనా పథకాన్ని వ్యవసాయ రంగానికి ఇచ్చి ఉంటే ఏమౌతుందో ఊహించండి. అది ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేసే ఊపును ఇవ్వడమే కాదు, రాకెట్‌ వేగంతో ఎగిసేలా చేయడానికి ఉపయోగపడేది. అది కోట్లాది మంది జీవనోపాధిని బలోపేతం చేసేది, ఆకలి కోరల నుంచి బయటపడేసి ఉండేది. బహుశా ఆత్మహత్యల ఉధృతిని తగ్గించగలిగేది.

ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రభుత్వ బ్యాంకులకు రూ. 2.11 లక్షల కోట్ల భారీ రీకాపిటలైజేషన్‌ నిధిని ప్రకటించారు. అది, మరింత డబ్బును సమకూర్చడం ద్వారా కంపెనీల భారీ మొండి బకాయిలను రద్దు చేయడానికే. అందుకు బదులుగా బ్యాంకులకు ఆ భారీ బెయిలవుట్‌ను దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ రుణాల మాఫీ లక్ష్యంతో ఇచ్చినట్టయితే... క్షీణించిపోతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలు ఎక్కించగలిగి ఉండేవారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని వ్యవసాయ రుణాల బకాయిలను మాఫీ చేయడం వల్లనే దాదాపు 1.8 కోట్ల రైతు కుటుంబాలకు మేలు చేయగలిగేవారు. ఈ 1.8 కోట్ల కుటుంబాలు వస్తువులకు డిమాండ్‌ను సృష్టించి, ఆర్థిక వ్యవస్థ చక్రాలను పరుగులు తీయించగలిగేవి. 

మార్కెట్‌ మంత్రానికి కాలం చెల్లింది
వాస్తవానికి మౌలిక సమస్య, గత కొన్ని దశాబ్దాలుగా సృష్టించిన లోపభూయిష్టమైన ఆర్థిక చింతనే. ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణ్యన్‌ కార్పొరేట్‌ రుణ మాఫీయే ఆర్థిక వృద్ధి అని పలుమార్లు నిస్సిగ్గుగా ప్రకటించారు. విధానకర్తలు ఆర్థికవృద్ధిని అర్థం చేసుకునేది ఈ దృష్టితోనే. అయితే, అదే వ్యవసాయ రుణాలను మాఫీ చేయడానికి వచ్చేసరికి మన రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌... అది ప్రమాదకరమని, జాతీయ బడ్జెట్‌ సమతూకాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. రైతులకు ఇచ్చే రుణ మాఫీ ఫిస్కల్‌ (కోశ) లోటుకు దారితీస్తుంది. బ్యాంకులకు ఇచ్చే రూ. 2.11 లక్షల కోట్లు మాత్రం ఫిస్కల్‌ లోటు లెక్కల్లోకి రావు! 

బహుశా ఆర్థిక మంత్రికి తెలిసి ఉండకపోవచ్చుగానీ, ప్రపంచం ఇప్పుడు మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ మంత్ర జపాన్ని రోజురోజుకూ మరింత ఎక్కువగా విడనాడుతోంది. 37 ఏళ్ల జసిందా ఆర్డెర్న్‌ నూతనంగా ఎన్నికైన న్యూజిలాండ్‌ ప్రధాన మంత్రి. ఆమె తన తొలి ఇంట ర్వ్యూలో ‘‘మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ మన ప్రజలను విఫలం చేసింది... తగినంత తిండిలేని పిల్లలు మన ఇళ్లలో ఉన్నారంటే అది సుస్పష్టమైన వైఫల్యమే’’ అన్నారు. ఆర్థిక వృద్ధి కొలబద్దలు మారాల్సి ఉంది. తమ ప్రభుత్వం కనీస వేతనాలను పెంచుతుందని, బాల పేదరికం తగ్గుదల లక్ష్యాలను చట్టంగా చేస్తుందని, అందుబాటులో ఉండే గృహాలను వేలాదిగా నిర్మిస్తుందని ఆర్డెర్న్‌ వాగ్దానం చేశారు. ఎంత మంది ఎక్కువగా ప్రజలను పేదరికం నుంచి బయట పడేస్తున్నాం, ఎంతమంది ఆకలిగొన్న ప్రజల కడుపులు నింపుతున్నాం, రైతు ఆత్మహత్యల సంఖ్య క్షీణత ఎంత, ఎన్ని ఎక్కువ ఉద్యోగాలను సృష్టించామనే కొలబద్దలతో మన ఆర్థిక మంత్రి సైతం ఆర్థిక వృద్ధిని కొలిచే రోజు కోసం ఎదురు చూస్తున్నాను.

- దేవిందర్‌శర్మ
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌:  hunger55@gmail.com

 

మరిన్ని వార్తలు