విషపు జల్లుల్లో కూలి బతుకులు

18 Oct, 2017 00:58 IST|Sakshi

విశ్లేషణ

పురుగు మందు డబ్బాలపై ముద్రించి ఉండే ప్రాణాంతక మోతాదు సంగతి ఎలా ఉన్నా, ఈ రసాయనాలు ప్రాణాంతకమైనవనేది మాత్రం వాస్తవం. కాబట్టి వాటిని అత్యంత జాగ్రత్తగా వాడాలి. కానీ, మొహానికి మాస్క్‌ను ధరించి మందు చల్లుతున్న కూలీని మీరు ఎప్పుడైనా చూశారా? చేతులకు తొడుగులు తొడుక్కుని మందు చల్లుతున్న కూలీలను సైతం నేను చూడలేదు. మందు చల్లే కూలీలు అన్ని రక్షణ ఉపకరణాలను ధరించి ఉండటం తప్పనిసరి చేసి ఉంటే మహరాష్ట్ర విషాదాన్ని నివారించగలిగి ఉండేవారమే.

పెస్టిసైడ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా వారు 1980ల మధ్య ఒకసారి నన్ను క్షేత్ర స్థాయి పర్యటనకు తీసుకువెళ్లారు. వాళ్లు పంట పొలాల్లో తిప్పి, క్రిమిసంహారక మందులను చల్లే వ్యవసాయ కూలీలకు ఎలాంటి రక్షణ ఉపకరణాలను సమకూరుస్తున్నారో చూపించారు. పొలాల్లో పురుగు మందు చల్లుతున్న వ్యవసాయ కూలీలు సురక్షితమైన దుస్తులను ధరించి, చేతులకు తొడుగులు, ముఖానికి మాస్క్‌ (ముసుగు), కాళ్లకు గమ్‌బూట్లు (మోకాళ్ల కింది పిక్కల వరకు ఉండే బూట్లు) వేసుకుని, తలకు టోపీ పెట్టుకుని కనిపించారు. ఆ దృశ్యం చూస్తుంటే వారి ఆరోగ్య సంరక్షణపై భరోసా కలిగింది.

నలభై ఏళ్లయినా అదే దుస్థితి
దాదాపు నలభై ఏళ్ల తర్వాత, మహారాష్ట్రలో 50 మంది వ్యవసాయ కూలీలు క్రిమిసంహారక మందుల విషప్రభావం వల్ల చనిపోయారని భావిస్తున్నారనే వార్త చదివి నిర్ఘాంతపోయాను. మరో 80 మంది బాధితులను రాష్ట్రం లోని వివిధ ఆసుపత్రులలో చేర్పించినట్టు కూడా తెలిసింది. వారిలో దాదాపు 25 మంది కంటి చూపును కోల్పోగా, మరో 25 మంది అత్యవసర ప్రాణరక్షణ వ్యవస్థల సహాయంతో చావుబతుకుల మధ్య కొట్లాడుతున్నారు. ఈ విషాదాన్ని రైతు, సామాజిక కార్యకర్తలు ప్రాచుర్యంలోకి తేవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగానే ఆయినా విచారణకు ఆదేశించింది. మృతుల దగ్గరి బంధువులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా సహాయాన్ని కూడా ప్రకటించింది. 

ఇంచుమించుగా గత 40 ఏళ్లుగా పరిస్థితి పెద్దగా ఏం మారలేదనేది స్పష్టమే. మనుషుల ప్రాణాలంటే లెక్కలేని పరిస్థితి దేశమంతా ఉన్నందున ఒక్క మహారాష్ట్ర ప్రభుత్వాన్నే ఎందుకు ఎందుకు తప్పు పట్టాలి? ప్రత్యేకించి పేదల్లోకెల్లా కడుపేదల బతుకులపై దుష్ప్రభావాన్ని చూపి, తరచుగా ప్రాణనష్టానికి దారి తీసే లేదా శాశ్వత అంగవైకల్యాలను కలుగజేసే పరిస్థితుల గురించి సమాజానికి ఇసుమంతైనా పట్టింపు ఉండదు.
క్రిమిసంహారక మందుల పరిశ్రమ, రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు కలసి మందులు చల్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ కూలీలను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని చేపట్టి ఉండాల్సింది. మందు చల్లడానికి పొలంలోకి దిగడానికి ముందే కూలీలు అన్ని రక్షణ ఉపకరణాలను ధరించి ఉండటం తప్పనిసరి చేసి ఉండాల్సింది. అదే జరిగి ఉంటే మహారాష్ట్ర విషాదాన్ని నివారించగలిగి ఉండేవారమే. 

విషంలో మునిగి తేలుతూ...
బీటీ పత్తి పంట రెండేళ్లుగా భయంకరమైన బోలు పురుగు తెగులును తట్టుకోవడంలో విఫలం కావడమే మహారాష్ట్ర విషాదానికి ప్రధాన కారణం. దీని ఫలితంగానే రైతులు బోలు పురుగు పీడను వదిలించుకోవాలని ప్రాణాంతకమైన మందుల మిశ్రమాలను చల్లడానికి పాల్పడ్డారు. 

పురుగు మందులన్నీ విషాలే. క్రిమిసంహారిణుల డబ్బాలపై ముద్రించి ఉండే ‘లీథల్‌ డోస్‌ 50’ (ప్రాణాంతక మోతాదు) స్థాయి సంగతి ఎలా ఉన్నా, ఈ రసాయనాలు ప్రాణాంతకమైనవనేది మాత్రం వాస్తవం. కాబట్టి వాటిని అత్యంత జాగ్రత్తగా వాడాలి. కానీ, వ్యవసాయ కూలీ ఎవరైనా మొహానికి మాస్క్‌ను ధరించి మందులు ^è ల్లడాన్ని మీరు ఎప్పుడైనా చూసి ఉంటారా? మొహానికి మాస్క్‌ సంగతి మరచిపోండి, చేతులకు తొడుగులు తొడుక్కుని మందు చల్లుతున్న కూలీలను సైతం నేను చూడలేదు. నేను అన్యాయంగా ఆలోచిస్తున్నానని మీరు అనుకునేట్టయితే... మీరు ఈసారెప్పుడైనా రహాదారుల వెంట పోయేటప్పుడు మీ వాహనాన్ని ఎక్కడైనా ఆపి, పంటపై మందు చల్లుతున్న వ్యవసాయ కూలీని చూడండి. 

ఈ విషయానికి సంబంధించి రైతు తప్పు కూడా ఉంది. మందులను చల్లేది ఎప్పుడూ రోజు కూలీ శ్రామికులే. కొద్దిమంది రైతులు మాత్రమే కూలీలు తప్పక ముందు జాగ్రత్తలు తీసుకునేలా చేస్తారు. సాధ్యమైనంత త్వరగా పని పూర్తి చేసేయమని వారు కూలీలను తొందరపెడతారు తప్ప, వాళ్ల రక్షణ గురించి, ఆరోగ్యం గురించి ఏ మాత్రం చింత పడరు. శరీరంలోకి ఇంకిపోయే పురుగు మందుల అవశేషాలు హానికరమైన ప్రభావాలను చూపడానికి కొంత కాలం పడుతుంది. అప్పటికల్లా శ్రామికుడు పని పూర్తి చేసుకుని, డబ్బు తీసుకు వెళ్లిపోతాడు. అత్యధిక సందర్భాల్లో ఆ శ్రామికుడ్ని ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకు వెళ్లేటప్పుడు సైతం అతని అనారోగ్యానికి కారణం పురుగు మందులేననేది కూడా తెలియదు. 

వాస్తవానికి, పురుగు మందు విషంవల్ల సంభవించే మరణాలు రైతు మరణాలుగా దాదాపుగా ఎప్పుడూ లెక్కలోకి రావు. 

పురుగు మందు ఎప్పుడు ఎలా చల్లాలి?
పురుగు మందులు చల్లే పనిని తప్పనిసరిగా ఉదయాన్నే గానీ లేదా సాయంత్రం పొద్దుపోయాక గానీ చేయాలి. ఆ ముందు జాగ్రత్తను తీసుకోవాలని పురుగు మందుల నిబంధనలు చెబుతాయి. కానీ, చాలా అరుదుగానే ఆ వేళలను పాటిస్తుంటారు. ఉదాహరణకు, రుతువులను బట్టి ఉదయం 6–8 గంటల మధ్య కాలం లేదా సాయంత్రం 6 గంటల తర్వాత పురుగు మందులు ^è ల్లే పనిని చేపట్టడం ఉత్తమం. కారణం చాలా సామాన్యమైనదే. ఒకటి, ఉదయం వేళల్లో బలమైన గాలులు వీచే అవకాశం తక్కువ. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ పురుగు మందు రసాయనం మరింత ఎక్కువ విషపూరితం అవుతుంది. అంత ఉదయాన్నే కూలీలు దొరకరు కాబట్టి మందు చల్లే పనులను మధ్యాహ్నం వేళల్లో చేపట్టడం అనివార్యమౌతుంది. మహారాష్ట్రలోని వ్యవసాయ కూలీలు ఏకధాటిన 8 నుంచి 10 గంటలపాటూ పురుగు మందులు చల్లాల్సి వస్తోందని ప్రాథమిక విచారణ తెలిపింది. 

గాలి వీస్తున్న దిశగానే కూలీ కూడా పురుగు మందు చల్లుతూ పోవాలి. ఇలా చేయడం వల్ల పురుగు మందు శ్రామికునికి అతి తక్కువగా చెరుపు జరుగుతుందని హామీ ఉంటుంది. ఈ జాగ్రత్తను పాటించడం కూడా నేను ఎక్కడా చూడలేదు. గాలి దిశ ఎటు వీస్తున్నా రైతు మాత్రం పని పూర్తి కావాలనే హడావుడిలోనే ఎప్పుడూ ఉంటాడు. ఇంతకంటే అధ్వానంగా, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు టమాటా పంటకు 15 నుంచి 20 సార్లు పురుగు మందు చల్లిస్తుండటాన్ని చూశాను. ఆ పని చేసే కూలీల్లో చాలా మంది నేపాలీలు, ఈశాన్య రాష్ట్రాల వలస కూలీలు. అంతగా పురుగు మందులు చల్లడం ఎందుకంటే ఒక రైతు, మార్కెట్‌ డిమాండ్‌ను బట్టి అలా చేయడం అవసరం అవుతోందని చెప్పాడు. 

క్రిమిసంహారక మందుల కంపెనీలు మందు ప్యాకెట్లలో చేతి తొడుగులను కూడా ఉంచుతున్న మాట నిజమే. చేతి తొడుగులతో పాటూ, టోపీ, మొహానికి మాస్క్‌లను కూడా తప్పని సరిగా ప్రతి ప్యాకెట్‌లోనూ ఉంచడాన్ని తప్పనిసరి చేయాలి. శ్రామికుల కోసం గమ్‌ బూట్లను కొని ఉంచాలని రైతులకు నిర్దేశించాలి. ప్రతి రైతూ తన పొలం వద్ద కొన్ని జతల గమ్‌ బూట్లను ఉంచేలా చూసే బాధ్యత వ్యవసాయ అధికారులదే. హానికరమైన క్రిమిసంహారక మందుల వాడకం, చల్లడానికి సంబంధించి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి శిక్షణ శిబిరాలను కలసి నిర్వహించాలని క్రిమిసంహారక మందుల కంపెనీలకు, వ్యవసాయ శాఖలకు నిర్దేశించాలి.

పురుగుమందు లేని సేద్యమే పరిష్కారం
వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కూడా ఈ విషయంలో ముఖ్య పాత్రను పోషించాల్సి ఉంది. విశ్వవిద్యాలయాలు వాడవచ్చని చెప్పిన తర్వాతనే ఏ పురుగు మందుకైనా అనుమతులను జారీ చేస్తారు. ఇలా అనుమతులను మంజూరు చేసే క్రమంలోనే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను కూడా పేర్కొనాలి. కంపెనీలు వాగ్దానం చేసిన వాటికి కట్టుబడటంలో విఫలమైతే... వాటి మార్కెటింగ్‌ హక్కులను ఉపసంహరించుకునే నిబంధన కూడా ఉండాలి. పురుగు మందు రసాయనాలను వాడేవారికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు తెలిసి ఉండేలా చేయడానికి కంపెనీలు హామీని కల్పిం చాలి. 

అదే సమయంలో, వ్యవసాయ శాస్త్రవేత్తలు రసాయనిక క్రిమిసంహారిణులు తక్కువగా అవసరమయ్యే లేదా అవసరమేలేని పంటలపై దృష్టిని కేంద్రీకరించాలి. ఉదాహరణకు, ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం (ఐఆర్‌ఆర్‌ఐ) ‘‘ఆసియా వరి పంటకు క్రిమిసంహారక మందులను వాడటం కాలాన్ని, పనిని వృ«థా చేసే చర్య మాత్రమే’’ అని తేల్చి చెప్పింది. ఆ సంస్థ వరి పరిశోధనలో ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. ఫిలిప్పీన్స్‌లోని సెంట్రల్‌ లూజాన్‌ ప్రాంతం, వియత్నాం, బంగ్లాదేశ్, భారత్‌లు రసాయనిక క్రిమిసంహారిణులను వాడకుండానే అత్యధిక దిగుబడులను సాధించవచ్చని నిరూపించాయని సైతం ఆ సంస్థ తెలిపింది. అయినాగానీ, దాదాపు 45 పురుగుమందులను వరి పంటపై చల్లుతున్నట్టు తెలిసింది. ఇది ఎలాంటి శాస్త్రీయ తర్కానికైనా విరుద్ధమైన పనే. అయినా వరి పంటపై పురుగు మందులు చల్లటాన్ని పూర్తిగా మానేయాలని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఎందుకు సూచించలేకపోతున్నాయి?

వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
దేవిందర్‌శర్మ
ఈ–మెయిల్‌: hunger55@gmail.com

మరిన్ని వార్తలు