అప్పుడే విశాఖ రాజధాని

18 Feb, 2020 05:01 IST|Sakshi

సందర్భం

అత్యధిక మంది తెలుగు మాట్లాడే జిల్లాలతో కూడిన ప్రత్యేక ‘ఆంధ్రరాష్ట్రం’ ఏర్పడాలనే భాషాపరమైన సెంటిమెంటును ఇరవయ్యవ శతాబ్ది రెండవ దశాబ్ది ఆరంభం నుండి వ్యాప్తిగావించడంతో బాటు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోవాలని తీవ్రంగా ఉడుంపట్టుబట్టిన వారిలో ‘ఉత్తర సర్కారు’ జిల్లాల నాయకులు ముఖ్యులు. వారి కోరిక, ఒత్తిడుల కారణంగా 1953 నాటి కేంద్రప్రభుత్వం అక్టోబర్‌ ఒకటవ తేదీ 1953న ‘ఆంధ్రరాష్ట్రం’ను ఏర్పరచింది. దీని కొనసాగింపుగా ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభలోని తెలుగు జిల్లాల ఎమ్మెల్యేలు (140 మంది) మూజువాణి ఓటుతో కర్నూలును రాజధానిగా (1937 శ్రీబాగ్‌ ప్రకారం) నిర్ణయించడం జరిగింది. గుంటూరులో హైకోర్టు పెట్టారు. 

ఆనాటికి ఆంధ్రరాష్ట్రంలో, ముఖ్యంగా నాలుగు మధ్య ఆంధ్ర జిల్లాల్లో, మరీ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అన్ని పార్టీల నాయకుల్లో, మరింత ప్రధానంగా ఆ జిల్లాల కాంగ్రెస్‌ (43 మంది శాసనసభ్యులు), కమ్యూనిస్ట్‌ (20 మంది శాసనసభ్యులు) నాయకుల్లో ఒకవైపు విజయవాడ–గుంటూర్లను ఆంధ్రరాష్ట్ర రాజధానిగా ఏర్పరచుకోవాలనే ఆకాంక్ష, ఆలోచన; మరోవైపు ఉమ్మడి ఏపీని, దాని రాజధానిగా హైదరాబాద్‌ను ఏర్పరచుకోవాలనే ఆలోచన ఉండేది. కానీ, అప్పటి ‘హైదరాబాద్‌ స్టేట్‌’లోని తెలంగాణ వారిలో మాత్రం ఉమ్మడి ఏపీ ఏర్పాటు, దానికి రాజధానిగా హైదరాబాద్‌ ఉండడం వంటి ఆలోచనలు 1953 నాటికి ఉండేవి కాదు. అయినప్పటికీ, సర్కారు జిల్లాల నాయకులు, ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులు కర్నూలు నుండి రాజధానిని మార్చాలని ఆంధ్ర రాష్ట్రం, రాజధాని కర్నూలు పుట్టిన రెండు నెలలలోపే తీవ్రంగా ప్రయత్నించడం జరిగింది. ఆలస్యం చేస్తే ఎలాంటి మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయో అన్నట్లు నాటి కర్నూలులోని శాసనసభ పలు దఫాలుగా, ‘ఆంధ్రరాష్ట్ర రాజధాని విషయంగా’ చర్చలు జరిపి, నవంబర్‌ ముప్పయ్‌ 1953న కర్నూలు రాజధాని మార్పు గురించి తీర్మానం చేసింది. 

అందులో, ఏప్రిల్‌ ఒకటవ తేదీ 1956 వరకు మాత్రమే కర్నూలులో రాజధానిని ఉంచాలని, ఆ తరువాత విశాఖపట్టణాన్ని శాశ్వత రాజధాని  చేయాలని తీర్మానించారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 61 ఓట్లు, ప్రతికూలంగా 58 ఓట్లు రాగా, తటస్థులుగా 20 మంది (కమ్యూనిస్టులు) ఉన్నారు. ఉమ్మడి ఏపీ, దాని రాజధానిగా హైదరాబాదు ఏర్పాటు జరుగుతాయోలేదో తెలియకముందే మూడేళ్ల ముందే కర్నూలు రాజధానిని మార్చడంపై అసెంబ్లీ నిర్ణయం తీసుకోవడం జరిగింది.  

ఇలా, రాజధానిపై, 1953లో మద్రాసులో ఒకసారి, కర్నూలులో మరోసారి అసెంబ్లీ చర్చించడం, ఒకసారి కర్నూలును, మరోసారి విశాఖను రాజధానిగా నిర్ణయించడానికి కారణం పంతొమ్మిదవ శతాబ్దిలో గోదావరి, కృష్ణా నదులపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యాక అక్కడి నాలుగు జిల్లాల్లో మెరుగైన ఆర్థిక, సాంఘిక మార్పులు జరగడం వలన ఆంధ్రరాష్ట్రం ఏర్పరచుకోవాలని కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులు భావించడం, విజయవాడ, గుంటూర్లలో రాజధానిని ఏర్పరచుకొని ఆంధ్రరాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర నిర్వహించాలనే బలమైన కోరిక వారిలో ఉండడమే. కానీ విజయవాడ, గుంటూరులు రాజధానిగా ఎన్నుకోకపోవడంతో ఆ జిల్లాల వారు ఉమ్మడి ఏపీ ఏర్పాటుపై కేంద్రీకరించి, తమకు అనుకూలంగా ఉన్న హైదరాబాద్‌ను రాజధానిగా చేసుకోవడం జరిగింది. 

అంటే, 1937 నాటి శ్రీబాగ్‌ ప్రకారం పొందిన కర్నూలు రాజధాని, లేదా, ఒక ప్రభుత్వపాలనా విభాగాన్ని తిరిగి పొందాలని, నవంబర్‌ ముప్పయ్‌ 1953న అసెంబ్లీ తీర్మానం ప్రకారం, విశాఖ పొందిన శాశ్వత రాజధానిని తిరిగి పొందాలని, అదే నవంబర్‌ ముప్పయ్‌ 1953న వస్తుందనుకొన్న రాజధానిని తిరిగి విజయవాడ, గుంటూర్లకు రావాలని మూడు ప్రాంతీయుల్లోనూ ఆకాంక్ష ఉంది. ఈ ఆకాంక్షలన్నీ తీర్చడానికే నేటి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమరావతిలో లెజిస్లేచర్‌ విభాగాన్ని, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ విభాగాన్ని, కర్నూలులో జ్యుడీషియల్‌ విభాగాన్ని ఏర్పరచడానికి అసెంబ్లీలో నిర్ణయించడం జరిగింది. ఇలా చేస్తే ఆయా ప్రాంతాల అభివృద్ధికి కూడా ఊతం ఇస్తాయని ఆయన భావించడం జరిగింది.  


డా‘‘ దేవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి
రిటైర్డ్‌ ప్రొఫెసర్, చరిత్రశాఖ, ఎస్వీ యూనివర్సిటీ

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా