గాంభీర్యం మాటున ఓటమి భయం

20 Mar, 2019 00:22 IST|Sakshi

డేట్‌లైన్‌ హైదరాబాద్‌ 

ఎన్నికలలో గెలవడం కోసం ఏమయినా చెయ్యొచ్చు అని నమ్మే చంద్రబాబు తన మాటలు నమ్మి జనం మోసపోరని, ఈ ఎన్నికల్లో ఘోరపరాజయం తప్పదని అర్థం అయ్యాక కొత్త ఎత్తులు వేయడం మొదలు పెట్టారు. అటు కాంగ్రెస్‌తో, ఇటు పవన్‌ కల్యాణ్‌తో, వీరూ సరిపోరని కేఏ పాల్‌తో కూడా లోపాయికారీగా పొత్తు కుదుర్చుకుని రహస్య ఎజెండాలతో గట్టెక్కాలని విఫలయత్నం చేస్తున్నా తన విజయంపై నమ్మకం కలగడం లేదు. అందుకే పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా, ముఖంలో సంతోషం తెచ్చిపెట్టుకున్నా ఆయన మాటలు మాత్రం ఓటమి భయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఏదేదో మాట్లాడుతున్న బాబు చేస్తున్నది సంధిప్రేలాపనే.

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ట్విట్టర్‌లో ఒక మంచి మాట చెప్పారు..  ‘ఓటమి తప్పనిసరి అని తెలిసిపోయినప్పుడు ఎంతటి  అనుభవశాలి అయినా ఉలికిపడతాడు, వణికిపోతాడు, కాబట్టి చంద్రబాబునాయుడి ప్రస్తుత నిరాధార ప్రకటనల పట్ల నాకేమీ ఆశ్చర్యం కలగడం లేదు’ అని. ‘అయ్యా బిహార్‌ రాష్ట్రం పట్ల మీకున్న వ్యతిరేకతను చాటుకునే అభ్యంతరకర భాషను వాడటం కంటే ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలు మీకు మళ్ళీ ఎందుకు ఓట్లు వెయ్యాలి అనే అంశం మీద దృష్టి పెడితే బాగుంటుంది’ అని కూడా పీకే (ప్రశాంత్‌ కిశోర్‌) చంద్ర బాబుకు హితవు చెప్పారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవంతో 60 ఏళ్ళుగా కష్టపడుతున్నానని పదే పదే చెప్పుకునే చంద్రబాబుకు వచ్చే మూడు వారాల్లో జరగబోయే ఎన్నికలలో ఘోర పరాజయం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నట్టున్నది.

అందుకే అర్థం పర్థంలేని మాటలు మాట్లాడుతు న్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ నేర రాజకీయాలు చేస్తున్నాడని, ప్రశాంత్‌ కిషోర్‌ బిహార్‌ బందిపోటు అని మొన్న ఒంగోలులో మాట్లా డుతూ అన్నారు. ఇదే కేసీఆర్‌ పార్టీతో పొత్తు కోసం తాను స్వయంగా వెంపర్లాడిన విషయం, ఇదే ప్రశాంత్‌ కిశోర్‌ తన తాజా మిత్రులు కాంగ్రెస్‌ వారి కోసం ఇటీవలే పంజాబ్‌ ఎన్నికల్లో పని చేసిన విషయం, అక్కడ పీకే టీం చెప్పినట్టే కాంగ్రెస్‌ గెలిచిన విషయం మరిచిపోయి మాట్లాడుతారు బాబు. మరిచిపోతారు అనడం కంటే జనమే అన్నీ మరిచిపోతారులే అనుకుని మాట్లాడుతారు అనాలి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా, ముఖంలో సంతోషం తెచ్చిపెట్టుకున్నా బాబు మాటలు మాత్రం ఓటమి భయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఏదేదో మాట్లాడుతున్నారు, ఏవేవో పనులు చేస్తున్నారు.

సౌమ్యుడు, సీనియర్‌ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య జరిగితే సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు కనీసం సంతాపం తెలపలేదు. పైగా తన ప్రభుత్వమే నియమించిన సిట్‌ ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూ ఉండగానే వివేకానందరెడ్డిని జగన్‌మోహన్‌ రెడ్డే చంపేశాడని బహిరంగ సభలో ఆరోపణ చేసి, అది జనం నమ్మాలని అనుకునే మనిషి చంద్రబాబు. సాక్షాత్తు రాష్ట్ర సీఎం ఇట్లా మాట్లాడితే దర్యాప్తు చేస్తున్న ఆయన కింది అధికారుల మీద ఆ మాటల ప్రభావం ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. ముద్రగడ ఆందోళన సందర్భంలో తునిలో రైలు తగలబెట్టిన సంఘటనలో, ఆ తరువాత విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్‌ మీద హత్యాప్రయత్నం సంఘటనలో కూడా ఆయన వాటిపట్ల కనీస విచారం వ్యక్తం చెయ్యక పోగా దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా ప్రకటనలు చేశారు.

తుని రైల్‌ ఘటనకు కడప రౌడీలు కారణం అని, విమానాశ్రయంలో దాడికి వైఎస్‌ఆర్‌సీపీ అభిమానే బాధ్యుడని, ఇప్పుడు వివేకానందరెడ్డిని జగన్‌ చంపేసాడని అలవోకగా అబద్ధాలు ఆడేస్తారు ఆయన. ఎన్ని అబద్ధాల యినా అది జనాన్ని నమ్మించాలి, అట్లాగే పదేపదే అవే అబద్ధాలు ఆడితే జనం నమ్మేస్తారు అన్నది ఆయన అభిప్రాయం. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది, జనం తనను నమ్మడం లేదు అని అర్థం అయి నట్టుంది బాబుకు. వియ్యంకుడు, ఎన్టీఆర్‌ కుమారుడు బాలకృష్ణతో తన ఇమేజ్‌ను గొప్పగా చూపించేందుకు ఓ సినిమా తీయించి అది జనానికి ఎక్కకపోవడంతో తన అసలు స్వరూపం బయటపెట్టే రాంగోపాల్‌ వర్మ సినిమా బయటికి రాకుండా చూడటానికి సకల ప్రయత్నాలు చేస్తున్నా రాయన. ఎన్నికల సముద్రంలో మునిగిపోతూ ఈ గడ్డిపోచను ఆధా రంగా పట్టుకొని ఈదాలనుకున్నారు.

ఎన్నికలలో గెలవడం కోసం ఏమయినా చెయ్యొచ్చు అని నమ్మే చంద్రబాబు తన మాటలు నమ్మి జనం మోసపోరని అర్థం అయ్యాక కొత్త ఎత్తులు వేయడం మొదలు పెట్టారు. రాజకీయ జీవితంలో ఎన్నడూ తాను ఒంటరిగా పోటీ చేసిన చరిత్ర లేదు. ఈసారి మాత్రం బయటకి కనిపించడానికి ఒంటరిగా పోటీ చెయ్యక తప్పని పరిస్థితి. తమకు వ్యతిరేకులు అనిపించిన వారందరి ఓట్లూ తొలగించే ప్రయ త్నంతో బాటు, వాళ్ళను బెదిరించి, భయపెట్టి ఓట్లు వెయ్యకుండా చూసేందుకు పోలీసుల సాయంతో చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపు.. మరోవైపు రాజకీయ పక్షాలతో రహస్య ఒప్పందాలు. మొదటినుండి అన్ని ఎన్నికలలో స్నేహం చేసిన బీజేపీతో ఇప్పుడు కలిసిపోయే పరిస్థితి లేదు కాబట్టి బయటికి ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నట్టు నమ్మిస్తూ లోపాయికారీగా ఢిల్లీలో కమలం పెద్దలతో దోస్తీ కొనసాగిస్తున్నారు.

తెలంగాణ ప్రయోగం బెడిసికొట్టడంతో కాంగ్రెస్‌తో ప్రత్యక్ష సంబం ధాలు పెట్టుకుంటే ఏపీలో పుట్టి మునుగుతుంది కాబట్టి ఆ పార్టీతో రహస్య ఒప్పందం. ఆ ఒప్పందంలో భాగమే అరకు నుండి కిషోర్‌ చంద్ర దేవ్, కర్నూల్‌ నుండి కోట్ల సూర్య ప్రకాష్‌ రెడ్డి, తిరుపతి నుండి పనబాక లక్ష్మిని లోక్‌సభకు తెలుగు దేశం తరఫున పోటీ చేయించడం. ఇది కొత్త తరహా పొత్తు. బీజేపీ, కాంగ్రెస్‌ రెండింటికీ సమాన దూరం పాటిస్తున్నా నని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఈ కొత్త తరహా పొత్తులు బహుశా చంద్రబాబు ఒక్కరికే సాధ్యం అనుకోవాలి.

ఇక అన్నిటికన్నా ముఖ్యమైన ఎత్తుగడ పవన్‌ కల్యాణ్‌ జనసేన. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో యువ రాజ్యం బాధ్యుడిగా కాంగ్రెస్‌ వాళ్ళ పంచెలు ఊడదీస్తానని ప్రగల్భాలు పలికి పార్టీ ఘోర పరాజయం తరువాత కనుమరుగు అయిపోయిన పవన్‌ 2014లో మళ్ళీ మోదీ బాబుల మిత్రుడిగా ప్రత్యక్షం అయ్యాక నాలుగేళ్ల పాటు అక్కడ క్కడ, అప్పుడప్పుడు కనిపించి నాలుగు మాటలు మాట్లాడిపోయేవారు. రాష్ట్రాన్ని విడగొడితే పదకొండు రోజులు అన్నం తినలేదన్న దగ్గరి నుండి తన సినిమా పనుల కోసం కేసీఆర్‌ గొప్ప నాయకుడు, తెలం గాణ ఉద్యమం అద్భుతం అని పొగిడి, మళ్ళీ ’అయ్యా కేసీఆర్‌ మా ఆంధ్రప్రదేశ్‌ను వదిలెయ్యండి’ అనే వరకూ జనసేన నేత రాజకీయ విన్యాసాలు చూశాం. చంద్రబాబు, ఆయన సుపుత్రరత్నం అవినీతి పరులు అన్న నోటితోనే అయ్యో చంద్రబాబును ఒంటరిని చేసి అందరూ వేధిస్తారా అనేవరకూ పవన్‌ రహస్య ఎజెండా జనానికి అర్థం కాదను కున్నట్టున్నారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడటం లేదనుకుందట.

175 శాసనసభ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకూ ఒకేసారి ఇడుపులపాయ నుండి అభ్యర్థులను ప్రకటించేసి ప్రచార క్షేత్రంలోకి వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి వెళ్లిపోతే తెలుగుదేశం, జనసేన తదితర పార్టీలు ఇంకా పూర్తి జాబితాలు ప్రకటించలేని స్థితిలో ఎందుకు ఉన్నాయి? ఇంకా ఎక్కడ ఎవరిని నిలబెడితే వైఎస్‌ఆర్‌ సీపీకి నష్టం చెయ్యగలమా అనే ఆలోచనల్లో ఉన్నట్టున్నారు. జనసేన, ఉభయ కమ్యూనిస్ట్‌ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి, తాజాగా ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం మాయావతి పార్టీ బీఎస్పీ వచ్చి ఆ కూటమిలో చేరింది. ఏపీకి సంబంధించినంత వరకు కమ్యూనిస్ట్‌ పార్టీలు ఇప్పుడు ఇంగువ కట్టిన గుడ్డలే అయినా ఒకప్పుడు బలమయిన శక్తి. మాయావతి పార్టీ ఉనికే ఏపీలో కానరాదు. అయినా పవన్‌ జనసేన పొత్తుల్లో భాగంగా కమ్యూనిస్ట్‌ పార్టీల కంటే ఎక్కువ స్థానాలు బీఎస్పీకి ఇచ్చారు. పాపం కమ్యూనిస్ట్‌లు కిక్కురుమనకుండా సర్దుకుపోయే స్థితి.

జనసేన కూటమిలోకి మాయావతిని తన జాతీయ సంబంధాల ద్వారా చంద్ర బాబే తీసుకువచ్చారని చెపుతున్నారు. పవన్‌కల్యాణ్‌ను ప్రయోగించి కాపుల ఓట్లు, మాయావతిని ప్రయోగించి దళితుల ఓట్లు చీల్చి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు నష్టం చెయ్యాలన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తున్నది. ఆ వర్గాల ఓట్లు తనకు ఎట్లాగూ రావన్న విషయం ఆయనకు అర్థం అయిపోయింది మరి. మరో పక్క ప్రజాశాంతి పార్టీ పేరిట చంద్రబాబు మరో బినామీ మత ప్రచారకుడు కేఏపాల్‌ను క్రిస్టియన్‌ మైనారిటీల ఓట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు పోకుండా నిరోధించేందుకు తెర మీదకు తెచ్చారు.

ఇన్ని చేస్తున్నా బాబుకు ఎన్నికల అనంతర దృశ్యం కళ్లముందు సాక్షాత్కరిస్తున్నట్టున్నది, తాజాగా జేడీ లక్ష్మీనారాయణను తెర మీదకు తెచ్చారు. జేడీ ఆయన ఇంటి పేరు కాదు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి కుట్రపూరితంగా జగన్‌ని కేసులలో ఇరికించినప్పుడు ఆ కేసుల విచారణకు సీబీఐ అధికారిగా ఉన్న లక్ష్మీనారాయణది అందులో జాయింట్‌ డైరెక్టర్‌ హోదా. అందుకే జేడీ అంటారు. భారతదేశ పౌరులు ఎవరయినా రాజకీయాల్లోకి రావచ్చు, అట్లాగే జేడీ లక్ష్మీనారాయణ కూడా. కానీ ఆయన గురించి చర్చ ఎందుకంటే స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసల బోధనలను గురించి మాట్లాడి సమాజానికి విలువలను గురించి ఉపన్యాసాలు ఇచ్చి, రాజకీయాల్లో అవినీతిని తూర్పారబట్టి సొంత పార్టీ పెడతానని చెప్పి చివరికి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. చివరి నిమిషం దాకా టీడీపీలోనే చేర తారని ప్రచారం జరిగినా అది వ్యతిరేక ప్రభావం చూపేటట్టుంది కాబట్టి జనసేనలోకి పంపించి అక్కడి నుంచి పోటీకి దింపుతున్నారు అని అర్థం అయిపోయింది. 

చంద్రబాబు నాయకత్వంలో రాహుల్‌గాంధీ, పవన్‌ కల్యాణ్, కమ్యూనిస్ట్‌లు, కేఏ పాల్, జేడీ లక్ష్మీనారాయణలతో కూడిన కూటమికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మధ్య  ఏప్రిల్‌ 11న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగబోతున్నాయని అర్థం అవుతూనే ఉన్నది. ఏపీ ప్రజలకు ఈ విషయం అర్థం కాలేదనుకుందామా? ప్రజలకు అర్థం అయింది కాబట్టే ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఆ మాటలు అన్నాడు. ఎన్నో ఎన్నికలు చూసిన అనుభవం కదా ఆయనది కూడా.


దేవులపల్లి అమర్‌
datelinehyderabad@gmail.com 

మరిన్ని వార్తలు