‘చంద్రుల’ కల నెరవేరేనా?

25 Apr, 2018 00:57 IST|Sakshi

డేట్‌లైన్‌ హైదరాబాద్‌

బీజేపీతో తెగతెంపులు చేసుకున్న దగ్గరి నుంచీ చంద్రబాబు నిద్రలేని రాత్రులే గడుపుతున్నారు. రాత్రంతా కన్న పీడ కలలనే రోజంతా ఉపన్యాసాలలో ‘కేసులు పెడతారేమో, వేధిస్తారేమో’ అన్న మాటలతో తిరిగి జనానికి చెపుతున్నారు. మరోవైపున ఎన్ని సర్వేలు చేయించుకున్నా తెలంగాణలో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని అధికారపక్షానికి అర్థమవుతోంది. అందుకే కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక కూటమి సక్సెస్‌ కోసం కేసీఆర్‌ పడరాని పాట్లు పడుతున్నారు. ఎవరి వల్లనయితే లాభం పొందారో, వారినే ఓడించాలన్న స్థితి తెలుగు సీఎంలది.

రెండు తెలుగు రాష్ట్రాలు , ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు బలమైన కోరి కలు. ఇద్దరు చంద్రుల రెండు వేర్వేరు కోరికల్లో ఏదో ఒక కోరికే తీరే అవకాశం ఉంది. ఎవరి వల్లనయితే లాభం పొందారో, ఎవరి నిర్ణయాల కారణంగా తాము అధికారంలోకి వచ్చారో వారినే ఓడించాలన్న కోరిక ఆ ఇద్దరు ముఖ్యమంత్రులదీ. వచ్చే నెల 12వ తేదీన జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి. అక్కడి ఎన్నికలు రెండు జాతీయ పార్టీలకూ జీవన్మరణ సమస్యే. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసి ఈ నాలుగేళ్ల కాలంలో కొంతమేరకు పుంజుకున్న కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటకలో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవడం ఆ పార్టీ నైతిక స్థయిర్యానికి అత్యంత అవసరం కాగా, మసకబారుతున్న ప్రతిష్టను నిలబెట్టుకోడానికి కర్ణాటకలో గెలవడం బీజేపీకి అంతకన్నా ఎక్కువ అవసరం. సర్వేలు కర్ణాటక ఫలితం హంగ్‌ అవుతుందని చెపుతున్నా ఎవరి ఆశలు వాళ్ళవి, ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి. 

పోటీదారులకంటే ‘చంద్రు’లకే టెన్షన్‌
ప్రత్యక్షంగా పోటీ పడుతున్న బీజేపీ కాంగ్రెస్‌ పార్టీల కంటే కర్ణాటక ఎన్నికల ఫలితం కోసం అత్యంత ఉద్విగ్న క్షణాలు గడుపుతున్నది చంద్రబాబునాయుడు, చంద్రశేఖర్‌రావులే. రెండుసార్లూ బీజేపీ సహాయంతోనే అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు కర్ణాటకలో బీజేపీ ఓడిపోవాలని కోరిక. తెలం గాణ రాష్ట్రం ఇచ్చిన, రాష్ట్ర సాధన కారణంగా ప్రజలు తనను గెలిపించిన చంద్రశేఖరరావుకు అదే కాంగ్రెస్‌ ఓడిపోవాలన్న కోరిక. (కాంగ్రెస్‌ నిర్ణయం కారణంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయాన్ని ఒప్పుకోను అంటే కుటుంబ సమేతంగా ఎందుకు సోనియాగాంధీ ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపి వచ్చారో కేసీఆర్‌ వివరణ ఇచ్చుకోవాలి).
చంద్రబాబు గత ఏడాది గుజరాత్‌ శాసనసభ ఎన్నికల సమయంలోనే బీజేపీ ఓడిపోవాలని చాలా కోరుకున్నారు. తన శక్తి మేరకు ప్రయత్నం కూడా చేశారు. అయినా అత్తెసరు మార్కులతో బీజేపీ అక్కడ బయటపడటం బాబుకు మింగుడు పడని విషయమే. గుజరాత్‌ ఎన్నికలకూ, కర్ణాటక ఎన్నికలకూ మధ్య బీజేపీతో తెగతెంపులు చేసుకున్న దగ్గరి నుంచీ చంద్రబాబు నిద్రలేని రాత్రులే గడుపుతున్నారు. రాత్రంతా కన్న పీడ కలలనే రోజంతా ఉపన్యాసాలలో ‘కేసులు పెడతారేమో, వేధిస్తారేమో’ అన్న మాటలతో తిరిగి జనానికి చెపుతున్నారు.

ఓడించాలి.. అయినా రాజీ చేసుకోవాలి
మనం తప్పులు చెయ్యకపోతే భయపడటం ఎందుకు అని చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం ఆయన చుట్టూ ఉన్నవాళ్ళలో ఒక్కరికయినా లేదాయె. కర్ణాటకలో ఓడిపోతే తప్ప బీజేపీ దూకుడును అడ్డుకోవడం సాధ్యం కాదన్న ఆలోచన కారణంగానే బాబులో ఆ కోరిక రోజురోజుకూ మరింత బలపడుతున్నది. బీజేపీ ఓడిపోవాలని  కోరుకుంటూనే మరో పక్క అదే పార్టీతో మళ్లీ సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు ఆయన మానలేదు. ఏ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా ఒక ‘సేఫ్‌ ప్యాసేజ్‌’ ఏర్పాటు చేసుకోవడం ఆయనకు అలవాటే. 2004–2014 మధ్యకాలంలో కూడా ఆయన యూపీఏ హయాంలో కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్నానని చెపుతూనే కేంద్రంలో కొందరు పెద్దలతో సంబంధాలు నెరపిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడూ ఎన్డీయేలో ఆ ‘సేఫ్‌ ప్యాసేజ్‌’ ఏర్పాటు చేసుకునే మరోవైపు పోరాటం చేస్తున్న పోజులు మీడియాకి ఇస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోతే ఇక విజృభించవచ్చు అన్నది ఆయన ఆలోచన.

ఆయన కల నెరవేరుతుందో లేదో కానీ పీడకలలు మాత్రం ఆయనను వదలడం లేదు. నిన్నటికి నిన్న ద్వారపూడిలో మాట్లాడుతూ మీరంతా నా చుట్టూ ఉండి నన్ను రక్షించుకోవాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. శాసనసభలో మాట్లాడుతూ కూడా నన్ను వేధిస్తారేమో అన్నారు. ఒకరోజు దీక్షలో వచ్చిన వాళ్ళందరి చేతా కాళ్లు మొక్కించుకున్న ఉదంతం ఆయనలో పెరిగిపోయిన లేదా పేరుకుపోయిన ఆత్మన్యూనతకు నిదర్శనం. కాళ్ళు మొక్కుతున్న వాళ్ళను కనీసం వారించే ప్రయత్నం కూడా చెయ్యని చంద్రబాబు తన బావమరిది, శాసనసభ్యుడు బాలకృష్ణ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని వచ్చీరాని పిచ్చి హిందీలో దుర్భాషలాడుతుంటే తన్మయంగా వింటూ ఉండిపోయారు. 

పొంచివున్న ప్రమాదంతో కలవరం
కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ ఇటీవలి రెండు తెలుగు రాష్ట్రాల పర్యటన, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రితో భేటీ, రెండు రాష్ట్రాల పోలీసు డైరెక్టర్‌ జనరల్‌లతో సమావేశం వంటివి చూసిన వాళ్లకు, ఈ మధ్య బీజేపీ వారు ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లలో జరిగిన అవినీతి మీద సీబీఐ విచారణ జరిపించాలని పదే పదే డిమాండ్‌ చెయ్యడం తప్పకుండా గుర్తుకొస్తుంది. ఆ వెనువెంటనే రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ విజయవాడ వెళ్లి ముఖ్యమంత్రితో భేటీ కావడం తరువాత మంగళవారం నాడు ప్రధానమంత్రినీ, కేంద్ర హోంమంత్రిని కలిసి రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితుల మీద నివేదిక సమర్పించనున్నట్టు వార్తలు రావడం ఏం సూచిస్తున్నట్టు? కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ దగ్గర, రాష్ట్ర గవర్నర్‌ దగ్గర చంద్రబాబు ఏం మొరపెట్టుకున్నారు? వారు కేంద్రానికి ఎటువంటి సమాచారంతో కూడిన నివేదికలు ఇవ్వనున్నారు? అన్న ప్రశ్నలకు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పరిణామాలే జవాబు చెపుతాయి.

ఇక కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిస్తే ఇప్పటికే బలం పుంజుకుని తన మీదికి దూసుకొస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ నైతిక శక్తి మరింత పెరుగుతుందని చంద్రశేఖర్‌రావు ఆందోళన. ఎన్ని సర్వేలు చేయించుకున్నా వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధికార పక్షం 40 నుండి 45 స్థానాలు మించి గెలవదనే తేలుతుండటం టీఆర్‌ఎస్‌ అధినేతను కలవరపెడుతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకే తాను ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ రాజకీయ కూటమికి మద్దతు సాధించే నెపంతో ఆయన బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడను కలిసి చర్చలు జరిపివచ్చారు. ఆయన వెనకే ఆయన ప్రియ మిత్రుడు, మజ్లిస్‌ నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ కూడా బెంగళూరు వెళ్లి కర్ణాటక ఎన్నికల్లో తన పార్టీ పోటీ చెయ్యకుండా దేవెగౌడ పార్టీ జేడీఎస్‌కు మద్దతు ఇస్తుందని చెప్పి వచ్చారు. మజ్లిస్, బీజేపీల మధ్య పరోక్ష సంబంధాలను గురించి గతంలో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సమయంలో కూడా చర్చ పెద్ద ఎత్తునే జరిగింది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్‌ను బలహీనపరిచి, వీలైతే జేడీఎస్‌ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం వచ్చేట్టు చూడాలన్నది చంద్రశేఖర్‌రావు ఆలోచన. 

ప్రథమ శత్రువే ప్రధాన లక్ష్యం
బీజేపీ, కాంగ్రెస్‌ల నాయకత్వంలోని యూపీఏ, ఎన్డీఏలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిని తానే ఏర్పాటు చేసి నాయకత్వం కూడా వహిస్తానని బయలుదేరిన చంద్రశేఖర్‌రావు బీజేపీని గెలిపించే ప్రయత్నాలు ఎందుకు చేస్తారు అన్న సందేహం రావచ్చు ఎవరికైనా. తెలంగాణలో ఇవ్వాళ ఆయన ప్రథమ శత్రువు కాంగ్రెస్‌ పార్టీనే కానీ బీజేపీ కాదు కాబట్టి. అసలు ఆయన ఆలోచిస్తున్న ప్రత్యామ్నాయ కూటమి ఆలోచన వెనక రెండు కారణాలు ఉన్నాయని ప్రచారం. ఒకటి వివిధ రాజకీయ పక్షాలు కాంగ్రెస్‌ వెనక చేరకుండా చూడటం ద్వారా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏకి సహాయపడటం అయితే మరొకటి రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు కుమారుడికి అప్పగించే క్రమాన్ని సులభతరం, వేగవంతం చెయ్యడం. 

ఎవరినీ సంప్రదించకుండా, ఎవరితోనూ చర్చించకుండా చంద్రశేఖర్‌ రావు ప్రగతి భవన్‌లో మీడియా ముందు ప్రకటించడం బెంగాల్‌ వెళ్లి మమతా బెనర్జీని, బెంగళూరు వెళ్లి దేవెగౌడను కలిసి రావడం జార్ఖండ్‌ నేత హేమంత్‌ సోరెన్, ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి తదితరులు ఆయన ప్రయత్నానికి మద్దతు ప్రకటించడం అయ్యాక ఇప్పుడు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసే విషయంలో ఎల్లుండి జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీలో నిర్ణయిస్తారని ప్రకటించడం వెనక ఉన్న మర్మం ఏమిటి? ముందు ఇల్లు చక్కబెట్టుకుని ఆ తరువాత ఇండియాను మార్చవచ్చునన్న ఆలోచనే కావచ్చు. 

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడమే కీలకం
తెలంగాణ ప్రజలు ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన, అమలు చేస్తున్న కార్యక్రమాలపట్ల పెద్దగా వ్యతిరేకంగా లేరు. కానీ జనంలోకి బలంగా వెళ్లిన ప్రతికూల అంశాలు స్వయంగా ముఖ్యమంత్రి ధోరణి. సచివాలయం ముఖం చూడకపోవడం నుంచి ప్రగతి భవన్‌ నిర్మాణం దాకా, మంత్రుల నుంచి మొదలుకుని కార్యకర్తలకూ, ప్రజలకూ అందుబాటులో లేకుండా పోవడం దాకా, భిన్నాభిప్రాయాన్ని సహించని అప్రజాస్వామిక వైఖరితో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల గొంతులు నొక్కడం వరకూ అన్నది సత్యం. ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటుందా అన్నది వచ్చే ఏడాది కాలంలో తెలియాల్సి ఉంది.
ఇంకో నాలుగు రోజుల్లో అధికారికంగా అస్తిత్వంలోకి రానున్న ప్రొఫెసర్‌ కోడండరాం నాయకత్వాన ఏర్పడిన తెలంగాణ జన సమితి ఒకవైపు, మార్క్సిస్ట్‌ పార్టీ చొరవతో ఏర్పడ్డ దళిత లెఫ్ట్‌ఫ్రంట్, భారత కమ్యూనిస్ట్‌ పార్టీలను కలుపుకుని ముందుకు పోగలిగితే తెలంగాణలో 2019లో నిస్సందేహంగా గెలుపు కాంగ్రెస్‌ పార్టీదే.


దేవులపల్లి అమర్‌
datelinehyderabad@gmail.com

మరిన్ని వార్తలు