ద్రోహం దాచేస్తే దాగేనా?!

24 Oct, 2018 01:11 IST|Sakshi

డేట్‌లైన్‌ హైదరాబాద్‌

పిల్లనిచ్చిన ఎన్టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని దొడ్డి దోవన దక్కించుకున్న చంద్రబాబుతో వైస్రాయ్‌ హోటల్‌ కుట్రలో భాగం పంచుకున్నవాడు బాలకృష్ణ. ఇప్పుడు తండ్రి జీవితాన్ని గొప్పగా తెరకు ఎక్కిస్తానని బయలుదేరడం విడ్డూరం కాదా? ఎన్టీఆర్‌పై సినిమా ద్వారా బాలకృష్ణ ఏం కోరుకుంటున్నాడు? బాబు నాయకత్వంలో ఎన్టీఆర్‌కు తాము చేసిన ద్రోహం ఎక్కడా కనపడకూడదు. అదే సమయంలో ఎన్టీఆర్‌ గొప్ప వ్యక్తి అని చూపించి టీడీపీకి లాభం చేకూరే విధంగా సినిమా ఉండాలి. ఎన్‌టీఆర్‌ రాజకీయ జీవితానికి ముగింపు పలికి ఇప్పుడు  ఆయన నామ జపం చేస్తున్న బాబు చిత్తశుద్ధి ఎంతో.. తండ్రి పట్ల బాలకృష్ణ భక్తి శ్రద్ధలు కూడా అంతే.

మహానటి సావిత్రి జీవితం ఇటీవలే తెరకెక్కింది. చాలావరకు వాస్తవానికి దగ్గరగా ఉంది ఆ సినిమా అని అందరూ చెప్పుకున్నారు. ఆ సినిమా తీసిన వాళ్ళు తప్పకుండా సావిత్రి జీవితానికి సంబంధించి అన్ని కోణాలనూ జాగ్రత్తగా పరిశీలించి, అధ్యయనం చేసి ఉంటారు. ఎందుకంటే ఒక మహానటి జీవితాన్ని తెరకు ఎక్కించాలన్న సదుద్దేశం తప్ప ఆ సినిమా నిర్మాతలకు వేరే ప్రయోజనాలు ఏమీ ఉండవు కాబట్టి. మహానటి సావిత్రి జీవించి లేరు, ఆమె వారసులెవరికీ సావిత్రి పేరు వాడుకుని ఇప్పుడు ఏదో లబ్ధి పొందాలన్న దుగ్ధ ఉండి ఉండదు.

అసలా చిత్ర నిర్మాణంతో సావిత్రి కుటుంబానికి ఎటువంటి సంబంధమూ లేదు. కాబట్టి ఆ సినిమాలో నిజాయితీ కనిపిస్తుంది. అందుకే అందరి మన్ననలూ పొందింది. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఏమిటీ సినిమా గోల అని విసుక్కోవచ్చు ఎవరయినా. నిజమే.. ఎన్నికలు తరుముకొస్తున్నాయి. తెలంగాణాలో ఎన్నికల కోడి ముందే కూసింది. డిసెంబర్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి, దాని వెనువెంటనే 2019 ఏప్రిల్, మే నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకూ, లోక్‌ సభకూ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటినుంచో ఎన్నికల వేడి కొనసాగుతున్నది. 

ఏపీలో ఎన్నికలు జరిగేలోపే రానున్న రెండు సినిమాలను ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉంది. ఎన్నికలకు సినిమాలకు ఏమిటి సంబంధం అన్న ప్రశ్న వేయవచ్చు ఎవరయినా. నిజమే సాధారణంగా ఎన్నికల సమయంలో నిర్మాతలెవరూ తమ సినిమాలను విడుదల చెయ్యాలని కోరుకోరు. ఎన్నికల హడావుడిలో పడి జనం తమ సినిమాలు చూడరన్న అభిప్రాయం వారిది. అయితే ఇప్పుడు ఒక రెండు సిని మాలు మాత్రం కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే వస్తున్నాయి. మొదటగా ఒకే సినిమా రాజ కీయ అవసరాల కోసం ప్రారంభమైంది. అయితే దాని వెనువెంటనే ఇంకో సినిమా అదే ఇతివృత్తానికి దగ్గరగా రాబోవడం గమనార్హం.

మహా నటుడి ఆత్మ క్షోభించనుందా?
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, వేలాది మందికి రాజకీయ జన్మఇచ్చిన ఎన్టీఆర్‌ మరణించిన 22 సంవత్సరాలకు ఆయన జీవితాన్ని వెండితెరకు ఎక్కించాలన్న ఆలోచన ఆయన కొడుకు, సినిమా హీరో, టీడీపీ శాసన సభ్యుడు, ఏపీ సీఎం బావమరిది, ఆ రాష్ట్ర మంత్రి మామ బాలకృష్ణకు వచ్చింది. తండ్రిని అప్రజాస్వామిక పద్ధతిలో పదవి నుంచి దింపి మానసిక క్షోభకు గురిచేసి, ఆయన అకాల మరణానికి పరోక్షంగా కారకుడయిన కొడుకే తండ్రి జీవితాన్ని తెరకు ఎక్కించబూనుకోవడం విడ్డూరం. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని దొడ్డిదో వన దక్కించుకున్న బాబుతో వైస్రాయ్‌ హోటల్‌ కుట్రలో భాగం పంచుకున్నవాడు బాలకృష్ణ.

ఇప్పుడు ఆయన తండ్రి జీవితాన్ని గొప్పగా తెరకు ఎక్కిస్తానని బయలుదేరడం విడ్డూరం కాక మరేమిటి? దేశానికి ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశం ఉన్న ఎన్టీఆర్‌ రాజకీయ జీవితానికి  ముగింపు పలికి ఇప్పుడు ఆయన విగ్రహాలకు దండవేసి ఆయన నామ జపం చేస్తున్న బాబు చిత్తశుద్ధి ఎంతో.. తండ్రి పట్ల బాలకృష్ణ భక్తి శ్రద్ధలు కూడా అంతే. మహానటి సావిత్రి సినిమా తీసిన వాళ్ళకీ, ఎన్టీఆర్‌ మీద సినిమా తీయబోతున్న ఆయన కొడుక్కీ ఏ మాత్రం పోలిక లేదు. అక్కడ నిజాయితీగా ఒక మహానటి జీవితాన్ని జనం ముందు ఉంచే ప్రయత్నం జరిగితే ఇక్కడ ఒక మహానటుడి ఆత్మ క్షోభించే రీతిలో మరో సినిమా నిర్మాణం జరగబోతున్నది. ఒకసారి తప్పు చేస్తే దిద్దుకునే అవకాశమే ఉండదా ఇక, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఉంటుందా అని ఎవరయినా బాలకృష్ణ ప్రయత్నాన్ని సమర్ధించవచ్చు.

కానీ, ఎన్టీఆర్‌ రాజకీయ పతనానికి మూలకారకుడయిన బాబు కానీ, అందుకు సహకరించి దాన్ని విజయవంతం చేసిన బాలకృష్ణ కానీ ఈ 22 ఏళ్ళలో ఏ ఒక్కసారయినా ఆనాడు ఎన్‌టీఆర్‌ను గద్దెదించి మేం తప్పుచేశాం అని చెంపలు వేసుకున్నారా? ఎన్టీఆర్‌ పేరిట బాలకృష్ణ సినిమా అనగానే మరో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ అని ఇంకో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. ఈ రెండు సినిమాల్లో నిజంగా ఎవరు ఏ మేరకు వాస్తవంగా తీస్తారు, ఎవరు ఎటువంటి వక్రీకరణలకు పాల్పడుతారు అన్నది చూడాల్సి ఉంది.

పరిపూర్ణ జీవిత చిత్రణకు మంగళమేనా?
బాలకృష్ణ సినిమా షూటింగ్‌ మొదలయింది. తండ్రి పాత్ర బాలకృష్ణ తానే పోషిస్తున్నాడు. ఇందులో బాబు పాత్రకు మరో నటుడు రానాను ఎంపిక చేసారు. ఇంచుమించు తనను బాబులాగా కనిపించేటట్టు మేకప్‌ బాగానే చేశారు. అంటే ఎన్టీఆర్‌ సినిమా ఆయన జీవితంలోకి బాబు ప్రవేశించేంత వరకూ కథ ఉంటుందన్నమాట. అయితే మరి వైస్రాయ్‌ ఎపిసోడ్, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు, ఆయన మరణం వరకూ జరిగిన పరిణామాలు అన్నీ ఈ సినిమాలో ఉంటాయా? ఉంటే బాలకృష్ణ తీస్తున్న ఈ సినిమా దర్శకుడు క్రిష్‌ నిజాయితీగా వాస్తవాలను తెరకు ఎక్కిస్తాడా? ఇప్పటికే ఒక దర్శకుడు తేజ ఈ సినిమా దర్శకత్వం నుంచి తప్పుకున్నాడు.

కారణం అందరికీ తెలిసిందే నిర్మాత చెప్పినట్టు వినడం కుదరక తప్పుకున్నాడని ప్రచారం. ఎన్టీఆర్‌ సినిమా ద్వారా నిర్మాత బాలకృష్ణ ఏం కోరుకుంటున్నాడు? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇక్కడ. సమాధానం కోసం పెద్దగా వెతుక్కోనక్కర లేదు. బాబు నాయకత్వంలో ఎన్టీఆర్‌కు తాము చేసిన ద్రోహం ఎక్కడా కనపడకూడదు అదే సమయంలో ఎన్టీఆర్‌ గొప్ప వ్యక్తి అని చూపించి టీడీపీకి లాభం చేకూరే విధంగా సినిమా ఉండాలి. ఎన్టీఆర్‌ పుట్టుక నుంచి మరణం దాకా తెరకు ఎక్కిస్తే చాలా వివాదాస్పద అంశాలు తెరకు ఎక్కించాల్సి వస్తుంది. అందుకని ఆయన జీవితం చివరి దాకా కాకుండా 60 ఏళ్ళు నిండగానే రాజకీయరంగ ప్రవేశం చేసి 1983లో తొలిసారి ఘన విజయం సాధించి అధికారంలోకి రావడంతో సినిమా ముగుస్తుందని సినీ పరిశ్రమ వర్గాలే చెపుతున్నాయి.

అంటే ఆయన నట జీవితం మాత్రమే ఈ సినిమాలో మనం చూస్తాం. పోనీ ఇంకాస్త దూరం వెళ్లి నాదెండ్ల భాస్కర్‌రావు తిరుగుబాటును విఫలం చేసి తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టేవరకూ చూపించవచ్చునని చెపుతున్నారు. బహుశా ఇదే జరగొచ్చు. ఎందుకంటే నాదెండ్ల భాస్కర్‌రావు తిరుగుబాటు ఎపిసోడ్‌ ఉంటేనే బాబు పాత్రకు ప్రాముఖ్యత వస్తుంది. కానీ అక్కడో ఇక్కడో ముగించేస్తే ఎన్టీఆర్‌ జీవితాన్ని పరి పూర్ణంగా చూపించినట్టు కాదు.

వెన్నుపోటును చూపించే నిజాయితీ ఎవరిది?
అందుకే రాంగోపాల్‌ వర్మ మరో సినిమా తీయడానికి సిద్ధపడ్డట్టున్నాడు. బాలకృష్ణ సినిమా ఎక్కడ ముగిసి పోతుందో అక్కడి నుంచి ఆయన సినిమా మొదలవుతుందని చెప్తున్నారు. ఎన్టీఆర్‌ జీవితంలో ముఖ్యమయిన ఘట్టాలన్నీ అక్కడి నుంచే మొదలవుతాయి. ఎన్నెన్ని మలుపులు, ఎన్ని మెరుపులు ఎన్ని మరకలు అన్నీ ఆ తరువాతి అధ్యాయంలోనే మనకు కనిపిస్తాయి. 1984లో తిరుగుబాటును చిత్తుచేసి ఇందిరాగాం«ధీ అంతటి మహా నాయకురాలు ఒక మెట్టు దిగొచ్చి అధికారం తిరిగి తనకు అప్పగించేట్టు చేసుకున్న దగ్గరి నుంచీ, సొంత అల్లుడి చేతుల్లోనే ఘోరమయిన వెన్నుపోటు పొడిపించుకుని కొద్ది మాసాలకే చనిపోయేవరకూ ఎన్టీఆర్‌ జీవితం అంతా ఉద్వేగభరితమే.

అందులో 85 –89 మధ్య కాలంలో ఆయన పాలన తీరు, వివాదాస్పద నిర్ణయాలు, 89లో ఓటమి ఆ తరువాత సొంత కుటుంబం నుంచే ఎదుర్కొన్న నిరాదరణ, అనారోగ్యం, రాజకీయ అవమానాలు, లక్ష్మీపార్వతి ఆయన జీవితంలో ప్రవేశించడం, ఆమెతో పెళ్లి, మళ్ళీ 1994లో కాంగ్రెస్‌ను మట్టి కరిపించి సొంత అల్లుడి అంచనాలనే తారుమారు చేసి అద్భుత విజయం సాధించి అధికారాన్ని తిరిగి కైవసం చేసుకున్న తీరు అన్నీ రసవత్తర ఘట్టాలే. ఇవన్నీ రాంగోపాల్‌ వర్మ సినిమాలో ఉండే అవకాశం చాలా ఉంది. ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో చూపించే నిజాయితీ బాలకృష్ణ సినిమాకు ఉండదు. ఏ రకంగా చూసినా రాంగోపాల్‌ వర్మ సినిమా మాత్రమే  ఎన్టీఆర్‌ అభిమానులను సంతృప్తిపరుస్తుందని చెప్పాల్సిన పని లేదు. మొత్తానికి ఎన్టీఆర్‌ జీవితం మొత్తం సమగ్రంగా తెలియాలంటే రెండు సినిమాలూ చూడాలి. అయితే ఆత్మకథలు రాసుకునే వాళ్లకు ఎంత నిజాయితీ ఉండాలో జీవిత చరిత్రలు రాసేవాళ్ళు, తెరకెక్కించే వాళ్ళూ వాస్తవాల చిత్రీకరణలో అంతే నిజాయితీ ఉండాలి. వివాదాస్పద సినీ ప్రముఖుడు రాంగోపాల్‌ వర్మ ఎన్టీఆర్‌కు ఎంత న్యాయం చేస్తాడో చూడాలి.


- దేవులపల్లి అమర్‌
datelinehyderabad@gmail.com 

మరిన్ని వార్తలు