ప్రజాతీర్పు వండి వారుస్తారా?

22 Mar, 2019 00:36 IST|Sakshi

సమకాలీనం 

గత వారం రోజుల సభలు, సమావేశాలు, ప్రజాస్పందన చూస్తున్న వారికి ఒక విషయం స్పష్టమౌతోంది. ఏపీ జనాభిప్రాయం ఇప్పటికే వారి మెదళ్లలో నిశ్చయం అయిపోయింది. ఇక అది ఈవీఎంలలోకి బదిలీ కావడమే తరువాయి. కానీ, కులాల వారిగా ఓట్లను చీల్చడానికి, వర్గాల వారిగా ప్రత్యర్థిని బలహీనపరచడానికి, లేని నిందారోపణలతో విపక్షనేతను చిన్నబుచ్చడానికి, పౌరుల్ని తక్కువ అంచనా వేసి సాను‘కుల’ మీడియాతో జనాభిప్రాయం తిరగరాయడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ దింపుడు కళ్లం ఆశే! రాజకీయ స్వార్థంతో చేసే ఏ చర్యలు ఎలా ఉన్నా, ప్రజల్ని తక్కువ అంచనా వేయడం, జనాభిప్రాయాన్ని ఇష్టానుసారంగా తిరగరాస్తామనుకోవడం భ్రమ మాత్రమే!

‘ఇక్కడ చట్టం అమలు కాదు, ఉపయోగించ బడుతుంది’ (యహా ఖానూన్‌ లాగూ నహీ హోతా, ఇస్తెమాల్‌ కియా జాతా హై) అనే డైలాగ్‌ అమితాబ్‌ నటించిన ‘అంధా ఖానూన్‌’ సినిమాలోది. అధికారం అండతో చట్టాలను చెరబట్టినవారు ఇష్టానుసారం వ్యవహరించే స్థితిని ప్రతిబింబించే అహంకారపు మాట అయినందున, సదరు డైలాగ్‌ నేరుగా ప్రేక్షకుల గుండెను తాకుతుంది. సన్నివేశం ఉత్కంఠ రేపుతుంది. దాదాపు అలాంటి వాతావరణమే నెలకొన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఇపుడు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమైంది. గెలుపు సందేహమై, ఓటమి తప్పదనే సంకేతాల కారణంగా అధికారపక్షం వైపునుంచి అన్ని మాయోపాయాలూ మొదలయ్యాయి. అయిదేళ్ల పాలనలో ప్రజాస్వా మ్యపు వ్యవస్థలన్నింటినీ చిద్రం చేసిన పాలకులు, ఇప్పుడు ఒకటొకటిగా అన్ని సంప్రదాయాలు, పద్దతులు, మర్యాదల్ని మంటగలుపుతున్నారు. ప్రజాక్షేత్రంలో గందరగోళం సృష్టించడం ద్వారా, ఇప్పటికే సిద్ధాంత పటుత్వం తగ్గి పలుచనైన రాజకీయాల్ని మరింత కలుషితం చేస్తున్నారు. అవసరానికో, అవకాశవాదానికో పనికొచ్చే పొత్తులతో, లోపాయికారి ఒప్పందాలతో ఎన్నికల చిత్రాన్నే మారుస్తున్నారు.

జనాభిప్రాయాన్నే వంచించాలని ఎత్తుగడలు వేస్తున్నారు. స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆలోచించి, ఓటువేసే వాతావరణం ఓటర్లకు దక్కనీకుండా, ఏదోలా వారిని ప్రభావితం చేసే వ్యూహ రచనల్లో మునిగితేలుతున్నారు. అధి కారపు అండదండలు, ఆర్థిక ప్రయోజనాల రుచి మరిగిన చిన్న చితక పార్టీలు, పచ్చ మీడియా బేషరతుగా పాలకపక్షానికి ఊడిగం చేస్తు న్నాయి. రాజకీయ శిబిరాలకు దన్నుగా అనుకూల మీడియా...  బలపడు తున్న జనాభిప్రాయాన్ని వక్రీకరింప జూస్తోంది. నిజం ప్రతిబింబించడం కాదు, నిర్మించడం అంతకన్నా కాదు, ప్రఖ్యాత జర్నలిస్టు ‘నామ్‌ చోమ్‌స్కీ’ చెప్పినట్టు, ‘జనాభిమతాన్ని’ తామే వండి, వార్చే పని ఇప్పుడు తెలుగునాట య«ధేచ్ఛగా సాగిస్తున్నారు. సంక్షుభిత సమ యాలు, సంక్లిష్ట ఎన్నికల్లోనూ విజ్ఞతతో వ్యవహరించే ఆంధ్ర సమాజాన్ని చిన్నచూపు చూసే రాజకీయ వైఖరి ఇది. దానికి ‘తందాన’ పలికే అను‘కుల’ మీడియా పోకడ రాజకీయ–మేధావి వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది. జనాన్ని తప్పుదోవ పట్టించే ఎత్తుగడలు ఎన్ని పన్నినా... ప్రజాక్షేత్రంలో మాత్రం అస్పష్టత ఉండదు.

రంగు తొలగడం తరువాయి
పరిస్థితి సానుకూలంగా లేనపుడు ప్రజల్లో గందరగోళం సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూడటం రాజకీయాల్లో ఓ నమూనా! ఫక్తు అదే పాటి స్తున్నారిపుడు. ఓట్లే యావ, గెలుపే లక్ష్యం! మతాన్ని, ముఖ్యంగా కులాన్ని మున్నెన్నడు లేనంతగా ఈ ఎన్నికల్లో వాడుకునే కుటిల వ్యూహాలు పన్నుతున్నారు. ప్రత్యక్ష–పరోక్ష పొత్తులు–అవగాహనలు కూడా పక్కా అవకాశవాదంతోనే తప్ప ఏ సిద్ధాంత సారూప్యతా, నిబ ద్ధతా లేదు. పాలకపక్షమైన తెలుగుదేశంతో జనసేన సఖ్యత జనానికి తెలియంది కాదు! తానొక విపక్షమై ఉండి, చాలా ప్రజాసంబంధ విషయాల్లో ప్రభుత్వంపై విమర్శల కన్నా సాటి ప్రధాన ప్రతిపక్షంపైనే విమర్శలు ఎక్కుపెట్టారు జనసేన నేత! కీలకమైన ప్రజా సమస్యలు ముప్పిరిగొన్నపుడు, తగుదునమ్మా అని తాను రంగ ప్రవేశం చేసి, జనా నికి ఊరట కన్నా ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించిన సందర్భాలెన్నో! అయినా, అటువంటిదేదీ లేదని మభ్యపెట్టడానికి ఎన్నెన్ని మాటలు చెప్పారో! కానీ, వారి లాలూచీ కుస్తీ క్రమ క్రమంగా బయటపడుతోంది.

ఎక్కడో ఉత్తరాదిలో ఉన్న బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రితో పొత్తుకు ఎంత వేగంగా పావులు కదిపారు? దీని వెనుక ఉండి వ్యవ హారం నడిపిందెవరు? ఎవరి ప్రయోజనాలు నెరవేరడానికి? దళిత, బడుగు బలహీనవర్గాలు ప్రధాన దన్నుగా ఉన్న వైఎస్సార్‌సీపీని రాజకీ యంగా దెబ్బతీయాలనే ఎత్తుగడ కాదా? ఏపీలో బీఎస్పీ–జనసేన–లెఫ్ట్‌ కూటమి వ్యూహాత్మక పొత్తుల తెరవెనుక ఉన్న పరోక్ష పథగామి ఎవరు? రాజకీయాల్లో ఓనమాలు తెలిసిన ప్రతి ఒక్కరూ అంచనా వేయగలరు. మైనారిటీ ఓట్లు దక్కనీయొద్దనే కుటిల నీతితోనే, విపక్షనేతకు బీజేపీతో లేని బంధం అంటగట్టడం. ఆంధ్ర–తెలంగాణ వివాదాన్ని రగల్చడానికి కేసీఆర్‌–జగన్‌ ఒకటనే దుష్ప్రచారం. వైఎస్సార్‌ని అభిమానించే పెద్ద సంఖ్య కాంగ్రెస్‌ వాదుల్ని వైఎస్సార్సీపీకి కానీకుండా చేసేందుకు కాంగ్రెస్‌తో తన అంగీకారం.. ఇన్ని వ్యూహాలా? ఆయా గ్రూపులు పోటీ చేసే స్థానాల ఎంపికతోనే రంగు బయటపడుతోంది, రేపు అభ్యర్థిత్వాలు ఖరారయ్యాక ఏ వ్యూహం వెనుక ఏ కుటిల నీతో తెలియకుండా ఉంటుందా? పులుముకున్న పులివర్ణం కలకాలం నిలువదు. తుంపర వర్షానికే కరిగిపోతోంది, ఇక రేపటి జడివానకు నిలుస్తుందా? ఊహు! రంగు వెలసి గాడిద బయట పడటం ఖాయం!

దిగితే తెలుస్తుంది లోతు
ఇంత కాలం ముసుగులో గుద్దులాటలు ఎలా ఉన్నా, ఒకసారి రాజకీయ బరిలోకి దిగాక అసలు రంగు తెలిసిపోవాల్సిందే! నిలదొక్కుకోకుంటే వెలిసిపోవాల్సిందే! వేగంగా తరం మారుతోంది. సామాజిక మాధ్య మాల ప్రభావం పెరిగాక సామాన్యులు కూడా తెలివిపరులైపోతున్నారు. ఆలోచిస్తున్నారు. ప్రత్యక్ష సమాచారంతో స్పష్టమైన అభిప్రాయాలు ఏర్ప రచుకుంటున్నారు. ఏ రంగంలో నిపుణుల్ని అక్కడే ఆదరిస్తున్నారు తప్ప ఇతర రంగాల్లో పెద్దపీట వేయడానికి వెనకాడుతున్నారు. సినీ తారలు, ఆ గ్లామర్‌తో రాజకీయాల్లో వెలగడమిక కష్టమే! తమిళ రాజకీయాలేలిన జయలలితే ఆ తరంలో ఆఖరు అనిపిస్తుంది. ఉత్సాహంతో ఎవరైనా సినీ రంగం నుంచి వచ్చినా... రాజకీయాల్లో నిబద్ధతతో నిలదొక్కుకోవా ల్సిందే! ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ అయినా, జేడీ లక్ష్మీనారాయణ అయినా తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. 2014 ఎన్నికల ముందు టీడీపీని సమర్థించినపుడున్నంత స్పష్టత ఇప్పుడు జనసేనాధిప తిలో కొరవడింది. చంద్రబాబునైనా, జగన్‌మోహన్‌రెడ్డినైనా ఆయన సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? ఏదైతే, ఎందుకు? స్పష్టంగా వ్యక్త పరచాలని ప్రజలు డిమాండ్‌ చేస్తారు.

ప్రజాకవి శ్రీశ్రీ అన్నట్టు, ‘ప్రజా జీవితంలోకి వచ్చాక ఏమైనా, ఎన్నైనా అంటాం’ అంటారు జనం. విశాఖ పట్నం లోక్‌సభ అభ్యర్థిత్వం ఖరారైన లక్ష్మీనారాయణ సీబీఐ అధికారిగా వ్యవహరించిన తీరు మరోమారు రాజకీయ తెరపైకి వస్తుంది. జగన్‌మో హన్‌ రెడ్డిపై కేసుల విచారణలో చూపిన అత్యుత్సాహం, చంద్రబాబుపై కేసుల విషయానికొచ్చే సరికి ఎందుకు తగ్గిందనే ప్రశ్న ఎప్పటికీ రేగు తూనే ఉంటుంది. తమ వద్ద తగిన సిబ్బంది లేరు కనుక విచారించలే మని న్యాయస్థానానికి ఆయన నేతృత్వపు సీబీఐ బదులివ్వడం అప్పట్లో వార్తయింది. నైపుణ్యాలు, సానుకూల ప్రచారాలే కాకుండా ప్రతికూల వాఖ్యలు కూడా ఇప్పుడు జనం చర్చల్లోకి వస్తాయి. ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఓ సీబీఐ కేసు విచారణను ఆదిలాబాద్‌ జిల్లా జడ్జి తప్పుబట్టడం వంటివి ఇప్పుడు ప్రచారంలోకి రావచ్చు. 2010లో ఆదిలాబాద్‌ వాంకిడి మండలం సర్కెపల్లి అడవిలో జరిగన ఆజాద్‌ (మావోయిస్టు), హేమ చంద్ర ప్రసాద్‌ (జర్నలిస్టు) ఎన్‌కౌంటర్‌ కేసు దర్యాప్తు సవ్యంగా జరగ లేదని, పోలీసులకు అనుకూలంగా సాగిందని జడ్జి వ్యాఖ్యానించారు.

సమాధానం లేకే ఎదురుదాడి
అయిదేళ్లు అధికారం అప్పగిస్తే అన్నిటా విఫలమైన ప్రభుత్వ పెద్ద, విపక్షం విమర్శల్ని తట్టుకోలేక ఎదురుదాడికి తలపడుతున్నారు. చేసిన ప్రగతిని చెప్పుకోలేని దుస్థితిలో విపక్షనేతపై నోటికొచ్చిన నిందలు మోపుతున్నారు. నలబై యేళ్ల అనుభవమని చెప్పే ముఖ్యమంత్రికి ఒక నిందితుడికి, నేరస్తుడికి తేడా తెలియదా? విపక్షనేత ఎదుర్కొంటున్న వన్నీ తామే వేసిన తప్పుడు కేసులని, ఏ కేసులోనూ ఏదీ నిరూపిత మయ్యే పరిస్థితి లేదని తెలిసీ చేసేది కువిమర్శ కాదా? 1999 ఎన్నికల్లోనూ నాటి పీసీసీ అధ్యక్షుడు డా.వైఎస్‌.రాజశేఖరరెడ్డిపై ఈయన ఇటువంటి నిందలే మోపారు. వారొస్తే అభివృద్ధి ఆగిపోతుందని, శాంతి భద్రతలుండవని, రౌడీయిజం రాజ్యమేలుతుందనీ ప్రజల్లో భయాందోళ నలు రేపారు. అదృష్టంతో ఆ ఎన్నికల్లో నెగ్గి, నిరూపితం కాని అవే నిందల్ని వైఎస్‌పై మళ్లీ మోపే ప్రయత్నం 2004లోనూ చేసి భంగ పడ్డారు. అవన్నీ రాజకీయ దుగ్ధతో చేసిన నిరాధారపు నిందలని డా‘‘ వైఎస్‌. హయాం నిరూపించింది. ‘అభివృద్ధి–సంక్షేమం’ జోడెడ్ల బండిలా పాలనను వై.ఎస్‌ పరుగులు తీయించారు. తర్వాతి తరాల పాలకులకు వైఎస్సార్‌ హయాం బెంచ్‌మార్కయింది. ఉత్తుత్తి నిందలు నమ్మి, అయ్యో... బంగారు పాలన అయిదేళ్లు జాప్యం చేసుకున్నామే! అని ప్రజలు పశ్చాత్తాప పడ్డారు. ఇప్పుడు ప్రజలు నిందలు నమ్మడానికి, సుపరిపాలనను జాప్యం చేసుకోవడానికి సిద్దంగా లేరు.

సడలిన నమ్మకానికి ఇవే ఆధారాలు!
గత వారం రోజుల సభలు, సమావేశాలు, ప్రజాస్పందన చూస్తున్న వారికి ఒక విషయం స్పష్టమౌతోంది. ఏపీ జనాభిప్రాయం ఇప్పటికే వారి మెదళ్లలో నిశ్చయం అయిపోయింది. ఇక అది ఈవీఎంలలోకి బదిలీ కావ డమే తరువాయి. అందుకు మూడు వారాల గడువుంది. ఈ లోపున ఎన్నెన్ని సర్కస్‌ ఫీట్లో! సీఎం విశ్వాసం నడలిందనడానికి పరస్పర విరు ద్ధపు ఆయన మాటలు, వ్యవçహారమే సంకేతం. ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగుతున్న ఇద్దరు మంత్రుల్ని తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయించిన సీఎం, తన తనయుడు లోకేష్‌తో మాత్రం చేయించలేదు. రిస్కు తీసుకోవడానికి సిద్ధంగా లేరన్న మాట! రెండు విధాలా, ఓటమి ఆస్కారాన్ని అంగీకరించారన్నట్టే! ‘నా నలభయేళ్ల రాజకీయ జీవితంలో ఇంత సానుకూలత ఎప్పుడూ చూడలేదు’ అని గంభీరంగా ప్రకటన చేసిన ఆయన, హిందూపూర్‌లో ఒక సీఐ స్థాయి అధికారి పోటీని నివా రించడానికి తన ప్రభుత్వంతో ఎలా మోకాలడ్డారో జనం చూశారు. అడ్డు కోవడం సరికాదని, పూర్వపు తేదీతో సీఐ రాజీనామా అంగీకరించండని ట్రిబునల్‌తో చెప్పించుకోవాల్సి వచ్చింది. కులాల వారిగా ఓట్లను చీల్చ డానికి, వర్గాల వారిగా ప్రత్యర్థిని బలహీన పరచడానికి, లేని నిందారోప ణలతో విపక్షనేతను చిన్నబుచ్చడానికి, పౌరుల్ని తక్కువ అంచనా వేసి సాను‘కుల’ మీడియాతో జనాభిప్రాయం తిరగరాయడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ దింపుడు కళ్లం ఆశే! రాజకీయ స్వార్థంతో చేసే ఏ చర్యలు ఎలా ఉన్నా, ప్రజల్ని తక్కువ అంచనా వేయడం, జనాభిప్రాయాన్ని ఇష్టానుసారంగా తిరగరాస్తామనుకోవడం భ్రమ మాత్రమే!


దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ :  dileepreddy@sakshi.com

మరిన్ని వార్తలు