మోకాలడ్డే సభ ఉండాలా? వద్దా?

24 Jan, 2020 00:07 IST|Sakshi

సమకాలీనం

రాష్ట్రాల్లో రెండో చట్ట సభ అవసరమా? అన్న సందేహాలకీ, చర్చకూ తెరలేపే పరి ణామాలకు ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలే వేదికయింది. విపక్షపార్టీ వ్యూహం, ఉద్దేశం ప్రకారం గాడి తప్పి జరిగిన  బుధవారం నాటి ఘటనలు రెండో చట్టసభ ఉనికినే ప్రశ్నార్థకం చేశాయి. సంప్రదాయాలకు భిన్నంగా చట్టసభలో సాగిన ఈ ధోరణి ప్రమాదకరమనే అభిప్రాయం వ్యక్తమౌ తోంది. ఆయా ఘటనల్ని యాదృచ్ఛిక పరిణామాలుగా చూడలేమని, ప్రజాస్వామ్య ప్రక్రియను చిన్నబుచ్చే అవాంఛనీయ దుర్ఘటనలుగానే పరిగణించాలని మేధావివర్గం భావిస్తోంది. సభలో వ్యవహారాలు ఒకటి తర్వాత ఒకటి ... నిబంధనలకు విరుద్ధంగా జరగటమే కాక ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను విపక్ష తెలుగుదేశం అడ్డుకోవడమే లక్ష్యంగా నడవటం సభ దారితప్పిన తీరుకు నిదర్శనం. శాసన మండలి ఛైర్మన్‌ స్వయంగా అంగీకరించినట్టు నిబంధనలకు భిన్నంగా చోటుచేసుకున్న పరిణామాలకు ఎవరు బాధ్యత వహించాలి? వాటిని తానే అనుమతించి,  తప్పు జరిగిందని అంగీకరిస్తూనే ఇంకో తప్పుకు సిద్ధపడ్డ తన చర్యల్ని ఛైర్మన్‌ ఎలా సమర్థిం చుకోగలరు? పెద్దల సభగా కీర్తించబడే శాసనమండలిని సంకుచిత రాజకీయ వ్యూహాలకు, ఎత్తుగడలకు వేదికగా పార్టీలు వాడుకునే పద్ధతులకు విరుగుడేమిటి?

స్వతంత్రంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన ఛైర్మన్‌ ఒక రాజకీయ నేత కనుసన్నల్లో నడిపితే ఆ సభకు దిక్కేది? సలహాలిచ్చి, సూచనలు చేస్తూ... శాసనసభ పంపే బిల్లులకు మెరుగులు దిద్దాల్సిన పెద్దల సభ, కుయుక్తితో సదరు బిల్లులకు మోకాలడ్డే వేదికైతే ఎంతవరకు ఆమోదయోగ్యం? ఇలాంటి ప్రశ్న లెన్నో తలెత్తుతున్నాయి. సభ నడిచిన తీరును ప్రజలు అసహ్యిం చుకోవడమే కాక సదరు సభ మనుగడనే ప్రశ్నార్థంలోకి నెట్టిన తాజా స్థితి. మండలి పరిణామాల పట్ల ప్రభుత్వం కలత చెంది ఉన్నట్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రివర్గ సహచరులు గురు వారం శాసనసభలో చేసిన ప్రసంగాల్ని బట్టి స్పష్టమౌతోంది. ఇటు వంటి దారితప్పిన సభలు ఉండాలా? వద్దా? చర్చించడం కోసమే సభను కొనసాగించాలని ప్రభుత్వం స్పీకర్‌ను కోరింది. సభ సోమ వారానికి వాయిదా పడింది. ఆ రోజున సభ మనుగడ తేలవచ్చు.

తెలిసీ నిబంధనలకు నీళ్లు
శాసనమండలి నుంచి పాలకపక్షం ఒకటి ఊహిస్తే, విపక్షం మరోటి ఆశించింది. కడకు ఇద్దరు అనుకున్నట్టూ జరగలేదు. ఎందుకు జర గలేదు? అన్నది విశ్లేషిస్తే పొరపాటు ఎక్కడ దొర్లిందో ఇట్టే అర్థమ వుతుంది. శాసనసభ ఆమోదించిన ముఖ్యమైన బిల్లుల్ని  మండలిలో ప్రవేశపెట్టిన పాలకపక్షం కొన్ని పరిణామాల్ని ఊహించింది. పరి పాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు వంటి కీలక బిల్లులు ఐనందున ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. రాజ్యాంగ అధికరణం 197 ప్రకారం తనకున్న అధికార–పరిమితుల మేరకు శాసనమండలి బిల్లుల్ని ఆమోదించడమో, తిరస్కరించడమో, సవరణలు ప్రతిపాదిం చడమో చేస్తుందని పాలకపక్షం భావిస్తుంది. ఏపీ శాసనమండలిలో విపక్షానికి మెజారిటీ ఉన్నందున కొంత ప్రతికూల పరిస్థితిని వారూ హించడం సహజమే! అనుమానించినట్టే అయింది. ‘సలహాలు సూచ నలు వస్తాయి, లేదా తిప్పిపంపుతారు అనుకున్నాం. కానీ, నిబంధ నల్ని ఉల్లంఘించి, లేని అధికారాల్ని ఉపయోగించి సెలెక్టు కమిటీకి పంపుతారనుకోలేదు... ఇది ఎంతో బాధించింది’ అని ముఖ్యమంత్రి స్వయంగా శాసనసభలో చెప్పారు. నిజంగా బిల్లును సెలెక్టు కమిటీకి పంపడం ద్వారా కొంత కాలయాపన చేయాలన్నదే విపక్ష వ్యూహమైతే, కనీసం అందుకు అవసరమైన ప్రక్రియను వారు చేపట్టి ఉండాల్సింది. సకాలంలో నోటీసు ఇవ్వలేదు. ముందురోజు బిల్లుల్ని ప్రవేశపెట్టినపుడు అందులో అంశాల పట్ల తమకు అభ్యంత రాలున్నాయని, సెలెక్టు కమిటీకి పంపాలనే భావనను అక్కడే, అప్పుడే వెల్లడించి దాన్ని సభ రికార్డుల్లోకి చేరేలా చూడాల్సింది.

అదీ చేయలేదు. లేవనెత్తి, చర్చించి, అవసరమైతే ఓటింగ్‌ జరిపి... (విపక్షానికి ఎలాగూ మెజారిటీ ఉంది గనుక) అప్పుడు సెలెక్టు కమిటీకి పంపించే ప్రక్రియనైనా సజావుగా చేసుండాల్సింది. కానీ, అలానూ జరగలేదు. ఆ లోపాన్ని స్వయంగా అంగీకరించిన ఛైర్మన్, తన విచక్షణాధికారం మేరకు సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నానని ప్రకటించారు. ఏదైనా ప్రక్రియలో, నిబంధనల్లో స్పష్టత లోపించి నపుడే సభాపతి విచక్షణకు ఆస్కారం ఉంటుంది. కానీ, ఇక్కడ ప్రక్రియ సజావుగానే ఉంది, దాన్ని పాటించలేదని, ఉల్లంఘణ జరిగిందని ఆయనే అంగీకరించారు. ఇక అప్పుడది విచక్షణా? వివక్షా? నిజానికి అక్కడ ఉటంకించిన నిబంధనలోనూ ఆయనకా అధికారం లేదు. ఆరంభంలోనే సభ గాడి తప్పింది. ఇక్కడ ఏ మాత్రం వర్తించని నిబంధన 71ని తీసుకువచ్చి, బిల్లులు ప్రవేశపెట్టడాన్నే అడ్డుకునే యత్నం మొదట విపక్షం చేసింది. ఇది కూడా మండలి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న అంశాల్లో ఒకటి. పెద్దల సభలో మెజారిటీ ఉందని ఇలా అడ్డుకుంటే, ప్రజల చేత ఎన్నికైన శాసనసభ మెజారిటీతో చేసిన నిర్ణయాలు ఎల్లవేళలా వీగిపోవా ల్సిందేనా? విపక్షానికి మెజారిటీ ఉంటే మాత్రం పెద్దల సభ, ప్రభుత్వం తెచ్చే బిల్లుల్ని వ్యతిరేకించే వేదిక కావాలా? బెజవాడ రౌడీల్లా వ్యవహరించి బాగా చేశారని విపక్షనేతే సభ్యుల వీపులు తట్టే సభ సాగాల్సిందేనా? ఇటువంటి ప్రశ్నలు మండలి ఉనికిని మసక బారుస్తున్నాయి. 

ఆశయం అడుక్కి... లక్ష్యం గాలికి...!
కాలక్రమంలో పెద్దల సభ స్ఫూర్తి దెబ్బతిన్నది. ప్రపంచ పార్లమెంటరీ వ్యవస్థల్లో ఉన్న పెద్దలు, మేధావుల సభల స్ఫూర్తితో మన దేశంలో కేంద్రంలో రాజ్యసభ, రాష్ట్రాల్లో శాసనమండలుల వ్యవస్థను తెచ్చారు. దిగువ సభలైన లోక్‌సభ, శాసనసభలకు దేశం, రాష్ట్రాల నలుమూలల నుంచి విభిన్న సామాజిక నేప«థ్యం, వేర్వేరు విద్యార్హతలు (కనీస విద్యార్హతలు నిర్దేశించనందున) కలిగిన వారు వస్తారు కనుక రెండో సభ ఉండాలనే వాదనకు మొదట దన్ను లభించింది. కొంత ఉద్రేకమో, ఆవేశంతోనో, తొందరపాటుగానో దిగువ సభలు బిల్లులు రూపొందించినా... మేధావులు వివేచనతో వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, మంచి–చెడుల్ని సమీక్షించి సూచనలు, సలహాలు చేయాలన్నది వీటి లక్ష్యం! ఈ పనికోసం సమాజానికి సమగ్రంగా ప్రాతినిధ్యం వహించేలా వివిధ వర్గాల నిపుణులు, అనుభవజ్ఞులు, మేధావులతో ఆయా సభల కూర్పు జరిగేది. వేర్వేరు రంగాలకు సంబంధించిన అంశాలు, బిల్లులు, విధానాలు, తీర్మా నాలు, పద్దులు సభలో చర్చకు వచ్చినపుడు ఆయా రంగ నిపుణులు, మేధావులు తగు సూచనలు, సలహాలు ఇచ్చేవారు. అలా పెద్దల సభ వివేకంతో శాసనసభ ప్రతిపాదనలకు, విధానాలకు మెరుగులు దిద్దేది. కానీ, రాను రాను ఈ స్ఫూర్తికి గండిపడింది. సభ కూర్పులోనే విలువలు, పద్ధతులు దిగజారాయి.

కేంద్రంలో, ఆయా రాష్ట్రాల్లో పాలకపక్షాలు తమ రాజకీయ నాయకులకు, అనుయాయులకు, ఆశ్రితులకు పెద్దల సభల్లో స్థానం కల్పించడం మొదలయ్యాక రాజకీయ నిరుద్యోగులకవి పునరావాస కేంద్రాలయ్యాయనే విమర్శ ఎదురైంది. లోక్‌సభ, శాసనసభల పోటీకి అవకాశం కల్పించలేనపుడు, వేరెవరికో స్థానం కల్పించి సిట్టింగ్‌లకు టికెట్టు నిరాకరించినపుడు.. వారికి పెద్దల సభల్లో చోటివ్వటం రివాజయింది. పార్టీలకు పెద్ద మొత్తంలో ఆర్థిక వనరులు సమకూర్చే మోతుబరులకు, అందుకు ప్రతిగా రాజ్యసభ, శాసన మండలి స్థానాల్ని ఇవ్వడం పెరిగాక సదరు సభల కూర్పు బాగా పలుచనయింది. ముఖ్యమంత్రి కుమారుడవడం తప్ప ఏ ప్రత్యేక అర్హతలున్నాయని నారా లోకేష్‌ ఎమ్మెల్సీ అయ్యారనే విమర్శలు బహి రంగంగానే వచ్చాయి. ఇలా ఏర్పడే పెద్దల సభల నిర్వహణకు, కమి టీలకు, సభ్యుల జీతభత్యాలకు... చెమటోడ్చే ప్రజల పన్నులతో నిండే సర్కారు ఖజానా నుంచి ఖర్చు చేయాల్సిందేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. దానికి తోడు పెద్దల సభల గౌరవాన్ని మంటగలు పుతూ చౌకబారు రాజకీయ వ్యూహాలకు, ఎత్తుగడలకు వేదిక చేయడం మరింత దివాలాకోరుతనమే!

ప్రమాదంలో ప్రజాస్వామ్యం
చట్టసభలకు నేతృత్వం వహించే స్పీకర్లు, ఛైర్మన్ల ప్రవర్తన అఖిలభారత స్థాయిలో విమర్శలకు గురవుతున్న వేళ ఏపీ ఘటన వారి పరువును మరింత దిగజార్చింది. పార్టీ అధినేత మండలి గ్యాలరీలో గంటల తరబడి కూర్చొని సభాపతిని, ఆయన నిర్ణయా లను ప్రభావితం చేయడం దురదృష్టకరం. విపక్షనేత గ్యాలరీ నుంచి, సభ్యుల్ని–సభాపతిని ఉద్దేశించి నిస్సిగ్గుగా సైగలు చేయడం హేయ మైన చర్య. ఆ ప్రభావంతో... ‘తప్పు జరిగింది నిజమే, తప్పని పరి స్థితిలో... నేనీ నిర్ణయం తీసుకున్నాన’ని సభాపతి చెప్పడం పరా కాష్ట! ఫిరాయింపుదారుల్ని అనర్హులుగా ప్రకటించడంలో స్పీకర్లు అనుచిత జాప్యం చేస్తున్నారని, ఈ విషయంలో నిర్ణయానికి ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను సూచించమని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన రెండు, మూడు రోజుల్లోనే ఇది చోటు చేసుకుంది. మన చట్ట సభలపైనా, వాటి నిర్వహణపైన ప్రజలకు ఇంకా ఏం విశ్వాసముంటుంది? అందుకే, ప్రపంచ దేశాల ‘ప్రజాస్వామ్య సూచిక’లో భారత్‌ స్థానం మరింత దిగజారింది. లెక్కించిన 165 దేశాలకు గాను, కిందటేడుతో పోల్చి చూసినా 2019లో భారత్‌ పది స్థానాలు తగ్గి 51 స్థానంలో నిలిచింది. ఇది మరింత దిగజారక ముందే ఇల్లు చక్కదిద్దుకోవాలి. సభాపతుల, సభ్యుల నడత మారాలి. సభలూ మారాలి. పనికిరాని సభలు తొలగిపోవాలి.

దిలీప్‌ రెడ్డి

మరిన్ని వార్తలు