భయం లేకే బరితెగింపు!

28 Sep, 2018 00:45 IST|Sakshi

సమకాలీనం

చట్టాల పట్ల నిర్భీతితో, సాటి మనిషిని వెంటాడి, నరికి చంపేందుకు ఉన్మాదులు తెగబడుతున్న తీరు ఆందోళనకరం. తీవ్ర నేరాలు చోటుచేసుకున్నపుడు, సదరు కేసుల విచారణ జరిపించి సత్వర న్యాయం అందేలా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. దాంతో ప్రజలకు విశ్వాసం, నేరస్తులకు భయం పెరుగుతాయి. జన సమక్షంలో హత్యలు చేసి, పోలీసుల వద్ద నిందితులు లొంగిపోయి, తగు సాక్ష్యాధారాలున్నపుడు... ఏ మాత్రం జాప్యం చేయకుండా వేగంగా విచారణ ముగించి, శిక్షలు పడేలా చూస్తే, సమా జంలో చట్టాలు–శిక్షల భయం నిలుస్తుంది. వ్యవస్థలన్నీ మనిషి ఉత్కృష్ట జీవనగతి కోసమే! మనిషి ప్రాణాల్ని కాపాడటం సదరు వ్యవస్థలన్నిటి ప్రాథమిక కర్తవ్యం.

గత పదిహేనురోజుల్లో పట్టపగలు నడిరొడ్డున జరి గిన హత్యలు, హత్యాయ త్నాలు సగటు మనిషిలో భయం పుట్టిస్తున్నాయి. ఎంచుకున్న వారిని జనం చూస్తుండగానే వెంటాడి హతమార్చిన తీరు, అçక్కడ నెలకొన్న భీతావహ వాతావరణం, తర్వాత జరుగుతున్న చర్చ... ఇదంతా ఒక ‘న్యూస్‌రీల్‌’లా కళ్ల ముందు తిరుగు తోంది. నాగరిక సమాజంగా మనం ఎటు పయని స్తున్నాం? అనే ఊహ గగుర్పాటు కలిగిస్తోంది. ‘అంతటా, రోజూ ఇవే జరుగుతున్నాయా? ఏదో ఒకటీ, అరా ఘటనలకు ఇంతలా కంగారు పడాలా?’ అనొచ్చు సగటు మేధావులెవరైనా! కానీ, అవి జరి గిన తీరు, అందుకు దారితీసిన కారణాలు, రాగల పరిణామాల్ని లోతుగా విశ్లేషిస్తే, అలా తీసిపారేయ డానికి వీళ్లేదు అనిపిస్తోంది. చట్టం–న్యాయ ప్రక్రియ, పోలీసు వ్యవస్థ, మీడియా, సామాజిక పరిస్థితులు, మానవ సంబంధాలు... ఇలా అన్నీ ఇపుడు చర్చకు వస్తున్నాయి. ఆయా ఘటనల ముందు, వెనక పరి స్థితులెలా ఉన్నా, రెండంశాలు మాత్రం తీవ్రంగా కలత రేపుతున్నాయి. చట్టాల పట్ల నిర్భీతితో, జనం చూస్తుండగానే సాటి మనిషిని వెంటాడి, నరికి చంపేందుకు ఉన్మాదులు తెగబడుతున్న తీరు ఆందో ళనకరం. అదే సమయంలో... జనం అచేతన, నిష్క్రి యత్వం, తమకేమీ పట్టనట్టు సాఫీగా సాగిపోతున్న తీరు మరింత గగుర్పాటు కలిగిస్తోంది.

సామాజిక మాధ్యమాలు వంటి ‘కృత్రిమ ప్రపంచం’ (వర్చువల్‌ వల్డ్‌)లో ఉన్నంత క్రియాశీలంగా జనం వాస్తవిక ప్రపంచంలో ఉండట్లేదు. ఈ పరిస్థితులిలాగే ఉంటే, ఇంకెన్ని ఘాతుకాల్ని చూడాల్సి వస్తుందోననే భయం పలువురిని కలవరపెడుతోంది. ఈ ఘోరాల వెనుక  భూవివాదాలు, వివాహేతర సంబంధాలు, పరువు భావనలు, కులాంతర ధ్వేషాగ్నులు, పగ–కక్ష సాధిం పులు ప్రధాన కారణాలవటం వికటిస్తున్న సామాజిక పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇవన్నీ తమకేమీ సంబంధంలేని వ్యవహారాలన్నట్టు పాలకులు స్పంద నారహితంగా ఉండటం మరింత ఆశ్చర్యకరం. ఏ విరుగుడు చర్యలూ తీసుకోకుండా ఈ పరిస్థితుల్ని ఇలాగే కొనసాగనిస్తే, అవింకా ఎటు దారితీస్తాయో అంతుబట్టని అయోమయం! నిరంతరం తలపై వేలాడే కత్తిలా చట్టమంటే ఓ ‘భయం’ నెలకొల్పడం ద్వారానే నేరాల్ని నియంత్రించగలమనే సంప్రదాయ భావన తరచూ గుర్తుకొస్తోంది. ఆ భయం సడలు తోంది. అందుకు, అనేకాంశాలు కారణమవుతు న్నాయి. మారిన ప్రభుత్వాల ప్రాధాన్యతలు, వ్యవ స్థాగత లోపాలు, సన్నగిల్లిన సామాజిక విలువలు, పలుచనైన మానవ సంబంధాలు, ప్రపంచీకరణ తాలూకు ఆర్థిక అసమానతలు... ఇలా ఎన్నెన్నో అంశాలు పరిస్థితుల్ని అక్కడికి తోస్తున్నాయి. ఎవరూ దీన్ని గట్టిగా పట్టించుకోక మనుషుల భద్రత గాల్లో దీపమయితే ఎలా? అనే ప్రశ్న తలెత్తుతోంది. 

ఇంత నిర్భీతి ప్రమాదకరం!
చట్టం, న్యాయ వ్యవస్థ, శిక్షలంటే ఇంతటి భయంలేని తనం ప్రమాద సంకేతమని సామాజికవేత్తలంటు న్నారు. మొన్న మిర్యాలగూడ, నిన్న ఎర్రగడ్డ, నేడు అత్తాపూర్‌లో జరిగిన çఘటనలు మనకదే భావన కలి గించాయి. ఇవి కాకుండా ఇలాంటి హత్యలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ఇది పరిమితంగా అక్క డక్కడ పొడచూపుతున్నదే అనుకున్నా... ఈ సంకే తాలు సమాజానికంత శ్రేయస్కరం కాదనేది ఆందో ళన.. పట్టపగలు, జనం మధ్య మారణాయుధాలతో తలపడి మనుషుల్ని తెగనరకడం అన్నదో ఉన్మాద చర్య! ఇందుకు కారణాలు చాలానే ఉండొచ్చు. తర్వాత తామెదుర్కోబోయే ఇబ్బందుల కన్నా లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తిని మట్టుపెట్టడమే ప్రధాన మనే ఉన్మాదపు భావనతోనో, మద్యం సేవించిన మత్తులోనో కొందరు ఇలాంటి దాష్టీకాలకు పాల్పడ వచ్చని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. ఏం చేసయినా తర్వాతి పరిస్థితిని తామెదుర్కొనగలమనే మొండి ధీమా కూడా ఇలాంటి చర్యలకు వారిని పురిగొల్పే ఆస్కారముందని సామాజిక శాస్త్రవేత్తలం టున్నారు.

నేర–న్యాయ ప్రక్రయలోని లోపాలే ఈ నిర్భీతికి ముఖ్య కారణమని నిపుణుల విశ్లేషణ. నేర దర్యాప్తు, సాక్ష్యాల పరీక్ష, న్యాయ విచారణ–అప్పీలు తదితర ప్రక్రియల్ని ఏ దశలోనయినా ప్రభావితం చేయగలలమనే ధీమాయే ఇటువంటి తెగింపులకు కారణమౌతోంది. ప్రక్రియలో జాప్యం, సాక్ష్యాల్ని తారుమారు చేయడం, సాక్షులు మాట మార్చేలా చూడ్డం, అప్పీలుతో శిక్షల అమలు వాయిదా వేయిం చుకోవడం.... ఇలా ఎన్నో మాయోపాయాలతో నేర స్తులు తప్పించుకుంటున్నారు. మహా అంటే రెండు, మూడు నెలలు జైళ్లో ఉంటాం, తర్వాత బెయిలో, అప్పీలో.. బయటకొచ్చేస్తామనే ధైర్యం కూడా వారినీ దుశ్చర్యలకు పురిగొల్పుతోంది. దర్యాప్తు–విచార ణల్లో అసాధారణ జాప్యాలు, అతి తక్కువ (సగటు 27 శాతం) కేసుల్లోనే శిక్షలు పడుతున్న తీరు, శిక్ష ఖరారయ్యాక కూడా దాని అమలు వాయిదాతో అప్పీళ్లు దశాబ్దాలపాటు సాగేలా చూసుకోవడం ఇందుకు నిదర్శనం. ఇటువంటి దురాగతాలకు రాజ కీయ నాయకులు, పలుకుబడి గలిగిన వారు వత్తాసుగా నిలవడం పరిస్థితిని ఇంకా దిగజా రుస్తోంది.

సంబంధాలు తెగిన సమాజం
మనుష్యుల మధ్య సంబంధాలు సన్నగిల్లాయి. నగర, పట్టణ ప్రాంతాల్లో ఒకరికొకరు సంబంధం లేకుండానే బతికేస్తున్నారు. పక్కింట్లో ఏం జరుగు తోందో ఈ ఇంటివాళ్లకు తెలియదు. రోడ్డు మీద కత్తిపోటుకు గురైన మనిషి రక్తపు మడుగులో గిలగిల్లాడుతుంటే... ఓ చూపు చూసి, నిట్టూర్చి తమ మానాన తాము సాగిపోవడం రివాజయింది. కళ్లె దుట ఒకర్ని మరొకరు పొడుస్తున్నా చోద్యం చూస్తు న్నారు. పని ఒత్తిడి లేకుంటే కాసేపు నిలబడి సెల్‌ ఫోన్లో ఫోటోనో, వీడియోనో తీసి సామాజిక మాధ్య మాల్లో పోస్టింగ్‌ పెట్టడం మామూలయింది. తెగించ యినా ప్రాణాలు నిలబెట్టడం మనిషి ప్రధాన కర్తవ్య మనే భావన తగ్గుతోంది. రిస్కు తీసుకోవడానికి సిద్దపడట్లేదు. ‘దాడి నాపై కాదు కదా! నాకెందుకు... అడ్డుకున్నందుకు దుండగులు నాపై కక్ష కడితేనో! సాక్షమివ్వడానికి పోలీస్‌స్టేషన్‌ చుట్టో, కోర్టు చుట్టో తిరగాల్సి వస్తేనో..! ఇలాంటి శంక, మీమాంస ఎక్కు వయింది. ఎర్రగడ్డ ఘటనలో సాహసించిన ఓ యువ కుడు వెనకనుంచి పటేల్మని తన్నడంతో నిందితుడు పడిపోయినందువల్ల, ఒక పోటు తగ్గి మాధవి ప్రాణా లతో బతికి బట్టకట్టింది. కనీసం ఆ జోక్యం లేకుంటే! ఏమయ్యేదో! అత్తాపూర్‌లో ఒక వ్యక్తి నిందితుడ్ని వెనకనుంచి పట్టుకొని నిరోధించడానికి యత్నిం చినా..

తానొక్కడవడం వల్లేమో అది సాధ్యపడ లేదు. విదిల్చుకున్న నిందితుడు వరుస పోట్లతో, లక్ష్యం చేసుకున్న వ్యక్తిని అక్కడికక్కడే హతమా ర్చాడు. దుండగుడి చేతిలో ఉన్నది గన్‌ వంటి ప్రమా దకర మారణాయుధం కాదు, గొడ్డలే అయినందున అక్కడున్నవారిలో ఓ నలుగురయిదుగురు పరస్పరం కనుసైగ చేసుకొని ఒక్కసారిగా నిందితులపై లంఘించి ఉంటే, పరిస్థితి ఎలా ఉండేదో? అనే భావన అత్యధికులు వ్యక్తం చేశారు. ఇలా సాహసం చేసే వారికి తర్వాతయినా పోలీసులు రక్షణ కల్పిం చాలి. ప్రభుత్వం, పోలీసులు, మీడియా... తగు  ప్రోత్సాహకాలివ్వడం, అవార్డులు–రివార్డులతో సత్కరించడం వంటివి చేయాలి. ‘కాదు, మా గుర్తింపు గోప్యంగా ఉంచండ’ని వారు కోరితే అదే చేయాలి. సదరు సాహసం ఇతరులకు స్ఫూర్తి అవు తుంది. నేరగాళ్లను అడ్డుకునేందుకు ఇంకెందరో  సిద్ద  మవుతారు. ఘటనా స్థలిలో సాటి మనుషులే అడ్డు కున్న సందర్భాలు పెరిగితే దుండగుల మొండి సాహ సాలు, హంతక చర్యలు తగ్గుతాయి.

మీడియాకూ బాధ్యత
ప్రసారమాధ్యమాలు సంయమనం పాటించాలని, బాధ్యతతో వ్యవహరించాలని సామాజికవేత్తలంటు న్నారు. పట్టపగలు, వెంటాడి మనిషిని మనిషి చంపే దాష్టీకాలు జరిగినపుడు ప్రసారాల్లో విచక్షణ చూపా లనేది వారి అభిప్రాయం. వాటిని పదే పదే చూపి, ‘ఓస్‌! ఇంతేనా.... హత్య ఇంత తేలికా..? ఇంత సుల భంగా నేరస్థలి నుంచి జారుకోవచ్చా!’ అన్న భావ నలు బలపడనీకుండా ప్రసారాల్లో జాగ్రత్త వహిం చాలి. చిరు చొరవే అయినా.. సాహసించిన వారిని హీరోలుగా చూపాలి. వేగంగా దర్యాప్తు–విచారణ ముగించి, సత్వర న్యాయంతో శిక్షలు పడ్డపుడు మీడియా వాటికెక్కువ ప్రాచుర్యం కల్పించాలనేది నిపుణుల అభిప్రాయం. పౌరులెవరైనా.. తామే పాఠకులు, తామే రిపోర్టర్లయ్యే వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమ వేదికల్లోనూ విచ్చలవిడితనం పెరిగిపోతోంది. ధృవీకరణ లేని వార్తల వ్యాప్తిని ఇక్కడ నిలువరించాలి.

శీఘ్ర విచారణలు నిరంతరం జరగాలి
పోలీసుల నేర దర్యాప్తు ప్రక్రి యల్లో ఇటీవల ఎంతో శాస్త్రీయత వచ్చింది. సాధారణ వేలి ముద్రలకు తోడు డీఎన్యే వేలిముద్రల్ని సరిపోల్చడం, ఇతర ఫొరెన్సిక్‌ పరీక్షలు, సీసీ కెమెరాల ఫుటేజీ విశ్లేషణ, లై డిటెక్టర్ల వాడకం... ఇలా పలు పద్దతులతో నిందితుల్ని ఇట్టే పట్టేస్తున్నారు. దర్యాప్తు వేగంగా ఓ కొలిక్కి తెస్తు న్నారు. శాస్త్ర–సాంకేతిక సహకారం వల్ల వివిధ విభాగాల మధ్య సమన్వయం, దర్యాప్తుల్లో ఖచ్చి తత్వం పెరిగాయి. ఇదే పరిస్థితి న్యాయ విచా రణ–శిక్షల ఖరారులోనూ ఉంటే, నేరస్తుల మీద చట్ట ప్రభావం ఎంతో ఉంటుంది. శిక్ష భయంతో నేరం చేయడానికి జంకుతారు. నేర తీవ్రతను బట్టి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సత్వర న్యాయం కోసం ‘శీఘ్ర విచారణ న్యాయ స్థానాల్ని’ (ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్ట్సు) ఏర్పాటు చేస్తున్నారు. నిర్భయ వంటి కేసుల్లో విచారణ వేగంగా జరిపి, తక్కువ సమయంలోనే శిక్షల్ని ఖరారు చేశారు.

అలాంటి కొన్ని న్యాయ స్థానాలను శాశ్వత ప్రాతిపదికన నడపాలి. తీవ్ర నేరాలు చోటుచేసుకున్నపుడు, సదరు కేసుల విచా రణ అక్కడ జరిపించి సత్వర న్యాయం అందేలా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. దాంతో ప్రజలకు విశ్వాసం, నేరస్తులకు భయం పెరుగుతాయి. జన సమక్షంలో హత్యలు చేసి, పోలీసుల వద్ద నిందితులు లొంగిపోయి, తగు సాక్ష్యాధారాలున్నపుడు... ఏ మాత్రం జాప్యం చేయకుండా వేగంగా విచారణ ముగించాలి. సత్వరం శిక్షలు పడేలా చూస్తే, సమా జంలో చట్టాలు–శిక్షల భయం నిలుస్తుంది. తాను ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలన్నీ మనిషి ఉత్కృష్ట జీవనగతి కోసమే! మనిషి ప్రాణాల్ని కాపాడటం సదరు వ్యవస్థలన్నిటి ప్రాథమిక కర్తవ్యం.

దిలీప్‌ రెడ్డి

మరిన్ని వార్తలు