ఆ బాధ్యత అందరిదీ కాదా?

29 Nov, 2019 01:08 IST|Sakshi

సమకాలీనం

మన రాజ్యాంగం, మూడో అధ్యాయంలో ప్రాథమిక హక్కులకు భద్రత కల్పించారు. అయినా సగటు మనిషి హక్కుల్ని కోల్పోతూనే ఉన్నాడు. రోజూ ఏదో రూపంలో వంచనకు గురవుతూనే ఉన్నాడు. సర్వ వ్యవస్థల్ని చెరబట్టి, అధికారాన్ని కేంద్రీకృతం చేస్తున్న వారు పౌరులకు ఒరగబెట్టిందేమిటి? నెల రోజుల పాటు విచారణ జరుపుతూ వివిధ వ్యాఖ్యలతో ఆశలు రేపిన న్యాయస్థానం చివర్న ‘సమ్మె తప్పో ఒప్పో తేల్చడం మా పరిధిలో లేదు’ అంటే ఆర్టీసీ కార్మికులు ఎటు వెళ్లాలి? ‘సమ్మెకట్టి విధులకు రానంత మాత్రాన ఉద్యోగాలు కోల్పోయినట్టు కాదు..’ అని హైకోర్టు విస్పష్టంగా చెప్పిన తర్వాత కూడా సమ్మె విరమించిన ఉద్యోగులు చాలా వేదనకు గురికావలసి వచ్చింది. పౌరుల నుంచి ఆశిస్తున్నట్టే ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ తమ నిర్దేశిత విధుల్ని బాధ్యతగా నిర్వర్తిస్తే అందరం బాగుపడతాం!

భారతీయ సనాతన సంస్కృతి, వారసత్వ సంపదకు సంబంధించిన సమస్త సాహి త్యంలో ఎక్కడైనా ‘హక్కు’ అనే మాట ఉందా? చెప్పండి! అని సర దాగా సవాల్‌ చేశారు ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పుష్కర కాలం కిందట. సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా ఉన్నాను నేనపుడు. అధికార వ్యవస్థ పారదర్శకంగా ఉండి, ప్రజా సమాచారం ప్రజల కివ్వడం తమ విధిగా భావిస్తే పౌరులు దాన్ని హక్కుగా డిమాండ్‌ చేయాల్సిన అవసరమే రాదన్నది ఆయన కవి హృదయం. నిజమే! ఈ సూక్ష్మం గ్రహించినందునే కాబోలు మన వేదాలో, వేదాంగాలో, ఉపనిషత్తులో, బ్రహ్మసూత్రాలో, పురాణాలో, ఇతిహాసాలో... భారత సనాతన ఆధ్యాత్మిక వాఙ్మయంలో ఎక్కడా హక్కు అనే మాటే కని పించదు. ఎందుకంటే, హక్కులు–విధులు ఒకే నాణేనికి రెండు పార్శా్వలు. ఒకరి హక్కులు ఎదుటి వారి విధులవుతాయి. అలాగే ఎదుటి వారి హక్కులు వీరికి విధులవుతాయి. వ్యక్తులు, జన సమూ హాల మధ్యే కాకుండా, పరస్పరం ఆధారపడ్డ రెండు సంస్థల మధ్య, చివరకు... పౌరులు–రాజ్యం మధ్య కూడా ఇదే బంధం ఉంటుంది.  ఎవరికి వారు, ఎక్కడికక్కడ తమ విధులు–బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తే, ఇక ఎదుటి వారెవరూ హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరమే రాదు. 

మన పురాణ గాథల్లో  కుటుంబంలోని వ్యక్తుల మధ్యే కాదు, అందరికీ, కుటుంబాలకు, సమాజాలకు, రాజ్యానికి కూడా విధుల్ని నిర్దేశించారు. వాటిని పాటించేలా కట్టడి చేశారు. తద్వారా ఎదుటి వారి హక్కులు నెరవేరేలా, వాటికి భంగం కలుగకుండా భద్రత కల్పించారు. డిమాండ్‌ చేసి హక్కులు సాధించుకోవాల్సిన పరిస్థితి ఎవరికీ రానీయవద్దనేది లక్ష్యం. సదరు భావన ఇపుడు లోపిస్తోంది. రాజ్యం, దాని అవిభాజ్య అంగాలు, వివిధ వ్యవస్థలు, సంస్థలు... తమ నిర్దేశిత విధుల్ని, బాధ్యతల్ని, కర్తవ్యాల్ని విస్మరిస్తున్నాయి. ఫలితంగా పౌరులు కడగండ్లపాలవుతున్నారు. విధుల్ని నిర్వర్తించ డంలో అప్పుడప్పుడు పౌరులూ విఫలమౌతున్నారు. మన రాజ్యాం గంలో పౌరులకు కొన్ని విధుల్ని నిర్దేశించారు. సదరు విధుల్ని పాటిం చండని పెద్దలు నొక్కి చెబుతున్నారీ రోజు. మన రాజ్యాంగాన్ని ఆమో దించి 70 ఏళ్లయిన సందర్భంగా మాట్లాడిన భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సహా పెద్దలు పౌరుల విధులు–బాధ్యతల్ని నొక్కి చెప్పారు. విధులు నిర్వ ర్తించకుంటే హక్కులకు రక్షణ ఉండదనీ ధ్వనించారు.
బాధ్యతలు లేనిదెవరికి?

నిజమే! పౌరులకు నిర్దిష్ట విధులున్నాయని భారత రాజ్యాంగం చెబు తోంది. ఎవరికి లేవు? శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతో సహా ముఖ్యమైన ప్రజాస్వామ్య విభాగాలన్నింటికీ నిర్దేశిత బాధ్యత లున్నాయి. ప్రసార మాధ్యమ (మీడియా) వ్యవస్థతో సహా! రాజ్యం నిర్వహించాల్సిన బాధ్యతల్ని రాజ్యాంగం నాలుగో అధ్యాయంలో ఆదేశిక సూత్రాలుగా పేర్కొన్నారు. శాసన–కార్యనిర్వాహక వ్యవస్థల పనితీరు సమీక్షించి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే బాధ్యతను న్యాయ వ్యవస్థకు అప్పగించారు. సమాజ సర్వతోముఖాభివృద్ధికి మీడియా పోషించాల్సిన పాత్ర గురించి ప్రెస్‌ కమిషన్‌ నివేదికతో పాటు ప్రెస్‌ కౌన్సిల్‌ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలూ దేనికదిగా పనిచేసే క్రమంలో పౌరుల హక్కులకు ఎక్కడైనా భంగం కలిగితే న్యాయం పొందవచ్చు. మన రాజ్యాంగం, మూడో అధ్యాయం, ప్రాథమిక హక్కుల రూపంలో ఇందుకు భద్రత కల్పించారు. అయినా సగటు మనిషి హక్కుల్ని కోల్పోతూనే ఉన్నాడు. రోజూ ఏదో రూపంలో వంచనకు గురవుతూనే ఉన్నాడు.

సర్వ వ్యవస్థల్ని చెరబట్టి, అధికారాన్ని కేంద్రీకృతం చేస్తున్న వారు పౌరులకు ఒరగబెట్టిందే మిటి? నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పదిహేడేళ్ల దేవేందర్‌ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖ ఎందరికో కంటతడి పెట్టిం చింది. కారణమేదైనా ఆత్మహత్యలు గర్హనీయం, అందరం ఖండించా ల్సిందే! కానీ, ‘....ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు, పేదలు ఇంకా నిరుపేదలవుతున్నారు... మా వైపు చూడండి, మా అమ్మానాన్నలు రోజూ కూలీ చేస్తున్నా మాకంటూ ఓ ఇల్లు లేదు, నే చచ్చాకయినా మాకో ఇల్లు ఇప్పించండి’ అంటూ ఆలేఖలో ప్రతి ధ్వనించిన యువకుడి ఆర్తి గురించి ఒక నిమిషమైనా ఆలోచించాలి కదా! ‘నిందితులెవరో వెంటనే తెలియదు తప్ప, ఆత్మహత్యలన్నీ హత్యలే!’ అని ఓ సామాజిక శాస్త్రవేత్త అన్నది ఇందుకేనేమో! నెల రోజుల పాటు విచారణ జరుపుతూ వివిధ వ్యాఖ్యలతో ఆశలు రేపిన న్యాయస్థానం చివర్న ‘సమ్మె తప్పో ఒప్పో తేల్చడం మా పరిధిలో లేదు’ అంటే ఆర్టీసీ కార్మికులు ఎటు వెళ్లాలి? ‘సమ్మెకట్టి విధులకు రానంత మాత్రాన ఉద్యోగాలు కోల్పోయినట్టు కాదు...’ అని హైకోర్టు విస్పష్టంగా చెప్పిన తర్వాత కూడా సమ్మె విరమించిన ఉద్యోగులు చాలా వేదనకు గురికావలసి వచ్చింది. ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం, ‘పిల్‌’ (అమరావతి రాజధాని భూములు–ఏబీకే ప్రసాద్‌ కేసు) విచారిస్తూ, బాధ్యత కలిగిన ఓ సంపాదకుడిని, ‘... మీకేమి సంబంధం? మీ భూములు లాక్కొన్నప్పుడు వద్దురు పొండి!’ అని సాక్షాత్తు సుప్రీంకోర్టే అంటే ఇక సాధారణ పౌరులకు దిక్కేది? 

పౌర విధులు స్వీయ బాధ్యత
పౌరుల ప్రాథమిక విధులు రాజ్యాంగంలో మొదట్నుంచి లేవు. 42వ రాజ్యాంగ సవరణతో, అధికరణం 51ఎ ద్వారా 1976 నుంచి అమ ల్లోకి వచ్చాయి. రాజ్యాంగానికి కట్టుబడి ఉండటం, స్వాతంత్య్ర పోరా టాన్ని ప్రభావితం చేసిన విలువల పరిరక్షణ. దేశ సమైక్యత, సమ గ్రత, సార్వభౌమాధికారాన్ని నిలబెట్టడం వంటివన్నీ ఈ ప్రాథమిక విధుల్లో ఉన్నాయి. అవసరం ఏర్పడ్డపుడు దేశ రక్షణకు సేవలందిం చాలి. కుల, మత, వర్గ, వర్ణ, లింగ, ప్రాంత, భాషా భేదాలకతీతంగా మనుషుల్లో సోదర భావం పెంచాలి, మహిళల్ని గౌరవించాలి. మన వైవిధ్య సంస్కృతి, వారసత్వ సంపదకు విలువిచ్చి పరిరక్షించాలి. అడవులు, నదులు, కుంటలు, జీవవైవిధ్యంతో పాటు సర్వ సహజ వనరుల్ని కాపాడుతూ, జీవకారుణ్యంతో ఉండాలి.

హింసను నిలువ రించి, ప్రజా ఆస్తుల్ని పరిరక్షించాలి. శాస్త్రీయ దృక్ప«థం, మానవ విలు వల వృద్ధితో అన్వేషణ–సంస్కరణ పంథాలో సాగాలి. అన్ని రంగాల్లో వ్యక్తిగత, సామూహిక సామర్థ్యాల ద్వారా దేశం ప్రగతి పథంలో సాగేందుకు తోడ్పడాలి. ఆరు–పద్నాలుగేళ్ల మధ్య వయసు పిల్లల తలిదండ్రులుగానో, సంరక్షకులుగానో వారికి విద్యావకాశాలు కల్పిం చాలి. ఇవన్నీ నిర్వర్తించడం దేశ పౌరుల ప్రాథమిక విధి అని రాజ్యాంగం చెబుతోంది. వీటి ఉల్లంఘనలకు నేరుగా న్యాయస్థా నాల్లో న్యాయ పరిష్కారం లేదు. కానీ, ఎప్పటికప్పుడు ఇవన్నీ పౌరులు పాటించేలా సంబంధిత ప్రభుత్వాలు చట్టాలు చేయవచ్చు.  వీటిని రాజ్యాంగంలో చేర్చడం పట్ల కొంత వివాదం, విమర్శ కూడా ఉంది. ఇవన్నీ పౌరులు సహజంగానే చేస్తారని, పైగా ఆచరణ పరమైన స్పష్టత కొరవడిందనేది విమర్శ. నిజానికి 42వ రాజ్యాంగ సవరణే ఒక పీడకల అనే స్థూల అభిప్రాయముంది. 1975లో అర్థరాత్రి విధిం చిన ఆంతరంగిక అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) నీడలో వచ్చిన సవరణలివి.

విధులు పాటించడమే హక్కులకు రక్షణ
ఎవరో చెప్పారని కాదు గానీ, ఎవరికి వారు తమ విధుల్ని నిర్వర్తిం చాలి. ఫలితంగా అందరి హక్కులకు రక్షణ లభిస్తుంది. ఏ చట్టం, రాజ్యాంగపు ఏ అధికరణం నిర్దేశించనవసరం లేకుండా మన వ్యక్తిత్వ రీత్యానే ఈ ప్రాథమిక విధుల్ని పాటించవచ్చు. సద్గురు జగ్గీవాసుదేవ్‌ ఒక పుస్తకంలో బాధ్యతను చక్కగా వివరించారు. ‘బాధ్యత... మూడొంతుల మంది తప్పుగా అర్థం చేసుకున్న పదమిది. అది ఎంత విస్తృతంగా, ఎంత విచక్షణారహితంగా వాడబడుతోందంటే, అది దాని ప్రబలమైన శక్తిని చాలా వరకు కోల్పోయింది. బాధ్యత అంటే ప్రపంచ బరువుని మనమీద వేసుకోవడం కాదు. మీరు చేసినదానికీ చెయ్యని దానికీ నిందని భరించడం కాదు. దానర్థం నిరంతరం అప రాధ భావనతో బ్రతకడం అంతకంటే కాదు. బాధ్యత అంటే కేవలం మీ స్పందనా సామర్థ్యమే. ‘నేను బాధ్యున్ని’ అని మీరు నిర్ణయిం చుకుంటే, స్పందించే సామర్థ్యం మీలో ఏర్పడుతుంది. ‘నేను బాధ్యున్ని కాదు’ అని నిర్ణయించుకుంటే, స్పందించే సామర్థ్యం ఉండదు.

దాన్నంత తేలిగ్గా వివరించవచ్చు, అదంత సరళమైంది..... ఈ క్షణంలో, చెట్లు వదిలే గాలినే మీరు తీసుకుంటున్నారు. మీరు వదిలే శ్వాసనే అవి తీసుకుంటున్నాయి. ఈ ఉచ్ఛ్వాస–నిశ్వాసల లావాదేవీ నిరంతరం సాగుతోంది. మీకిది తెలిసినా తెలియక పోయినా మీ శ్వాసకోశంలో సగభాగం ఆ చెట్లకి వేలాడుతోంది. ఇలా పరస్పరం ఆధారపడి ఉన్నారన్న సంగతి మీరెన్నడూ అనుభూతి చెంది ఉండకపోవచ్చు. మహా అయితే మేధోపరంగా ఆలోచించి ఉంటారు. కానీ, ఈ అనుబంధాన్ని మీరు అనుభూతి చెంది ఉంటే, మీకెవరైనా ‘మొక్కలు నాటండి, అడవుల్ని రక్షించండి, ప్రపంచాన్ని కాపాడండి’ అని చెప్పాలా? అసలు అది అవసరమా?’అన్నారాయన. ఇది గ్రహిస్తే రాజ్యాంగం నిర్దేశించే విధుల్ని మనం విడువకుండా పాటిస్తాం. ఇప్పటికే పాటిస్తున్నాం కూడా! పౌరుల నుంచి ఆశిస్తు న్నట్టే ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ తమ నిర్దేశిత విధుల్ని బాధ్యతగా నిర్వర్తిస్తే అందరం బాగుపడతాం! ఇది నిజం!


వ్యాసకర్త: దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

మరిన్ని వార్తలు