వారి పుట్టుకా ఆ గర్భం నుంచే!

8 Mar, 2019 03:20 IST|Sakshi

సమకాలీనం

‘మార్చి 8’ వస్తోందంటే చాలు, ప్రపంచమంతా అకస్మాత్చేతన పొందుతుంది. పత్రికల్లో, రేడియోల్లో, టీవీల్లో, వెబ్‌సైట్లలో, సామాజిక మాధ్యమాల్లో... ఆ 24 గంటలు, ఎక్కడ చూసినా ‘మహిళ’ కేంద్ర బిందువవుతుంది. కరుణ, దయ, జాలి, అనుకంపన... కట్టలు తెంచుకు ప్రవహిస్తాయి. కానీ, ఆచరణకు వచ్చేసరికి మన అడుగులు వెనక్కి పడుతున్నాయి. మన రోజువారీ నిర్వాకాలు మధ్యయుగాలకు నడుపుతున్నాయి. సభలు, సమావేశాలు, సదస్సులు, లక్ష్యాలు... సరే, అవన్నీ సాగుతూనే ఉంటాయి. ఏక కాలంలో సమాజం అట్టడుగుస్థాయి నుంచి మార్పు రావాలి. కుటుంబమే అందుకు మౌలిక యూనిట్‌ కావాలి. అప్పుడు, సమానత్వం నిజంగా ఎంత అందమైన ఫలం!

‘సమానత్వం’ ఎంత అందమైన పదం! మేధో సమాజం ఆదిపత్యం సాధించిన తర్వాత కూడా దశాబ్దాలు, శతాబ్దాలుగా మనం వల్లెవేస్తున్న పదం. అనేక సమానత్వాల్లో... ఆడ–మగ మధ్య అంతరాలు లేని లింగ సమానత్వం ఒకటి. ఇది ఎప్పటికీ అందమైన కలేనా? ఈ కల నెరవేర్చుకునే దిశలో సరైన అడుగులే పడుతున్నాయా? ఆచరణలో ఎక్కడున్నాం? 2030 నాటికి సాధించాలని ఐక్యరాజ్య సమితి (యుఎన్‌) నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఇదెంతో ప్రాధాన్యతాంశం! సుమారు రెండొందల దేశాలు ఆచరణకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన విధాన పత్రమిది. ‘‘అందరు మహిళలు, బాలికలు సాధికారత పొందేలా లింగ సమానత్వం సాధించాలి... అంతటా, వారి పట్ల అన్ని రకాల వివక్షను అంతమొందించాలి’’ అన్నది స్థూల లక్ష్యం.

మరింత నిర్దిష్ట వ్యక్తీకరణ... ‘‘ప్రైవేటు, పబ్లిక్‌ అన్ని ప్రదేశాల్లోనూ మహిళలు, బాలికలు అందరిపైన లైంగిక హింసతో పాటు ఏ రూపంలోనూ హింస– వేధింపులు అన్నవి లేకుండా నిర్మూలించాలి’’అని పేర్కొన్నారు. ఈ విష యాల్లో, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న తాజా స్థితిని లోతుగా అధ్య యనం చేసి గణాంకాలు, వాస్తవాలు, వివరాలతో ‘హామీలను ఆచరణ లోకి తెద్దాం’ అంటున్న యుఎన్‌ తాజా నివేదిక ఈ సమానత్వ సాధనకు సరికొత్త సిఫారసులు చేస్తోంది. విధానాలు, ఆర్థిక వ్యయం, శాస్త్ర సాంకే తికత వినియోగం, భద్రత–నేరనియంత్రణ, సమగ్ర కార్యాచరణ ఇలా.. అనేకాంశాల్లో ఏం చేస్తే సమానత్వ సాధనలో ఆశించిన లక్ష్యాన్ని చేరుకుం టామన్నది ఈ నివేదికలో పొందుపరిచారు.

సుస్థిరాభివృద్ధి కోసం ఉద్దే శించిన 17 అంశాల్లో ఒకటైన లింగసమానత్వం (అయిదోది) సాధించేం దుకు, మిగిలిన 16 లక్ష్యాల్లోనూ... ఈ అంశం స్థితి, ప్రాతినిధ్యం, ప్రాధా న్యత, ఫలితాల్ని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలన్నది తాజా సిఫా రసుల్లో ఒకటి. ముఖ్యమైన ఇంకో ఆరు సిఫారసులున్నాయి. ఇదంతా ప్రపంచస్థాయిలో జరుగుతోంది. మిగతా విషయాల్లో ఎలా ఉన్నా, ‘విశ్వ స్థాయిలో ఆలోచించు, స్థానికంగా ఆచరించు’ అన్న నినాదం లింగ వివక్షను రూపుమాపి, మహిళలకు తగు భద్రత కల్పించి, సమానత్వం సాధించడంలో అక్షరాలా సరిపోతుంది. కానీ, ఇప్పుడదే లోపిస్తోంది!

ఆలోచనలు ఆకాశాన... ఆచరణ అట్టడుగున
పెద్ద పెద్ద స్థాయిల్లో మన ఆలోచనలు, చర్చలు, అధ్యయనాలు, నివేది కలు ఏటా అందుతూనే ఉన్నాయి. ‘మార్చి 8’ వస్తోందంటే చాలు, ప్రపంచమంతా అకస్మాత్చేతన పొందుతుంది. పత్రికల్లో, రేడియోల్లో, టీవీల్లో, వెబ్‌సైట్లలో, ఇతర సామాజిక మాధ్యమాల్లో... ఆ 24 గంటలు, ఎక్కడ చూసినా ‘మహిళ’ కేంద్ర బిందువౌతుంది. కరుణ, దయ, జాలి, అనుకంప... కట్టలు తెంచుకు ప్రవహిస్తాయి. కానీ, ఆచరణకు వచ్చేసరికి మన అడుగులు వెనక్కి పడుతున్నాయి. మన రోజువారీ నిర్వాకాలు మధ్యయుగాలకు నడుపుతున్నాయి. నట్టిల్లే నరక కూపానికి బీజం వేస్తోంది. పిల్లల పెంపుదలే వివక్షకు ఆజ్యం పోస్తోంది. బాధ్యత మరచిన బడి, కాలేజీ, యూనివర్సిటీలకు చేష్టలుడిగాయి.

ఎదిగీ ఎదగని లేత మెదళ్లను కలుషితం చేసే సాంస్కృతిక దాడి ముప్పేటా జరుగుతోంది. అదే క్రమంలో, కాలం చెల్లిన కట్టుబాట్లు, చేవలేని చట్టాలు, పదును తగ్గిన నేరదర్యాప్తులు, సకాలంలో న్యాయం అందించని న్యాయస్థా నాలు...  ఇవన్నీ ఆమెకు ప్రతికూలమే! ముఖ్యంగా మహిళలు, బాలిక లపై సాగుతున్న హింస, వేధింపులను ఎవరూ తీవ్రంగా పట్టించుకో వడం లేదు. ఇల్లయితేం, పనిప్రదేశమైతేనేం... అంతర్‌–బహిర్‌ హింసకు నేడు అడ్డూ అదుపూ లేదు. నోరిప్పి వెళ్లడించని, ఎక్కడా నమోదుకాని హింస నాలుగ్గోడల మధ్య కర్కశంగా రాజ్యమేలుతోంది.

నిర్హేతుకంగా యుక్తవయసులోనే యువతుల జీవితాలు ఆరిపోతున్నాయి. గృహిణులు అనామకంగా హత్యలకు గురై, కిరోసిన్‌–పెట్రోల్‌ మంటకు ఆవిరై, గుర్తు తెలియని శవాలై... కుటుంబాలే కుదేలైపోతున్నాయి. ముందు అవి ఆగి పోవాలి. కానీ, అది జరగట్లేదు. ఈ హింస నానాటికి పెరుగుతోంది. దేశంలో గడచిన నాలుగేళ్లలోనే మహిళపై హింస 34 శాతం పెరిగిందని అధికారిక క్రైమ్‌ రికార్డులు చెబుతున్నాయి. నమోదవని హింస ముందు ఇది పిసరంత! మన చుట్టూ మనం పట్టించుకోని, తగినంత శ్రద్ద చూపని పలు స్థానిక అంశాలే ఈ దుస్థితిని పెంచి పోషిస్తున్నాయి.

భావజాలమే మూలకారణం
మొన్కొక శిరీష, నిన్న జ్యోతి, నేడు రవళి... పేర్లేమైతేనేం, ప్రాంతమెక్క డయితేనేం దుర్మార్గంగా హత్యలకు గురయ్యారు. సభ్యసమాజం ప్రగా ఢంగా సానుభూతి తెలిపింది. ప్రసారమాధ్యమాలు ఎలుగెత్తి చాటాయి. దర్యాప్తు సంస్థలు వాటి స్థాయిలో ‘యధాశక్తి’ స్పందించాయి. ఈ మాట ఎందుకనాల్సి వస్తోందంటే, పాతిపెట్టిన శవాన్ని మట్టిపొరల్లోంచి తవ్వి పోస్టుమార్టమ్‌ చేసేంత ఒత్తిడి పెంచితే గాని నిందితుడి వైపు అడుగులు పడలేదు, హత్య దర్యాప్తు ఓ కొలిక్కి రాలేదు! ఇలా వెలుగు చూడని దురాగతాలెన్నో! డబ్బుకో, కులానికో, రాజకీయ ఒత్తిళ్లకో లొంగి దర్యా ప్తులు మందగించడంతో కంచికి చేరని కథలెన్నెన్నో!! ముదిరిన ఈ సామాజిక రుగ్మతకు నెమ్మదైన కాయకల్ప చికిత్సలు జరుగుతూనే ఉన్నాయి.

మూలాల్లో మాత్రం మార్పులేదు. చదువురాని జులాయిల నుంచి, సంపన్న కుటుంబాల మోతుబరి యువకుల వరకు... ప్రేమకు, వ్యామోహానికి, వాంఛకు మధ్య తేడాలు తెలియని స్థితిలో యువతులపై బరితెగించే సాహసాలు నలువైపుల పెచ్చుమీరుతున్నాయి. ఏ మాధ్య మం ద్వారా ఏ రోజు ఏం వార్త వినాల్సివస్తుందో తెలియని భయం, ఆందోళనలు వెన్నాడుతూనే ఉన్నాయి! విచక్షణా జ్ఞానం లేని అపరిపక్వ స్థితిలో ‘ప్రేమించా–ప్రేమించు’ అని యువతులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ఉన్మాదస్థితికి చేరి హత్యలు, హత్యాయత్నాలు, తీవ్రంగా గాయపరచ డాలు... ఇలా ఎన్నెన్నో అకృత్యాలు జరిగిపోతున్నాయి.

బాధ్యతారహి తంగా తీసే చౌకబారు సినిమాలు, టీవీ సీరియళ్లు, విచ్ఛలవిడిగా అందు బాటులోకి వచ్చిన విశృంఖల శృంగార సైట్లు (పోర్నో) యువతరాన్నే గాక వివాహితులను కూడా వక్రమార్గాల్లోకి నడుపుతున్నాయి. వివాహే తర లైంగిక సంబంధాలు అనేక విపరిణామాలకు, హింసకు, చివరకు భౌతిక దాడులు, భౌతిక నిర్మూలనకూ దారి తీస్తున్నాయి. ఎన్నో కుటుం బాల్లో చిచ్చు రగులుస్తున్నాయి. అన్ని చోట్లా మహిళలే బలిపశువులవుతు న్నారు. స్త్రీని సొత్తుగా భావించే పురుషాధిక్య, భూస్వామ్య భావజాలం తాలూకు అవలక్షణాల వల్లే ఇది జరుగుతోంది.

చట్టాలంటే భయముండాలి
ఉన్మాదిగా మారినపుడు, మూర్ఖపు తెగింపే తప్ప చట్టమనే భయముం డదు. నిర్భయ వంటి కఠిన చట్టాల కింద కేసులు పెడతారని తెలిసినా లైంగిక దాడులకు, హింసకు పాల్పడటానికి ఇదొక గట్టి కారణం. అదే సమయంలో మన ‘నేర దర్యాప్తు–న్యాయ వ్యవస్థ’ లొసుగుల వల్ల, పట్టుబడ్డా తమకేమీ కాదనే ధీమా కూడా ఒకోసారి లేని తెగింపునిస్తుంది. మహబూబ్‌నగర్‌ హత్య కేసులో పట్టుబడ్డ ఒక నిందితుడు, గడచిన 15 ఏళ్లలో 12 హత్యలు చేసినట్టు వెల్లడయింది. తాజా దర్యాప్తు సందర్భం గానే ఇదంతా తేలింది.

అంటే, 12 వ హత్యకు పాల్పడి ఉండకపోతే? దర్యాప్తు–విచారణ ప్రక్రియ లోపరహితంగా ఉంటేనే, చట్టాలంటే జనాలకు భయముంటుంది. ముఖ్యంగా లైంగిక నేరాల్లో వాటిని నిలువ రించడం కన్నా మేదడులో నేర ప్రవృత్తి బలపడకుండా నియంత్రించ డమే మంచిది. అభివృద్ది చెందిన దేశాల్లో ఇందుకు ప్రత్యేక శ్రద్ద పెడ తారు. పిల్లలపై లైంగిక హింసకు పాల్పడే మానసిక రుగ్మత (పిడో ఫైల్‌)ను చాలా తీవ్రంగా పరిగణిస్తారు. ఉన్మాద లక్షణాల్ని గుర్తించి, వారి కదలికలు, తదుపరి ఎత్తుగడలపై నిరంతర నిఘా వేస్తారు.

మనదగ్గర, తమ కూతుర్ని పలానా యువకుడు వేధిస్తున్నాడని తలిదండ్రులు పోలీసు కేసు చేసి, కౌన్సిలింగ్‌ జరిపించిన తర్వాత జరిగిన హత్యలెన్నో! లైంగిక నేరాలెంత ప్రమాదకరమో తెలిసేలా హైస్కూల్‌ స్థాయిలో ఓ పాఠం పెట్టాలి. వివక్ష మంచిది కాదని, సమానత్వమే గొప్ప అనే భావ నను ఇల్లు, బడి, కాలేజీ స్థాయిల్లో బలోపేతం చేయాలి. సమాజపు వివిధ పార్శా్వల్లో ఆ భావనల్ని పరివ్యాప్తం చేయాలి.

ఆ కడుపునే పుట్టి పెరుగుతున్నారు
యుక్తవయసులో బయటకు వెళ్లే కూతుళ్లకు సవాలక్ష సూచనలు, హెచ్చ రికలు చేసే తలిదండ్రులు కొడుకులకు ఎందుకు చేయరు? ‘ఇదుగో.. నీకు ఇలాంటి సవాళ్లు, సమస్యలుంటాయి జాగ్రత్త!’ అని ఆడపిల్లలకు చెబుతారు. కంటికి రెప్పలా కాచుకుంటారు. మరి, ఆయా దురాగతాలకు పాల్పడేది తమ కొడుకులో, వారి వంటి ఇతర యువకులో అని ఆయా తలిదండ్రులకు తెలియదా? ‘మీకు ప్రమాద ఆస్కారం ఉంటుంది’ అని కూతురుకు చెప్పినట్టే, ‘మీ వల్ల ఇలాంటి ప్రమాదం జరుగొచ్చు, జరుగొద్దు’ అని కొడుకులకూ చెప్పాలి కద! కానీ, అది జరుగదు. అదే జరిగితే ఇంత విచ్చలవిడితనం, ఉన్మాదం, హింస ఉండవు. అర్థరాత్రి, అపరాత్రి ఇంటికొచ్చే యుక్తవయసు తనయులు ఎక్కడ తిరుగుతు న్నారు, ఏ చెడు సహవాసాలు చేస్తున్నారు పట్టించుకునే తలిదండ్రులెంత మంది ఉంటారు? గంట ఆలస్యమైతే కూతురికి ఏమైందో అని ఆందో ళన. ఒకోసారి... ఏ చెడుతిరుగుళ్లు తిరుగుతుందో అనే శంక! మరి, కుమారుల విషయంలోనూ అంతటి శ్రద్ద ఉండాలి.

‘వాడికేం, వాడు మగాడు’ అనే తప్పుడు భావజాలమే నేరాలకు, నేర స్వభావానికి బీజం వేస్తోంది. సదరు వివక్ష ఇంట్లోనే, తలిదండ్రుల బాధ్యతారాహిత్యం వల్లే మొలకెత్తుతోంది. తిండిలో, బట్టల్లో, వ్యయంలో, తిరుగుళ్లలో.... ఒక్కటే మిటి అన్ని విషయాల్లోనూ ఇదే వివక్ష! ఎదిగే చిరు మెదళ్లలో విభిన్న ఆలోచనా ధోరణులను ఈ వైఖరే పెంచుతోంది. ఆపై, సున్నితవిషయా లేవీ పట్టించుకోని బడుల్లో, కాలేజీల్లో ఆ విషపు మొక్క బలోపేతమౌ తోంది. దానికి... నేటి సినిమా, టీవీ, స్మార్ట్‌ఫోన్‌ ద్వారా తేలిగ్గా లభి స్తున్న ఉత్ప్రేరక మాల్‌–మసాలా మాంచి ఎరువులా పనిచేస్తోంది. ఇక అది వటవృక్షమౌతోంది.

ఫలితంగా, విచక్షణ కోల్పోయి ఎంతటి ఉన్మా దానికైనా బరితెగిస్తున్నారు. సభలు, సమావేశాలు, సదస్సులు, సుస్థిరా భివృద్ధి లక్ష్యాలు... సరే, అవన్నీ సాగుతూనే ఉంటాయి, మంచిదే! ఏక కాలంలో సమాజం అట్టడుగుస్థాయి నుంచి మార్పు రావాలి. కుటుం బమే అందుకు మౌలిక యూనిట్‌ కావాలి. అప్పుడు, సమానత్వం నిజంగా ఎంత అందమైన ఫలం! (నేడు అంతర్జాతీయ మహిళాదినోత్సవం)


వ్యాసకర్త: దిలీప్‌ రెడ్డి, ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పోలీస్‌ సంస్కరణ సాధ్యమా?

రాయని డైరీ.. మమతాబెనర్జీ (సీఎం)

అయోమయమా, అతి లౌక్యమా?

గంజాయిపూత పండితే..!

‘గుజరాత్‌ మోడల్‌’ మారేనా?

చే లాంటి యోధుడు మళ్ళీ పుట్టడు

నాగరిక చట్టం అడవికి వర్తించదా?

హక్కులు దక్కితేనే రైతుకు రక్ష!

కనీస మద్దతు ధర ఒక భ్రమ

నయవంచన వీడని ‘నారా’గణం

లక్షమంది బీసీలకు గురుకులాల విద్య

‘కమలం’ ఆశలు ఫలిస్తాయా?

ధిక్కార స్వరం గిరీష్‌

ప్రత్యేక హోదా ఏపీ జీవనాడి

సోనియా గాంధీ(యూపీఏ) రాయని డైరీ

ఉగ్రరూపం దాలుస్తున్న వాయు కాలుష్యం

వడివడి అడుగులు!

రెపో రేటు తగ్గింపు వృద్ధి సంకేతమేనా?

శాపనార్థాలకి ఓట్లు రాలవ్‌

క్రికెట్‌లో ‘బలిదాన్‌’ ఎందుకు?

ప్రజాప్రయోజనాలు రహస్యమా? 

త్రిభాషా శిరోభారం ఇంకెన్నాళ్లు?

ప్రగతికి పనిముట్టు పుస్తకం

‘సబ్‌కా విశ్వాస్‌’లో వాళ్లకు చోటుందా?

ప్రేమతత్వాన్ని ప్రోదిచేసే ఈద్‌

పచ్చగా ఉండాలంటే.. పచ్చదనం ఉండాలి

నిష్క్రమణే నికార్సయిన మందు!

స్వయంకృత పరాభవం

‘ఏపీ అవతరణ’ తేదీ ఎప్పుడు?

విదురుడిలా! వికర్ణుడిలా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అలా మాట్లాడటం తప్పు

ఆదిత్య వర్మ రెడీ

తిరిగొస్తున్నా

మళ్ళీ మళ్ళీ చూశా

ఆ టైటిల్‌ చూసి ఎవరొస్తారన్నారు?

వారికి ఆ అర్హత లేదు