ఆదివాసులకు అన్యాయం చేయొద్దు

3 Mar, 2018 01:04 IST|Sakshi
హరిభూషణ్‌(యాపనారాయణ)

ఆదివాసీల రిజర్వేషన్లలో 1976 నుంచి లంబాడీలను చేర్చినందువల్ల ఆదివాసులు చాలా నష్టపో యారు. ఇప్పటికైనా లంబాడీలను వేరు చేసి వారికి విడిగా రిజర్వేషన్లు కల్పించాలి. సమస్యను ఇరువర్గాలు మిత్రవైరుధ్యంగా గుర్తించి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.

ఆదివాసులకు పది శాతం రిజర్వేషన్లు, ముస్లింలకు 12 శాతం రిజ ర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన బిల్లు కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే ఆమోదం పొందక తిరిగి వచ్చింది. ఆదివాసుల రిజర్వేషన్‌ పెంపు, ముస్లిం రిజర్వేషన్‌ పెంపు, వేరు వేరు బిల్లుల రూపంలో ఉండాలనే ఇంగిత జ్ఞానం కూడా పాటించకుండా ఆది వాసులపట్ల, ముస్లింలపట్ల ఎంతో ప్రేమ ఉన్నట్లు రూపొందించిన ఈ బిల్లు 1986లో ఎన్టీఆర్‌ బీసీలకు 25 శాతం నుంచి 40 శాతానికి పెంపు చేస్తూ రూపొందించిన బిల్లు వంటిదే. అది హైకోర్టు కొట్టి వేస్తే టీడీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా పోలేదు. ఆ తాను నుంచే వచ్చిన ముక్క అయిన కేసీఆర్, ఆయన స్థాపించిన టీఆర్‌ఎస్‌ ఇవ్వాళ ప్రపంచవ్యాప్తంగానూ, దేశంలోనూ సామ్రాజ్యవాద, బ్రాహ్మణీయ భూస్వామ్య భావజాలానికి, పాలనకు వ్యతిరేకంగా ముందు భాగాన నిలబడి పోరాడుతున్న మూల ఆదివాసులపై, ముస్లింలపై ప్రేమ చూపుతారంటే తోడేళ్లు, గొర్రెలకు మేలు చేయడం వంటిదే.

ఆదివాసులకే పరిమితమై ఆలోచించినా ఒకవైపు రాజ్యాంగం లోని 5వ షెడ్యూల్‌ రూపొందించిన మార్గదర్శకాలను కూడా తుంగలో తొక్కి ఎస్టీ జాబితాలోకి లంబాడాలను చేర్చి మూల ఆది వాసీలకు, లంబాడాలకు మధ్యన చిచ్చు పెట్టి పీడిత వర్గాల ఘర్ష ణల్లో, విభేదాలు, వైమనస్యాలు, విద్వేషాల్లో రగుల్కొంటున్న మంటల్లో పేలాలేరుకుంటున్న ప్రభుత్వం.. మరొ కవైపు ఎస్టీ రిజర్వేషన్లను పది శాతానికి పెంచి బిల్లును శాసనం చేయగలదని, చేసినా మూల ఆదివాసులకు న్యాయం చేయగలదని ఆశించడం అత్యాశే అవుతుంది. ఇపుడున్న ఆరు శాతం రిజ ర్వేషన్లలోనూ నాలుగు శాతమే అమలవుతున్నది. ఈ నాలుగు శాతంలో నాలుగో వంతు కూడా మూల ఆదివాసులకు దక్కడం లేదు. కారణం 1976లో లంబాడాలను అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చిన దగ్గర్నించే గత నలభై రెండేళ్లలో మూల ఆదివాసుల జనాభాకు లంబాడాల జనాభా ఇరవై రెట్లకు పెరిగింది.

లంబాడాల వలసలు వేగవంతంగా పెరగడమే ఇందుకు కారణం. 1961లో 81,366గా ఉన్న లంబాడా జనాభా 2011లో 20,99,524కు పెరిగింది. ఏజెన్సీలో మూల ఆదివాసుల జనాభా 2011లో 9 లక్షలుగా మైనారిటీకి పడిపోయింది. కనుక ఈ పరిస్థితిలో ఎస్టీ రిజర్వేషన్లు పదిశాతం అమలయినా మూల ఆదివాసులు పొందే ప్రయోజనమెంతో, పాలక వర్గాలు ఆడుతున్న ఓటు బ్యాంకు రాజ కీయాలు ఎంత దుర్బుద్ధితో కూడినవో ఎవరైనా న్యాయంగా ఆలోచిస్తే అర్థం అవుతుంది. రాజ్యాంగం ప్రకారం అడవిలో, ఏజెన్సీలో మూల ఆదివాసులకు మాత్రమే దక్కవలసిన జల్, జంగల్, జమీన్‌లపై అధి కారం గ్యారంటీ కావాలన్నా రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృ తిక, విద్యా, ఉద్యోగ, భూసంబంధ హక్కులు అమలు కావాలన్నా 1976లో చేసిన చట్ట సవరణను రద్దు చేయవలసిందే. రిజర్వేషన్ల అమలులో 1976ను కటాఫ్‌ డేట్‌గా గుర్తించి బ్యాక్‌లాగ్‌ పోస్టులను, భూమి పట్టాలను బ్యాక్‌లాగ్‌ పద్ధతిలో అమలు చేయాల్సిందే.

ఎస్టీ వర్గీకరణ అంటే మూల ఆదివాసీ తెగల్లోనే గోండు, కోలాము, పరధాను, పరమేశు, నాయకపోడు, చెంచు వంటి ఆదివాసీ తెగల జనాభా ప్రాతిపదికపైననే కానీ మైదాన ప్రాంత సంచార జాతి అయిన లంబాడాలను కలిపి కాదు. 1976ను కటాఫ్‌ తేదీగా గుర్తించి వలస లంబాడాలను ఎస్టీ రిజర్వేషన్ల నుంచి తొలగించాలి. 1976 నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లంబాడాలకు ఆయా రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు ఇక్కడ ఇవ్వాలి. అయితే అది రాజ్యాంగంలోని ఎస్సీ, ఎస్టీ గుర్తింపు కాజాలదు. కాయితా లంబాడాలు, వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో చేరజాలరు. అడవిలో మూల ఆదివాసుల నివాసం, తొలి రోజుల్లో ఆహారాన్వేషణ, వేట, కాలక్రమంలో పోడు వ్యవసాయం, ఏజెన్సీలో ఉనికి, ఎస్టీ గుర్తింపుకు ప్రాతిపదిక కావాలి. ఐదవ షెడ్యూల్డు ఏజెన్సీ (అటవీ) ప్రాంతాల్లో ఏజెన్సీ సర్టిఫికెట్లు మూల ఆదివాసులకు మాత్రమే ఇవ్వాలి. ఏజెన్సీ ప్రాంతంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వగైరా రాజకీయాధికారా లన్నీ మూల ఆదివాసు లకే పరిమితం కావాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో నూటికి నూరు శాతం ఉద్యోగాలు మూల ఆదివాసులకే ఇవ్వాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో రెసి డెన్షియల్‌ స్కూళ్లలో, కాలేజీలలో మూల ఆది వాసుల పిల్లలకే సీట్లు ఇవ్వాలి. జీసీసీలో మూల ఆదివాసులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.

ఆదివాసుల సంస్కృతిని అగౌరవ పరిచే చర్యలు చేపట్టవద్దు. సూకీ మాత, సేవాలాల్‌ చిత్రాలను ఆదివాసీ మ్యూజియంలో పెట్టడం సరిౖయెంది కాదు. మేడారం ట్రస్టులో ఆదివాసులు మాత్రమే ఉండాలి. జోడన్‌ఘాట్‌లో కొమురం భీం విగ్రహానికి చెప్పుల దండ వేయడం రాజ్య ప్రేరేపిత అవమానకర చర్య. ఆదివాసుల మనోభావాలను గాయపరిచే చర్య. ఏజెన్సీ ప్రాంత ఐడీడీఐలలో మూల ఆదివాసులకు మాత్రమే హక్కులుండాలి. లంబాడా ప్రజలకు ప్రత్యేకంగా మైదాన ప్రాంతాలలో రిజర్వేషన్లు కల్పించాలి. ఐటిడీ ఏలు నెలకొల్పాలి. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లపై హైకోర్టు న్యాయ మూర్తులతో ఒక కమిషన్‌ వేయాలి.
ప్రభుత్వ రంగం రోజురోజుకూ కుంచించుకు పోతున్న నేపథ్యంలో రిజర్వేషన్లు పీడిత, పేద ప్రజల సమస్యలనన్నింటినీ పరిష్కరింప జాలవు. వాటివల్ల ఉపయోగం చాలా పరిమిత మైందనే ఎరుక ఉండాలి.

మూల ఆదివాసులకు జల్‌ జంగల్‌ జమీన్‌లపై సర్వాధికారాలు దక్కాలంటే ఆదివాసీయేతరులైన పేదలు, పీడితులు ముఖ్యంగా లంబాడాలు మూల ఆదివాసులకు శత్రువులనీ, లంబాడాలకు దక్కవల సిన న్యాయం దక్కకూడదనీ అర్థం కాదు. పాలకవర్గాలు పెట్టిన కుట్ర తప్ప మూల ఆదివాసులకు, లంబాడాలకు మధ్యనున్నది మిత్ర వైరు ధ్యమే. దీనిని మిత్ర వైరుధ్యంగానే గుర్తించి మూల ఆదివాసులు, లంబాడాలు, ఆదివాసీయేతర పీడిత, పోరాట ప్రజానీకంతో కలిసి పరిష్కరించుకోవాలి. భూస్వాములు, దళారీ పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాద ఏజెంట్లే అసలైన శత్రువులు. వాళ్లే ఈ ఘర్షణలకు మూలం. ప్రభుత్వాలు వాళ్ల చేతుల్లో కీలుబొమ్మలు. మూల ఆదివా సులు, లంబాడాలు, పీడిత ప్రజలందరూ ఐక్యమై దోపిడీ పాలక వర్గా లకు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడటం ద్వారానే పేద ప్రజలం దరికీ న్యాయమైన భవిష్యత్తు సాధ్యమవుతుంది.

మూల ఆదివాసులు జల్, జంగల్, జమీన్, స్వీయ గౌరవం కోసం పీడిత ప్రజలందరితో ఐక్యమై పోరాడాలి. స్వపరిపాలన కోసం పోరాడాలి. మిలిటెంటు పోరాటాల ద్వారా తప్ప ఎన్నికల రాజకీ యాల ద్వారా పేద, పీడిత ప్రజలకు లభించేది ఎండమావులే. అంతిమ సారాంశంలో పీడిత ప్రజలందరితోపాటు మూల ఆదివా సుల సమస్యలకు పరిష్కారం నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానే సాధ్యం. పోరాటానికి అది మార్గదర్శకం, లక్ష్యం కావాలి.
(మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి యాపనారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ అలియాస్‌ జగన్‌.. ఎన్‌కౌంటర్‌  ఘటన జరగటానికి ముందు రోజు ‘సాక్షి’కి పంపిన వ్యాసం)

మరిన్ని వార్తలు