నాణ్యమైన విద్యాబోధనకు భరోసా

18 Jun, 2020 01:17 IST|Sakshi

సందర్భం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం లో తెలంగాణ అన్ని రంగాలలో వివక్షకు గురయినట్టే విద్యారంగం కూడా వివక్షకు గురయింది. ప్రజలు కోరుకున్న ఆంగ్లమాధ్యమ విద్య అందకపోగా దాన్ని ప్రైవేట్‌ రంగంలో పెట్టి విద్యను ఖరీదైనదిగా మార్చారు. కోస్తా ప్రాంతానికి చెందిన ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యనందించే పెట్టుబడిదారులే విద్యాలయాలు నడిపించి పేదలకు విద్యను గగనకుసుమం చేశారు. వ్యాపారంగా మార్చి చదువుకోవడాన్ని చదువు‘కొనడం’గా మార్చారు. ప్రభుత్వ విద్యను అటకెక్కించారు. కోస్తా ప్రాంతంలో విశ్వవిద్యాలయాలు, రెసిడెన్షియల్‌ కళాశాలలు, పాఠశాలలు తెరుచుకొని తెలంగాణను నిర్లక్ష్యం చేశారు. పేదవారు నాణ్యమైన విద్యకోసం, పోటీని తట్టుకోవడం కోసం అంగలారుస్తున్నారు. బహుజన వర్గాల్లోనూ ఇంగ్లిష్‌ మాధ్యమం, నాణ్యమైన విద్యకావాలన్న డిమాండ్‌ బలంగా పెరిగింది.

నాణ్యమైన విద్య, ఇంగ్లిష్‌ మీడియం ప్రభుత్వ రంగంలో లభించినప్పుడు మాత్రమే అది పేద బహుజన కులాల పిల్లల కందుతుంది. ప్రైవేట్‌ రంగంలో ఉన్న వేల, లక్షల ఫీజు భారాన్ని గ్రామీణపేద బహుజనులు భరించే స్థితిలో లేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టి.ఆర్‌.ఎస్‌ ప్రభుత్వం ఏర్పడే నాటికి తెలంగాణ విద్యారంగం ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం, ప్రైవేట్‌లో ఇంగ్లిష్‌ మాధ్యమం వుంది. ఉన్నత విద్యలోనూ ఇదే పరిస్థితి. ప్రజలు ముఖ్యంగా గ్రామీణ పేద బహుజనులు కోరుకుంటున్న ఇంగ్లిష్‌ మాధ్యమం. నాణ్యమైన విద్యను అందించడం ఎలా అనే విషయంలో ప్రభుత్వ పరంగా చర్చోపచర్చలు జరిగాయి. నాణ్యమైన విద్యంటే రాచిరంపాన పెట్టి ఎంసెట్‌ ధ్యేయంగా మాత్రమే ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు విద్యనందించడం కాదు. విద్యార్థి అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించడం, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలనూ ఎదుర్కోవడం. చదువును జీవితానికి అన్వయించుకోవడం... ఇవి సాధ్యపడేలా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెసిడెన్షియల్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ, పీజీ కళాశాలలు నాలుగైదేళ్ళలో రెండింతలకంటే ఎక్కువై 900కు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇవి పెరిగి ప్రతి మండలంలో నాణ్యమైన విద్య గ్రామీణుల కందుతోంది.  

సగర్వంగా, సమున్నతంగా ఇవీ మా నాణ్యమైన విద్యాలయాలకు నమూనా అని చెప్పుకోదగ్గవి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వీటి సంఖ్య 267 ఉన్నా క్రమక్రమంగా వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. క్రీడలకు ప్రైవేటు విద్యాసంస్థలు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. కనీసం విద్యార్థులు కూర్చోడానికి సరిపడా స్థలం కూడా లేనిచోట ఆ సంస్థలు నడుస్తుండగా ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు మాత్రం విశాలమైన బయటి ప్రదేశాల్లో ప్రకృతి మధ్య ఉన్నాయి. చదువుతో పాటు ఇతరేతర వ్యాపకాలు, ఉపన్యాస పోటీలు, క్విజ్‌లు, సాహిత్య కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సెమినార్లు... నిర్వహిస్తూ విద్యార్థి మనో వికాసానికి తోడ్పడుతున్నాయి. చదువులు ముగిశాక అందరికీ ఉద్యోగాలు రావడం ఏ సమాజంలోనూ సాధ్యంకాదు. కానీ, ఆ జ్ఞానంతో సొంతంగా బతకగలిగే స్థితి పొందాలి. చిన్న ఉద్యోగం నుండి ఉన్నతోద్యోగాలు పొందడానికి కావాల్సిన నైపుణ్యాలతో పాటు స్వయం ఉపాధితో బతకగలిగే స్థితి రావాలి. తెలంగాణ గురుకుల విద్యాలయాలు ఆ పని చేస్తున్నాయి. కేవలం పుస్తకాల జ్ఞానమే కాకుండా సినిమా, పెయింటింగ్, డ్రైనేజ్, సేంద్రియ వ్యవసాయం, వంటలు, రోజువారీ జీవితంలోని అవసరాలు, కరాటే, కుంగ్‌ఫూ... లాంటి అనేక విషయాలపై అవగాహన కల్పించడం ఈ విద్యాలయాల ప్రత్యేకత.

సమ్మర్‌ క్యాంపుల్లో భారతదేశంలో ప్రధాన వృత్తి అయిన వ్యవసాయం, కంప్యూటర్, కౌన్‌బనేగా కరోడ్‌ పతి లాంటి విజ్ఞాన సముపార్జనకు సంబంధించిన విషయాలన్నింటిపై అవగాహన కల్గిస్తున్నారు. ఇక్కడ చదివిన అమ్మాయిలు ఎవరెస్ట్‌ విజేతలు కావడం తెలంగాణకే గర్వకారణం. అంతేకాదు... ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో డాక్టర్లు, డెంటల్‌ డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఐటీయన్లు కావడం, సీఏ, నల్సార్, సెంట్రల్‌ యూనివర్సిటీ, ఢిల్లీ యూనిర్సిటీల్లో  ఈ విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. తెలంగాణ బహుజన సమాజం చిరకాల స్వప్నమైన నాణ్యమైన, ఇంగ్లిష్‌ విద్య  అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఆ విద్యాలయాల రధసారథి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌కు తెలంగాణ బహుజన సమాజం రుణపడి ఉంటుంది.


డా.కాలువ మల్లయ్య 
వ్యాసకర్త రచయిత, కవి
మొబైల్‌: 9182918567

 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు