సాగు అంచనాపై అలసత్వమే అసలు ప్రమాదం..!

22 Dec, 2019 01:16 IST|Sakshi

సందర్భం

వ్యవసాయరంగ సమస్యలపై బడ్జెట్‌ ముందస్తు చర్చలకు గాను నన్ను ఆహ్వానించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక విషయానికొస్తే చుక్కలంటుతున్న ఉల్లి ధరలను ప్రస్తావించకుండా ఈరోజుల్లో ఏ చర్చా సంపూర్తి కాదు. కొన్ని నెలల క్రితం కిలోకి 10 నుంచి 20 రూపాయలుగా ఉన్న ఉల్లి ధర ప్రస్తుతం రూ. 200లకు చేరడంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. 

ఇక కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఉన్న ప్రభుత్వాలు ఎప్పటిలాగే, ఉల్లి దిగుమతులు, సబ్సిడీ ధరలకు ఉల్లిపాయలను సరఫరా చేయడంపై యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది ప్రజలు ప్రతిరోజూ తమ ఆధార్‌ కార్డును సమర్పించి కిలో ఉల్లిపాయలు కొనడానికి పొడవాటి క్యూలలో నిలబడి వేసారిపోతున్నారు. 

భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినిపోవడం, అదే సమయంలో డిమాండ్‌ మాత్రం యధాతథంగా ఉండటంతో ఉల్లిధరలు భారీగా పెరగడం వాస్తవం. దీనికితోడుగా వ్యాపారులు కృత్రిమంగా నిల్వ చేయడంతో ఉల్లిధరలు చుక్కలంటి దేశమంతా గగ్గోలు బయలుదేరింది. దేశంలో ఉల్లి పంటల ఉత్పత్తి పరిమాణంపై నిర్దిష్టమైన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంటే ముందస్తు చర్య తీసుకోవడానికి వీలవుతుందని ఉల్లి సంక్షోభం మంచి గుణపాఠాలను అందించింది. భారీగా పంట పండటంతో ధరలు పూర్తిగా పడిపోయిన కారణంగా తక్కువ ధరలకు పంటలు అమ్ముకోవడం, పండిన పంటను నేలపాలు చేయడం వంటి ఘటనలు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఉల్లిపాయల ఉత్పత్తి తగ్గుముఖం పడుతోందని తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా ఉల్లి దిగుమతులకు పూనుకుంటే ధరలు ఈ స్థాయిలో పెరిగేవి కావు.

ఉల్లిధరలు పెరగ్గానే దేశవ్యాప్తంగా గగ్గోలు పెడుతున్నప్పటికీ ఉల్లిధరలు పడిపోయినప్పుడు రైతుకోసం ఏ ఒక్కరూ చుక్క కన్నీరు కార్చకపోవడాన్ని ప్రభుత్వం గుర్తించాలి. అనేక వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటిస్తోంది కానీ వరి, గోధుమ, పత్తి వంటి కొన్ని పంటలకు మినహాయిస్తే మిగిలిన పంటల విషయంలో దాన్ని అమలు చేయడానికి తగిన యంత్రాంగం కానీ, వనరులు కానీ లేవు.

వ్యవసాయ మార్కెటింగ్‌ సంస్కరణలు: రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్‌ శిస్తుపేరిట వేల కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నాయి కానీ మార్కెట్‌ యార్డుల్లో సౌకర్యాలకు కేటాయించడానికి బదులుగా దాన్ని జనరల్‌ పూల్‌కి దారిమళ్లిస్తున్నాయి. వసతుల లేమితో రైతులు తమ పంట లను ఆరుబయట స్థలాల్లో నిల్వచేసి వర్షం, వరదల సమయంలో తీవ్రంగా నష్టపోతున్నారు.

వ్యవసాయ వృత్తులకు భీమా: ప్రతి ఏటా ఏదో ఒక పంట చేతికి రాక తల్లడిల్లిపోతున్న రైతుల క్షేమం కోసం వ్యవసాయ బీమాలో కీలక సంస్కరణలు తీసుకురావాలి. సన్నకారు, చిన్నకారు రైతులకు పంట బీమాను కల్పించడమే కాకుండా ప్రభుత్వమే దాని ప్రీమియం చెల్లించాలి. బీమా కంపెనీ లకు మాత్రమే లాభాలు అందిస్తున్న ప్రస్తుత వ్యవసాయ బీమా విధానాన్ని పూర్తిగా సంస్కరించాలి.

సాధారణ వ్యవసాయ సమస్యలు: వాస్తవ సాగుదారులకు వివిధ పథకాలను అనువర్తించి అమలు చేయగల సాంకేతిక జ్ఞానాలను తీసుకురావాలి. వ్యవసాయంలోకి యువతను ఆకర్షించడానికి ప్రత్యేక పథకాలను చేపట్టాలి. భారత్‌లో వ్యవసాయ పరిశోధనను పునరుజ్జీవింప జేయాలి. రైతు ప్రధాన పరిశోధనకు నిధులు అధికంగా కేటాయించాలి. ఇది మాత్రమే ఈ దేశ రైతులకు ప్రయోజనం కలిగిస్తుంది.
వ్యాసకర్త : డా. యలమంచిలి శివాజి, రాజ్యసభ మాజీ ఎంపీ

మొబైల్‌ : 98663 76735

మరిన్ని వార్తలు