అంబేడ్కర్‌ ఆలోచనలే కరోనా కట్టడికి మార్గం

15 Apr, 2020 00:54 IST|Sakshi
ఔరంగాబాద్‌లో న్యూ కాలేజీ క్యాంపస్‌లో బోధి మొక్కను నాటుతున్న అంబేడ్కర్‌ (1950)

సందర్భం

మనిషి లాభాపేక్షకు ప్రతిగా ప్రకృతి ప్రకోపం నుంచి ఉద్భవించినది కరోనా. కరోనా వంటి విపత్తులను ఎదుర్కోవాలంటే రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల నుంచి స్ఫూర్తిని పొందాలి. ఆదేశిక సూత్రాలలో అంబేడ్కర్‌ ప్రకృతి పరిరక్షణను, ప్రకృతిని ఆలంబనగా చేసుకొని జీవనం సాగించడాన్ని ప్రబోధిం చారు. రాజ్యాంగంలో పొందుపరచిన ఆశయాలకు ఒక సుదీర్ఘ సామాజిక సాంస్కృతిక నేపథ్యం వుంది. కుటీర పరిశ్రమలను ప్రభుత్వ బాధ్యతగా చేయాలనీ, పశుపోషణ, వ్యవసాయాభివృద్ధిని ప్రభుత్వ విధుల్లో చేర్చాలనీ ప్రతిపాదించారు. రాజ్యాంగం నాలుగో భాగంలో అధికరణం 37 నుంచి 51 వరకూ ఈ ఆదేశిక సూత్రాలను వివరించారు. 

ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అవసరమైన ఆర్థికాభివృద్ధి, సామాజిక, రాజకీయ ప్రణాళికకు ఆదేశిక సూత్రాలు దోహదం చేస్తాయి. ప్రవేశికలో పేర్కొన్న న్యాయం, సమానత, సౌభ్రాతృత్వంలను సాధించడానికి, ఇవి మార్గదర్శకాలుగా నడిపిస్తాయి. ఒకానొక సందర్భంలో రాజ్యాంగ నిర్ణయసభ సలహాదారు బి.ఎన్‌.దావ్రో మాట్లాడుతూ ఒకోసారి దేశ ప్రామాణిక ఆరోగ్యాన్ని, జీవన ప్రమాణాలను మెరుగుపరిచే తన ప్రాథమిక బాధ్యతను నిర్వహించడంలో భాగంగా రాజ్యం/ప్రభుత్వం వ్యక్తిగత హక్కులలో జోక్యం చేసుకోవలసివస్తుంది అని చెప్పాడు. దేశ నాయకత్వం రాష్ట్ర నాయకులను కలుపుకొని ఒక ధన్వంతరీ అవతారమెత్తి మొత్తం ఆరోగ్య వ్యవస్థను దాని చుట్టూ పరివేష్టించివున్న ఆర్థిక, సామాజిక రుగ్మతలకు మందు కనిపెట్టాలి. కేవలం చప్పట్లు కొట్టడం, వీధుల్లో దీపాలు వెలిగించడం మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తుకై ప్రణాళికలు సిద్ధంచేసి ప్రజలను ముందుకు నడిపించాలి. అభివృద్ధి చెందామని చెప్పుకుంటూ ఇప్పుడు కూలిపోయిన దేశాల వ్యాపారధోరణులు, విధానాలు మన దేశానికి పనికిరావని గుర్తించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యం, విద్య, సామాజిక న్యాయం అను మూడు అంశాలను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలి. ముందుగా ప్రజారోగ్య వ్యవస్థలోని సబ్‌–సెంటర్లను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వ్యవస్థను పటిష్టపరచాలి. అందుకు కావలసిన ఆర్థిక వనరులను వెంటనే సమకూర్చి పారామెడికల్‌ సిబ్బందిని, డాక్టర్లను యుద్ధ ప్రాతిపదికన భర్తీచేయాలి. 

గతంలో మనదేశానికి టి.బి., ఎయిడ్స్, ఆటలమ్మ వంటి మహమ్మారులను పారదోలిన చరిత్ర వుంది. అవసరమయితే అమెరికాతో కుదుర్చుకున్న ఆయుధ సరఫరా ఒప్పందాన్ని రద్దుచేసుకొని ఆ డబ్బుతో దేశంలో ఒక లక్షమంది డాక్టర్లను, పది లక్షలమంది పారా మెడికల్‌ సిబ్బం దిని నియమించి కరోనాపై యుద్ధాన్ని ప్రకటించాలి. ఆరోగ్యంతోపాటుగా అత్యంత కీలక విషయం విద్య. మనదేశంలో ప్రాథమిక, మాధ్యమిక విద్యపై కొన్ని మెరుగైన విధానాలు ఉన్నా ఇంకా విద్య సార్వజనీనం కావడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పరిశోధనపై ప్రత్యేక శ్రద్ధపెట్టి ప్రపంచానికి మార్గదర్శకం కావాలి. సాధ్యమైనంతవరకూ మన చుట్టుపక్కలనే వున్న వనరులను ఉపయోగించుకోవాలి. దానివలన దూరం నుండి కాక మనకు దగ్గరలోనే అవసరమైన వనరులను పొందగలుగుతాము. దేశంలో అమలవుతున్న విని మయ విధానాన్ని కట్టడిచేయాలి. విలాస వస్తువులపై పెద్దస్థాయిలో పన్ను విధించాలి. ప్రకృతి వనరులను భవిష్యత్తు తరాలకోసం ఒక పద్ధతిలో వినియోగించాలి. దేశం స్వయంపోషకంగా ఉంటూ మన దేశంలో తయారుచేసిన వస్తువులను ఉపయోగించుకోవాలి. అంబేడ్కర్‌ సహజవనరులను, ప్రధాన పరిశ్రమలను, ఆర్థిక వ్యవస్థలోని కీలక అంశాలను ప్రభుత్వ ఆస్తిగా పరిగణించాలని పేర్కొన్నాడు. ఇప్పుడు ఆదేశిక సూత్రాలను భారత ప్రజలు అంతరాత్మగా స్వీకరించి ముందుకు సాగాలి. భారత స్వాతంత్య్ర ప్రకటన బ్రిటిష్‌ వలసపాలకుల నుంచి విముక్తి మాత్రమే కాదు. అది భారత ప్రజల రాజకీయార్థిక, సామాజిక సాంస్కృతిక స్వావలంబన. ఇటువంటి భావనలు వాస్తవరూపం దాల్చాలంటే సంక్షేమ రాజ్యస్థాపనే పరమ లక్ష్యంగా రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశిక సూత్రాల అమలు ఒక్కటే మార్గం. ఆర్థిక సమానత్వాన్ని సాధించి సామ్యవాద తరహా సమాజాన్ని నిర్మించడమే వీటి ముఖ్య ఉద్దేశ్యం.

అధికరణం 38 ప్రకారం సామాజిక , ఆర్థిక, రాజకీయ న్యాయంతో కూడిన ప్రజాసంక్షేమానికి అనుగుణమైన వ్యవస్థ ఏర్పడటానికి ఆదాయంలో హోదాలో సౌకర్యాలలో అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వం (రాజ్యం) కృషి చేయాలి. అలాగే అధికరణం 39 (బి) – ప్రజలందరి సమష్టి మేలు సమకూర్చేలా సమాజంలోని భౌతికవనరులపై యాజమాన్యం నియంత్రణలను చేకూర్చేందుకు విధానాన్ని రూపొందించుకోవాలి. 39 (సి) ప్రకారం ‘జన సామాన్యానికి హాని కలగకుండా, సంపద, ఉత్పత్తి సాధనాలను వికేంద్రీకరించేలా ప్రభుత్వం తన విధానాన్ని రూపొందించుకోవాలి. ఇటువంటి ప్రజా విధానాల రూపకల్పనే లక్ష్యంగా రూపొందిన అదేశిక సూత్రాల అమలులోని ఉదాసీనతే కరోనా వైరస్‌ వంటి వ్యాధులకు కారణమై.. ప్రజల ఆరోగ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను సామాజిక జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ వైఫల్యాల ఫలితమే నేడు దేశంలో 40 శాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. అధికరణం 40 ప్రకారం గ్రామ పంచాయితీలను వ్యవస్థీకరించి, స్వపరిపాలనా సంస్థలుగా అవి పని చేయడానికి అవసరమైన అధికారాలను, ప్రాధికారాలను ప్రభుత్వం ఇవ్వాలి. మానవతా పరిస్థితులతో కూడిన పనిని చూపేందుకు ప్రభుత్వం ప్రసూతి, వైద్య సదుపాయాలు ఇవ్వాలి.

కార్మికులకు జీవన భృతిని, ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవనాన్ని గడిపేందుకు అవసరమైన పరిస్థితులను సాంఘిక, సాంస్కృతిక అవకాశాలను కల్పించేందుకు, ప్రభుత్వం కృషిచేయాలి– అధికరణం 43. పౌష్టికాహార స్థాయిని, జీవన ప్రమాణ స్థాయిని పెంపొందించి, ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చడంలో ప్రభుత్వం కృషి చేయాలి– అధికరణం 47 ప్రకారం. గోవులను, ఇతర పాడి పశువులను, పెంపుడు జంతువుల వధని నిషేధించి, వాటి ఉత్పాదనను మెరుగుపర్చడానికి ప్రభుత్వం కృషి చేయాలి– అధికరణం 48. అధికరణం 51 (జి) ప్రకారం ప్రాకృతిక సంపదలైన అడవులు, నదులు, నదీ జలాలు వన్యప్రాణుల సంరక్షణ కొరకు ప్రభుత్వం కృషి చేయాలి. ఈ ఆదేశిక సూత్రాల వైఫల్యాల పాలన ఫలితమే కరోనా వంటి వైరస్‌ల ఉధృతికి కారణం. కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కోవాలంటే అంబేడ్కర్‌ ఆలోచనా విధానం లోంచి రాజ్యాంగ స్ఫూర్తిలోంచి భారత దేశం తనదైన ‘గ్రీన్‌ పాలిటిక్స్‌’ను నిర్వహించుకోవాలి.

డొక్కా మాణిక్యవరప్రసాద్‌
వ్యాసకర్త మాజీ మంత్రి

మరిన్ని వార్తలు