ఎన్టీఆర్‌ జీవితమే సందేశం

28 May, 2020 00:41 IST|Sakshi

సందర్భం 

తెలుగు సినీ జగత్తులో నందమూరి తారక రామారావు నట సార్వభౌముడు. ఎన్టీఆర్‌గా, అన్నగా తెలుగు జాతి హృదయాలను గెలుచుకున్న విశ్వనటుడు. తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం. తెలుగు భాషా నుడి కారాలకు పర్యాయపదం. ఆత్మగౌరవ పతాక. మరోవైపు ఎన్టీఆర్‌ అంటే క్రమశిక్షణ. తన వైవిధ్యభరితమైన పాత్రలతో ఆబాల గోపాలాన్ని అలరించారు. నాలుగు దశాబ్దాల పైబడిన సినీ ప్రస్థానంలో నాలుగు వందలకు పైబడి నటించిన చిత్రాల్లో తెలుగువారి జీవన నేపథ్యమే ప్రతిఫలించింది. పురాణ పాత్రల ద్వారా ఆరాధ్యదైవంగా నిలి చారు. మూసధోరణికి భిన్నంగా కుటుంబ బాధ్య తలు చేపట్టిన పెద్దగా, అన్నగా, ప్రేమికుడుగా, స్నేహితుడుగా అనుబంధం, మమకారం, దుఃఖం, రాచరికాలు వంటి బహుముఖ రసాన్విత పాత్రలతో తెలుగునేల సాంఘిక జీవనాన్ని దృశ్యకావ్యాలుగా మలిచారు. భిన్న పాత్రలతో సాగిన ఎన్టీఆర్‌ సినీ ప్రస్థానం ఆయన్ని వెండితెర వేల్పుగా, ఒక కర్మయోగిగా ప్రజల ముందు నిలిపింది. 

వెండితెర అగ్ర కథానాయకుడుగా వెలుగొందుతూ ప్రతినాయక పాత్రలయిన రావణాసురుడు, దుర్యోధనుడు వంటి పాత్రలకు సైతం రాజసం అద్దారు. సర్వావేశ సంకలితం, ఆనందం, ఆవేశం, ఆగ్రహం, సహనం, అసూయ, భక్తి, ధిక్కారం వంటి రావణుని పరస్పర విరుద్ధ ప్రవృత్తులన్నీ ఎన్టీఆర్‌ వ్యక్తీకరించారు. ఎన్టీఆర్‌ క్రమశిక్షణ శ్వాసగా బ్రతికిన వ్యక్తి. భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో నేర్పరి. కళాకారుడు దేనికి కట్టుబడి ఉండడనే లోకోపవాదుని ఎన్టీఆర్‌ తిరగరాశారు. సామా జిక దురాచారాలపై ఎన్టీఆర్‌ తన పాత్రల ద్వారా కత్తి ఝుళిపించారు. పౌరాణిక పాత్రలు ఎన్టీఆర్‌ ఆంగిక, హావభావాల్లో ఇట్టే ఒదిగేవి. పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్‌ నట విశ్వరూపాన్ని చూపిన చిత్రం ‘దాన వీర శూర కర్ణ’. కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడిగా త్రిపాత్రాభినయం చేశారు. సుయోధనునిగా ఎన్టీఆర్‌ అసమానంగా నటించారని సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. 

అలాగే ‘శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ చిత్రం ద్వారా సామాజిక కుటిల నీతిని బహిర్గతం చేశారు. బహుముఖంగా అనేక భిన్న పాత్రల్లో నటిస్తూ తన మనసు దాహార్తిని తీర్చే సామాజిక సందేశాత్మక చిత్రాలు అనేకం నిర్మించారు. పదిహేడు చిత్రాలకు స్వయంగా దర్శకత్వం చేశారు. నర్తనశాల చిత్రం కోసం వెంపటి చిన సత్యం వద్ద నృత్యాన్ని నేర్చుకున్నారు. ఎన్టీఆర్‌ పాత్రలలో పరకాయ ప్రవేశం చేస్తాడనటానికి ఇది నిదర్శనం. వారి నట కౌశలాన్ని తెలుగు ప్రేక్షకులు దృశ్యమానంగా తిలకించారు, పులకించిపోయారు. ఎన్టీఆర్‌కు తెలుగు సాహిత్యం, భాషపై ఎనలేని మమకారం. భాషపై అపారమైన పట్టువున్న వెండితెర నాయకుడు. శ్రీశ్రీ సాహిత్యాన్ని కరతలామలకంగా తెలుసుకున్నారు. ఇటువంటి నేపథ్యంలోంచే ‘ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం’ అనగలిగారు. సాహిత్య ప్రియుడయిన ఎన్టీఆర్‌ ‘పల్నాటి యుద్ధం’ సినిమా యుద్ధ సన్నివేశంలో యోధులకు యుద్ధ నియమాలు బోధించే సందర్భానికి మహాకవి గుర్రం జాషువా పద్యాలు రాయించుకున్నారు. పలు ప్రసంగాల్లో ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అన్న శ్రీకృష్ణ దేవరాయలవారి మాటల్ని వల్లె వేసేవారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని శ్లాఘిస్తూ తాదాత్మ్యం చెంది మాట్లాడేవారు.  

విద్యార్థి దశలోనే తెలుగు భాషమీద ప్రాణాలు నిలిపి చదువుకున్నానంటారు ఎన్టీఆర్‌. చదువు నేర్పిన గురువుల పట్ల అత్యంత గౌరవ ప్రపత్తులతో వుండేవారు. ఈ ప్రభావంతోనే ఆయన తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. సామాజికార్థిక సమన్యాయం ప్రాతిపదికగా ‘అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ’ని నెలకొల్పారు. భారతీయ తాత్విక ధారల్లో ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రజాస్వామికవాది అయిన బుద్ధుడిని, జ్ఞాన ముద్రలో ప్రతిష్ఠింప జేశాడు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎన్టీఆర్‌ జీవితం కొనసాగింది. ఆయన కట్టు, నడక, ఆహార్యం, నిండైన నిలువెత్తు తెలుగుదనం. ఎన్టీఆర్‌ నటించిన సినిమాలన్నిటా తెలుగు వారి జీవితం ఉంటుంది. ఎన్టీఆర్‌ జీవితమే ఒక సందేశం. (నేడు ఎన్టీఆర్‌ జయంతి)


వ్యాసకర్త : డొక్కా మాణిక్యవరప్రసాద్‌, మాజీమంత్రి

మరిన్ని వార్తలు