సంక్షేమ ‘ప్రదాత’

8 Jul, 2020 01:29 IST|Sakshi

అభిప్రాయం

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, సంక్షేమం గురించి చెప్పాలంటే రాజన్న పాలనకు ముందు, తరువాత అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. బడుగు, బలహేన వర్గాల ఆరాధ్య దైవం దివంగత డా. యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. వెనుకబడిన వర్గాల సమూహాల ఉద్ధరణ కోసం ఎనలేని కృషి చేశారు. ప్రజాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి నిరుపమానం. పరోపకారం, సేవాగుణం ఆయనను విశిష్టమూర్తిగా నిలబెడితే... ఇచ్చిన మాట తప్పకపోవటం, వేసిన అడుగు వెనక్కి తీసుకోకపోవటం ఆయనను ప్రజల హృదయాల్లో శిఖరాగ్రాన నిలబెట్టింది.

అప్పటి అధికార పక్షం నిర్వాకం కారణంగా ఉమ్మడి ఏపీలో ఉపాధి అవకాశాలు హరించుకుపోతూ పేదల బతుకులు పొగచూరుతున్నాయి. దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అత్యంత దయనీయమైన జీవనం సాగిస్తున్నారు. సామాన్యుల బతుకు వెతలను స్వయంగా పరికించి వాళ్ళలో భరోసాను, ధైర్యాన్ని నింపేందుకు వైఎస్సార్‌ 2003లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టారు. ఉమ్మడి ఏపీలో 1,467 కి.మీ.లు పాదయాత్ర చేసిన ఆయన... రైతులను, కార్మికులను, మహిళలను అక్కున చేర్చుకున్నారు. చదువులకోసం విద్యార్థులు పడుతున్న కష్టాలు చూసి చలించి పోయారు.

మొక్కవోని దీక్షతో పాదయాత్రను కొనసాగించి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఈ పాదయాత్ర 2004లో జరిగిన 12వ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అప్రతిహత విజయానికి తోడ్పాటును అందించింది. పాదయాత్రలో ప్రజలకిచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి ప్రజల పాలిట దేవుడయ్యారు. అధికారం చేపట్టిన వెంటనే ఉచిత విద్యుత్తుపై తొలి సంతకం పెట్టారు. సాధారణ పేదలకు అత్యంత ఖరీదైన ఆధునిక కార్పొరేట్‌ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని అభిలషించి ఆరోగ్యశ్రీని అమల్లోకి తెచ్చారు.

ఇందిరమ్మ ఇల్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, మహిళలకు పావలా వడ్డీ రుణాలు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్‌ల పెంపు, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ బిల్లును అసెంబ్లీలో నాచేతనే ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించి ముస్లిం లకు రిజర్వేషన్‌ ప్రాధాన్యతను కలిపించిన ఆ సంతృప్తి ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతుంది. 108 వంటి పథకాలు ప్రవేశపెట్టి సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ప్రజలకు అందించారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేం దుకు, వృ«థాగా పోయే ప్రతి నీటి చుక్కను బీడువారిన పొలాలకు మళ్లిం చేందుకు జలయజ్ఞం పథకానికి రూపకల్పన చేశారు. 

ఆయన స్మిత పూర్వ భాషి అంటే మాటల కన్నా ముందు ఆయన చిరునవ్వు ఎదుటవారిని పలకరిం చేది. ప్రతి పనిలోనూ ప్రజా శ్రేయస్సు, ప్రతి ప«థకంలోనూ ప్రజా సంక్షేమమే ప్ర«థమ ధ్యేయంగా ముందుకు సాగారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం వంటి పార్టీలు ఎదురొచ్చినా వైఎస్‌ఆర్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా నిలిచి మళ్ళీ సునాయాసమైన గెలుపును అందించింది. ఆయన జన్మ దినోత్సవం సందర్భంగా ప్రజల నేతగా పేరొందిన వైఎస్సార్‌ను మనసారా స్మరించుకుందాం. వైఎస్సార్‌ ఆశీస్సులతో ప్రజల అండదండలతో 2019 ఎన్నికల్లో ఆయన వారసుడిగా జగన్‌మోహన్‌రెడ్డి అధికారాన్ని చేపట్టారు.

రాజన్న రాజ్యం నిర్మిస్తానని ప్రజలకిచ్చిన వాగ్దానం నెరవేర్చే దిశగా నవరత్నాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సొంత ఇళ్ళు ఉండాలనే రాజన్న కలను నేడు జగనన్న నెరవేరుస్తూ ప్రజల ఆశీస్సులు పొందుతున్నారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం మహాద్భుతం. వైఎస్‌ఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని రైతు దినోత్సవ కార్యక్రమం జరపటం రైతులకు ఆయన అందించిన సాయం, నింపిన స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుంది.    


వ్యాసకర్త: డొక్కా మాణిక్యవరప్రసాద్
శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు‌

మరిన్ని వార్తలు