‘ఆరోగ్యశ్రీ’మంతుడు

8 Jul, 2020 01:36 IST|Sakshi

డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి 71వ జన్మదినం నేడు. ఆయన 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రపాలనలో నవశకం మొదలయింది. ‘ఆరోగ్యశ్రీ’ పథకం వై.ఎస్‌. ప్రభుత్వానికి ప్రాణదాతగా పేరు తెచ్చింది. ప్రజల్లో ప్రభుత్వాల మీద అపారమైన నమ్మకాన్ని పెంచింది. నిరుపేదలు, అల్పాదాయ, మధ్యతరగతి కుటుంబాలు ఈ పథకం ద్వారా కార్పోరేట్‌ వైద్యానికి నోచుకున్నాయి. సకల సౌకర్యాలు గల ఆసుపత్రుల్లో వైద్యసేవలు పొందారు.

తమ రోగాన్ని నయం చేసుకొని ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్లే ప్రజలు రాజశేఖరరెడ్డి పేరును ‘రాజన్న’గా మార్చుకొని ఇంటికెళ్ళారు. ప్రత్యామ్నాయపార్టీలు ఎన్నికల్లో పోటీచేసి అస్పష్ట పరిస్థితులు సృష్టించినా రెండోసారీ డాక్టర్‌ వైఎస్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు. అందుకే ఇది ప్రజల విజయం, పేదల విజయమని స్వయంగా ఆయన చెయ్యెత్తి చాటారు.

నాన్నగారి నడకను, నడతను నరనరానా నింపుకుని ‘రాజన్న’ బాటలోనే  నేటి యువముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి  ప్రజల ముంగిట ప్రభుత్వాన్ని నిలిపారు. ఈ జూలై ఒకటిన ‘‘ప్రతిప్రాణానికీ విలువనిచ్చే ప్రభుత్వమిది’’ అనే నినాదంతో ‘ఆరోగ్యశ్రీ’ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. వెయ్యీ ఎనభైఎనిమిది అంబులెన్సులు, సంచార వైద్యశాలలు రాష్ట్రం నలుమూలల కదలాడుతున్నాయి. 

రాజశేఖరరెడ్డి ఒక యోగిలా తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాలను కలుపుకుంటూ చేవెళ్ళ నుంచి ఇచ్ఛాపురం వరకు 1475 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి పేదల జీవితాల్లోకి తొంగిచూశారు. అడుగడునా ఆకలి అలికిడిని పసిగట్టారు. బీటలువారిన బీడు భూముల్లో కాలుపెట్టారు. రైతు కడుపుకోతకు కారణాలను కనుగొన్నారు. ఆత్మహత్యల అంతరంగాన్ని అధిమిపట్టారు. అందుకే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెనువెంటనే  రైతుకు ఉచిత విద్యుత్‌ దస్త్రం మీద తొలిసంతకం చేశారు.  మధ్యంతరంగా ఆగిన అన్ని నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేశారు. అట్టడుగు ప్రజానీకం ‘అన్నం రాజన్న స్వరూపం’గా శ్లాఘించారు. 

ముసలివాళ్ళ మనస్సు ఎరిగిననేతల్లో అగ్రగణ్యుడు కూడా రాజన్నే. నెలొచ్చేసరికి ప్రభుత్వం నుంచి వాళ్ళ చేతికి నాలుగు డబ్బులు అందేలా చేయాలనుకున్నాడు. రాజన్న తన పాదయాత్రలో అడుగడుగున ఇటువంటి పేదరికపు అనుభవాలను పెనవేసుకున్నారు. అందుకే వృద్ధాప్యఫించన్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. పావలావడ్డీ ప్రదాత, సున్నావడ్డీ స్ఫూర్తి ప్రదాత కూడా రాజన్నే.  చేతిలో చిల్లుగవ్వలేక ఇంట్లోంచి వీధిలోకి రాని చెళ్ళమ్మలకు అక్కయ్యలకు, అమ్మలకు, అవ్వలకు ఆప్యాయతను పంచి, ఆత్మవిశ్వాసాన్ని పెంచిన ఆదర్శనాయకుడు రాజన్న.

‘‘చెల్లమ్మలకూ... అక్కయ్యలకూ..’’ అంటూ తన కుడి చేయి పైకెత్తి అభివాదంతో రాజన్న తన ఉపన్యాసం ప్రారంభిస్తే చాలు మహిళాలోకం మైమరచిపోయేది. విద్యపట్ల ఆసక్తి, విద్యార్థి పట్ల ఆదరణ, సరికొత్త విద్యాసంస్థల పట్ల శ్రద్ధ వహించి జిల్లాకో విశ్వవిద్యాలయాన్ని నిర్మించిన చదువుల సంస్కర్త డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ఆర్ధికస్తోమత అందక చదువులకు స్వస్తిపలికిన ఎందరో విద్యార్థులను వెతికి వెలికితీశారు.

విద్యార్థులతో కళాశాలలు కలకలాడేలా చేశారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ సంక్షేమవిధానం గ్రామీణ, పట్టణ పేదల బతుకుల్లో కాంతులీనాయి. వైఎస్‌ ఆలోచనలు ఎన్నెన్నో జన్మదినాలు జరుపుకుంటాయి. జనం నోళ్ళల్లో నానుతాయి.  దార్శనికునిగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో చెరగనిముద్ర వేసుకున్న డాక్టర్‌  వైఎస్సార్‌ పాలన నాటికి, నేటికి, ఏనాటికీ చిరస్మరణీయం.                          


వ్యాసకర్త: డాక్టర్‌ జికెడి ప్రసాద్‌, 
ఫ్యాకల్టీ, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం
ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం ‘ మొబైల్‌ : 93931 11740

మరిన్ని వార్తలు