సమర్థ భావ ప్రసారం.. ఇప్పుడు ప్రాణావసరం!

16 Apr, 2020 00:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సందర్భం

అర్థవంతమైన కమ్యూనికేషన్‌ మంచి కాఫీ లాంటిది. ఎందుకంటే, ఆ తర్వాత అది నిద్రపోనివ్వదని పాశ్చాత్యుడన్నా, నిత్య సంచలనశీలికి నిద్రలో కూడా నిద్రపట్టదని మన కవులన్నా అవి ప్రజాభిప్రాయానికి మూలమైన కమ్యూనికేషన్‌ ప్రభావానికి దర్పణం పట్టే మాటలే. కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వారికి అభినందపూర్వకంగా కొట్టిన చప్పట్లు, సకారాత్మక భావోద్వేగాలు వెల్లివిరియడానికి వెలిగించిన దీపాలు ఒక వ్యక్తి మదిలో ఆలోచనగా అంకురించి, చిగురించి, మొగ్గతొడిగి, వికసించి అద్భుతమైన భావప్రసారం ద్వారా కోట్లమంది భారతీయులను కర్తవ్యోన్ముఖులను చేశాయి. యావత్‌ ప్రపంచాన్ని స్తంభింపజేసిన కరోనా వైరస్‌ వల్ల మానవాళి ప్రాణభయంతో బిక్కుబిక్కున బతుకుతున్న సమయాన ప్రభావశీలమైన  ’కమ్యూనికేషన్‌’ గురించి మాట్లాడుకోవడం సముచితం. విద్యావిషయకంగా చూస్తే విస్తృతార్థంలో కమ్యూనికేషన్‌ నాలుగు రకాలుగా ఉంటుంది. అవి: ఇంట్రా పర్సనల్‌ కమ్యూనికేషన్‌ (వ్యక్తి మనసు లేదా మస్తిష్కం లోలోపల జరిగేది),  ఇంటర్‌ పర్సనల్‌ (ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది), గ్రూప్‌ (ఒక సమూహపు సభ్యుల మధ్య), మాస్‌ (జనబాహుళ్యానికి ఉద్దేశించినది). కరోనా కరాళనృత్యం నేపథ్యంలో, ఈ నాలుగు రకాల కమ్యూనికేషన్‌ ప్రక్రియలను వినియోగించుకోవడం ద్వారా మన శారీ రక, మానసిక ఆరోగ్యాలను కాపాడుకోవడంతో పాటు మన కుటుంబం, సమాజం భయాందోళనల నుంచి బైటపడి మహమ్మారిపై పోరాటంలో విజ యం సాధించడానికి ఉపకరించవచ్చు. 

ఈ లాక్‌డౌన్‌ తెచ్చిన ఖాళీ సమయంలో ఎప్పుడేమి ఉపద్రవం సృష్టిస్తుందో తెలియని మందులేని కరోనా, ధనిక దేశాల్లో సైతం పిట్టల్లా రాలుతున్న జనం, మనదగ్గరా పెరుగుతున్న కేసుల సంఖ్య అందరినీ లోలోపల భయంకరంగా వణికిస్తున్నాయి. అంబులెన్స్‌ వచ్చినట్లు, ప్రభుత్వం నిర్దేశించిన ఆసుపత్రికి తీసుకుపోయినట్లు, అయినవారికి దూరంగా 14 రోజులు ఆసుపత్రిలో ఉన్నట్లు, వైద్యుల ప్రయత్నాలు విఫలమయినట్లు, ఒకరిద్దరి మధ్యనే అంటరానివాడిగా అంతిమ సంస్కారం జరిగినట్లు...వివిధ భావనలు మస్తిష్కంలో రీలులా తిరగని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చావు భయం అధికంగా ఉన్నవారికి కరోనా లాంటి పరిస్థితులు మరీ ప్రమాదకరంగా పరిణమించి లేనిపోని రుగ్మతలకు దారితీస్తాయి. అందుకే, ఇలాంటి సమయాల్లో ఎక్కువసేపు ఒంటరిగా ఉండకపోవడం మంచిది. పుస్తక పఠనం, సంగీతం, నాట్యం వంటి ఇష్టమొచ్చిన వ్యాపకంపై దృష్టి మరల్చే ప్రయత్నం చేయాలి. విపరీతమైన నెగెటివ్‌ వార్తల ప్రభావంతో మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటే...తమ అత్యంత సన్నిహితులతో వాటిని పంచుకుని వారి నుంచి ఊరట పొందవచ్చు. ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ, శూన్యంలోకి చూస్తూ గడపడాన్ని ఈ సమయంలో తేలిగ్గా తీసుకోకూడదని నిపుణులు సూచి స్తున్నారు.      

ఒక వ్యక్తి దగ్గర మొదలైన సమాచారం ఒకరి నుంచి మరొకరికి, అక్కడినుంచి మరొకరికి వెళ్ళేసరికి భావ, అర్థ, తాత్పర్యాలు మార్చుకుని వేరే రూపు సంతరించుకుంటుందని కమ్యూనికేషన్‌ పరి శోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా, చాట్‌ చేసుకున్నా అప్రయత్నంగా కరోనా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వస్తున్న భయానక సమాచారంతో ఉన్న మనం అప్రయత్నంగా ఆ సమాచారం మన మిత్రుడితో, సహచరుడితో పంచుకోవాలనుకుంటాం. మనవల్ల వేరే వాడిలో నిస్పృహ పెరగకూడదన్న నియమం పెట్టుకుంటే ఏ చింతా ఉండదు. కరోనా వ్యాప్తికి ఒక మతాన్ని తప్పుపట్టడం, వదంతులు వ్యాపింపజేయడం వంటి విద్వేషకారక భావాలను టెలిఫోన్‌ లేదా సోషల్‌ మీడియా మాధ్యమంగా సంభాషణ చేసేవారు విశాల సమాజ హితం దృష్ట్యా మొగ్గలోనే తుంచివేయాలి.    
గ్రూప్‌ కమ్యూనికేషన్‌తోనే  విప్లవాలు వచ్చాయి. సరైన సమయంలో సరైన పదాలతో మాట్లాడే శక్తిసామర్థ్యాలు ఉన్నవారు సమాజంలోని వ్యక్తులను శక్తులుగా మలిచారు, కర్తవ్యోన్ముఖులను చేశారు. ఇప్పుడు వాట్సాప్, పేస్‌బుక్‌ వంటి మాధ్యమాల వల్ల గ్రూపులు కట్టడం తేలికైపోయింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, స్కూల్‌ మేట్స్, కాలేజ్‌మేట్స్, కొలీగ్స్‌తో పాటు ఒకే అభిరుచి ఉన్నవారు సైతం ఒక గ్రూపుగా ఏర్పడి నిరంతరాయంగా భావ విని మయం సాగిస్తున్నారు. గ్రూప్‌ మొత్తానికి ఉత్తేజపూరితమైన, ఉత్సాహకారకమైన, ఉల్లాసభరితమైన సమాచారం పంచుకోవడం అభిలషణీయం. సకారాత్మక ఒక ఆలోచన లేదా ఒక సృజనాత్మక కథనం మొత్తం గ్రూపు సభ్యుల మనసుకు ఊరట కలిగించవచ్చు.

పెను విషాదాన్ని మానవాళి మౌనంగా భరిస్తున్న దుర్భర రోజులివి. ఈ కాలంలో తిమిర సమానమైన నిరాశానిస్పృహలను పారదోలి విషాదంలో మునిగి ఉన్న ప్రజలకు వెలుగు దివ్వెలు చూపాలనే సత్సంకల్పం ముఖ్యం. అందుకే తెలం గాణ ముఖ్యమంత్రి ప్రజల కోసం రచనలు చేయండని కవిలోకాన్ని ప్రత్యేకంగా అభ్యర్థించారు. ఇప్పటికే పత్రికల్లో, సోషల్‌ మీడియా వేదికల్లో అనేక కవితలు జనం ముంగిటికి వచ్చాయి. కళాకారులు రాగయుక్తంగా ప్రజలకు బోధలు చేస్తూ, సంఘ సేవకులను ప్రస్తుతిస్తూ వీడియోలు రిలీజ్‌ చేస్తూ చైతన్యపరుస్తున్నారు. ఈ కరోనా కాలంలో మంచి రచనలు జన బాహుళ్యానికి ఉత్సాహం, ఉత్తేజం ఇస్తాయి. ఈ వైరస్‌ మిగిల్చే విషాదం ఇంకా కొన్ని నెలలు ఉంటుంది. మంచి సాహిత్యం అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఒక్క మంచి మాట వెయ్యిన్నొక్క మస్తిష్కాలకు ఉత్ప్రేరకమని అంటారు. కరోనా పీడిత పలు దేశాల్లో ప్రజల మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతిని, భీతావహులైన సున్నిత మనస్కులను ఆత్మహత్యలవైపు పురికొల్పుతున్నదని వస్తున్న బాధాకర వార్తల నేపథ్యంలో విద్యావంతుడైన ప్రతి వ్యక్తీ బాధ్యతతో ఈ నాలుగు రకాల భావ ప్రసరణ విధానాలను సమాజ సాంత్వన సాధనాలుగా వాడుకోవాలి. బాధ్యతాయుతమైన భావ ప్రసారం....ఇప్పుడు తక్షణావసరమే కాదు ప్రాణావసరం కూడా.

డాక్టర్‌ ఎస్‌.రాము
వ్యాసకర్త అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియాలో శిక్షకుడు

మరిన్ని వార్తలు