జోహార్‌ డాక్టర్‌ గారూ..!

22 Jan, 2020 00:11 IST|Sakshi
ఆదుర్తి పాండురంగ విఠల్‌

ఏడాది క్రితం విస్సన్నపేటలో నేను ఆయన్ని కలిశాను. ఎక్కువ అడుగులు నడవలేని స్థితిలో ఉన్నారాయన. అయినా  రోడ్డు మీదకి వచ్చి నన్ను కౌగలించుకుని ఇంట్లోకి తీసుకుని వెళ్ళారు. ఏమైనా ఈ ముసలితనం చాలా కష్టమయ్యా అన్నారు. అప్పుడు ఆయన కళ్ళలో నీరు చూశాను. ఎందుకు ఇలా ఈడ్వాలి  ఈ దేహాన్ని అని ఇంకో మాట. ఎవరెవరో వృద్ధాప్యం వద్దనుకుని తనువులు చాలించిన ఉదాహరణలు చెప్పారు. ఏమిటి సార్‌ మీరిలా మాట్లాడుతున్నారు? అని కొంచెం కంగారుపడుతూ అన్నాను. తెరలు తెరలుగా నవ్వారు. ఏవయ్యా నేనలా  చెయ్యనులే అని మరీ నవ్వారు. హమ్మయ్య అనుకున్నాను. మీరు రాయాల్సింది బోలెడు వుంది. రాయండి అన్నాను. అన్నానే గాని, కొందరిని ముసలితనంలో చూడకూడదు అని మనసులో అనుకున్న మాట మాత్రం మనసులోనే దాచుకున్నాను. ప్రవాహంలాంటి మనిషిని ఎండిపోయిన నదిలా ఎలా చూడగలం? ఆయనలా నవ్వుతూనే వున్నారు. ఏవేవో చెప్తూ గుర్తు చేసుకుంటూ నవ్వుతూనే వున్నారు.        

ఆయన నవ్వు భలే వుండేది. పెదాల చివరగా నవ్వితే కళ్ళలో వెలుగులు చిమ్మేవి. ఎప్పుడూ విఠల్‌ గారూ అనేవాళ్ళమే తప్ప ఏ అంటే ఏమిటి? పి అంటే ఏమిటి అని ఆలోచించలేదు. ఏపీ విఠల్‌ అంటే ఆదుర్తి పాండురంగ విఠల్‌  అని ఈరోజే తెలిసింది. ఆయన వెళ్ళిపోయారన్న వార్తలో ఆయన పూర్తి పేరు కలిసి కనపడితే గుండెలో ఎక్కడో నీటి కెలక చప్పుడైంది. సూర్యాపేట నుంచి విజయవాడ దాకా ఆయనను ఒక మంచి డాక్టర్‌గా ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో కాని, ఆయన మంచి మార్క్సిస్టు డాక్టరుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి చాలాకాలం గుర్తుండిపోతారు. ఆయనిప్పుడు లేరు. ఇక ఆయన గతమైపోయారు. ఎవరైనా వర్తమానం నుంచి గతంగా మారిపోవాల్సిందే కదా. వారి జీవితం..వారి ఆలోచనలు..వారి ఆచరణ వారి గతాన్ని కూడా చెరగని వర్తమానంగా నిలిపి వుంచుతాయి. అలా విఠల్‌ గారు నాకెప్పుడూ వర్తమానమే.

నేను బాగా ఆయనతో చనువుగా గడిపింది ప్రజాశక్తిలో సబ్‌ ఎడిటర్‌గా పనిచేసినప్పుడు. నేను రాసిన ప్రతి అక్షరాన్నీ ఆయన కళ్ళనిండా ఆప్యాయతతో మెచ్చుకునే వాడు. నేను రాసినదానికి ఎప్పుడైనా అడ్డంకి వస్తే సరాసరి ఆయన దగ్గరికే పరిగెత్తేవాడిని. ప్రజాశక్తిలో నేను చేరిన కొద్దిరోజులకే శ్రీశ్రీ మీద నేను రాసిన వ్యాసంతో ఆయనకూ నాకూ మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత కాలం తిప్పిన మలుపులు ఆయనకూ చాలా ఉన్నాయి, నాకూ చాలా ఉన్నాయి. కానీ ఏ మలుపూ మా మధ్య ప్రేమకు అడ్డు రాలేదు. నాకు బాగా గుర్తు. ఆయన నవ్వుతూ నవ్వుతూ కన్నీళ్ళు పెట్టుకుంటారు. అది నవ్వుతో వచ్చే కన్నీరు కాదు ద్రవించే మనసు చేసే మాయ.సుందరయ్యగారు చనిపోయినప్పుడు మొదటి పేజీ మేకప్‌ చూసే భాగ్యం నాకు దక్కింది. అప్పుడు సగం పేజీ నేను రాసిన రైటప్‌ అందరికీ గుర్తే. ఆయన నన్ను కౌగలించుకుని

కన్నీళ్ళతో తడిపిన తడి కూడా గుర్తే. ఇలాంటి జ్ఞాపకాలే చాలా ఉన్నాయి. మొన్న మొన్నటి దాకా పత్రికల్లో నేను రాసింది ఏది చదివినా పనిగట్టుకుని ఫోను చేసి చాలాచాలా సేపు మాట్లాడేవారు. నా గొడవ అలా ఉంచితే  ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా వుంది. ఆయనతో సన్నిహితంగా గడిపిన పార్టీ మిత్రులు ఎవరూ అంత తేలిగ్గా  మర్చిపోలేరు. ఆయన తార్కిక శక్తి..ఆయన మేధస్సు..ఆయన జ్ఞానం..ఆయన రచనా నైపుణ్యం..ఆయన నిష్కల్మషత్వం.. నమ్మిన దాన్ని నిష్కర్షగా చెప్పే నిజాయితీ ఆయన నవ్వులాగే ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టే గుణాలు. సుందరయ్యగారి చివరి రోజుల్లో ఆయన వెన్నంటి ఉన్న విఠల్,  సుందరయ్యగారి ఆత్మకథ రాయడమే కాదు, సుందరయ్య ఆత్మను కూడా చాలా దగ్గరగా అర్థం చేసుకున్నారు. పార్టీ కోసం సుందరయ్య ఆత్మ కథను రాసినా తనకు తెలిసిన సుందరయ్య గురించి మరిన్ని విశేషాలతో ‘నాకు తెలిసిన కామ్రేడ్‌ సుందరయ్య’ అని మరో పుస్తకం రాసి సుందరయ్యను మనందరికీ మరింత దగ్గరగా తీసుకు వచ్చారు. మరో నాలుగు పుస్తకాలు అచ్చులో ఉన్నట్టు శ్రీశ్రీ విశ్వేశ్వర్రావు గారు చెప్పారు. 

ఆయన అనేక సందర్భాలలో అనేక అంశాల మీద ‘సాక్షి’ తదితర పత్రికల్లో రాసిన వ్యాసాలు వందలాదిగా వుంటాయి. మనుషులు చెప్పే తీర్పులు వేరు, కాలం ఇచ్చే తీర్పు వేరు. మారుతున్న కాలంలో మారుతున్న నైజాల నిజాల ఇజాల మీద ఆయన చేసిన తీర్పులు మాత్రం అందరూ చదవాలి. వాటిని  ముద్రించి ఎవరైనా  భద్రపరిస్తే చరిత్రకు మేలు చేసినవారవుతారు. ఎవరూ సర్వ సంపూర్ణులు కారన్న సత్యాన్ని అంగీకరిస్తే ఆయన్ని కూడా అనేక కారణాల రీత్యా అంగీకరించక తప్పదు. పాఠాలూ, గుణపాఠాలూ అవసరమన్న విషయాన్ని మనం ఆమోదిస్తే విఠల్‌ గారి నుంచి కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. కొన్ని గుణపాఠాలూ తెలుసుకోవచ్చు. విఠల్‌ గారిని విఠల్‌ గారిలానే ప్రేమించిన వారు అనేకులు ఇంకా పార్టీలోనూ పార్టీ వెలుపలా అశేషంగా ఉన్నారు. బహుశా ఆయన పార్టీలో ఉండి వుంటే ఆయన అంత్యక్రియలకు వేలాదిగా తరలివచ్చి వుండేవారు. పెద్ద బహిరంగ సభ జరిగేది. పాటలు.. ఉపన్యాసాలు మారుమోగేవి. కానీ చనిపోయిన వారికి అవేం తెలుస్తాయి?

బతికినంతకాలం తాను ఒక మంచి కమ్యూనిస్టుగానే బతికారు. సుందరయ్యగారు వచ్చేయ్‌ అంటే సూర్యాపేటలో అద్భుతంగా సాగుతున్న హాస్పిటల్ని వదిలేసి విజయవాడ చేరుకున్నారు. సమాజానికి వైద్యం చేసే పనిలో తన వైద్యం కొంత నిర్లక్ష్యం చేసే వుంటారు. సొంత లాభం అంతా మానుకుని డాక్టర్‌ విఠల్‌ అన్న పేరు మాత్రం వెనకేసుకున్నారు. మార్క్సిస్టులతో విభేదాలు వచ్చినా మార్క్సిజాన్ని తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూనే వున్నారు. అదే వెలుగులో సమస్తాన్నీ విశ్లేషించుకుంటూ వచ్చారు. మెజారిటీ మత  ఫాసిజాన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు. ఎన్ని విభేదాలున్నా పార్టీ నాయకులతో తన సంబంధాలను సజీ వంగా కొనసాగిస్తూనే వచ్చారు. వైద్యం చేసేటప్పుడు తరతమ భేదాలు ఎలా వుండకూడదో.. సత్యాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడూ అంతే నిష్పాక్షికంగా, నిర్భయంగా ఉన్నారు. ఎ.పి. విఠల్‌ లాంటి డాక్టర్లు ఈ కాలంలో ఇంకా అవసరం. ఎవరి లోటునూ పూడ్చలేం.  కానీ, విఠల్‌గారి లాంటి వ్యక్తులు లేని లోటును అసలు పూడ్చలేం. విఠల్‌గారూ మీకు నా జోహార్లు.

డా‘‘ ప్రసాదమూర్తి
వ్యాసకర్త ప్రముఖ కవి, 84998 66699

మరిన్ని వార్తలు