భారత్‌ విధానం కావాలి మార్గదర్శకం

9 Apr, 2020 00:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సందర్భం

గతంలో విశ్వాన్ని తుడిచిపెట్టిన వ్యాధులను ఎదుర్కోవడానికి అనుసరించిన విధానాలేవైనా, ఇప్పుడు కరోనాను ఎదుర్కోవడానికి  పనికొస్తాయా? మన ప్రస్తుత స్థితికి సరి పోయే సామీప్య చారిత్రక అను భవంగా 1918 ఫ్లూ మహమ్మా రిని పేర్కొనవచ్చు. దీన్ని ఎదు ర్కోవడానికి అమెరికాలోని నగరాలు ఈ కింది ‘ఔష ధాలతో నిమిత్తం లేని విధాన నిర్ణయాల’లో అన్నింటిని గానీ, కొన్నింటినిగానీ అమలుచేశాయి. ఫ్లూ అనేది అంటు వ్యాధి అని ప్రకటించడం; పాఠశాలలు, చర్చీలు, థియే టర్లు, హోటళ్లు, నృత్యశాలలు మూసేయడం; జనం గుంపులుగా పోగవకుండా చూడటం; రోగులను విడిగా ఉంచడం. ఈ వ్యాధి వ్యాపిస్తోందన్న వార్తలు వచ్చిన తొలి రోజుల్లోనే కొన్ని నగరాల్లో ఈ తక్షణ చర్యలకు పూను కుంటే, కొన్ని నగరాల్లో మాత్రం ఆలస్యంగా ఉపక్రమిం చారు. కొన్ని నగరాల్లో అసలు స్పందనే కరువైంది. వీటి అమలు జరిగిన సమయ సందర్భాలు, తదనంతర పరి ణామాలు ఇట్లాంటి ఉపద్రవాలు తలెత్తినప్పుడు విధాన కర్తలు అనుసరించాల్సిన వ్యూహాలకు ముడిసరుకుగా పని కొస్తాయి.

ఒక స్పష్టమైన ఉదాహరణగా మనం ఫిలడెల్ఫియా, సెయింట్‌ లూయిస్‌ నగరాల్లో అనుసరించిన భిన్న వైఖరు లను పరిశీలిద్దాం. ఫిలడెల్ఫియాలో మొదటి కేసు 1918 సెప్టెంబర్‌ 17న నమోదైంది. అధికారులు దీన్ని తీవ్రంగా పరిగణించకపోవడమే కాకుండా, జన సమూహాలను యథాతథంగా అనుమతించారు. సెప్టెంబర్‌ 28న ఒక పరేడ్‌ కూడా జరగడం గమనార్హం. అక్టోబర్‌ 3 నాటికిగానీ పాఠశాలలు మూసేయడం, సమావేశాల మీద నిషేధం విధించడం జరగలేదు. ఈలోగానే ఫ్లూ జనంలోకి వ్యాపిం చింది. ఇక దాన్ని నియంత్రించడం వైద్యుల వశంలో లేకుండా పోయింది. మరోవైపు సెయింట్‌ లూయిస్‌లో చురుగ్గా వ్యవహ రించారు. అక్కడ మొదటి కేసు 1918 అక్టోబర్‌ 5న నమో దైంది. అక్టోబర్‌ 7 నుంచే జనం సామాజిక దూరాన్ని పాటించేలా వివిధ చర్యలు తీసుకున్నారు. మొదటి కేసు నమోదు కాగానే ఈ రెండు నగరాల స్పందనలో తేడా వ్యవధి, రెండు వారాలు.

ఇది ఎలా పరిణమించిందో చూద్దాం. వ్యాధి తీవ్రత అత్యధికంగా ఉన్న సమయంలో సెయింట్‌ లూయిస్‌లో లక్షకు 50 మంది చనిపోతే, ఫిలడె ల్ఫియాలో మాత్రం లక్షకు 250 మంది చనిపోయారు. మొత్తంగా మరణాల సంఖ్య (సెప్టెంబర్‌ 8–డిసెంబర్‌ 28, 1918) ఫిలడెల్ఫియాలో లక్షకు 719 ఉండగా, సెయింట్‌ లూయిస్‌లో లక్షకు 347 ఉంది. అయితే సెయింట్‌ లూయి స్‌లో ఈ మరణాల సంఖ్య పెరగడానికి కారణం, విధాన పరమైన నిర్ణయాలను నవంబర్‌ మధ్యకల్లానే ఉపసంహ రించుకోవడం. 1918 ఫ్లూ మహమ్మారి నేర్పుతున్న పాఠాలు కొన్ని వున్నాయి. మొదటిది, సామాజిక దూరాన్ని తక్షణమే, అదీ తీవ్రంగా పాటింపచేయడం వల్ల మరణాల సంఖ్యను తగ్గించవచ్చు. ఔషధాలతో నిమిత్తం లేని విధాన నిర్ణ యాల్లో చాలా తక్కువ వాటిని అమలు చేసిన నగరాల్లో మరణాల సంఖ్య సగటున వారానికి లక్షకు 146 ఉంది. అదే ఈ విధానపరమైన నిర్ణయాలను ఎక్కు వగా అమలు చేసిన నగరాల్లో మరణాల సంఖ్య కేవలం లక్షకు 65. ఇంకో ముఖ్యమైన అంశం, ఈ విధాన నిర్ణయాలను ఒక పద్ధతిలో ఉపసంహరించుకోవాలి.

లేదంటే మరణాల సంఖ్య మళ్లీ ఎగబాకుతుంది. జనాలు సమూహాలుగా పోగయ్యే కార్యక్రమాల మీద నిషేధం విధించడం; పాఠశాలలు, ప్రార్థనాలయాలు, థియేటర్లు మూసేయడం లాంటి చర్యలు తీసుకున్న నగరాల్లో వ్యాధి తీవ్రత ఎక్కు వగా ఉన్న సమయంలో కూడా మరణాల సంఖ్య తక్కు వగా ఉంది. అయితే, ఈ అంటువ్యాధి కెరటంలా వచ్చి పడుతుంటుంది. తొలి దశలో తక్కువ మరణాలు సంభ వించిన నగరాలు కూడా తర్వాత కెరటాల బారిన పడ వచ్చు. కాబట్టి, పక్కా ప్రణాళికతో కూడిన ఉపసంహరణ చర్యలు అవశ్యం. ఈ గత అనుభవాల వెలుగులో ప్రస్తుత స్థితిగతులకు వస్తే గనక, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అత్య వశ్యమైన సామాజిక దూరాన్ని పాటించేలా జనతా కర్ఫ్యూతో శ్రీకారం చుట్టిన భారత ప్రభుత్వ యోచన గొప్ప మెళకువతో కూడినది. కానీ ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ జాతీయ లాక్‌డౌన్‌ ఉపసం హరణ రాష్ట్రాలు, జిల్లాలు, నగరాల వారీగా ప్రణాళికా బద్ధంగా దశలుగా జరగాలి. మనం అమలు చేస్తున్న కార్యక్రమాల పనితీరులో మార్పులు చేసుకోవడానికి ఈ మహమ్మారిని ఒక సవా లుగా తీసుకోవాలి. దీనికిగానూ కొన్ని మూలసూత్రాలను ఏర్పరచుకోవాలి. తమకు అవసరమైన సేవల కోసం ప్రజలు ప్రభుత్వం దగ్గరికి పోవడం కాకుండా, ప్రభు త్వమే ప్రజల దగ్గరికి వెళ్లేలా చూసుకోవాలి. పిల్లలకు డిజి టల్‌ మాధ్యమంలో బోధన, వివిధ సంక్షేమ పథకాల అమలు లాంటివి దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.

ఆహార సామగ్రి కోసం ప్రజలు రేషన్‌ దుకాణాలకు వెళ్లకుండా ప్రభుత్వమే ఇంటింటికీ పంపిణీ చేయాలి. ప్రభుత్వ కార్యాలయాల పనితీరులో కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌ నమోదు తక్కువగా ఉండేలా చూసుకోవడం ఒక ముఖ్య సూత్రం కావాలి. అన్ని సమావేశాలను టెలి, వీడియో కాన్ఫరెన్సుల్లోనే జరపాలి. సమాచార బదిలీ పూర్తిగా డిజిటల్‌ మాధ్యమంలో సాగాలి. ఇంకో ముఖ్య విషయం, ముందు జనాన్ని నమ్మాలి, తర్వాత ధ్రువీకరించుకోవాలి. అవసరమైన చోట్ల తగిన అనుమతులు ఆటోమేటిగ్గా ఇచ్చే ట్టుగా ఉండి, క్షేత్రస్థాయి ధ్రువీకరణ తర్వాత చేసుకోవాలి. ఆదాయాన్నీ, ఉద్యోగాలనూ కాపాడేలా నిర్మాణ రంగానికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి. ఇవి కొన్ని సూచ నలు మాత్రమే. ఇలాంటివి ఎన్నో పరిగణనలోకి తీసుకుని విధాన నిర్ణయాలను ఏర్పరచుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, కొంతకాలానికి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలు, దానికి అనుగుణమైన చర్యలు అన్నీ కలిసి, కోవిడ్‌–19 మహమ్మారిని ఎదుర్కోవడానికి తగిన ఒక పటిష్టమైన భారతీయ విధానంగా రూపొందాలి. ఇలాంటి సంక్షోభాలు తలెత్తినప్పుడు అవసరమైన మార్గదర్శక చర్యల్లో ఇవి ప్రపంచవ్యాప్తంగా శాశ్వత మార్పు తేవాలి.

డా. సమీర్‌ శర్మ ఐఏఎస్‌
వ్యాసకర్త అమెరికాలో పీహెచ్‌డీ చేశారు, కంచి యూనివర్సిటీ నుంచి డీలిట్‌ పట్టా పొందారు.  

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు