అడవిలాంటి అమ్మాయి

15 Oct, 2017 11:09 IST|Sakshi

సందర్భం

రెండున్నర నెలల కిందట అనుకుంటాను, మొదటిసారి ఆ అమ్మాయిని ఒక తెలుగు రియాలిటీ షోలో చూశాను. ఏదో టాస్క్‌ ఆడుతున్న సందర్భం అది. ఎవరేం చేస్తున్నారో తెలీని గందరగోళం నడుస్తోంది. ఆ గోలలో నుంచి మీద పడిన వాళ్ళని దులుపుకుని పైకిలేస్తూ ‘రేయ్‌ దొంగ సచ్చినాళ్ళారా!’ అంటూ చెవులకి ఇంపుగా ఒక తిట్టు తిట్టింది. ఆ ఒక్క మాటని పలికిన తీరులోని చక్కదనాన్ని గ్రహిస్తుండగానే వంద గోళీలు ఒక్కసారిగా గచ్చుమీద పడి గళ్ళున మోగినట్లు నవ్వింది. అంతే! ప్రాణం లేచి వచ్చింది. ఎన్నాళ్ళకెన్నాళ్ళకి సినిమా టీవీ రంగాల్లో అడవి లాంటి సహజమైన అమ్మాయిని చూడటం!

రియాలిటీ షోల వ్యాపార దృక్పథాలు, జయాపజయాల లెక్కలు, సంస్కృతి పరిరక్షణ వాదుల మండిపాట్లు, మేధావుల ఈసడింపుల గురించి కాదు, ఈ పూట అచ్చంగా ఆ అమ్మాయి నవ్వు గురించి మాట్లాడాలని ఉంది. కుందేలు బొమ్మలున్న సౌకర్యవంతమైన దుస్తులు వేసుకుని, వంగకుండా కుంగకుండా నేలమీద కదం తొక్కిన నడక గురించి కూడా మాట్లాడాలి. హాస్యంలో కరుణలో, స్నేహంలో, దుఃఖంలో, పంతంలో, ప్రేమలో, వ్యూహంలో మునిగి, ఔచిత్యంగా తేలిన మాట గురించీ మాట్లాడాలి. పెదాల్ని ఈ చెవినుంచి ఆ చెవివరకూ సాగదీసే ప్రతి కవళికా నవ్వు కాదని, నాభి నుంచి లేచి గుండెలోతుల్ని తాకి అడ్డుకట్ట లేకుండా పైకి తన్నిన జలలాంటి ఆమె నవ్వు గురించి మాట్లాడాలి.

గాయని సునీత పాటపై రాసిన కవితలో మద్దూరి నగేష్‌ బాబు అంటాడు, ‘ఆ అమ్మాయి పాడతా ఉంటే నన్నెవరో బ్రెడ్డులా తరిగేసి పోతారు’  అని. ఈ అమ్మాయిని వింటూ చూస్తూ ఉన్నా అంతే. పాతలోకం ఆడపిల్లల చుట్టూ పేర్చిపెట్టిన చట్రాలు తునాతునకలయి, గుడ్డునుంచి జీవంతో ఉన్న పిట్టపిల్ల బయటికి వచ్చినట్లు, ఆడపిల్ల మనిషిగా రూపాంతరం చెందడం ఎందుకు బావుండదు? బావుండదని, ఇప్పటికీ అమ్మాయిలు అమ్మాయిలుగా ఉంటేనే లోకానికి ఇష్టమని మళ్ళీ ఇంకోసారి తెలిసింది. ముగ్గురు అబ్బాయిలు, ఈ అమ్మాయి కలిసి కూచున్నప్పుడు ‘ఇక్కడ అమ్మాయిలు ఎవరున్నారని!’ అని వాళ్ళలో ఎవరో అన్నమాట పైకి చలోక్తిలా వినిపించింది. కానీ అంతరార్థం ముల్లులా గుచ్చుకుంది. నిర్భీతి, సమర్థత, చొరవ, నైపుణ్యాలు ఉన్న స్త్రీ, స్త్రీ కాదు, పురుషుడే. ‘తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏకైక మగాడు రేణుకా చౌదరి’ అని ఎన్టీఆర్‌ అన్నపుడు కూడా ఆ ప్రశంస వెనుక ఉన్నది ఫ్యూడల్‌ భావజాలమే.

ఆ రియాలిటీ షో ముగింపు దశలో ఈ అమ్మాయి చుట్టూ రెండు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు బలంగా వినిపిం చాయి. ఇష్టపడినవారు చాలా ఎక్కువ ఇష్టపడితే, వ్యతిరేకించిన వారు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఉద్వేగాలన్నీ పెంచి పోషించినవే కావచ్చు. అయినప్పటికీ స్త్రీలు పొందుతున్న స్వేచ్ఛ మీద ఇంకా ఏదో ఒకరూపంలో కొనసాగుతున్న సెన్సార్‌షిప్‌ని ఈ సందర్భం మళ్ళీ చూపించింది. లోకానికి ఉపయోగపడే అంశాలలోని వివక్షకి నైతిక మద్దతు బలంగా ఉండొచ్చు. కానీ లక్షలాది మంది చూపుని లాక్కున్న అంశం, ఆ మేరకి ప్రజల చైతన్యాన్ని ప్రభావితం చేస్తుంది కనుక అక్కడ కనిపించే వివక్ష మీద కూడా మాట్లాడాలి. ఈ అమ్మాయిని వ్యతిరేకించిన నెటిజన్లు, ముఖ్యంగా ఒకానొక శక్తిశాలి అయిన నటుడి అభిమాన గణాచార్లు వేసిన వీరంగం చెప్పనలవి కాని భాషలో చాలా వయెలెంట్‌గా ఉంది. మనమిప్పటికీ మధ్యయుగాల నాటి జీవుల మధ్య బతుకుతున్నామన్నది గుర్తొస్తే ఎంత అశాంతిగా ఉంటుంది?!

స్త్రీలు ఆత్మవిశ్వాసంతో గట్టిగా మాట్లాడితే డామినేషన్, వ్యూహం నిర్మిస్తే మానిప్యులేషన్, స్నేహం చేస్తే బరితెగింపు, గలగలా నవ్వితే కంటగింపు. చివరికి విజయపు కొలమానాలు కూడా పితృస్వామిక తానులో ముక్కలే. ‘నువ్వు నా భార్యవి కాదు, ఎప్పటికీ నాకు గాళ్‌ ఫ్రెండ్‌లా ఉండాలి’ అని తన సహచరుడు చెప్తుంటాడని ఆ అమ్మాయి చెప్పినపుడు, ‘మగడు వేల్పన పాతమాటది, ప్రాణమిత్రుడ నీకు’ అన్న గురజాడ మాటలు గుర్తుకు వచ్చాయి. స్త్రీ పురుష సంబంధాలను మరింత ఆకర్షణీయంగా, ప్రజాస్వామికంగా చూడటం నమూనాలకి భిన్నం. కనుకనే అన్యోన్యత, అనురాగాల పొదరిల్లు లాంటి భద్ర కుటుంబాలను యథాతథంగా కాపాడుకునే వారినే విజేతలుగా ప్రకటిస్తుంటారు.

ఓ అపరాజితా! ప్రియమైన అమ్మాయీ, కాలివేలితో నేలమీద గుండ్రంగా రాస్తూ ఓరగా చూస్తూ పమిట కొంగో, చున్నీ చివర్లో నోటికి అడ్డం పెట్టుకుని, కిసుక్కున నవ్వడం నీకెలాగూ రాదు. కాలికింద చీమ నలక్కుండా ఒద్దిగ్గా మందగమనంతో హంసలా నడవడమూ రాదు. దిగులు మేఘం వచ్చి నెత్తినెక్కినపుడు తప్ప, మాటల్లో వెన్నముద్దను కూరడమూ నీకు రాదు. ఎవరు ఎన్ని మాటలన్నా ‘ఏయ్‌..ఎహేయ్‌’ అంటూ తలెగరేయడం తప్ప వెక్కివెక్కి ఏడవడానికి భుజాలు వెతుక్కోవడమూ రాదు. కాబట్టి డియర్‌ హరితేజా! నువ్వు నీలాగా ఎప్పటిలాగా తిట్టిన లోకం మొఖంమీద కొండలు పగలేసి బండలు కొట్టినట్లు నవ్వాలి. కాళ్ళకి చక్రాలు కట్టుకుని ఉత్సాహంగా చేతులు గాల్లో ఎగరేస్తూ శిఖరానికి పరుగులు తీయాలి. నీ పాటలో మాటలో ఆటలో నటనలో ఇక కొత్తందనాలు చిందులేయాలి.

డా. కేఎన్‌. మల్లీశ్వరి
వ్యాసకర్త కథ, నవలా రచయిత్రి, కార్యదర్శి ప్రరవే (ఏపీ)
ఈ–మెయిల్‌ : malleswari.kn2008@gmail.com

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు