ప్రతిధ్వనించే పుస్తకం

19 Feb, 2018 00:29 IST|Sakshi
బుచ్చిబాబు

అసలు జీవితానికి అర్థమేమై వుంటుంది?ఈ చింతనే ప్రధానంగా సాగుతుంది ‘చివరికి మిగిలేది’. వ్యక్తిగతమైన విముక్తి ప్రధాన ప్రేరణగా దీన్ని రాసినట్టు బుచ్చిబాబు చెప్పుకున్నారు. తెలుగులో వచ్చిన గొప్ప మనో వైజ్ఞానిక నవలగా ఇది ఆయనకు ఎంతో కీర్తిని తెచ్చిపెట్టింది. ప్రధానంగా కథకుడైన బుచ్చిబాబు రాసిన ఏకైక నవల ఇది. తొలుత ధారావాహికగా వచ్చి 1952లో పుస్తకరూపం దాల్చింది. శీలపు మరకను కలిగివున్న తల్లి గత చరిత్ర దయానిధిని జీవితాంతం వేదనకు గురిచేస్తుంది. తల్లి చేసిన తప్పేమిటో స్పష్టంగా తెలియదు, లేదా రచయితే తెలియనివ్వడు. అంతర్ముఖుడైన దయానిధిలాగే నవలంతా ఒక
గుప్తమైన మార్మికత పరుచుకుని ఉంటుంది. అయినప్పటికీ తనకు ఎదురయ్యే దేన్ని కూడా తరచి చూడకుండా దయానిధి ఉండడు. కళ, సౌందర్యం, ప్రకృతి, సమాజం, స్త్రీ, రాజకీయం, అమలిన శృంగారం అన్నింటినీ స్పృశిస్తాడు.

దయానిధి తన సుదీర్ఘ జీవిత ప్రయాణంలో అమృతం, కోమలి, ఇందిర, సుశీల, నాగమణి లాంటి స్త్రీల సామీప్యానికి వెళ్తాడు; వెళ్లలేకపోతాడు. వజ్రం రూపంలో సంపద వస్తుందీ పోతుందీ. మనుషుల ద్వేషాన్నీ, దానికి గల కారణాన్నీ అర్థం చేసుకుంటాడు. తనకేం కావాలో తెలియనప్పుడు మానవుడు ద్వేషిస్తాడు. మనిషికి కావాల్సింది మతాలు, దేవుళ్లు, మొక్కుబళ్లు, రాజకీయాలు కావు; మానవుడికి కావాల్సినది దయ, అని తేల్చుకుంటాడు. అమృతం, కోమలి పాత్రలు గుర్తుండిపోతాయి.

కథనం తాబేలు నడకలా సాగుతుంది. ఏమీ ప్రత్యేకించి పరుగులు పెడుతూ జరగదు. ప్రతి వాక్యాన్నీ, ప్రతి గమనింపునీ కవితాత్మకంగా మలవాలన్న శైలి బుచ్చిబాబు బలమూ, బలహీనతా రెండూ.
జీవితం గురించి ఎక్కువ ఆలోచిస్తుంటావు, జీవించవు అన్న స్నేహితుడి వాక్యం దయానిధికి పూర్తిగా వర్తిస్తుంది. జీవితంలో మునిగిపోవడానికి మించిన వేరే పరమార్థం జీవితానికి ఏమీలేదు. అలాగని దీని గురించి జిజ్ఞాసువులు మీమాంస పడకుండా ఉండటమూ కష్టమే. జీవితానికి అర్థమేమిటన్నదానికి ప్రత్యేకించి సమాధానం ఏమీ లేదు. ఆ సమాధానాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమూ, అందులో భాగంగా కలిగే కొన్ని అనుభవాలూ, అవి కాగలిగే జ్ఞాపకాలూ, తనతో తాను మనిషి సమాధాన పడటమూ మాత్రమే చివరికి మిగిలేవి.

మరిన్ని వార్తలు