కొనుగోలు శక్తికి ఉద్దీపన కరువు

28 Aug, 2019 01:11 IST|Sakshi

అభిప్రాయం

భారతదేశ ఆర్థిక వ్యవస్థ గడ్డు కాలంలో ఉంది. ఒకవైపున మోదీ 2024 నాటికి ఆర్థికవ్యవస్థ స్థాయిని 5 లక్షల కోట్ల రూపాయలకి తీసుకువెళ్ళాలనే లక్ష్యాన్ని ప్రకటిస్తున్నారు. మరో ప్రక్కన దేశ ఆర్థ్ధికవ్యవస్థపై మాంద్యం తాలూకు కారుమబ్బులు కమ్ముకుంటున్నాయనే వార్తలు వస్తున్నాయి. ‘ప్రభుత్వం బయటకు చెప్పకపోయినా, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుల నుంచి అందుతోన్న సంకేతాల మేరకు గడచిన 34 సంవత్సరాల నుంచీ వృద్ధి రేటు తగ్గుతూ వస్తోంద’ని బజాజ్‌ ఆటోకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త  రాహుల్‌ అన్నారు. ‘పెట్టుబడులకు, డిమాండ్‌కి ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం ఏవిధంగానూ ప్రయత్నించడం లేద’ని కూడా ఆయన చెబుతున్నారు. ఆయన ఈ మాటలు అన్నది 2019 జూలై మాసం చివరిలో. కాగా, ఇంతటి తీవ్ర పరిస్థితులలో కూడా నేటి వరకూ  ఆర్ధికమాంద్యం నుంచి గట్టెక్కించే చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. 

మరో ప్రక్కన రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మాటల ప్రకారం జూన్‌ మాసంలో ‘ద్రవ్య విధాన కమిటీ’ సమావేశం జరిగిన నాటికే దిగజారివున్న ఆర్థిక స్థితి, ఈ కొద్ది కాలంలో మరింత అధోముఖంగా జారిపోయింది.  ఈ స్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు రిజర్వ్‌ బ్యాంకు తన వంతుగా ఇప్పటివరకూ వడ్డీ రేట్లను 1.1% మేరన తగ్గించింది. అయితే, ప్రభుత్వం తన వంతుగా ఉద్దీపన వంటివి చేపట్టడం కూడా తప్పనిసరి అని రిజర్వ్‌బ్యాంకు పెద్దల అభిప్రాయం. కాగా, కడకు నేడు ఉద్దీపన ప«థకం ఏదీ ఇచ్చే ఉద్దేశం లేదంటూ ప్రధానమంత్రి ప్రధాన ఆర్థ్ధిక సలహాదారు చావు కబురు చల్లగా చెప్పారు.  

కానీ, షేర్‌మార్కెట్‌లలో పతనం గురించి మాత్రం ప్రభుత్వం మెరుపు వేగంతో ప్రతిస్పందిస్తోంది. మొన్నటి బడ్జెట్‌ అనంతరం  అత్యంత ధనవంతుల మీద పెంచిన పన్ను మొత్తం తాలూకు భారం  అనేక విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపుదారులను తాకింది.  దాంతో వారు షేర్‌ మార్కెట్‌ల నుంచిపెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దీనితో సెబీ విదేశీ ఫోర్ట్‌ఫోలియో మదుపుదారులకు సంబంధించిన పలు నిబంధనలను సరళీకరించింది. తద్వారా పతన దిశగా సాగుతోన్న షేర్‌ మార్కెట్‌కు కొంత ఊతాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం తాపత్రయపడుతోంది.  

2008లో అమెరికాలో ఆరంభమైన ఆర్థ్ధిక మాంద్యం మనల్ని తాకకపోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, మన జాతీయం చేయబడిన బ్యాంకులు. రెండవది దేశంలోని జాతీయ ఉపాధి హామీ ప«థకం. నాడు మన జాతీయ బ్యాంకులు అడ్డగోలు రుణవితరణ చేయలేదు. అవి ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారలేదు. అలాగే, జాతీయ ఉపాధి హామి పధకం వలన  దేశంలోని కోట్లాది మందికి కొనుగోలు శక్తి పెరిగింది.  

నేడు జాతీయ బ్యాంకులలో మొండి బకాయిలు పెరిగిపోయాయి. రుణవితరణలో పెద్ద పాత్ర ఉన్న  బ్యాంకింగేతర ఆర్థ్ధికసంస్థల స్థితి కూడా దివాలా బాట పట్టింది. మన నీతిఆయోగ్‌ ప్రకారమే నేడు ఆర్థ్ధిక సంస్థల స్థితి 70 సంవ త్సరాలలో కనీవినీ ఎరుగనంత దయనీయంగా ఉంది. ఇక, జాతీయ ఉపాధి హామి పథకం పట్ల విముఖత కారణంగా కూలీల వేతనాల చెల్లింపు జాప్యం అవుతోంది. వ్యవసాయ రంగం స్థితి కూడా దిగజారి గ్రామీణ ఆర్థ్ధిక ఆరోగ్యం çకుదేలైపోతోంది. గ్రామాల ఆర్థిక స్థితికి  కొలబద్ద అయిన  ట్రాక్టర్‌లు, బైక్‌ల అమ్మకం దశాబ్దాల  కనిష్ట స్థాయికి పడిపోయింది. అలాగే, తల నూనెలు, సబ్బులు, కడకు బిస్కెట్‌ల వంటి చిన్న చిన్న వినియోగ వస్తువుల అమ్మకాలు కూడా నేడు గ్రామీణ ప్రాంతాలలో, నగర ప్రాంతాలలో కంటే దారుణంగా దెబ్బతిని ఉన్నాయి.  

ఈ మధ్య కాలంలో  ఆసియా దేశాల కరెన్సీల విలువలో కూడా పతనం నెలకొంది. మన రూపాయి విలువ మరింత అధికంగా పతనం చెందింది. అలాగే, మనదేశం నుంచి ఎగుమతి అయ్యే కార్ల అమ్మకాలు ఇతర దేశాలలో డిమాండ్‌ పతనం వలన 4.2% మేరకు తగ్గాయి. మన దేశీయ మార్కెట్‌లో ఈ అమ్మకాల తగ్గుదల 19% మేరకు ఉంది. అలాగే, జూలై 2019 మధ్యనాటి స్థితి ప్రకారంగా ప్రపంచంలోని అతిపెద్ద 10 షేర్‌ మార్కెట్‌లలో ప్రతికూల ఫలితాన్ని ఇచ్చింది (2.8%) భారతదేశ షేర్ల సూచీయే ! అలాగే గత నాలుగేళ్లలో భారతదేశ ఎగుమతుల వృద్ధి రేటు సగటున 0.2%గా మాత్రమే  ఉంది. ప్రపంచదేశాల ఎగుమతుల సగటు వృద్ది రేటు 0.6% గా ఉంది. 2010  2014లో ప్రపంచ దేశాల సగటు ఎగుమతుల వృద్ధి సాలీనా 5.5% గా ఉండగా, మన దేశంలో అది 9.2% గా ఉంది. 

అంటే, ప్రపంచంలోని ఇతర దేశాలలో కంటే భారత్‌లో మరింత తీవ్ర మాంద్య పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికి ప్రధాన కారణం 2016లో జరిగిన పెద్ద నోట్ల రద్దు ప్రభావం మన ఆర్థిక రంగాన్ని ఇప్పటికీ వెంటాడటమే. ఇక నోట్ల రద్దుతోపాటుగా  హడావుడిగా అమలు జరిగిన జీఎస్టీ వలన కూడా సమస్యలు మరింత జటిలం అయ్యాయి. నిరుద్యోగ సమస్య 45 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.  ప్రభుత్వం మాంద్యం పరిష్కారానికి చేపడుతోన్న చర్యలు కూడా అరకొరగానే మిగిలిపోయాయి. 

ఒక ఉద్దీపన పథకం అవసరం అయిన దశలో  దానిని తిరస్కరించి; కార్పొరేట్‌లపై  పన్ను శాతాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థ్ధిక వ్యవస్థ కోలుకునే అవకాశం కనుచూపు మేరలో లేదని  ‘మింట్‌ స్థూల ఆర్థిక పరిశీలక సూచీ’ చెబుతోంది.  ఈ పరిస్థితిలో ప్రభుత్వం ద్రవ్యలోటును కట్టడి చేసే ఆలోచనలు మానుకొని తన యథాశక్తి ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనను ఇవ్వడం తప్పనిసరి. మరీ ముఖ్యంగా ఈ ఉద్దీపన గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచే దిశగా ఉండాలి., 2024 నాటికి 5 లక్షల కోట్ల ఆర్థ్ధిక వ్యవస్థ కల కనే ముందు, నేడు మనం స్థూలవృద్ధి రేటులో ప్రపంచంలో ఆరవ స్థానం నుంచి ఏడవ స్థానానికి పడిపోయిన వాస్తవాన్ని గమనంలో ఉంచుకోవాలి. 

పీ.ఎస్‌: శుక్రవారం ఆర్థికమంత్రి ప్రకటించింది–సామాన్య జనాభా, మధ్యతరగతి వర్గాల కొనుగోలు శక్తిని పెంచే ఉద్దీపన పథకం కాదు. అది కేవలం వడ్డీ రేట్ల తగ్గింపు లేదా బ్యాంకుల ద్రవ్యలభ్యతను పెంచేది మాత్రమే. కానీ, ఎస్‌బీఐ చైర్మన్‌ ప్రకారం అసలు ప్రజలకు కొనుగోలు శక్తి లేకపోవడమేగానీ, బ్యాంకుల వద్ద ద్రవ్య లభ్యత లేకపోవ డం కాదు. కాబట్టి సామాజిక రంగంలోన, మౌలిక వసతుల రంగంలో ఉపాధిని పెంచే చర్యలు మాత్రమే ప్రస్తుత స్థితిలో నిజమైన ఆర్థిక ఉద్దీపనకు దోహదపడతాయి. 

వ్యాసకర్త: డి. పాపారావు, ఆర్థికరంగ విశ్లేషకులు
మొబైల్‌ : 98661 79615

మరిన్ని వార్తలు